Wednesday, January 28, 2009

స్వీడన్‌లో మాతృభాష వాడకం

జనవరి 2009

(ఇది మార్చి 2003 ఈమాట వెబ్ పత్రికలో ప్రచురించేను. నా బ్లాగుని చదివే పాఠకుడో, పాఠకురాలో ఈ వ్యాసాన్ని ఈ బ్లాగులో ఇక్కడ మళ్ళా ప్రచురించమని కోరేరు. అందుకని...)

నేను ఈమధ్య స్వీడన్‌ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.

స్వీడన్‌ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్‌ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు మహా ఉంటే. కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.

మన ఆంధ్ర ప్రదేష్‌ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్‌ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్‌ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.

నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్‌ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి అన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్‌ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్‌ పక్కన ఇంగ్లీషు కనిపించదు ఒక్క స్టాక్‌హోమ్‌ వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్‌ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల (”ఇన్‌గ్రీడియంట్స్‌”) పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్‌ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్‌ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. “సి. ఎన్‌. ఎన్‌.” లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.

వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్‌ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్‌ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్‌ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్‌ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్‌ లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.

ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్‌ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్‌ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్‌ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.

తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది కార్‌, బస్‌, కోర్ట్‌. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.

స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్‌. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్‌ భాష లో. ఇలా అన్నానని స్వీడన్‌ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు. స్వీడన్‌ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్‌ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్‌ కౌంటర్‌ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ ఇలా తారసపడ్డ వారందరితోనూ ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు. మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే మంచి ఇంగ్లీషు ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది. (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్‌ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్‌ వాళ్ళు స్వీడిష్‌ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.

ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్‌ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్‌ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అందరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్‌ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్‌ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.

ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం. తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్‌ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్‌ దేశీయులకి రెండో, మూడో నోబెల్‌ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.

ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్‌ లోని విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా బోధన అంతా స్వీడిష్‌ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.

ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్‌ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. “నెల తక్కువ వెధవల్లారా” అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!
స్వీడన్‌ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్‌ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్‌ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్‌ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ మరొక స్వీడన్‌ దేశీయుడితోనైనా సరే ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. “అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్‌. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?” ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్‌ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్‌ లోనూ సామర్య్ధం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.

ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్‌, జెర్మనీలో జెర్మన్‌, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్‌, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, “అయ్యా, మీరు ఫారిన్‌ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ” అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.

ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. ” ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు” అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.

వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. “చదవడం, రాయడం వచ్చా?” అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.

Tuesday, January 6, 2009

నిరుడు కురిసిన హిమ సమూహాలు – ఒక సమీక్ష

జనవరి 2009
కల్యాణి, కాదంబిని, వైదేహి, విశాలాక్షి, సుగంధి, ఉలూచి, ప్రమద్వర, భార్గవ, అంబరీషుడు వంటి పాత్రలూ, వడ్డాణము, నాగవత్తులూ, నాలుగు పేటల చంద్రహారాలు, జాజిమొగ్గల గొలుసు, మొదలైన ఆభరాణాల మధ్య వెంకటేశ్వర్లూ, జోగినాధం వంటి పేర్లు రాకపోతే ఇదేదో పింగళి సూరన్న రాసిన ఏ కళాపూర్ణోదయమో అనుకునే ప్రమాదం ఉంది. ఈ పుస్తకం నిడివిని 150 పేజీలనుండి ఏ 1500 పేజీలకో పొడిగించి, ఒక క్రమ బద్ధంగా కథ చెప్పి ఉండుంటే ఏ వేయిపడగల కథలాగో తయారయి ఉండేదేమో. కాని చేసిన ప్రయత్నానికి ఒక “పడగ” ఇస్తాను.

