Friday, February 20, 2009

మన ఆర్ధిక దుస్థితిని గట్టెక్కించటం ఎలా?

ఫిబ్రవరి 2009

నన్నెవరూ అడగరు కానీ అడిగితే మన ఈ ఆర్ధిక దుస్థితి నుంచి తేరుకోటానికో మార్గం ఉంది. ఈ కిటుకు, మరొక కాలంలో, మరొక సందర్భంలో నాకు తెన్నేటి విశ్వనాధం గారు చెప్పేరు. నాకొక్కడికే కాదండోయ్. సభలో ఉన్న నలుగురికీ చెప్పేరు. అలాగని సభలో నలుగురే ఉన్నారనుకునేరు. ఆ నాడు మైదానం మనుష్యులతో కిటకిటలాడిపోయింది. మొదట "నాతో" అని, తరువాత "నలుగురితో" అని చివరికి "ఎంతోమంది" అంటున్నానని తప్పుపట్టకుండా అసలు విషయం చెప్పనివ్వండి.

విశ్వనాధం గారు చెప్పిన కిటుకు చిన్న కథ రూపంలో చెప్పేరు. అది ముందు టూకీగా చెబుతాను. ఒక రుషి నదిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆకాశంలో ఎగురుతూన్న ఒక డేగ కాళ్ళ పట్టు నుండి జారి దోసిట్లో ఒక కప్ప పడింది. దాని శరీరం అంతా గోళ్ళు గీరుకుపోయి ఉన్నాయేమో అది బ్రతికే అవకాశం తక్కువగా కనిపించింది. రుషి తన తపోశక్తిని అంతా ధారపోసినా అది బతికే అవకాశం తక్కువని సాక్షాత్తూ ఆ బ్రహ్మ దేవుడే కనిపించి చెప్పేడు. చెప్పి ఊరుకోకుండా ఒక తరుణోపాయం చెప్పేడు. చివికిపోయిన ఆ కప్పని ఒదిలేసి తన తపోశక్తితో ఒక కొత్త ప్రాణిని సృష్టించమన్నాడు. అప్పుడు ఆ రుషి ఏం చేసేడు? ఎలాగూ కొత్త దానిని సృష్టించినప్పుడు దానిని మరొక కప్పలా కాకుండా అందంగా మనిషిలా సృష్టించేడు. ఆ వ్యక్తే అతిలోకసుందరి అయిన మండోదరి - రావణాసురుడి భార్య. అంత అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని రావణుడు సీత వెంట పడటం మన అదృష్టం! లేకపోతే మనకి రామాయణం ఉండేది కాదు.

ఈ కథ చెప్పి విశ్వనాధం గారు "కాంగ్రెస్ పార్టీ కప్పలా చివికిపోయింది. నెహ్రూ ఎంత మొనగాడైనా ఇలా చివికిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి బతికించలేడు. కనుక మండోదరి లాంటి అందమైన కొత్త పార్టీని పెట్టేం. మీరంతా ప్రజాపార్టీకే ఓటు వెయ్యండి" మా అందరికీ ఒక సలహా పారేసేరు.

ఇప్పుడు అమెరికాలో మన ఆర్ధిక పరిస్థితి చిరిగి, చివికి, మరమ్మత్తుకి లొంగని, టెర్మినల్ పేషెంటు" లా దీనావస్థలో ఉంది కదా? (అంటే కంప్యూటరు టెర్మినల్ దగ్గర కూర్చుని పేషెంటుగా ఈ బ్లాగుని చదువుతూన్న చదువరిలా కాదండోయ్!) మన ఒబామా, ఇంతకి ముందు బుష్, ఈ చివికిపోయిన వ్యవస్థకి ప్రాణం పోసి రక్షిద్దామని ట్రిలియన్లకొద్దీ డాలర్లు గుమ్మరిస్తున్నారు. కానీ, ఇలా చివికి శిధిలమయిపోయిన బేంకు (లేదా బ్యాంకు) లని పునరుద్ధరించేకంటె వీటిని చావనిచ్చి, వీటి స్థానంలో సరి కొత్త, బాగా, మంచి సమర్ధతతో పని చేసే, సంస్థలని నిర్మించి వాటికి మరొక కొత్త పేరు పెట్టి నడిపితే బాగుంటుంది.

ఈ ఊహ నా బుర్రలో కొంతవరకూ మాత్రమే పుట్టింది. నెట్‌స్కేప్ కనిపెట్టిన మార్క్ ఏండ్రీసన్ ఏమిటన్నాడంటే ఈ సరికొత్త బేంకు లని ఇంటర్నెట్‌లో పెట్టి కంప్యూటర్ల చేత నడిపించమన్నాడు. ఏండ్రీసన్ అనలేదు కానీ, ఇలా ఈ బేంకింగు వ్యవస్థ కి కొత్త పేరు పెట్టి అంతర్జాలం మీద నడిపిస్తే ఇప్పుడు జరుగుతూన్నన్ని గూడుపుఠాణీలు, కుమ్మక్కులూ జరగటానికి అవకాశం తక్కువ. అంతేకాదు. ఈ కొత్త వ్యవస్థ ని నిర్మించటానికి బోలెడు కంప్యూటర్లు, ప్రోగ్రామర్లు కావాలి కనుక ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయి. దానితో ఈ ఆర్ధిక మాంద్యత తగ్గవచ్చు. అయ్యా! అమ్మా! నేను మంచి చెప్పినా సరే, నా మాట వింటే నాకు ఎక్కడ "క్రెడిట్" వచ్చెస్తుందో అని ఎవ్వరూ వినరు. కాని చెప్పకుండా ఉండలేను కదా!

Monday, February 16, 2009

ఈ ఆడువారు!!!

ఫిబ్రవరి 2009

"ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే అన్నాడు" ఒక సినిమా కవి. అంటే, వారికి మనస్సులో ఉండేది ఒకటి, పైకి చెప్పేది మరొకటి నాకు అర్ధం అవుతున్నాది. Men are from Mars and Women are from Venus అంటారు. అంటే మాట్లాడే తీరు వేరవటమే కాకుండా ఈ ఆడువారు మరో ప్రపంచం నుండే వచ్చేరు అంటాడు (లేక అంటుంది) ఇంగ్లీషులో ఈ వాక్యం రాసిన వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం. సర్వసాధారణంగా మగవారికి "వాళ్ళు" ఏమంటున్నారో అర్ధం అయి చావదు. "వాళ్ళు" చేసే పనులు ఎందుకు అలా చేస్తున్నారో అస్సలే అర్ధం కాదు. అందుకనే పురాణాలు, ప్రబంధాల నుండి కట్టుకథలు, కొంటెబొమ్మల వరకు, ఏ మాధ్యమంలో చూసినా ఆడువారికి మగవారికీ మధ్య వచ్చే "సంఘర్షణ" మీద బోలెడన్ని వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. కారు తోలటం తీసుకొండి. ఈ విషయంలో ఆడవారి చాకచక్యాన్ని "ఆడ డ్రైవర్లు!!" అని రెండు ముక్కల్లో తేల్చి పారెస్తారు మగరాయుళ్ళు. ఆడువారి మీద అంత తొందరగా తీర్మానించేసేలోగా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఏదో కొత్త ఊళ్ళో కారు నడుపుతూ, ఒక చేతిలో మేపు ఉండీ కూడ దారి తప్పిపోయి, అస్సలు ఎక్కడ ఉన్నామో కూడ తెలియని పరిస్థితిలో, తిరిగిన దారి వెంబడే తిరుగుతూ, ఈతరానివాడు నీళ్ళల్లో బుడకలు వేస్తూన్నట్లు ఉంటాడు మన గోపాళం. అటువంటి సందర్భాలలో పక్క కుర్చీలో ఉన్న రాధ ఎన్నిసార్లు గోపాళాన్ని గట్టెంకించలేదు? ఆడవాళ్ళకి మేపులు అక్కరలేదు. "0.3 మైళ్ళు తరువాత కుడి పక్కకి తిరుగు" వంటి నిర్దేశాలు అక్కరలేదు. "మేసీస్ దాటిన తరువాత వచ్చే కారు డీలర్ దగ్గర కుడి పక్కకి తిరగాలి" అని వాళ్ళ బుర్రలో ఉంటుంది కాబోలు.

