Monday, February 21, 2011

ఏం? ఎందుకని? - 15

15. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఆకులన్నీ ఆకుపచ్చగా ఉండవు కాని, చాల మట్టుకు ఉంటాయి. ఆకుపచ్చ వృక్షసామ్రాజ్యపు పతాక వర్ణం. ఈ ఆకుపచ్చకీ వృక్షసామ్రాజ్యానికి మధ్య ఉన్న లంకె ఏమిటో చూద్దాం. మనం బతకడానికి మనకి శక్తి ఎలా కావాలో అదే విధంగా చెట్లు బతకడానికి కూడా వాటికి శక్తి కావాలి. ఈ శక్తి ఆహారం నుండి లభిస్తుంది. మనం బద్ధకిష్టులం గనక ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒక చెట్టు నుండి ఒక కాయో, పండో కోసుకు తినేస్తాం. మొక్కలు ఆ పని చెయ్యలేవు కదా. ఆందుకని మొక్కలు తమకి కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకొంటాయి. ఈ తయారీ అంతా ఆకులలో జరుగుతుంది. అంటే ఆకులు మొక్కలకి ఆహారం తయారు చేసిపెట్టే కార్ఖానాలు.

అన్ని కార్ఖానాలకి మల్లే వీటికి కూడ ముడి పదార్ధాలు కావాలి కదా? అందుకని మొక్క భూమి నుండి నీళ్లనీ, పోషక పదార్ధాలనీ, గాలి నుండి బొగ్గుపులుసు వాయువునీ పీల్చుకుంటుంది. ఈ రెండింటిని రసాయన సంయోగం పొందించి ఆహారం తయారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియకి శక్తి కావాలి కదా. ఆ శక్తి సూర్య రస్మి సరఫరా చేస్తుంది. ఈ పద్ధతినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ సంయోగం ఫలోత్పాదకంగా జరగాలంటే ఒక మధ్యవర్తి సహాయం కావలసి ఉంటుంది. అటువంటి మధ్యవర్తిని రసాయనశాస్త్రంలో కేటలిస్టు అంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో వాడే కేటలిస్టు పేరు పత్రహరితం. దీన్ని పైరుపచ్చ అని కూడ అంటారు. ఇంగ్లీషులో 'క్లోరోఫిల్'. ఈ పత్రహరితాన్ని మొక్కలు తమకి తామే తయారు చేసికొంటాయి. ఈ పత్రహరితం ఆకుపచ్చ రంగులో ఉంటుంది కనుక, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి.

మొక్కలు పత్రహరితం తో పాటు ఇంకా అనేక ఇతర రసాయనాలని తయారు చేసుకుంటాయి. పత్రహరితం ఆకుపచ్చ రంగుని ఇచ్చినట్లే 'క్సేంతోఫిల్' అనే పదార్ధం పసుపు పచ్చ రంగుని ఇస్తుంది. కేరోటిన్ నారింజ రంగుని పోలిన ఎరుపు రంగుని ఇస్తుంది. 'ఏంథోసయనిన్' ఎర్రని ఎరుపు రంగుని ఇస్తుంది. ఈ 'ఏంథోసయనిన్' ఏపిలు పళ్ళకి తీపిని, ఎరుపుని ఇస్తుంది. సర్వసాధారణంగా పత్రహరితం పాలు ఎక్కువ ఉండడం వల్ల పచ్చ రంగు ధాటి ముందు మిగిలిన రంగులు వెలవెలబోయి, ఆకులు పచ్చగా కనిపిస్తాయి.

Saturday, February 19, 2011

ఏం? ఎందుకని? - 14

14. మూత్రం సాధారణంగా పసుపుపచ్చగా ఉంటుంది. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ రకం ప్రశ్నలకి భౌతిక శాస్త్రం ఒక రకమైన సమాధానం చెబుతుంది, రసాయన శాస్త్రం మరొక కోణం ద్వారా సమాధానం చెబుతుంది. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ఆకులు ఎందుకు ఆకుపచ్చగా ఉంటాయి? ఆన్న ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లే ఇక్కడా చెప్పొచ్చు. కాని ఈ విషయానికి ఇక్కడ రసాయన శాస్త్రపు దృక్కోణం బాగా ఉపయోగ పడుతుంది. మూత్రానికి రంగు రావడానికి మూత్రం లో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే ఎర్రటి రంగు పదార్ధం. ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్ బైలిరూబిన్ గానూ, తదుపరి యూరోక్రోం గానూ విచ్చిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలు లో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్లు తాగినప్పుడు మూత్రం కూడ ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ల రంగులో కాని ఉంటుంది. నీళ్లు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది. ఈ పరిస్తితిలోనే మనవాళ్లు వేడి చేసిందంటారు. చలవ చెయ్యడానికి మజ్జిగ తాగమంటారు. మజ్జిగే అక్కర లేదు, మంచినీళ్లు తాగినా సరిపోతుంది; కాని అనుకోకుండా మంచి మజ్జిగ తాగే అవకాశం వస్తే ఎందుకు వదలుకోవాలి? (నా చిన్నతనంలో మంచి, చిక్కటి పాలు, మజ్జిగ తాగే అవకాశమే ఉండేది కాదు. అందుకనే ఇలా రాసేను.) మూత్రానికి పసుపు రంగు తప్ప మరే ఇతర రంగు ఉన్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది కాని ఎన్నడు సొంత వైద్యం చేసుకోకూడదు.