ఈ “నవల”లో నన్ను బాగా హత్తుకున్నది కథాకాలంలో ఆచారవ్యవహారాలని, జీవితాన్ని వర్ణించిన ఆ నాటి తెలుగు భాష. ఈ రకం భాష ఇప్పుడు వినబడటం లేదు, కనబడటం లేదు. పురుళ్ళు, పిల్లలు, బారసాలలు, తొట్టిలో వెయ్యటాలు, అక్షరాభ్యాసాలు, దసరా పప్పుబెల్లాల పాటలు, సమర్తలు, పెళ్ళిల్లు, బూజంబంతులు, వియ్యపురాలి పాటలు, నూతిలోకి దూకి ఆడవాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, విధవా వివాహాలు, దేశభాషలని నొక్కిపెట్టి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టినందుకు మెకాలే మీద ఒక విసురు, కులవృత్తులని కూకటివేళ్ళతో పీకివేసిన బ్రిటిష్ వారిపై మరొక విసురు, ఇలా రచయిత మూడు తరాల జీవితకథ మూడు పాళ్ళూ, కల్పన కొంచెం మేళవించి, సూత్రబద్ధం కాని పువ్వుల పోగులా కథని ప్రదర్శించేరు. దారంతో గుచ్చిన దండైతే దానికి ఒక మొదలో, చివరో, వరసో ఉంటాయి. ఈ కథ చదవటానికి ఆ ఇబ్బందేమీ అక్కర లేదు; ఏ పేజీలోనైనా మొదలుపెట్టి ఎంత ఓపిక ఉంటే అంతే చదివి, ఆ చదివినది కాస్తా ఆనందించవచ్చు.

ఉదాహరణకి పన్నెండేళ్ళ రవణని, “కాసిని మంత్రాలు చదివి ఆరిని దీవించండి బాబూ” అని ఎవ్వరో అడిగితే, “సుమంగళీరియం వధూ..తరవాత గుర్తురాలా..అమ్మా! రెండరటి పళ్ళు తెండి. వధూవరాభ్యాం వరదా భవంతు, ఆఁ తలంబ్రాలు పోయించాలి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ,..ఒ, ఓ, ఔ” అంటూ రాగయుక్తంగా చదివుతూ, “యస్యజ్ఞాన దయాసింధో – గోడ దూకితే అదో సందో, ... ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి, ఆఁ మంగళ సూత్రం కట్టు నాయనా…” ఇదొక చిన్న హాస్యస్పోరకమైన సంఘటన.

ఈ కథ మనకి స్వతంత్రం రావటానికి ముందు రోజులలో మొదలై ఆంధ్ర ప్రదేష్ అవతరణ వరకు కొనసాగుతుంది. స్వామీ విజయానంద ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం నిరాహార దీక్ష పట్టేరన్న విషయం నాకు తెలియనే తెలియదు (ఈయనేనా స్వామీ సీతారం అంటే?) రచయిత పూర్వులు గాంధీ గారి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనటం, జైలుకెళ్ళటం దగ్గర నుండి దేశంలో ఉన్న రాజకీయ, ఆర్ధిక వాతావరణాలు అలా కనిపిస్తూనే ఉంటాయి.

ఈ పుస్తకం రచయిత శ్రీమతి సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి, ఎం. ఎ. హైదరాబాదులో సిటీ కాలేజీ, తెలుగు శాఖకి ఆధిపత్యం వహిస్తూ రిటైరు అయేరు. ఈమె ఎవ్వరో నాకు తెలియదనే అనుకుంటున్నాను; ఎప్పుడూ కలిసిన జ్ఞాపకం లేదు. బంధుత్వమూ లేదు. ఎవరో అమెరికా వస్తూ ఉంటే, “వేమూరి వేంకటేశ్వరరావు గారికి – నమస్కారములతో” అని సంతకం చేసి పంపేరు. మొదట్లో రెండు పేజీలు చదివి ఆపేసేను. మరొక సారి మధ్యలోంచి మరో మూడు పేజీలు చదివేను. పుస్తకంలో ఎక్కడ మొదలుపెట్టి చదివినా బాగానే ఉందనిపించింది (ముందు కథ తెలియక్కరలేదు, ఎందుకంటే దీనికి కథలా ఒక మొదలూ, చివరా అంటూ ఏమీలేవు.) మధ్యమధ్యలో పద్యాలున్నాయి, పాటలున్నాయి, శ్లోకాలున్నాయి. ఈ రకం జీవితాన్నీ, ఈ రకం సంఘాన్నీ, ఈ రకం భాషనీ, అరవై ఏళ్ళ క్రితం నేను చూసేను. ఈ కథలో కొన్ని అంశాలు నా పుట్టుకకి ముందు కాలానివి కూడా ఉన్నాయి. ఆ కాలపు జీవితానికి అద్దం పట్టినట్లు ఉన్నాయి ఇందులో సంఘటనలు. అందుకనే నాకు మళ్ళా మళ్ళా చదవ బుద్ధి వేసింది.