నేనే కాదు. ఆడ, మగ అనే విచక్షణ లేకుండా ఎంతోమంది విజ్ఞానవేత్తలు "ఆడువారు ఎందుకు మగవారిలా ఉండరు?" అని ఆలోచించి పరిశోధన చెయ్యటం మొదలుపెట్టేరు. ఆఖరికి అదృష్టవశాత్తు ఒక ఆడ సైంటిస్టు ముందుకు వచ్చి ఒక ప్రతిపాదనని చేసేరు. ఈ "ప్రతిపాదన" రుజువైతే అప్పుడు దీన్ని "సిద్ధాంతం" అంటాం. అదృష్టవశాత్తు అని ఎందుకన్నానంటే ఇటువంటి వాటిల్లో మగవాళ్ళు తమ బుర్రని పెడితే అది ఉచ్చులో పెట్టిన రీతి పరిణమిస్తుంది. ఈ ప్రతిపాదన మొదట్లో ఎప్పుడు ఎక్కడ జరిగిందో నేను చెప్పలేను కానీ, నేను చదవటం మాత్రం Scientific American సెప్టెంబరు 1992 సంచికలో చదివేను. ప్రొఫెసర్ డొరీన్ కిమూరా - బార్నరడ్ కాలేజీలో పనిచేసే సైకాలజీ ప్రొఫెసరు క్రిస్టీన్ విలియంస్ తో ఏకీభవిస్తూ - ఆడవాళ్ళ శరీర నిర్మాణమే వేరు!" అని గంభీరమైన వదనంతో శలవిచ్చేరు. ఆ విషయం మనకి తెలీదేమిటి? అయిదో తరగతి కుర్రాణ్ణి అడిగితే చెబుతాడు. ప్రేమలో పడబోతూన్న ఉన్నత పాఠశాల విద్యార్ధి అయితే మన ప్రభంద కవుల పద్యాలు ఉదహరిస్తూ మరీ చెబుతాడు.

"మీరు పొరపాటు పడుతున్నారు. నేననేది ఒకటి, మీరనుకుంటూన్నది మరొకటి?" అని ఆమె ఆడవారి మాటలని అపార్ధం చేసుకుంటూన్న మగరాయుళ్ళని సరిదిద్దింది.

గమనించేరా? ఇక్కడ మనం చేస్తూన్న తప్పు ఏమిటో! ఇక్కడ డొరీన్, క్రిస్టీన్ ఆడవాళ్ళల్లా మన కంటికి కనిపించినా వాళ్ళు యూనివర్శిటీ ప్రొఫెసర్లు అని మనం మరచిపోకూడదు. మనం స్త్రీని చూస్తే ముందస్తుగా మనని మెలికలు తిప్పించేవి ఆమె మెలికలు, ఒంపులు, వగైరా; మిగిలినవి ఏమీ కనబడవు, అర్జునుడికి మత్స్య యంత్రంలో చేప కన్ను ఒక్కటే కనిపించినట్లు అనుకొండి. ఒక ఆడ సైకాలజీ ప్రొఫెసరు మరొక ఆడదానిని చూస్తే ఆమెకి ఒంపులు కనిపించవు, ఒక "వ్యక్తి" కనబడుతుంది ట. (ఇది ఆడవాళ్ళు చెబితే తెలియాలి కాని నాకు ఎలా తెలుస్తుంది? ఇటువంటి సందర్భంలోనే ఆదిశంకరుడంతటివాడు ఉభయభారతి చేతుల్లో దరిదాపు చిత్తయిపోయేడు కదా?) ఈ "వ్యక్తి" కి వ్యక్తిత్వం ఎక్కడనుండి వచ్చింది? మెదడులో ఉన్న నూరానులనే జీవకణాల మధ్య ఉండే అల్లిక వల్ల. దీన్నే అందరికీ అర్ధం అయే శుద్ధ తెలుగులో చెబుతాను, వినండి. మన personality ని, మన mind stuff ని నిర్ణయించేది మన మెదడులో ఉండే wiring. మెదడులో ఉన్న ఈ wiring తేడాగా ఉండటం వల్ల ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకేలా ఉండరు. (బాహ్యరూపం సంగతి సరే, ఇక్కడ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తున్నాను.)

మన తెలుగువాళ్ళకి కంప్యూటర్ పరిభాష ఉగ్గుపాలతో పట్టినట్లు అబ్బేసింది కనుక ఇక్కడ కంప్యూటర్ ఉపమానం ఒకటి చెబుతాను. మగవాళ్ళ బుర్ర IBM PC లా ఉంటే ఆడవాళ్ళ బుర్ర Apple Mac లా ఉంటుందనుకొండి. లేకపోతే పురుషుల బుర్రలో Intel chip ఉంటే ఆడవాళ్ళ బుర్రలో Motorola chip ఉంటుందనుకొండి. చూశారా, ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అని చెప్పటం లేదు. రెండింటి కట్టడి వేరు.

చేసే పని చేసేదాని కట్టడి మీద ఆధారపడి ఉంటుందనే నమ్మకం కొంతమందిలో ఉంది. దీన్నే ఇంగ్లీషులో function follows structure అంటారు. కనుక మగవాళ్ళ బుర్రలు మేపులు చదవటానికి అనువుగా నిర్మించబడి ఉండొచ్చు. అందుకే మగవాళ్ళు మేపుల మీద ఆధారపడతారు.

"అహఁ, అలా కాదు. మేపులని నిర్మించినది అధికారంలో ఉన్న మగవాళ్ళు. కనుక వారికి అర్ధం అయేటట్లు వారు నిర్మించుకున్నారు. వాళ్ళు మేపులని గీసేటప్పుడు అవి ఆడవారికి అర్ధం అవుతున్నాయో, లేదో ఎప్పుడైనా ఆడువారిని సంప్రదించేరా?" అని ప్రొఫెసర్ విలియంస్ సున్నితంగానే మందలించేరు. "మొట్టమొదటి రోడ్డు మేపు ఆడది గీసి ఉంటే మేపు మీద దూరాలు, రోడ్ల పేర్లు, అక్షాంశాలు, రేఖాంశాలు, వగైరాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా దారి వెంబడి ఏయే బండగుర్తులు కనిపిస్తాయో చూపుతూ మేపు గీసి ఉండేది. చూడండి, చిన్న పిల్లల పుస్తకాల్లోనూ, కొంటేబొమ్మలలోనూ ఇటువంటి 'మేపు'లే కనిపిస్తాయి."

ఇదంతా నేను పనిలేని మంగలిలా గొరుగుతూన్న పిల్లి తల అనుకోకండి. ఆడ, మగా ఒకేలా ఉండరని ఈమధ్యనే - మరెవ్వరో కాదు - వైద్యశాస్త్రజ్ఞులు కనుక్కున్నారు! ఇంతవరకు జబ్బులని కుదర్చటంలో జరిగిన పరిశోధనలన్నిటిలోనూ, మగ వాడినే నమూనాగా తీసుకున్నారు. మగవాడి మీద పని చేసిన విధంగా మందులు ఆడవాళ్ళ మీద పని చెయ్యవని ఈ మధ్య తెలిసినది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే - ఇప్పటివరకు మీరెవ్వరు గమనించకపోతే - మగవారు, ఆడువారు, వీరిద్దరూ రెండు విభిన్నమైన శాల్తీలు. అసలు నన్నడిగితే ఆడవాళ్ళు ఈ లోకం వాళ్ళు కాదు! వాళ్ళని అర్ధం చేసుకోటానికి మగవాళ్ళ బుర్రలో ఉన్న IBM PC చాలదు.


ఆడువారిని ఇంకా బాగా అర్ధం చేసుకుని మోక్షాన్ని సాధించాలంటే చదవటానికి బోలెడంత ముడిసరుకు ఉంది. ఉదాహరణకి -

http://health.howstuffworks.com/men-women-different-brains.htm

Sunday, February 15, 2009

జిహ్వకోరుచి

ఫిబ్రవరి 2009

“ఎవ్వరైనా అరటి పండుని ఎలా తింటారబ్బా! తొక్క ఒలిచిన అరటి పండు ఆకారం చూస్తే చాలు, నాకు దానిని నోట్లో పెట్టుకో బుద్ధి పుట్టదు!” అంటూ అరటి పండు ఇష్టంగా తినే నా బోంట్లని చూసి ఆశ్చర్య పడ్డది ఒక గృహిణి.

