Saturday, December 26, 2009

నవ్వటమా? మానటమా?

నవ్వటమా? మానటమా?

శేషప్ప అయ్యరుకి వచ్చినపాటి ఇంగ్లీషు నాక్కూడా వచ్చుంటే, నేను కనీసం పదహారణాల తెలుగువాణ్ణయి ఉండుంటే, పై మకుటంలో అడిగిన ప్రశ్నని to laugh, or not to laugh అన్న ధోరణిలో ఇంగ్లీషులోనే అడిగి ఉండేవాడిని.

నా చిన్నతనంలో రాజు గారు, గాజు పెంకు కథ చెప్పి, చివరికి వచ్చేసరికి "కథ కంచికి, మనం ఇంటికి" అనకుండా "తీస్తే మంట, తియ్యకపోతే తంట!" అంటూ ముగించేవాడిని. "ఆ గాజు పెంకు ఏమిటి? అది ఎక్కడ గుచ్చుకుంది?" అని నన్ను అడగి ఇరకాటంలో పెట్టకండి. మీరు కుశాగ్రబుద్ధులు కనుక ఊహించుకోగలరు.

ఇంతకీ నవ్వటమా? మానటమా? అని కదూ అడిగేను. నవ్వితే మంట, నవ్వకపోతే తంట! అన్నట్లు నవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.

నేను అమెరికా వెళ్ళిన కొత్తలో లైబ్రరీ మెట్లు ఎక్కుతూ ఉంటే అట్నించి దిగుతూ ఉన్న ఒక తెల్లమ్మాయి నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వింది.

నేను డంగైపోయి, "అయితే ఈ అమ్మాయి నన్ను ప్రేమించెస్తోందంటావా?" అని పక్కనున్న అచ్యుతరావుని అడిగేను.

"లోపలికి పద, చెబుతాను" అన్నాడు

లోపల లోన్ డెస్క్ దగ్గర మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడ నన్ను చూసి కిచ కిచ మంది.

"ఇదిగో ఈ అమ్మాయి కూడ నవ్వుతోంది కదా. నిన్ను ప్రేమిస్తోందో ఏమిటో! ఓ సారి సినిమాకి వెళదామా అని అడిగి చూడు" అన్నాడు అచ్యుతరావు, ముసి ముసి నవ్వులు నవ్వుతూ.

ఈ రెండో అమ్మాయి పాత కాలపు హిందీ సినిమా తార తున్ తున్ లా ఉంది.

అమెరికాలో నవ్వు ఒక పలకరింపులాంటిదిట. అని నాకేం తెలుసు?

అందుకని నేను కూడా ఎవ్వరినైనా చూసినప్పుడు నవ్వటం అలవాటు చేసుకున్నాను.

అదే నా కొంప ముంచింది - ఇండియాలో

ఇండియాలో నవ్వరుట! అని నాకేం తెలుసు?

ఆమాత్రం తెలియకపోతే ఎందుకు పనికొస్తావురా? అన్నాడు అన్నయ్య. ఎయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ వాళ్ళ మొహాలు చూడలేదుట్రా?

మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు కొట్టుకు చావలేదూ! ఎందుకుట?

సూదిమొన మోపినంత భూమి కోసం అయితే ఈ సోది అంతా రాసి మిమ్మల్ని ఎందుకు ఇలా నస పెడతాను?

ద్రౌపది నవ్విందిట. మయసభలో మడుగులో పడ్డ మన దుర్యో అన్నని చూసి నవ్విందిట.

"నన్ను చూసి నవ్వెదవే, వన్నెల దొరసానీ?" అంటూ మండిపడి, "నీ భరతం పడతానుండు" అని పెద్దన్న భారత యుద్ధానికి కాలు దువ్వేడని ఒక కథ ఉంది. అదండి, పద్దెనిమిది అక్షౌణీలు కొట్టుకు చావటానికి కారణం. (తెలుగువాళ్ళు - ఆంధ్రావోళ్ళు కాదు - మనం, తెలుగోళ్ళం కౌరవుల పక్షంలో పోరాడేమని మరవకండి).

ఒక నాడు జిన్నా అన్న మాటకి నెహ్రూకి నవ్వు వచ్చిందిట. అదండి పాకిస్తాను పుట్టి మనకి పక్కలో బల్లెం అవటానికి కారణం.

ఇప్పుడు ఆంధ్రోళ్ళు, తెలంగణోళ్ళు "యూ హౌ మచ్ అంటే యూ హౌ మచ్" (నువ్వెంత అంటే నువ్వెంత) అని తగువాడేసుకుంటున్నారు కదా. ఈ కురుక్షేత్రంలో ఉభయ సైన్యాల మధ్యనీ రధాన్ని ఆపి ఏమిటి చెయ్యాలో తోచక బిక్కచచ్చిపోయి నేను నిలబడి ఉంటిని గందా. భోజనం చెయ్యనని భీష్మించుకుని కూర్చున్న ఒక కురువృద్ధుడిని ఒక అంపశయ్య మీద పడుక్కోబెట్టి, సవ్యసాచిలా వైద్యుడు పక్కని నిలబడి ఊషర జలం (సేలీను) ఎక్కిస్తూంటే ఇటు ఆంధ్రాలోనూ, అటు తెలంగాణాలోనూ ప్రజలు రధాలకి నిప్పెట్టి హాహాకారాలు చేస్తున్నారు కదా.