పుస్తకం 500 ప్రతులే అచ్చు వేసేరు. వెల రూ. 130/ అని ఉంది కాని, మధ్యవర్తులు 40 శాతం తినెస్తారు కనుక కావలసిన వారు నేరుగా రచయితకి రూ. 100/ పంపించి బేరం పెట్టి కొనుక్కోవచ్చేమో. ఇది ఉభయత్రా లాభదాయకం అని నా పైత్యం. ప్రతులకు: ఓగేటి పబ్లికేషన్స్, 3-6-470 పావనీ సత్యా కంప్లెక్స్, 6 వ వీధి, 103 వ నంబరు ప్లాటు, హిమయత్ నగర్, హైదరాబాదు – 29, ఫోను: 040-27634469.

Monday, January 5, 2009

ఈ విమానాల సంసారం కాదనుకొండి

జనవరి 2009

ఈ రోజుల్లో విమానపు ప్రయాణాలంటే విసుగేస్తోంది. కించిత్ భయం కూడా వేస్తోంది.

పూర్వం విమానపు ప్రయాణం చేసేమంటే అది సంఘంలో మన అంతస్థుకి ఒక గుర్తు, గుర్తింపు. ఇప్పుడో? ప్రతీ అబ్బడ్డమైనవాడూ, అంకుపాలెం వెళ్ళొచ్చినట్లు అమెరికా వెళ్ళి వచ్చెస్తున్నాడు. పడవలో కాదు, విమానంలో. నిన్న మొన్నటి వరకు చెంబుచ్చుకుని బయలుకెళ్ళడానికి మించి ఇంటి గుమ్మం దాటని ప్రబుద్ధులంతా అకస్మాత్తుగా విమానం ఎక్కేయడంతో "దోసెడూ కొంపలో పసుల రేణము" అని శ్రీనాథుడు అన్నట్లుగా తయారయేయి ఈ విమానాలు.

చెంబు, రేణము అనగానే గుర్తుకి వస్తున్నాది. మన '"విండియన్సు" ఎక్కువమంది ఎక్కిన విమానాలలో ఒక దృగ్విషయం గమనించేను; ఉదయం ఆ టోయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం అందరికీ ఒకే సారి వస్తుంది - ఎవరో సింక్రనైజ్ చేసినట్లు! ఒక సారి, నిక్కచ్చిగా చెప్పాలంటే 1964 లో, Saturn Airways వారి ప్రొపెల్లర్ విమానాన్ని అద్దెకు తీసుకుని భారతీయులం కొంతమందిమి ఇండియా వెళ్ళేం. తెల్లవారే సమయానికి అందరం విమానం తోకలో ఉన్న టాయిలెట్ దగ్గర బారులు తీసేం. పైలట్ "విమానం తూగిపోతోంది, కొంచెం ఎగువకి జరగండి బాబూ" అని ఇంగ్లీషులో మొర పెట్టుకున్నాడు. నా చిన్నతనంలో బండి తోలే మా ఎర్రన్న ఇలాగే "పైకి రండమ్మా" అన్నప్పుడల్లా మా అత్తయ్య, "అలా ఆశీర్వదించు బాబూ, నీ బండి మళ్ళా మళ్ళా ఎక్కుతాను" అనేది.

"ఆఁ మీకు ఇండియన్సు మరీ లోకువ అయిపోయేరు. ప్రతీ చిన్న విషయానికీ మీరు ఇండియన్సు మీద అలా విరుచుకు పడడం ఏమీ బాగు లేదు" అని కొందరు ఆప్తులు నన్ను పక్కకి పిలచి కూకలేసేరు.