నేను అప్పుడే నోట్లో పెట్టుకుని ఒక కొరుకు కొరికిన అరటి పండు ముక్కని మింగాలో కక్కాలో తెలియని తికమక పరిస్థితిలో పడ్డాను. అరటి పండు నాకు ఇష్టం. రోజుకో పండైనా తింటాను. అరటి పండు ఎంత ఇష్టమైనా ఎవ్వరైనా ప్రసాదం అంటూ చేత్తో చిదిమి, ఒక ముక్కని నా చేతిలో పెడితే నాకు తినబుద్ధి కాదు.

కొందరు అరటి పండు తొక్కంతటినీ ఒలిచేసి, తొక్కని పారేసి అప్పుడు పండుని తింటారు. కొందరు పండుని చక్రాలులా కోసుకుని, ఒకొక్క చక్రాన్నే ఫోర్కుతో తింటారు. వెంకట్రావు పండు మొదటి భాగాన్నీ, చివరి భాగాన్నీ విరచి పారేసి, మధ్య భాగాన్నే తింటాడు. సూజన్ ‘మీట్ అండ్ పొటేటో’ పిల్ల. ఆమెకి పళ్ళల్లో కాని, కాయగూరల్లో కాని గింజ కనబడ కూడదు. ఒక సారి ఇండియన్ రెస్టారాంటుకి తీసికెళ్ళి బైంగన్ బర్తా తెప్పిస్తే వేలేసి ముట్టుకో లేదు – వంగ గింజలని చూసి. కడుపుతో ఉన్న కేటీ సాల్ట్ బిస్కట్ మీద పీనట్ బటర్ రాసుకుని, దాని మీద టూనా ఫిష్ పెట్టుకుని, దాని మీద నిలువుగా కోసిన అరటి పండు బద్దని పేర్చి తింటూంటే చూసే వాళ్ళకి కడుపులో తిప్పిందంటే తిప్పదూ?

పళ్ళన్నిటిలోనూ అగ్రగణ్యమైన మామిడిపండు అంటే మా అన్నయకి ఇష్టం లేదు. కాదు, కూడదు అని మొహమాట పెడితే కోసుకు తినే ఏ బంగినపల్లి పండో ఒక ముక్క తింటాడు తప్ప పిసుక్కు తినే పళ్ళంటే అస్సలు పడదు. మూతి చిదిమి, జీడి పిండేసి, సువర్ణరేఖ పండుని తింటూ ఉంటే రసంతో పాటు మామిడి పండు గుజ్జు చిన్న చిన్న ముక్కలుగా నోట్లోకి వస్తూ ఉంటే దాని రుచితో స్వర్గానికి ఒక మెట్టు దిగువకి చేరుకుంటాను నేను. అదే పండుని నోట్లో పెట్టుకుని వాంతి చేసుకున్నంత పని చేసేడు మా అన్నయ్య.

లోకో భిన్న రుచి అన్నారు. మనుష్యులు ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళ రుచుల ఎంపకాలు, తిండి అలవాట్లు కూడ దరిదాపుగా అన్ని రకాలూ ఉన్నాయి. మా పెద్దన్నయ్య కూతురు లక్ష్మి చిన్నప్పుడు కందిగుండ అన్నంలో కలుపుకు తినేది తప్ప కంచంలో ఉన్న మరొక వస్తువుని ముట్టుకునేది కాదు. నూనెలో వేసి సాతాళించిన చిక్కుడు కాయలని తప్ప మరేదీ ముట్టుకునేవాడు కాదు మా అబ్బాయి సునీలు. యోగర్టు అంటే అసహ్యించుకునేవాడు. ఇప్పుడు నాకు అరటి పండు ఎంత ఇష్టమో వాడికి యోగర్టు అంత ఇష్టం. వయస్సుతో పాటు రుచులు, అభిరుచులు మారతాయి మరి.

ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి. “నాలుగు రుచులూ తినటం అలవాటు చేసుకోవాలి” అంటూ మా మామ్మ మా చేత తను కాచిన వేప పళ్ళ పులుసుని బలవంతాన్న తినిపించేది. అప్పుడు ఈసురో మంటూ ఆ చేదు పులుసు తిన్నా, ఇప్పుడు అలాంటి పులుసు ఎవ్వరైనా కాచిపెడితే తిందామని కలలు కంటూ ఉంటాను.

కారానికి రుచేమిటి అని మీరనొచ్చు కానీ, అలవాటు పడని నోటికి కారం కారంగానే అనిపిస్తుంది; అలవాటు పడ్డ తర్వాత కారంలో కారం కంటే “రుచిని” నాలుక ఎక్కువగా పోల్తి పడుతుంది. కాఫీ కాని, కారం కాని, కాకరకాయ వేపుడు కాని – ఇవేవీ కూడా మొదటి సారి రుచించవు. అలవాటు పడ్డ తర్వాత వాటిని వదలబుద్ధి కాదు. కుంకుడుకాయ రసంలా ఉందని ఒకప్పుడు బీరుని చీదరించుకున్న నేను ఇప్పుడు బీరులలో రకరకాలని గుర్తించి, వాటిలో తేడాలు చెప్పగలను.

ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్లే ఆ వ్యక్తి తినే ఆహార పదార్ధాలలలోనూ, తినే విధి విధానాలలోనూ కూడ ఒక ‘వ్యక్తిత్వం’ ఉంటుంది. మనం ఎక్కువ ఇష్టపడి తినే వస్తువులు, మనకి ఇష్టం లేని వస్తువులు, మనకి అసహ్యమైన వస్తువులే కాకుండా మనం తినే పదార్ధాలని మనం తినే విధానం కూడ మన జఠర వ్యక్తిత్వాన్ని (గేస్ట్రొనోమిక్ పెరసనాలిటీ) వెల్లడి చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెబుతాను. “నేను శాకాహారం అయినంత సేపూ, ఏది ఎలా వండి పెట్టినా సమదృష్టితో రుచులు ఎంచకుండా తింటాను” అని అందరితోటీ చెప్పేవాడిని. అంటే నాకు ఒక జఠర వ్యక్తిత్వం అంటూ లేదని గొప్పగా చెప్పుకునేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత నా శ్రీమతి వచ్చి, నేను అనుకున్నట్లు నాకు అన్నీ సాయించవనిన్నీ, నాకు కూడా ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఉన్నాయనీ సోదాహరణంగా రుజువు చేసింది. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా నా అక్క చెళ్ళెళ్ళు, “నీకు చేగోడీలు ఇష్టంరా, అందుకని చేసేం” అని చేసి పెట్టేవరకూ నాకు చేగోడీలు ఇష్టమనే తెలియదు. అయినా ఇంత అమెరికా వచ్చీ ఏ ఫేషనబుల్ గా ఉన్న తిండినో ఇష్టపడాలి కానీ ఈ నాటు వంటకం ఇష్టం అని నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుందో ఏమో.

ఈ జఠర వ్యక్తిత్వం అనే ఊహనాన్ని వ్యక్తిగత స్థాయి నుండి జాతీయ స్థాయికి లేవనెత్తవచ్చు. మానవుడు సర్వాహారి. దేశ, కాల పరిస్థితులని బట్టి ఏది దొరికితే అది తిని బతకనేర్చిన జీవి. అయినా సరే కొన్ని కొన్ని జాతులు ఒకొక్క రకమైన జఠర ముద్రని ప్రదర్శిస్తాయి. హిందువులు ఆవుని తినరు. ముస్లింలు పందిని తినరు. కొరియా వారు కుక్కలని, చైనా వారు పాములనీ తింటారు కాని, అమెరికాలో కుక్కలని, పాములని తినరు. కీటకాలనీ, వానపాములనీ చాల మంది తినరు. ఫ్రాంసులో నత్తలని గుల్లల పాళంగా వేయించి, దాని మీద వెల్లుల్లి జల్లి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆయా సంస్కృతుల జఠర వ్యక్తిత్వాలు.

ఈ విపరీతమైన ఉదాహరణలని అటుంచి, మనం సర్వ సాధారణంగా తినే వస్తువుల సంగతి చూద్దాం. మా చిన్న బావ కొత్తిమిర దుబ్బు కనిపిస్తే చాలు మైలు దూరం వెళ్ళిపోతాడు. ఇలాగే బెండ కాయలు, టొమేటోలు, బ్రోకలీ, కేబేజీ, కొబ్బరికాయ మొదలైనవి తినలేని వాళ్ళు మనకితరచు తారస పడుతూ ఉంటారు.

