Tuesday, January 19, 2010

నాకు తెలియక అడుగుతాను

నాకు తెలియక అడుగుతాను, మరేమీ అనుకోకండి.
ఒక పక్క
దేశంలో దరిద్రం తాండవిస్తోంది.
లంచగొండితనం పరాకాష్ఠనందుకుంటోంది.
అవస్థాపన సౌకర్యాల స్థితి అధ్వాన్నంగా ఉంది.

మరోపక్క
చైనావాడు
మనా భూభాగాన్ని అంగుళం అంగుళం చొప్పున కబళించెస్తున్నాడు
అరుణాచల ప్రదేష్ అంతా తనదే అంటున్నాడు
దేశంలోకి చొరబడ్డమే కాకుండా మన కలన వలయాలలోకి కూడ చొరబడి
మన దేశపు అస్తిత్వానికే ఎసరు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు

మరోపక్కనుండి
పాకిస్తాను వాడు
ముంబాయి మీద దండెత్తి
ఘజినీ, గోరీ రోజులు గుర్తుకు తెస్తున్నాడు

ఇన్ని సాధించవలసిన సమశ్యలు ఉండగా
మన తెలుగు విద్యార్ధులు
భావి భారత పౌరులు
నవయుగపు రథసారధులు
ఏమిటి చేస్తున్నారు?

రాజకీయనాయకుల చేతులలో చదరంగపు పావులుగా మారి
సొంతంగా ఆలోచించటం మాని
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

విశ్వవిద్యాలయాల్లో నేర్వవలసినది విచక్షణా జ్ఞానం
బుర్రలేని గొర్రెపోతులా కసాయివాడి వెనక నడవడం కాదు

Thursday, January 7, 2010

తెలుగు దేశానికి పట్టిన దుర్గతి

తెలుగు వాళ్ళకి మరో పని లేదా? చీటికీ మాటికీ వీధిన పడి దౌర్జన్యకాండ జరపటం తప్ప మనవాళ్ళకి మరో పని ఉన్నట్లు లేదు. ఎక్కడో, ఎవ్వరో అనామకులు అంతర్జాలంలో ఒక కూత కేసే సరికి ముందూ, వెనకా ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా వీధిన పడి కనిపించినవి అన్నీ కాల్చెయ్యటమేనా? ఒక "వెబ్ సైటు" స్థాపించటం అనేది అయిదు నిమిషాల పని. మరొకరి పేరు మీద ఈ-టపాలు పంపటం అర నిమిషం పని. తెలుగు వాళ్ళని ఇంత సులభంగా బుట్టలో వేసుకోవచ్చని మన దేశపు శత్రువులకి తెలిస్తే వారు వెబ్ సైటు లని, ఈ-టపాలని ఉపయోగించి మనకీ పాకిస్తానుకీ (కాకపోతే మనకీ- చైనాకి, ఏదో మాటవరసకి అంటున్నాను) ఒక్క కలం పోటుతో కలత పెట్టొచ్చు. ఆలోచించండి. రిలయన్సు వారు నా బావ మరదులు కారు. రాజశేఖరరెడ్డి చావుకి మరొక కారణం చెప్పేడు హైదరాబాదులో టేక్సీ తోలేవాడు. హెలికాప్టరు చోదకుడు మందులకి లొంగని కేన్సరుతో బాధపడుతున్నాడుట. అతని చావు ఎలాగూ తథ్యమేనని అతని వారసులకి కోట్ల కొద్దీ డబ్బు ఇచ్చి, ఆ చోదకుడిని ఆత్మహత్య చేసేసుకోమన్నారుట. ఎవ్వరు? రాజశేఖరరెడ్డి మరణిస్తే లాభం పొందే వారు. చోదకుడు వారి పేర్లు కూడా చెప్పేడు. అసలే ఆంధ్రదేశం ఉడికిపోతోంది. ఇప్పుడు ఆ పేర్లు మళ్ళా చెప్పేనంటే ఇంకేమయినా ఉందా!

ఇందిరా గాంధీ చచ్చిపోయిన తరువాత రాజివ్ గాంధి ప్రధాని అయిన రోజునే ధీరూభాయి అంబానీ అర నిమిషం సేపు రాజివ్‌తో ముఖస్తంగా మాట్లాడటానికి అవకాశం ఇమ్మని ఆ అర నిమిషంలోనూ "అమ్మ గారికి ఎప్పుడైనా ఏదైనా అయితే అప్పుడు ఈ కాగితం మీకు ఇమ్మన్నారు" అని నెంబర్లు ఉన్న కాగితం ఒకటి అందించేడుట. రాజివ్ అర నిమిషం కాదు అరగంట మాట్లాడేడుట. ఇటువంటి హాస్యోక్తులలో గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ తారాగణం అంతా ప్రస్తుతం దివంగతులై ఉండటం.

సర్దార్‌జీ జోకులు లాంటివే ఈ కథలు కూడ. కడుపులో చల్ల కదలకుండా, కాలు మెదపకుండా ఇటువంటి కథలు ఎవ్వరయినా అల్లగలరు. అలాగే కాలక్షేపానికో, కోతిచేష్టలు చెయ్యటానికో పనిలేని ఒక కుర్ర మంగలి ఈ అంబానీ జోకుని తయారు చేసి తన “ఇంటిపుట” (హోంపేజి వచ్చిన తిప్పలు) లో పెట్టుకున్నాడుట. అంతకంటె పనిలేని పెద్ద మంగళ్ళు రిలయన్సు షాపులమీదకి దండయాత్ర చేస్తూ ఉంటే మన రాజకీయ వినాయకులు “శాసనోల్లంఘన చేసిన విద్యార్ధులకి క్షమాబిక్ష పెట్టాలి” అని ఒత్తిడి తెస్తూ ఉంటే తెలుగువాళ్ళంతా కలసి కట్టకట్టుకుని ఏ గంగలోనో దూకాలి తప్ప మరో మార్గం లేదు.