మీరే చెప్పండి. ప్రపంచంలో ఏదేశెమేగినా ఎందు కాలిడినా ఇటువంటి ప్రవర్తన ఎక్కడేనా చూసేరా? దీనికి కారణం మనవి చేసుకుంటాను, సావధానంగా చదవండి.

సాధారణంగా మనం విమానాలు ఎక్కే ముందు రెండు భయాలు పీక్కు తింటాయి.

విమానం అవతలి దరికి క్షేమంగా చేరుతుందో లేదో అనేది మొదటి భయం. ఈ విషయంలో నేను చెప్పగలిగే సలహాలు రెండు. ఒకటి, విమానం ఎక్కే ముందు ఆ వెంకటరమణమూర్తి కి ఒక దండం పెట్టుకుని, ఆ విమానంలో ఉన్నంతసేపూ రామా కృష్ణా అనుకుంటూ కూర్చోవటం. లేదా, రెండవ మార్గం ఏమిటంటే, ఎయిర్ పోర్టు లో కనిపించిన ఆ హరే కృష్ణా వాడికి ఐదో పదో ఇచ్చేసుకుని, వాడి దగ్గర భగవద్గీత ఒకటి పుచ్చుకొని దాన్ని పారాయణ చేసెయ్యటం.

ఇక రెండో భయం ఏమిటా అని కాదూ అడుగుతున్నారు? చదవండి, తరవాయి కథనం!

విమానాలలో రెండు రకాలు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది - పెద్దవి, బుల్లివి. మీ "ఫ్లైట్ నంబరు" ఎంత పొడుగ్గా ఉంటే మీ విమానం అంత బుల్లిగా ఉంటుందన్నది గమనించ వలసిన మొదటి సూత్రం.

పొడుగాటి "ఫ్లయిట్ నంబరు" ఉన్నటువంటి బుల్లి విమానాల్లో రెండు పుంజీలకి మించి సీట్లు ఉండవు. కనుక మీరు ఏ పది నెలల ముందో "రిజర్వేషన్" చేయించేసుకోవడం తెలివైన పద్ధతి. ముందే రిజర్వు చేయించుకున్నా కంపెనీ వాడిని కనీసం రోజుకి రెండు సార్లేనా టెలిఫోనులో పిలచి మీ సీటు మీ పేరనే ఉందో మరొకరి పేరుకి బదిలీ అయిపోయిందో చూసుకుంటూ ఉండండి. ప్రయాణం దగ్గర పడుతోందనగానే, కంపెనీ వాడిని ఆరేసి నిమిషాలకి ఒకసారి చొప్పున ఆరారా పిలచి మీ సీటుని ఖరారు చేసుకోవడం లో నాకు తప్పేమీ కనిపించటం లేదు. నన్నడిగితే రేపు ప్రయాణం అనగా, ఈ వేళే ఆ అయిర్ పోర్టు కి వెళ్ళిపోయి ఆ గేటు దగ్గర మాటు వెయ్యమంటాను.

పొట్టి "ఫ్లయిట్ నంబరు" ఉన్న పొడుగాటి విమానాలు దేశపు ఈ కొస నుండి ఆ కొసకో, ప్రపంచపు ఈ కొస నుండి ఆ కొసకో వెళతాయి. ఈ రకం విమానాలలోనే మనం ఇండియా నుండి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద భోషాణపు పెట్లు రెండేసి చొప్పున పట్టుకొస్తాం. నూ యార్కులో దిగిన తరువాత మీరు బేంగర్, మెయిన్ వెళ్ళవలసి వచ్చిందనుకొండి. అప్పుడు ఈ భోషాణపు పెట్లు కానీ పైన చెప్పిన బుల్లి విమానాలలోకి ఎక్కిచేమంటే అవి గాలిలోకి లేవలేవు. అసలు నన్నడిగితే ఈ సామానుని ఏ "ఫెడ్ ఎక్స్" లోనో పంపించేసి, ఆ "ఫెడ్ ఎక్స్" వాడు ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా మరొక శాల్తీ అనుకోమని ఆ "ఫెడ్ ఎక్స్" విమానం ఎక్కెయ్యండి!