ఈ అయిష్టతలు అన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. పిల్లలందరికీ పుట్టగానే తెలిసేది తల్లి పాల రుచి. తర్వాత నెమ్మదిగా ఆవు పాలో, డబ్బా పాలో మొదలు పెట్టేసరికి కొంచెం తీపి అలవాటు అవుతుంది. ఆ తర్వాత సంస్కృతులకి అనుగుణంగా రుచులు అలవాటు అవుతాయి. మన దేశంలో అయితే అన్నంలో వాము నెయ్యి కలిపి కొత్త రుచులు అలవాటు చేస్తాం. సాధారణంగా పిల్లలు ఏ కొత్త రుచిని పరిచయం చేసినా మొదట్లో నచ్చుకోరు. మనం వాళ్ళ నోట్లోకి కుక్కటం, వాళ్ళు దాన్ని ఉమ్మెయ్యటం, మనం దానిని మళ్ళా చెంచాతో నోట్లోకి తొయ్యడం – ఈ తంతు ప్రతి తల్లికి తెలిసినదే.

పుట్టుకతో పసి పాపలు తీపిని నచ్చుకోవటం, చేదుని ఏవగించుకోవటం సర్వసాధారణంగా జరిగే పని. నాలుగు నెలల ప్రాంతాలలో ఉప్పదనం మీద మోహం పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రకరకాల రుచులు అలవాటు అవుతాయి. పాపకి భవిష్యత్తులో ఏయే రుచులు అలవాటు అవుతాయో ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే రుచుల మీద కూడ ఆధారపడి ఉంటుందిట. తల్లి వెల్లుల్లి తింటే పిల్లలకి కూడ వెల్లుల్లి మీద ఇష్టత పుట్టటానికి సావకాశాలు ఎక్కువట. ఈ సిద్ధాంతం ఎంత శాస్త్రీయమైనదో చెప్పలేను కాని, నా శ్రీమతికి వంకాయ ఇష్టం, మా అమ్మాయి సీతకి వంకాయ అంటే అసహ్యం.

కొత్త రుచులని ప్రయత్నించటానికి కూడ భయపడే పరిస్థితిని ఇంగ్లీషులో నియోఫోబియా అంటారు. ఈ భయమే పెద్దయిన తర్వాత “పికీనెస్” గా మారుతుంది. ఈ పికీనెస్ ని తెలుగులో ఏమంటారో ప్రస్తుతానికి స్పురించటం లేదు కాని, ఈ రకం వ్యక్తులు మనకి తరచు తారసపడుతూ ఉంటారు. కొందరు కంచంలో వడ్డించిన వస్తువులని వేళ్ళతో కోడి కెక్కరించినట్లు కెక్కరించి, ఏదీ సయించటం లేదని లేచి పోతారు. ఇలాంటి వాళ్ళతో రెస్టారెంటుకి వెళితే మన పని గోవిందా. వీళ్ళకి మెన్యూలో ఉన్నవి ఏవీ నచ్చవు. నూనె ఎక్కువ వేసేడనో, కారం సరిపోలేదనో, సరిగ్గా ఉడకలేదనో, అన్నం మేకుల్లా ఉందనో, ముద్దయిపోయిందనో, మరీ కరకరలాడుతోందనో, మాడిపోయిందనో, ఏదో ఒక వెలితి కనిపిస్తుంది వీరికి. వీరిని చూసి జాలి పడాలి కాని కోపగించుకునీ, విసుక్కునీ లాభం లేదు. మనందరికీ భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, పానీయాలు లా కనిపించేవే వీరికి ఏకుల్లాగో, మేకుల్లాగో కనిపిస్తాయి. అందుకని తినలేరు.

జేన్ కావర్ అనే ఆవిడ ఇటువంటి పికీ ఈటర్స్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడ పుచ్చుకుంది. ఫిలడెల్ఫియాలో 500 మందిని కూడగట్టి వారికి ఒక ప్రశ్నావళి సమర్పించింది. వీటికి ప్రజలు ఇచ్చిన సమాధానాలు చదవటం ఒక అనుభూతి. “నేను కరకరలాడే వస్తువులని తినలేను.” “నారింజ రంగులో ఉన్న తినుభండారలనే నేను తినగలను.” “పళ్ళెంలో వడ్డించిన వస్తువులని ఎల్లప్పుడూ అనుఘడి దిశలోనే తింటాను.” “నేను ఇంట్లో వండినవి తప్ప బయట వండినవి తినలేను.” ఇవీ ఆమె సేకరించిన సమాధానాలలో కొన్ని మచ్చు తునకలు. ఆవిడ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా పికీ ఈటరే. ఆవిడ వరకుఎందుకు. అమెరికాలో మన తెలుగు వాళ్ళల్లో నేను చూసేను. బయటకి వెళ్ళి ఏది తిన్నా ఇంటికివచ్చి ఆవకాయ డొక్క తో ఇంత మజ్జిగ అన్నం దబదబా తింటే కాని నిద్ర పోలేరు.

కొన్ని అలవాట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కొన్నింటికి మనం అలవాటు పడిపోయి పట్టించుకోము. కార్న్ ఫ్లేక్సు, ఓట్ మీలు మొదలైనవి ఉదయమే తినాలని ఎక్కడైనా నియమనిబంధనలు ఉన్నాయా? ముందు పప్పూ అన్నం, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆఖరున పులుసు, చారు, మజ్జిగ తినాలని ఎవరు నియంత్రించేరు? మా ఇంట పురోహితులు సోమయాజులు గారు ముందు కూర, పచ్చడి తిని, తర్వాత పిండివంటలు తిని, అప్పుడు పప్పు అన్నం తినే వారు. ఎందుకు అలా తిరకాసుగా తింటున్నారని నేను చిన్నతనంలో మర్యాద తెలియని రోజులలో అడిగేసేను. “పప్పు అన్నం ముందు తినెస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు మిగిలినవి తినటం కష్టం. అందుకని” అని ఆయన చెప్పేసరికి మా అమ్మ, నాన్నగారు కూడ తర్కబద్ధంగా ఉన్న ఆ సమాధానం విని ఆశ్చర్యపోయేరు.

నేను అమెరికా వచ్చిన తర్వాత తిండి తినే పద్ధతిలో ఒక కొత్త బాణీ ప్రస్పుటం కావటం మొదలైంది. ఇంటి దగ్గర అన్నంలో కలుపుకుందుకి పప్పు, కూర, పచ్చడి, తర్వాత పులుసు, చారు, మజ్జిగ – ఆ వరసలో తినేవాళ్ళం. ఆయ్యరు హొటేలుకి వెళ్ళి తిన్నా దరిదాపు అవే వంటకాలు తగిలేవి. మొన్న వాషింగ్టన్ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ ఇండియన్ రెస్టరాంటు కి వెళ్ళేను. వాడు ఒక కప్పు అన్నం, దానితో తినటానికి బైంగన్ బర్తా ఇచ్చేడు. ఎంతకని బైంగన్ బర్తా తింటాను? మర్నాడు చైనా వాడి దగ్గరకి వెళ్ళేను. వాడూ కప్పుడు అన్నం తో పాటు మరొక పాత్ర నిండా వేయించిన చిక్కుడు కాయలు పెట్టేడు. ఎంతకని చిక్కుడు కాయలు తింటాను? పోనీ అని రాత్రి పీట్జా తినటానికి వెళ్ళేను. అక్కడా అంతే. అంటే ఏమిటన్న మాట? ఒక్కళ్ళం రెస్టరాంటుకి వెళితే, వెళ్ళిన చోట మనకి థాలీ లాంటిది దొరకక పోతే మనకి నాలుగు రకాల ఆధరువులు లేకుండా “ఏక భుక్తమే” గతి.

ఇలాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవాలంటే చైనా రెస్టరాంటుకీ, ఇండియన్ రెస్టారాంటుకీ, ఒక్కళ్ళూ వెళ్ళకూడదు, ఒక చిన్న మందలా వెళ్ళాలని ఒకడు నాకు హితోపదేశం చేసేడు. ఇంట్లో మా ఆవిడ చెప్పినట్లు, ఆఫీసులో మా సెక్రటరీ చెప్పినట్లు వినటం అలవాటయిపోయిందేమో మనమంచికే చెబుతున్నాడు కదా అని ఆ హితైషి చెప్పినట్లు ఒక సారి అరడజను మంది సహోద్యోగులతో చైనా రెస్టరాంటుకి వెళ్ళేను. వాళ్ళంతా బాతులని, కుక్కలని, పందులనీ ఆర్డరు చేసుకుంటున్నారు. నేను బితుకు బితుకు మంటూ బుద్ధాస్ డిలైట్ ఆర్డరు చేసేను. అందరివీ ఒకటీ ఒకటీ వస్తున్నాయి. నేను తప్ప అందరూ వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. నేను బిక్క మొహం బైటకి కనిపించకుండా బింకంగా పోజు పెట్టి బుద్ధాస్ డిలైట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆది వచ్చే సరికి ఒక వాయి భోజనాలు కానిచ్చేసిన నా సహోద్యోగులు దీని మీద కలబడి పంచేసుకుని, “రావ్, మేము కూడ నీలాగే వెజిటేరియన్ ఆర్డర్ చెయ్యవలసింది, ఇది చాలా బాగుంది” అంటూ ఆ ప్లేటుని ఒకరి చేతుల మీదుగా మరొకరు నా దగ్గరకి పంపేసరికి అది కాస్తా ఖాళీ అయిపోయింది. నేను మొర్రో మొర్రో అంటే మరొక ప్లేటు తెప్పించేరు. ఆది వచ్చేసరికి అందరి భోజనాలు అయిపోయాయి.

నా తిండి అలవాట్లని తలచుకొని నా మీద నేను జాలి పడిపోయేలోగా మరొక సంగతి. కొందరికి అన్ని రకాల తిండి వస్తువులు పడవు. అంటే ఎలర్జీ. అమెరికాలో నాలుగింట ఒక వ్యక్తికి ఎదో విధమైన తిండి ఎలర్జీ ఉందిట. ఈ ఎలర్జీలలో కూడ రకాలు ఉన్నాయి. కొంతమందికి నువ్వులు, వేరుశనగ తింటే నోరు పూసెస్తుంది. మరికొందరికి వేరుశనగ పొడ తగిలితే చాలు ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురౌతుంది.

అందుకోసం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలచినప్పుడు వారిని అడగెయ్యటమే. నిషిద్ధం కావచ్చు, పడక పోవచ్చు, ఇష్టం లేక పోవచ్చు. మతం ఒప్పుకోకపోవచ్చు. మా చిన్న బావని ఎవ్వరైనా భోజనానికి పిలిస్తే, మొహమాటం లేకుండా,”అమ్మా! దేంట్లోనూ కొత్తిమిర వెయ్యకండి. కొత్తిమిర వాసన కూడ దేనికీ తగలకుండా చూడండి” అని చెప్పెస్తాడు.

ఇంకో రకం ప్రజలకి మరొక సమస్య. వీరి నాలుక రుచులలో అతి చిన్న తేడాలని కూడ ఇట్టే పట్టేయగలదు. వీరి రుచి బొడిపెలు అతి సున్నితం. మన బోంట్లకి చక్కెర లేని కాఫీ, టీ లు కొద్దిగా చేదనిపిస్తే వీరికి పరమ చేదుగా ఉంటాయి. అదే టీ లో ఒక చెంచాడు పంచదార వేసుకుంటే మనకి సరి పోతుందికాని వీరి నోటికి ఆ టీ పానకంలా అనిపిస్తుంది. వీళ్ళని ఇంగ్లీషులో “సూపర్ టేస్టర్స్” అంటారు. మామిడి పండు ఇష్టం లేని మా అన్నయ్య ఒక సూపర్ టేస్టర్. వంట వండి వాడిని మెప్పించటం ఆ బ్రహ్మ దేవుడి తరం కాదు. ఉప్పు ఎక్కువైంది, పులుపు సరిపోలేదు, కారం మరి కాస్త పడాలి అంటూ వాడి గొణుగుడు భరించటం మాకు అలవాటైపోయింది. కాని ఆవకాయలు పెట్టే రోజులు వచ్చినప్పుడు మాత్రం పాళ్ళు సరిగ్గా పడ్డాయో లేదో చూడటానికి వాడు లేకపోతే ఆవకాయ సరిగ్గా వచ్చేదే కాదు. ఇండియాలో పుట్టి గుర్తింపు లేక, రుచులు ఎంచుతాడని నలుగురి చేత చివాట్లు తినేవాడు కాని, వాడి వంటి సూపర్ టేస్టర్స్ కి అమెరికాలో మంచి ఉద్యోగాలే దొరుకుతాయి.



ఆధారం
వేమూరి వేంకటేశ్వరరావు, జిహ్వకోరుచి, ఈమాట అంతర్జాల పత్రిక, సెప్టెంబరు 2005

Tuesday, February 10, 2009

ఈ సిద్ధాంతం విన్నారా?

ఫిబ్రవరి 2008

చెన్నపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమిలిపట్నం, కళింగపట్నం, (ఈ జాబితాని పూర్తి చెయ్యండి) .... ఇలా తెలుగు, తమిళ దేశాలలో ఏ "పట్నం" పేరు చూసినా అది సముద్రపుటొడ్డున ఉన్న ఉరే (రేవు పట్నం) కావటం గమనార్హం.

ఈ బాణీకి వ్యతిరిక్తంగా రెండే రెండు ఊళ్ళు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో తునికి, యలమంచిలికి మధ్య ఉన్న రైలు స్టేషన్ నరిశీపట్నం రోడ్డు. నరిశీపట్నం ఊరు ఇంకా లోపుకి (సముద్రానికి దూరంగా), కొండలలో ఉంది. రెండో ఊరు, విశాఖపట్నం స్టేషన్ కి రైలు బండి చేరుకునే ముందు గోపాలపట్నం అనే ఊరు మీదుగా వెళుతుంది. ఈ గోపాలపట్నం విశాఖ విమానాశ్రయానికి చాల దగ్గర. ఇది సముద్రానికి దగ్గరగానే ఉన్నా, రేవుపట్టణం కిందకి రాదు.

ఈ రెండు ఊళ్ళని మినహాయిస్తే, "పట్నం" అన్న తోక ఉన్న ఊళ్ళన్నీ రేవు పట్టణాలనే నా నమ్మకం. ఈ గమనిక మీద వ్యాఖ్యానాలు ఆహ్వానిస్తున్నాను.

Sunday, February 8, 2009

ఇచ్చుటలో ఉన్న హాయి...

ఫిబ్రవరి 8, 2009, ఆదివారం ఈనాడు పత్రికలో దానం చెయ్యటంపై ఒక సంపాదకీయం పడింది. అది అందరూ చదవదగ్గది. అందుకని దాని లంకె ఇక్కడ ఇస్తున్నాను.
http://www.eenadu.net/homelink.asp?qry=Editorial

ఈ లంకె ఎన్నాళ్ళు తాజాగో ఉంటుందో తెలియదు కనుక, ఆ వ్యాసాన్ని యధాతథంగా ఈ దిగువ చూపుతున్నాను. ఈ బ్లాగులో, గతంలో, అత్త(వా)గారి సొమ్ము అనే ఒక వ్యాసం ఉంది. అదికూడా ఈ సందర్భంలో మళ్ళా చదవదగ్గది.

ఇదిగో ఈనాడు సంపాదకీయం

ఇచ్చుటలో ఉన్న హాయి...

'వచ్చినవాడు వామనుడు కాడు, శ్రీమన్నారాయణుడు... దానం మాట మర్చిపో... లేకుంటే ఆయన మాయకు బలి అవుతావు' అని బలిచక్రవర్తిని శుక్రాచార్యులు గట్టిగా హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి వినలేదు. 'మాట ఇచ్చాను... దానం చేసి తీరవలసిందే... తిరుగన్నేరదు నాదు జిహ్వ, వినుమా ధీవర్య వేయేటికిన్‌' అన్నాడు. ఆ ప్రకారమే ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. తన సహజ కవచకుండలాలు అపహరించడానికి స్వయంగా దేవేంద్రుడే యాచకుడిగా వస్తున్నాడని కర్ణుడికి ముందే తెలిసింది. అయినా చలించలేదు. '...విప్రులు కడునర్థివేడిన బొచ్చెంబు సేయక ఇచ్చుట... నాకు వ్రతం... ఆ వ్రత నియమాలకి తిరుగులేదు' అన్నాడు. అన్నట్టుగానే దానమూ చేశాడు. దగ్గరున్నదంతా దానధర్మాలకు వెచ్చించి వట్టి చేతులతో మిగిలాడు రంతిదేవుడు! ఆ స్థితిలో మరో దీనుడు వచ్చి చేయి చాచాడు. 'అన్నము లేదు... కొన్ని మధురాంబువులున్నవి... త్రావుమన్న... రావన్న!' అంటూ వాణ్ని చేరదీసి ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి నిశ్చింతగా నిలబడ్డాడు. మొన్న మొన్నటిదాకా మన మధ్యన జీవించిన మహాతల్లి డొక్కా సీతమ్మదీ అదేవరస. 'వరద గోదారి పోటుమీద ఉంది, పడవ ప్రయాణం ప్రమాదమమ్మా!' అని సరంగులు వారించారు. అయినా ఆవిడ వినలేదు. లంకల్లో చిక్కడి, ఆకలితో అల్లాడుతున్న దీనులకోసం వేడిగా వండి వార్చి పట్టుకెళ్ళి వడ్డించింది. పాప పుణ్యాల సంగతి కాదు ఇక్కడ చూడవలసింది. 'దానం చేస్తే పుణ్యం వస్తుంది' అనుకుంటూ దానాలు చేసిన బాపతు కాదు వారెవరూ! దాతృత్వం వారి సహజ స్వభావం అంతే! తమ దగ్గర ఉన్నది సంతోషంగా ఇచ్చే లక్షణం కారణంగా వారంతా చరిత్రలో నిలిచిపోయారు. వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ధన్యజీవులంటున్నాం!