Thursday, February 3, 2011

ఏం? ఎందుకని? - 13

13. మనకి దురద ఎందుకు వేస్తుంది?

దోమ కుట్టితే దురద వేస్తుంది; నొప్పి పెట్టదు. దురదగుండాకు ఒంటికి తగిలితే దురద వేస్తుంది. కురుపు పక్కు కట్టి మానుతూన్నప్పుడు దురద వేస్తుంది. ఎందుకు?

తేనెటీగ కుట్టినప్పుడు శరీరం లోనికి వెళ్లిన విషం వల్ల నొప్పి పుడుతుంది. తేలు విషం శరీరం లోనికి వెళ్లినప్పుడు పుట్టే సలుపు వరసే వేరు. కాని దోమ కుట్టినప్పుడు తేనెటీగ విషం లాగా, తేలు విషం లాగా బాధ పెట్టదు; దురద వేస్తుంది. దోమకాటుకి దురద ఎందుకు వేస్తుందో ముందస్తుగా చెప్పనివ్వండి. నిజం చెప్పినందుకు నిష్టూరాలడవద్దని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.

దోమ కుట్టినప్పుడు అది నిజంగా మన రక్తం తాగుతున్నాదన్నమాట; తేనెటీగ లాగ తేలు లాగ మన శరీరం లోకి విషం ఎక్కించటం లేదు. తన పొట్ట నిండా మన రక్తం తాగేసిన తరువాత దోమ బరువెక్కి పోతుంది. పొట్టడు రక్తంతో దోమ మరి ఎగరలేదు. పోనీ ఆ తాగిన రక్తం బాగా ఒంట పట్టే వరకు మన శరీరం మీదే కాలక్షేపం చేద్దామా అంటే మనం మాత్రం తక్కువ వాళ్లమా? దాని చెంప చెళ్లు మనిపించెయ్యమూ? అందుకని తొందరగా పొట్ట నింపేసుకొని దోమ పలాయన మంత్రం పఠించాలాయె. ఎగరగలగటానికి ఎలాగో ఒక లాగ మన దోమ తన బరువుని తగ్గించుకోవాలె. మార్గాంతరం లేక దోమ మన మీద అల్పాచిమానం చేసేసి వెళ్లిపోతుంది. పోతూ పోతూ పొయ్యిలో ఉచ్చోసి పోవటం అంటే అక్షరాలా ఇదే! ఈ అల్పాచిమానం వల్లనే మనకి దురద వేస్తుంది. దోమ కాటులో విషం లేదని తెలిసి సంతోషించడమా? దోమ కరచిన కాటుకి కాకపోయినా అది పోతూ పోతూ చేసిన పనికి ఒళ్లు మండి ఏడవటమా? మగడు కొట్టేడని కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చినట్లు ఉంది ఈ ఉదంతం.

దురద అంటే నొప్పి కాదు. నొప్పి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దురద చర్మం మీదే వేస్తుంది. చర్మం ఎండిపోయినా, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నా దురద వేస్తుంది. ఈ రకం దురద బాధ నుండి తప్పించుకోవాలంటే శరీరాన్ని “చెమ్మ”గా ఉంచుకుంటే సరిపోతుంది. అందుకనే చలికాలంలో ఒంటికి వెన్నపూస రాసుకోవటం. మూత్ర పిండాలకి వ్యాధి వచ్చినా దురద వెయ్యవచ్చు.

దురద వేసినప్పుడు గోకాలనే బుద్ధి ఎందుకు పుడుతుందో తెలుసా? గోకినప్పుడు ఆ గోకుడు వల్ల నొప్పి పుడుతుంది. 'దురద వేస్తున్నాదీ, 'నొప్పి పుడుతున్నాదీ అనే వాకేతాలు (signals) రెండూ మెదడుకి ఒకే సారి చేరుకుంటాయి. అప్పుడు మెదడు 'నొప్పి పెడుతున్నాదీ' అనే వాకేతానికి ప్రాముఖ్యత ఇచ్చి, దురద వాకేతాన్ని విస్మరిస్తుంది.

నొప్పి మీద పరిశోధన చాల కష్టం. ఏందుకంటే మందు ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే దానిని మనుష్యుల మీద ప్రయోగించాలి. కాని మనుష్యుల మీద ప్రయోగాలంటే మనం అంతగా ఇష్టపడం.