ఈ రకం బుల్లి విమానాలు ఎక్కే ముందు గేటు దగ్గర మన బరువెంత అని అడుగుతారు. ఎక్కడేనా మీ బరువుని దాచిపెట్టచ్చు కాని, అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ మాత్రం బరువెంతో నిజం చెప్పెయ్యండి. మీరు మొహమాటపడిపోయి వాడి దగ్గర బరువు తగ్గించి చెప్పేరంటే, విమానం కడితేరా గమ్యం చేరకుండానే పెట్రోలు అయిపోతుంది. తరవాత విచారించి లాభం లేదు.

మీరెంత ముందు జాగ్రత్తలో ఉన్నా, ఈ బుల్లి విమానం బయలుదేరే వేళకి మిమ్మల్ని బండి ఎక్కనిస్తారన్న భరొసా ఏమీ లేదు. ఎదురు గాలి ఎక్కువగా వుంది కనుక బండి సగం ఖాళీగా ఉంచాలి అంటాడు. ఇటువంటి పరిస్థితులలో మనం మన ''స్టేటస్'' ని చాటించి సీటు సంపాదించడానికి పట్టు చీరలు కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా, సూట్లు వేసుకున్నా ఏమీ లాభం లేదు. అందుకని అప్పుడే సర్జరీ లోంచి బయటకు వచ్చిన డాక్టరులా నీలం రంగు పజామ, జుబ్బా వేసుకుని, ఒక గుడ్డ టోపీ పెట్టుకుని ఎయిర్ పొర్టు కి వెళ్ళండి. ఓపిక ఉంటే, దార్లో "టార్గెట్" లో ఆగి ఒక "బీచ్ కూలర్" కొని దాని మీద ''రష్, హ్యూమన్ ఆర్గన్'' అని ఎర్రటి అక్షరాలతో ఒక కాగితం అంటించేరంటే, మీ సీటుకి ఢోకా ఉండదు. గేటు దగ్గర కాపలావాడు మిమ్మల్ని ''డాక్!'' అని సంబోధించినప్పుడు మాత్రం ఎవరిని పిలుస్తున్నాడా అని వెనక్కి తిరిగి మాత్రం చూడకండి.

మొత్తం మీద మన ఏడుపు ఏదో ఏడిచి, గేటు దాటి బయటపడ్డాం అనుకుందాం. అక్కడ విమానానికి బదులు ఒక బస్సు ఉంటుంది. నిజంగా విమానం ఎక్కిస్తాడా లేక ఈ బస్సులోనే మన గమ్యానికి తీసుకుపోతాడా అని అనుమానం వచ్చేలా ఒక పావుగంట సేపు నానా సందులు, గొందులు తిప్పి చివరికి అగ్గిపెట్టెలలా ఉన్న నాలుగు విమానాల గుంపు దగ్గరకి తీసుకెళతాడు.

బోయింగు 747 ఒక ఏనుగులా కనిపిస్తే ఈ బుల్లి విమానాలు ఎలకల్లా కనిపిస్తాయి. మీ చేతులో ఏమైనా "కేరీ ఆన్ బేగేజి" ఉంటే ఒక ఆసామి ఆ బుల్లి విమానం మెట్ల దగ్గర మీ సామాను అంతా పుచ్చేసుకుని, మిమ్మల్ని ఒక్కరినే విమానం ఎక్కమంటాడు. ఆ సామానుని విమానం డిక్కీలో వేసేసి అదే ఆసామీ విమానం నడపడానికి వస్తాడు కనుక మీరు పరాగ్గా వాడికి "టిప్పు" ఇవ్వడం లాంటి అపసంతి పనులు చెయ్యకండి.