చప్పని వట్టిగడ్డిని తినిపించినా- గోవులు కమ్మని పాలు ఇస్తాయి. మురికినీటిని తెచ్చి తమలో కలిపేస్తున్నా సహించి, నదులు తియ్యని నీళ్లు ఇస్తాయి. తనని నరకడానికి వచ్చినవాడికి సైతం చెట్లు చల్లని నీడ ఇస్తాయి. ఇవ్వడం వాటి స్వభావం! అందుకే వాటికి లోకంలో పూజార్హత! అపకారం చేసినవాడిని సైతం ..పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు... అనే గొప్ప లక్షణాన్ని మనిషి వాటినుండే నేర్చుకున్నాడు. రుచికరమైన ఆహారాన్ని ఒక్కడివీ కూర్చుని తినకు. ఏకఃస్వాదు న భుంజీత... అని భారతం ఆదేశించింది. దాన్ని పాటించేవారు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. వారిని సజ్జనులు అంటారు. వారివల్లే ఈమాత్రం అయినా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి- అని లోకం భావిస్తుంది. దానగుణం అనేదాన్ని గొప్ప లక్షణంగా లోకం గుర్తించింది. ఆలికి అన్నం పెట్టడమే ఊరికి గొప్ప ఉపకారమనుకునే జనం సంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో, పరాయివాడికి సహాయం చేద్దామని ఎవరైనా అనుకుంటే చాలు- లోకం హర్షిస్తుంది. వారికి జేజేలు పలుకుతుంది. వారిని దేవుళ్లలా చూస్తుంది. 'అనాథాశ్రమం కట్టడానికి చందా కావాలి' అని వస్తే- 'నా దగ్గరేముంది ఇవ్వడానికి! నా ముసలి తల్లితండ్రులను మీ సమాజానికి జమ వేసుకోండి' అని అంటగట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అలాంటివారికి ఇవ్వడంలో ఉండే గొప్ప అనుభూతి ఎన్నటికీ తెలియదు. తన స్తనాన్ని పసిబిడ్డ నోట కరచి పట్టుకుని తియ్యని పాలని ప్రేమగా జుర్రుకుంటుంటే- తన జీవాణువుల్లోని మాతృత్వపు మహామాధుర్యాన్ని పాల రూపంలో బొట్టు బొట్టుగా బిడ్డ లేత పెదవులపై జార్చే అమ్మ- ఆ క్షణాన ఏ దేవతకైనా తీసిపోతుందా? ప్రమాదానికి గురై రక్తం ఓడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుడికి మన శరీరంలోని రక్తం నెమ్మదిగా ప్రాణం పోస్తుండగా, ఆ జీవి క్రమంగా తేరుకుని మొహం తేటపడుతుంటే మనకు కలిగే ఆనందం బ్రహ్మానందానికి తీసిపోతుందా! ఆ క్షణాన మనం దేవతలతో సమానం కామా? మరణానంతరం మన కళ్లు మరో అంధుడి కళ్లకి వెలుగునిచ్చి ఈ లోకాన్ని తృప్తిగా పరికిస్తుంటే - మనం ఇంకా జీవించి ఉన్నట్లు కాదా! ఆ మేరకు మనం అమరులం అయినట్లే కదూ! అవును! దానగుణం మనల్ని దేవతలను చేస్తుంది.

మనలో కొన్ని అపోహలు స్థిరపడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటే మగతనం సన్నగిల్లుతుందనీ, రక్తం దానం చేస్తే ప్రాణం నీరసపడుతుందనీ, కళ్లు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డివాడిగా పుడతామనీ.. ఏవేవో దురభిప్రాయాలు మనలో పాతుకుపోయాయి. ఇదంతా వట్టి అవివేకమని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నిజానికి రక్తదానం చేసినప్పుడు ఆ మేరకు తిరిగి రక్తాన్ని ఉత్పత్తి చేసుకునే వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. కొద్ది గంటల్లోనే శరీరానికి అవసరమైనంత రక్తం తయారవుతుంది. అంతేకాదు, శరీర భాగాలను దానం చేసిన వారికి ఆరోగ్యమూ, ఆయుర్దాయమూ పెరుగుతాయన్న ఒక గొప్ప విశేషాన్ని పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాలను దానం చేసినవారి ఆరోగ్య స్థితిగతులపై సుదీర్ఘ పరిశీలన నిర్వహించిన అమెరికాలోని మినెసొటా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఈ సంచలన విషయాన్ని ప్రకటించింది. 'న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌'లో ప్రచురితమైన డాక్టర్‌ హసన్‌ ఇబ్రహీం బృందం పరిశోధన ప్రకారం- మూత్రపిండాలు దానం చేసినవారు మరింత ఆరోగ్యంగాను, ఆయుర్దాయంతోను నిశ్చింతగా జీవిస్తున్నట్లు స్పష్టం అయింది. గతంలో నార్వే, స్వీడన్‌లలో చేపట్టిన ఇదేరకం అధ్యయనాలు సైతం ఈ విషయాన్నే నిర్ధారించడం గమనించదగిన విశేషం. మనిషి శరీరంలోని భాగాలను సైతం దానం చేసినా హాని జరగదు సరికదా- ఆరోగ్యం మెరుగవుతుంది, ఆయుర్దాయమూ పెరుగుతుందన్నది విజ్ఞాన శాస్త్రం తేల్చి చెప్పింది. మనిషికి వరంగా లభించే దేహంలోనే ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పుడు- దానం మూలంగా మనిషి స్వయంగా సంపాదించుకున్న సిరిసంపదలలో కొంతభాగం ఇచ్చేస్తే కోలుకోలేమనడం శుద్ధ అవివేకం కదా! ఏమంటారు?

Friday, February 6, 2009

కాకిగోల

ఫిబ్రవరి 2009

మా తునిలో – నా చిన్నతనంలో - సాయంకాలం డాబా మీద పడుక్కుంటే చాలు కాకులు వందలకొద్దీ కనిపించేవి. కాకులు గూళ్ళు చేరే వేళ అది. మా ఇంటి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు మీద కాకులు చేసే “కావ్ కావ్” గోలకి చెవులు గింగుర్లెత్తిపోయేవి. నేను అమెరికా వచ్చిన కొత్తలో కాకులు కనిపించేవే కాదు. ఈ మధ్య ఇండియన్సుతో పాటు అమెరికాలో కాకుల జనాభా కూడ పెరుగుతూన్నట్లనిపిస్తోంది.

ఒక్క నూజీలండ్‌లో తప్ప కాకులు లేని దేశం లేదుట. కొన్ని దేశాలలో ఎక్కువ, కొన్ని దేశాలలో తక్కువ.

సాధారణంగా పల్లెలలో ఎక్కువ, పట్టణాలలో తక్కువ.

పొలాలలో పంట పిట్టల పాలు కాకుండా ఉండటానికి గడ్డితో చేసిన మనిషి బొమ్మలని కాపలా పెడతారు. ఈ గడ్డి బొమ్మలని చూసి పిచికలు భయపడతాయేమో కాని ఆ గడ్డి మనుష్యుల మీద భయం లేకుండా వాలే కాకులని చూసేను నేను. మనుష్యులంటే కాకులకి బొత్తిగా భయం లేదు.

