Tuesday, January 6, 2009

నిరుడు కురిసిన హిమ సమూహాలు – ఒక సమీక్ష

జనవరి 2009
కల్యాణి, కాదంబిని, వైదేహి, విశాలాక్షి, సుగంధి, ఉలూచి, ప్రమద్వర, భార్గవ, అంబరీషుడు వంటి పాత్రలూ, వడ్డాణము, నాగవత్తులూ, నాలుగు పేటల చంద్రహారాలు, జాజిమొగ్గల గొలుసు, మొదలైన ఆభరాణాల మధ్య వెంకటేశ్వర్లూ, జోగినాధం వంటి పేర్లు రాకపోతే ఇదేదో పింగళి సూరన్న రాసిన ఏ కళాపూర్ణోదయమో అనుకునే ప్రమాదం ఉంది. ఈ పుస్తకం నిడివిని 150 పేజీలనుండి ఏ 1500 పేజీలకో పొడిగించి, ఒక క్రమ బద్ధంగా కథ చెప్పి ఉండుంటే ఏ వేయిపడగల కథలాగో తయారయి ఉండేదేమో. కాని చేసిన ప్రయత్నానికి ఒక “పడగ” ఇస్తాను.

ఈ “నవల”లో నన్ను బాగా హత్తుకున్నది కథాకాలంలో ఆచారవ్యవహారాలని, జీవితాన్ని వర్ణించిన ఆ నాటి తెలుగు భాష. ఈ రకం భాష ఇప్పుడు వినబడటం లేదు, కనబడటం లేదు. పురుళ్ళు, పిల్లలు, బారసాలలు, తొట్టిలో వెయ్యటాలు, అక్షరాభ్యాసాలు, దసరా పప్పుబెల్లాల పాటలు, సమర్తలు, పెళ్ళిల్లు, బూజంబంతులు, వియ్యపురాలి పాటలు, నూతిలోకి దూకి ఆడవాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, విధవా వివాహాలు, దేశభాషలని నొక్కిపెట్టి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టినందుకు మెకాలే మీద ఒక విసురు, కులవృత్తులని కూకటివేళ్ళతో పీకివేసిన బ్రిటిష్ వారిపై మరొక విసురు, ఇలా రచయిత మూడు తరాల జీవితకథ మూడు పాళ్ళూ, కల్పన కొంచెం మేళవించి, సూత్రబద్ధం కాని పువ్వుల పోగులా కథని ప్రదర్శించేరు. దారంతో గుచ్చిన దండైతే దానికి ఒక మొదలో, చివరో, వరసో ఉంటాయి. ఈ కథ చదవటానికి ఆ ఇబ్బందేమీ అక్కర లేదు; ఏ పేజీలోనైనా మొదలుపెట్టి ఎంత ఓపిక ఉంటే అంతే చదివి, ఆ చదివినది కాస్తా ఆనందించవచ్చు.

ఉదాహరణకి పన్నెండేళ్ళ రవణని, “కాసిని మంత్రాలు చదివి ఆరిని దీవించండి బాబూ” అని ఎవ్వరో అడిగితే, “సుమంగళీరియం వధూ..తరవాత గుర్తురాలా..అమ్మా! రెండరటి పళ్ళు తెండి. వధూవరాభ్యాం వరదా భవంతు, ఆఁ తలంబ్రాలు పోయించాలి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ,..ఒ, ఓ, ఔ” అంటూ రాగయుక్తంగా చదివుతూ, “యస్యజ్ఞాన దయాసింధో – గోడ దూకితే అదో సందో, ... ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి, ఆఁ మంగళ సూత్రం కట్టు నాయనా…” ఇదొక చిన్న హాస్యస్పోరకమైన సంఘటన.

ఈ కథ మనకి స్వతంత్రం రావటానికి ముందు రోజులలో మొదలై ఆంధ్ర ప్రదేష్ అవతరణ వరకు కొనసాగుతుంది. స్వామీ విజయానంద ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం నిరాహార దీక్ష పట్టేరన్న విషయం నాకు తెలియనే తెలియదు (ఈయనేనా స్వామీ సీతారం అంటే?) రచయిత పూర్వులు గాంధీ గారి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనటం, జైలుకెళ్ళటం దగ్గర నుండి దేశంలో ఉన్న రాజకీయ, ఆర్ధిక వాతావరణాలు అలా కనిపిస్తూనే ఉంటాయి.

ఈ పుస్తకం రచయిత శ్రీమతి సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి, ఎం. ఎ. హైదరాబాదులో సిటీ కాలేజీ, తెలుగు శాఖకి ఆధిపత్యం వహిస్తూ రిటైరు అయేరు. ఈమె ఎవ్వరో నాకు తెలియదనే అనుకుంటున్నాను; ఎప్పుడూ కలిసిన జ్ఞాపకం లేదు. బంధుత్వమూ లేదు. ఎవరో అమెరికా వస్తూ ఉంటే, “వేమూరి వేంకటేశ్వరరావు గారికి – నమస్కారములతో” అని సంతకం చేసి పంపేరు. మొదట్లో రెండు పేజీలు చదివి ఆపేసేను. మరొక సారి మధ్యలోంచి మరో మూడు పేజీలు చదివేను. పుస్తకంలో ఎక్కడ మొదలుపెట్టి చదివినా బాగానే ఉందనిపించింది (ముందు కథ తెలియక్కరలేదు, ఎందుకంటే దీనికి కథలా ఒక మొదలూ, చివరా అంటూ ఏమీలేవు.) మధ్యమధ్యలో పద్యాలున్నాయి, పాటలున్నాయి, శ్లోకాలున్నాయి. ఈ రకం జీవితాన్నీ, ఈ రకం సంఘాన్నీ, ఈ రకం భాషనీ, అరవై ఏళ్ళ క్రితం నేను చూసేను. ఈ కథలో కొన్ని అంశాలు నా పుట్టుకకి ముందు కాలానివి కూడా ఉన్నాయి. ఆ కాలపు జీవితానికి అద్దం పట్టినట్లు ఉన్నాయి ఇందులో సంఘటనలు. అందుకనే నాకు మళ్ళా మళ్ళా చదవ బుద్ధి వేసింది.

పుస్తకం 500 ప్రతులే అచ్చు వేసేరు. వెల రూ. 130/ అని ఉంది కాని, మధ్యవర్తులు 40 శాతం తినెస్తారు కనుక కావలసిన వారు నేరుగా రచయితకి రూ. 100/ పంపించి బేరం పెట్టి కొనుక్కోవచ్చేమో. ఇది ఉభయత్రా లాభదాయకం అని నా పైత్యం. ప్రతులకు: ఓగేటి పబ్లికేషన్స్, 3-6-470 పావనీ సత్యా కంప్లెక్స్, 6 వ వీధి, 103 వ నంబరు ప్లాటు, హిమయత్ నగర్, హైదరాబాదు – 29, ఫోను: 040-27634469.

2 comments:

  1. బాగుందండి సమీక్ష ! వెంటనే ఈ పుస్తకం కొని చదవాలి !

    ReplyDelete
  2. సమీక్ష బావుంది. ఇటువంటి పుస్తక పరిచయాలను, సమీక్షలను ఒక్కచోట చేర్చటానికి http://pustakam.net అనే కొత్త సైట్ తయారయ్యింది. మీ పుస్తక సమీక్షలను వారికి పంపితే అక్కడ ప్రచురిస్తారు. మీ బ్లాగులో లింక్ ఇస్తే సరిపోతుంది.

    ReplyDelete