మీరు చిన్నప్పుడు ఎప్పుడేనా చెరువు గట్టు దగ్గర నిలబడి చిల్ల పెంకుతో నీళ్ళ మీద కప్ప గంతులు వేయించేరా? ఒడుపు చూసుకుని చిల్ల పెంకుని నీళ్ళల్లోకి విసిరితే అది నీటి ఉపరితలాన్ని తాకుతూ, లేస్తూ, గెంతులు వేస్తూ వెళుతుంది. మన బుల్లి విమానం గాలిలోకి లేచిన తరువాత అలాగే కుప్పి గంతులు వేస్తూ వెళుతుంది. దారి పొడుగునా మన గుండె కాయ గొంతుకలోనే ఉంటుంది కనుక విమానం బయలు దేరే లోగా ఒక వేలియం మాత్ర పడేసుకొండి. ఆ మరచిపోయేను. ఆ మాత్ర వేసుకునే లోగా, ఒక కాగితం మీద మీ పేరు, చిరునామా, టెలిఫోను నంబరు, మీ "బ్లడ్ టైపు" వగైరా వివరాలు అన్నీ రాసేసి ఆ కాగితాన్ని అందరికీ కనిపించేలా మీ బట్టలకి అంటించేసుకొండి.

విమానాలు - ప్రత్యేకంగా బుల్లి విమానలు - తోలేవాళ్ళకి "ఫ్రీ వే" ఏదో "రన్ వే" ఏదో తేడా తెలియకపోవచ్చు. చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు "శ్రీ, చుక్క, దెబ్బ" వేసిన విధంగానే మొట్టమొదట "చెకిన్" అయిన ఆసామీని "పైలట్" గాను, వరుసలో రెండవ వాడిని "కోపైలట్" గానూ, మూడవ వ్యక్తిని "స్టువర్డు" గాను వేస్తారని ఎవరో అంటూ ఉంటే ఒక సారి విన్నాను. కనుక విమానం తోలడంలో మనకి ఎంత అనుభవం ఉందో వాళ్ళకీ అంతే ఉండి ఉంటుంది. అంత కంటే ఎక్కువ అనుభవం ఉంటే వాళ్ళకి కూడా పెద్ద విమానాలు తోలే ఉద్యోగాలే దొరికేవి కదా.

ఈ మధ్య ఇలా బుల్లి విమానాలు తోలి తోలి చివరికి పెద్ద విమానం పైలట్ గా చిన్న "ప్రమోషను" సంపాదించుకొన్న ఒక పైలట్ పరాకు చిత్తగిస్తూ - బర్బేంక్ లో "రన్ వే" మీద ఆపడం మానేసి విమానాన్ని నేరుగా ఊళ్ళో ఉన్న పెట్రోలు బంకు దగ్గరకి తీసుకెళ్ళి ఆపిందిట. (ఈ రోజులలో ఆడ పైలట్లు కూడా ఉంటున్నారన్న మాట మరచి పోకండి.)

కారు తోలుతున్నాననుకొంది కాబోలు. బండి ఆగే లోగా ఒక సారి "లిప్ స్టిక్" రాసుకుందుకని "రియర్ వ్యూ మిరర్" లో చూసుకొని ఉండుంటుంది. లేకపోతే సర్దార్జీ జోకులో చెప్పినట్లు "రియర్ వ్యూ మిరర్" లో కనిపించిన "రన్ వే" ప్రతిబింబాన్ని చూసుకుని, "అరె, దూరం వెళుతూన్నకొద్ది ఈ రన్ వే పొడుగౌతున్నాదే" అని హాశ్చర్య పోయే లోగా ప్రమాదం జరిగిపోయిందేమో. నిజానిజాలు మనకి తెలియవు కదా.

ఈ సోదంతా మనకి ఇప్పుడు ఎందుకు కానీ విమానం ప్రయాణాలు మాత్రం పూర్వంలా "ఫన్" గా ఉండటం లేదు. విమానాలు బస్సుల్లా తయారయేయి. మరీ పిప్పళ్ళ బస్తాలో కుక్కీసినట్లు కుక్కెస్తున్నాడు. కాలు జాపుకుందుకి చోటుండదు. ఒళ్ళు విరుచుకుందామంటే చోటు ఉండదు. పోనీ కన్ను మూసి కునుకు తీద్దామంటే వెనక సీట్లొ ఉన్న ఆసామీ ఒడ్డి మంగలాడిలా మనని గుద్దుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఎలాగో ఒక లాగ కన్ను మూసేం అనుకొండి. ఉత్తర క్షణంలో "విండో సీటు" లో కూర్చున్న ఆసామీకి ఒంటేలుకి వస్తుంది.