కాకులు పంటలని తినేసి రైతుకి నష్టం తీసుకొస్తాయనే వదంతి ఒకటి ఉంది. తిండి గింజలని కాజేయటంలో కాకులు దిట్టలే కాని, పంటలకి నష్టం కలిగించే క్రిమికీటకాదులని కూడ కాకులు తింటాయి కనుక మొత్తమ్మీద కాకుల వల్ల లాభమే కాని నష్టం వాటిల్లటం లేదని కొంతమంది “కాకి కోవిదులు” కాకులని వెనకేసుకొస్తున్నారు.

కాకులు తెలివిగల పక్షులు అని వాదించటానికి బోలెడన్ని దాఖలాలు చూపించవచ్చు.

ఒక సారి ఎత్తుగా ఎగురుకుంటూ వచ్చి ముక్కున కరిచిపెట్టిన పిక్కని ఒక కాకి సిమెంటు చపటా మీద జారవిడచింది. “అయ్యో పాపం! కాకి ముక్కు నుండి పిక్క జారిపోయిందే” అని నేను జాలి పడుతూ ఉంటే కింద పడ్డ దెబ్బకి పిక్క చితికి లోపల ఉన్న గింజ బయటకి వచ్చింది. కాకి కిందకి దిగొచ్చి ఆ గింజని కబళించింది. కాకి కావాలని ఆ పిక్కని చపటా మీద పడేసిందిట – అని కాకి కోవిదుడు నాకు వివరణ ఇచ్చేడు.

చిన్నప్పుడు చదువుకున్న మరొక కథ. సన్నని మూతిగల కూజాలో అట్టడుగున ఉన్న నీళ్ళని తాగటానికి గులకరాళ్ళతో కూజాని నింపుతుందొక కాకి. అప్పుడు పైకి అందొచ్చిన నీళ్ళని తాగుతుంది.

కాకి తెలివైన ఘటం అని నమ్మించటానికి మిత్రభేదంలో ఒక కథని వాడుకోవచ్చు. ఒక చెట్టు కింద పుట్టలో ఉండే పాము చెట్టెక్కి ఒక కాకి పెట్టిన గుడ్లని దొంగతనంగా తినేస్తూ ఉంటుంది. రాణి గారి మిలమిల మెరిసే నగని మన కరటం దొంగిలించి రాజభటులు చూస్తూ ఉండగా పుట్టలో పడెస్తుంది. రాజభటులు పుట్టని తవ్వి, పాముని చంపి, నేవళాన్ని దక్కించుకుంటారు. ఈ కథని బట్టి కాకి తెలివైనదే కాకుండా దొంగబుద్ధులు ఉన్నదని కూడ రుజువవుతోంది కదా. దొంగని దొంగే పట్టాలంటారు. ఈ కథని బట్టి మనకి మరొక విషయం ద్యోతకమవుతోంది. కాకులకి మిలమిల మెరిసే వస్తువులంటే ఇష్టం. మా పెరట్లోని వెండి ఉగ్గు గిన్నెలనీ, చిన్న చిన్న చెంచాలనీ కాకులు తరచు ఎత్తుకుపోతూ ఉండటం నాకు తెలుసు. కనుక నీతిచంద్రికలోని కాకి కథ పూర్తిగా కాకమ్మ కథ కాకపోవచ్చు.

ఇటువంటి తెలివిని ప్రదర్శిస్తూన్న కాకులని లోకువ కట్టేసి, “లోకులు కాకులు” అని లోకులు కాకులకి ఎందుకు అప్రతిష్ట తెస్తారో నాకు అర్ధం కాదు. లోకులలో వీసమెత్తు సంఘీభావం నేనెప్పుడూ చూడలేదు కాని, కాకులలో కలిసికట్టుతనం చాల ఎక్కువ. ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడిపోతే ఆ కాకిని ఏకాకిగా ఒదిలేయకుండా పది కాకులు కింద పడ్డ కాకి చుట్టూ మూగుతాయి. దెబ్బ తిన్న కాకి తేరుకునే వరకు వేచి ఉంటాయి. ఒక వేళ కాకి కాని చచ్చిపోతే చుట్టూ మూగిన కాకులు అలా కాపలా కాస్తూనే ఉంటాయి.

మసి పూసుకుని రెక్కలు కట్టుకున్నా సరే మానవుని మేధ - తులానికి తులం – కాకి తెలివితో తూగలేదని కొందరు అంటున్నారు.

కోకిలకి గుడ్లు పొదగటం చేతకాదనిన్నీ, అందుకని కోకిల కాకి గూట్లో గుడ్లు పెడుతుందనిన్నీ, పిల్ల బయటకి వచ్చిన తరువాత చూట్టానికి రెండూ నల్లగానే ఉన్నా “కాకి కాకే, కోకిల కోకిలే” కాబట్టి కాకి కోకిల పిల్లలని గుర్తు పట్టి గూట్లోంచి తరిమెస్తుందని ఒక కథ చలామణీలో ఉంది. ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని, ఇలా బేవారసుగా మరొకరి చేత పని చేయించుకోటాన్ని సంస్కృతంలో “కాక పిక న్యాయం” అంటారు. “కవి సమయం” వలె వాడుకుందుకి బాగుంటే బాగుండ వచ్చు గాక, కాని కాకులు ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు అంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను.

“కాకి కాకే, కోకిల కోకిలే” అంటూ కాకిని చిన్నబుచ్చటానికి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది: కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేద పిక కాకయో? వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. దీని అర్ధం ఏమిటంటే “కాకీ నలుపే, కోకిలా నలుపే. రెండింటికి ఏమిటి తేడా? వసంతకాలం వస్తే కాకి కాకే, కోకిల కోకిలే.”

ఇలాగే కాకినీ, నెమలినీ పోల్చుతూ, “కాకీక కాకికి కాక కేకికా?” అంటూ ఒక కొంటె కోణంగి కాకులని తెలుగులో ఒక కసురు కసిరేడు.

నల్లగా (అంటే, అంద విహీనంగా) ఉన్న మగవాడికి అందమైన (అంటే, నలుపు తక్కువైన) ఆడదానిని కట్టబెడితే, “కాక త్రోటిబింబ న్యాయం” అని సంస్కృతంలోనూ, “కాకి ముక్కుకి దొండపండు” అని తెలుగులోనూ అంటారు. “కాకిదొండ” అనే ఒక రకం దొండ పాదుకి కాసే దొండపండు కూడా ఎర్రటి ఎరుపే. కాని కాకి ముక్కుకి తగిలించే దొండ మామూలు దొండో, కాకిదొండో నాకు తెలియదు.

తెల్లనివన్నీ పాలెలా కావో అలాగే నల్లని పక్షులన్నీ కాకులూ కావు. ఆ మాటకొస్తే కాకి జాతికి చెందిన పక్షులన్నీ నల్లగానూ ఉండవు. తెలుగులో “సముద్రపు కాకి” అనబడే పక్షిని ఇంగ్లీషులో “ఆస్‌ప్రి” అంటారు. ఇది కాకి జాతి కానే కాదు. చూడటానికి తెల్లగా, కొంగలా ఉంటుంది. ఎందుకనో, ఎవ్వరో దీన్ని “సముద్రపు కాకి” అని తప్పుగా అనేశారు; అది నిఘంటువులోకి ఎక్కిపోయింది. “సముద్రపు కాకిని నిఘంటువు నుండి తొలగించాలి!” అనే నినాదంతో నేను ఎన్నికలలో పోటీ చేస్తా!

మేగ్‌పీ, రూక్, జే, రేవెన్ - ఈ నాలుగూ కాకి జాతే కాని మొదటి మూడూ నల్లగా ఉండనే ఉండవు. ఎడ్గార్ అలెన్ పో అనే అమెరికా కవి “రేవెన్” అనే మకుటంతో చిరస్మరణీయమైన ఇంగ్లీషు పద్యం రాసేడు.

కాకిని పోలిన రేవెన్ కి బ్రిటిష్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. లండన్ నగరపు తూర్పు శివారుల్లో, థెంస్ నది ఒడ్డున “టవర్ అఫ్ లండన్” అనే కట్టడం ఉంది. ఇందులో ఒక కోట, ఒక ఖైదు, ఒక రాజగృహంతో పాటు, ఈ కట్టడపు ప్రాంగణంలో నాలుగు రేవెన్ లు ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ ప్రాసాదపు ప్రాంగణం విడచి బయటకి ఎగిరిపోతాయో అప్పుడు బ్రిటిష్ రాజవంశం నాశనం అయిపోతుందనే మూఢ నమ్మకం బ్రిటిష్ వాళ్ళకి గాఢంగా ఉంది. అందుకని ఆ పక్షులు ఎగరటానికి వీలు లేకుండా వాటి రెక్కల కింద ఉండే స్నాయువులని రివాజుగా కత్తిరించెస్తారు. లండన్ చూడటానికి వెళ్ళిన పర్యాటకులకి ఈ రేవెన్ జాతి కాకులు ప్రత్యేకమైన ఆకర్షణ! ఈ రేవెన్ లు ఎంత నలుపంటే బాగా నల్లగా నిగనిగలాడే జుత్తుని ఇంగ్లీషులో “రేవెన్ హెయిర్” అంటారు.