“ఈ నవభారత యుద్ధం”లో పద్దెనిమిది అక్షౌణీల రూపాయలకి పైనే నష్టం వచ్చి ఉంటుంది. హైదరాబాదులో బస్సులని నడిపితే వాటిని తగలెట్టెస్తున్నారు. నడపకపోతే ఆదాయం నష్టం వస్తోంది. నడిపితే మంట, నడపకపోతే తంట.

ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారా అని నాకు ఉన్న కొద్ది అవస్థాపక సౌకర్యాలనీ (infrastructure అండీ, మరేమీ కాదు) ఉపయోగించి చిరు పరిశోధన చేస్తిని గందా. చెయ్యగా తెలిసుకున్నది ఏమిటంటే…

శ్రీనాధుడు నవ్వేడుట. అదిట ఈ బంధ్‌కీ, రస్తా రోకోలకీ కారణం! ఒఠ్ఠి నవ్వటమే అయితే అంత బాధ కలిగేది కాదుట; వెటకారం కూడా చేసేడుట – వీళ్ళని చూసి.

వేళ్ళని చూసి?

ఈ తెలంగణోళ్ళని చూసి.

శ్రీనాధుడు ఎందరెందరినో చూసి నవ్వేడు. వేటకారాలు చేసేడు. నది ఒడ్డున ఉన్న నాయురాళ్ళని చూసి కన్ను గీటేడు. అది అతని స్వయంబు. అయినా నాకు తెలియక అడుగుతాను. శ్రీనాధుడు వీళ్ళని ఏమన్నాడుట?

“వీళ్ళు ఒఠ్ఠి అనాగరికులు. వీళ్ళకి వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుని, మాగాయ టెంకని గీరుతూ తినటం కూడ తెలీదు. సజ్జన్నం, జొన్న రొట్టెలు తినే అనాగరికులు” అన్నాడుట.

హారి భడవల్లారా. శ్రీనాధుడు అన్నది మిమ్మల్ని కాదు.

మరైతే ఎవరిని ఉద్దేశించి అన్నాడు?

ఎవ్వరిని ఉద్దేశించి అంటే ఏమిటి గాని, ఇదేదో అయిదు వందల ఏళ్ళ క్రితం మాట. దాన్నిప్పుడు కెలకటం ఎందుకు?

ఎలా మరిచి పోతామండీ. ముందు శ్రీనాధుడు. తరువాత నైజాము నవాబు, ఇప్పుడు ఈ ఆంధ్రాఓళ్ళు.

ఈ విషయాలన్నీ ఆలోచించే భారత ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసిందిట. ఎప్పుడూ, ఎక్కడా ఎవ్వరిని చూసి నవ్వొద్దని.

అదండి మన ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ముడుచుకున్న మూతులు పెట్టుకుని ధుమధుమలాడుతూ ఉండటానికి కారణం! వాళ్ళని నవ్వించటానికి ప్రయత్నించకండి. మీ రస్తా రోకో చేసెయ్యగలరు.

Thursday, December 17, 2009

తెలంగాణ: ఒక సామాన్యుడి అవగాహన

నేను ఇప్పుడు వరంగల్లులో ఉన్నాను. తెలంగాణ ఉద్యమం మంచి ఊపులో ఉన్న రోజులలో నేను ఇక్కడే ఉండి ఈ ప్రజల నాడి చూడటం తటస్థపడింది. "ఆంధ్రా వోళ్ళ" మీద ఈరికి ఉండిన అభిప్రాయం రోజూ వింటుంటిని. నేను తిరిగే సమాజం విద్యాధికులైన మధ్యతరగతి వ్యక్తులే. వీరిలో చాలమంది "ఆంధ్రా వోళ్ళు" వీరికి ఏదో పెద్ద అన్యాయం చేసినట్లు నమ్మే వారే. ఇప్పుడు, ఇక్కడ, ఈ ఆవేశపూరిత వాతావరణంలో, నిజానిజాలతో సంబంధం లేదు.

ఈ మధ్య ఈ ఊళ్ళో ఒక రచయితల (కవితలు రాసేవారు) సమావేశానికి వెళ్ళేను. దరిదాపు 30 మంది వచ్చేరు. వీరిలో నలుగురు అతి ఆవేశంగా, "ఆంధ్రా ఓళ్ళని" తిడుతూ, అసహ్యించుకుంటూ, పద్యాలు చదివేరు. బ్రిటిష్ వాళ్ళని కూడ భారతీయులు అంతగా అసహ్యించుకున్నారని నేను అనుకోను!

తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలని అంతగా అసహ్యించుకుంటూ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రా అంటూ ఎందుకు ఆంధ్రా వారు గొడవపెడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. కేంద్ర ప్రభుత్వం వాలకం చూస్తూ ఉంటే తెలంగాణాని విడదీయటంలో కేంద్రానికి ఏదో లాభం ఉండి ఉండాలి. ఏ రాష్ట్రమూ కేంద్రం కంటె బలంగా ఉండటం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు.

ఈ పరిస్థితులలలో తెలంగణాతోపాటు హైదరాబాదు కూడ ఆంధ్రాకి దూరం అయిపోవటం తధ్యం. ఇటుపైని హైదరాబాదులో పెట్టుబడులు తగ్గించి ఆంధ్రావారు ఏ విజయవాడనో, విశాఖనో వ్యాపార కేంద్రంగా నిర్మించుకోవటం శ్రేయోదాయకం. మళ్ళా ఏ కడపో, కర్నూలో ముఖ్యపట్టణం అయితే కొన్నాళ్ళ తరువాత రాయలసీమ వారు విడిపోతామంటారు. అప్పుడు కోస్తా అంధ్రాకి మిగిలేది సున్న.