విమానాలలో తిండి సంగతి నేను ప్రత్యేకం రాయక్కరలా! వాళ్ళు పెట్టే గడ్డి ఎలానూ తినలేమని తెలిసి కూడా బుద్ధి గడ్డి తిని "వెజిటేరియన్" భోజనం కావాలని అడిగేమనుకుందాం. మూడొంతుల ముప్పాతిక మనం అడిగిన "స్పెషల్ మీలు" వాళ్ళ కంప్యూటర్లో ఉండదు. మన పని గోవిందా! పోనీ మన అదృష్టం బాగుండి "స్పెషల్ మీలు" ఉందనుకుందాం. అప్పుడు ఉదయం, మధ్యహ్నం, రాత్రి అన్న పక్షపాతం లేకుండా - అన్ని పూటలు ఒకే భోజనం పెడతాడు. ఏదో వాడే పోయాడు, సరిపెట్టుకుందాములే అనుకొని, ఆ తిండిని నోట్లో పెట్టుకుంటే, తస్సాదియ్య, దాని రుచి అట్ట ముక్కలా ఉంటుంది.

ఇలా "తిండి అట్ట ముక్కలా ఉంటుంది, రుచిగా ఉండదు" వగైరా నిందారోపణలు చేస్తూ ఉంటే "ఆ మరీ డెక్కురుగొట్టు వాళ్ళల్లా ఏమిటి, వాళ్ళు పెట్టే తిండి కోసం విమానం ఎక్కుతామా మనం" అని సామంతురాలు ఒకావిడ ఒక సారి నన్ను నిలేసి అడిగింది.

"ఈ ప్రెషరైజ్డ్ కేబిన్ లో మన రుచి బొడిపెలు బాగా వికసించవండి. అంతే కాకుండా కేబిన్ లో పీడనం వల్ల ఆహారంలో "ఫ్లేవరు" ఉండి చచ్చినా అది మన ఘ్రాణ నాడుల వరకూ చేరదండి. అందుకని వాళ్ళు ఎంత బాగా వండినా ఈ విమానలలో తిండి ఇంతకంటె బాగుండదండి" అని "పాప్యులర్ సైన్స్" లో ప్రవేశం ఉన్న ఒక పెద్ద మనిషి విమానాలవాళ్ళని వెనకేసుకొచ్చాడు.

ఈ భయాలన్నీ ఒక ఎత్తు, సింగపూర్ నుండి మద్రాసు వెళ్ళడం లో ఉన్న భయం మరొక ఎత్తు. నేనొకసారి ఈ కాలి మీద (ఈ "లెగ్" లో అనడానికి నేను తెలుగులో పడుతూన్న తాపత్రయానికి నన్ను క్షమించి ఒదిలెయ్యండి) ప్రయాణం చేస్తున్నాను. విమానం గాలిలోకి లేచి కొంచెం కుదుట పడగానే నా ఎదురుగుండా ఉన్న ఒక ఆసామి లేచి, "ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్" తెరచి తన సంచి తీసేడు. సంచి లోంచి ఏదైనా పుస్తకం తీస్తున్నాడనుకొన్నాను. అది పుస్తకం కాదు. అదొక లుంగీ. ఆ లుంగీని బయటకు తీసి, కట్టుకున్న పేంటుని విప్పేసి ఆ లుంగీ కట్టుకుని, పేంటుని మడత పెట్టి ఆ సంచీలో పెట్టేసి, సంచీని పై అరలో పెట్టేసి తన సీట్లో మళ్ళా కూర్చున్నాడు. మనిషి కంగ లేదు. కానీ నా పక్కన కూర్చున్న ఆడ కూతురు మూర్చిల్లి పడిపోయింది. మద్రాసు వచ్చేవరకు మరి లేవలేదు.

ఆమ. "దట్సిట్."