ఈ రేవెన్ జాతి కాకులని నా చిన్న తనంలో “మాల కాకులు” అనేవారు. ఇప్పుడు, మాల, మాదిగ వంటి పేర్లు వాడితే హరిజనులకి, దళిత వర్గాలవారికీ కోపం వచ్చినా రావచ్చు కనుక వీటికి మరొక పేరు పెట్టాలేమో. మనం వీటిని ఏ పేరు పెట్టి పిలచినా ఇవి ఎండకి నల్లబడ్డ మామూలు కాకులు కావు; ఇవి కాకులలో ఒక ఉప జాతి. మామూలుగా మనవేపు కనిపించే “ఊర కాకులు” మరీ అంత నల్లగా ఉండవు; వాటి ఛాతీ బూడిద రంగులో (చామనచాయగా) ఉంటుంది. “బొంత కాకులు” శరీరం అంతా నల్లటి నలుపు. ఇవి రేవెన్ లకి దూరపు బంధువులయి ఉండొచ్చు.

మనదేశంలో మనకి ఎక్కడ చూసినా కాకులు కొల్లలుగా కనిపిస్తాయి; హంసలు తుపాకేసి వెతికినా కనిపించవు. తుపాకేస్తే కాకులూ కనిపించకపోవచ్చు; అది వేరే సంగతి. తమాషా ఏమిటంటే మన కవులకి మాత్రం ఎక్కడ చూసినా హంసలే కనిస్పిస్తాయి కాబోలు; వాళ్ళకి కాకి - మచ్చుకి ఒకటి - కనిపించి చావదనుకుంటాను. కాకులని వర్ణించిన కవిని ఒక్కడిని చూపించండి. కాకులన్నీ కవితకి అనర్హమేనా? లేకపోతే, లేని హంసలని తెగ వర్ణించి ఉన్న కాకులని విస్మరించిన కవుల పరిశీలనా శక్తిని విమర్శించాలా? లేక, మన దేశంలో తరతరాలుగా తెలుపు తొక్క మీద ఉన్న మమకారానికి నలుపు మీద ఉండే చిన్న చూపుకి ఇది మరొక నిదర్శనమా? కాకపోతే ఏమిటి చెప్పండి! “గంగలో మునిగినంత మాత్రాన్న కాకి హంస అవుతుందా?” అనిన్నీ, “కాకై కలకాలం బ్రతికే కంటె హసై ఆరు నెలలు బ్రతికితే చాలదూ?” వంటి సామెతలతో కాకులని వేళాకోళం చేస్తారా?

మన దేశంలో హంసని అమాంతం పైకి ఎత్తేసి కాకిని కిందకి దించేసేము కాని ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాలలో ఒక దానికి “సిగ్నస్” (హంస) అనిన్నీ, మరొక దానికి “కోర్వస్” (కాకి) అనిన్నీ పేర్లు పెట్టి రెండింటినీ సమానంగా గౌరవించేరు, పాశ్చాత్యులు.

రామాయణంలో ఒక్క చోట మాత్రమే కాకి ప్రస్తావన వస్తుంది. సీతారాములు కాకులు దూరని కారడవిలో వనవాసం చేస్తూన్నప్పుడు, కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవి వక్షస్థలం గాయపరచగా, రాముడు దర్భ పుల్లని మంత్రించి వదులుతాడు. అదే బ్రహ్మాస్త్రమై కాకాసురుడుని వెంటాడితే వాడు తిరిగి రాముడినే శరణు వేడుకుంటాడు. రామబాణానికి తిరుగులేదు కనుక ప్రాణం రక్షించుకుందుకి అస్త్రానికి కన్ను బలిగా సమర్పించుకుంటాడు. అందుకనే కాకికి ఒక కన్ను లొట్టపోయి మెల్లకన్నులా కనిపిస్తుందని ఒక కథ ఉంది.

కాకి మెల్ల కన్నుకి కారణం నల్లి శాపం అని మరొక పిల్లల కథలో వస్తుంది: “చీమ, నల్లి నేస్తం పట్టేయిట. నల్లి కర్రలకి వెళ్ళిందిట. చీమ పులుసులో పడిపోయిందిట. నల్లికి దుఃఖం వచ్చిందిట…” ఈ కథలో కాకి కన్ను లొట్టపోవాలని నల్లి శపిస్తుంది.

కారణం ఏది అయినా కాకి చూపులో కొద్దిగా దోషం ఉన్నట్లు కనిపిస్తుందని దృష్టి దోషం లేనివాళ్ళంతా ఒప్పుకుంటారు. కాకి ఎటు చూస్తున్నాదో చెప్పుకోవటం కష్టం. అందుకనే ఒకే వ్యక్తి రెండు పక్కలా వాదించటానికి ప్రయత్నిస్తే “కాకాక్షి న్యాయం” అంటారు. కాకతాళీయ న్యాయం లో కాకి పాత్ర కేవలం కాకతాళీయం! కాకదంత పరీక్ష అంటే కంచి గరుడ సేవ చెయ్యటం.

మిత్రభేదంలో కథానాయకుడనదగ్గ “కరటకుడు” కి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? కరటం అంటే కాకి. ఆ కాకి తెలివి నక్కకి ఇచ్చేడు కవి. ఇచ్చి ఆ నక్కకి “కరటకుడు” అని పేరు పెట్టేడు. అని నా సిద్ధాంతం.

కాకి గుమ్మంలో వాలి అదేపనిగా అరిస్తే చుట్టాలొస్తారని ఒక నమ్మకం. నిర్ధారణ చేసుకోవాలంటే, “కాకీ మా ఇంటికి మా అన్నయ్య వస్తున్నాడని గెంతు” అని అడిగినప్పుడు కాకి కాని గెంతితే అన్నయ్య రావలసిందే. కాకిని గెంతించటానికి “ఎంగిలి చేత్తో కూడ కాకిని తోలని వాళ్ళు” పరమ లోభులన్నమాట.

కాకెంగిలి చెయ్యటం అంటే చొక్కా కింద పెట్టి కొరికి ఇవ్వటం. చొంగెంగిలి కంటె కాకెంగిలి ఎంతో నయం అని శాస్త్రీయంగా రుజువు చెయ్యొచ్చు.

తెలుగులో కాకిబంగారం అన్నా ఇంగ్లీషులో “టిన్‌సెల్” అన్నా ఒకటే కాని తెలుగు వారికి ఇంగ్లీషు మాటే నచ్చుతుందిట. ఈ ఇంగ్లీషు అభిమానులు “ఎంగిలి” ని ఇంగ్లీషులో ఏమంటారో కనుక్కోవాలి.

కాకికీ, చావుకీ ఏదో సంబంధం ఉంది. చచ్చిపోయిన వారికి పిండాలు పెట్టినప్పుడు వాటిని కాకులు తినాలంటారు. కాకినాడలో కాకులకి కరువో ఏమిటో కాని అక్కడ పిండాలని పిండాల చెరువులో “వదిలేవారు.” “వదులుతారు” అని ఎందుకు అనలేదంటే ఆ చెరువుని ఇప్పుడు కప్పెట్టేసేరుట.

“కాకి చావు” అంటే హఠాన్మరణం.

“కాకి గాలి” తగిలితే చావు త్వరగా వస్తుందిట. కాకి గాలి తగిలేంత దగ్గరగా నేను ఎప్పుడూ కాకిని దగ్గరగా రానివ్వలేదు - అది మీద రెట్ట వేస్తుందనే భయంతో. ఆ భయమే నన్ను రక్షించినట్లుంది.

నాకు ఇంతవరకూ కాకి గాలి తగిలినట్లు లేదు. అందుకే ఇలా బ్లాగుతున్నాను.

ఈ దిగువ లంకె పంపినందుకు అరుణం గారికి ధన్యవాదాలు!

http://video.google.com/videoplay?docid=-7329182515885554944