Friday, February 20, 2009

మన ఆర్ధిక దుస్థితిని గట్టెక్కించటం ఎలా?

ఫిబ్రవరి 2009

నన్నెవరూ అడగరు కానీ అడిగితే మన ఈ ఆర్ధిక దుస్థితి నుంచి తేరుకోటానికో మార్గం ఉంది. ఈ కిటుకు, మరొక కాలంలో, మరొక సందర్భంలో నాకు తెన్నేటి విశ్వనాధం గారు చెప్పేరు. నాకొక్కడికే కాదండోయ్. సభలో ఉన్న నలుగురికీ చెప్పేరు. అలాగని సభలో నలుగురే ఉన్నారనుకునేరు. ఆ నాడు మైదానం మనుష్యులతో కిటకిటలాడిపోయింది. మొదట "నాతో" అని, తరువాత "నలుగురితో" అని చివరికి "ఎంతోమంది" అంటున్నానని తప్పుపట్టకుండా అసలు విషయం చెప్పనివ్వండి.

విశ్వనాధం గారు చెప్పిన కిటుకు చిన్న కథ రూపంలో చెప్పేరు. అది ముందు టూకీగా చెబుతాను. ఒక రుషి నదిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆకాశంలో ఎగురుతూన్న ఒక డేగ కాళ్ళ పట్టు నుండి జారి దోసిట్లో ఒక కప్ప పడింది. దాని శరీరం అంతా గోళ్ళు గీరుకుపోయి ఉన్నాయేమో అది బ్రతికే అవకాశం తక్కువగా కనిపించింది. రుషి తన తపోశక్తిని అంతా ధారపోసినా అది బతికే అవకాశం తక్కువని సాక్షాత్తూ ఆ బ్రహ్మ దేవుడే కనిపించి చెప్పేడు. చెప్పి ఊరుకోకుండా ఒక తరుణోపాయం చెప్పేడు. చివికిపోయిన ఆ కప్పని ఒదిలేసి తన తపోశక్తితో ఒక కొత్త ప్రాణిని సృష్టించమన్నాడు. అప్పుడు ఆ రుషి ఏం చేసేడు? ఎలాగూ కొత్త దానిని సృష్టించినప్పుడు దానిని మరొక కప్పలా కాకుండా అందంగా మనిషిలా సృష్టించేడు. ఆ వ్యక్తే అతిలోకసుందరి అయిన మండోదరి - రావణాసురుడి భార్య. అంత అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని రావణుడు సీత వెంట పడటం మన అదృష్టం! లేకపోతే మనకి రామాయణం ఉండేది కాదు.

ఈ కథ చెప్పి విశ్వనాధం గారు "కాంగ్రెస్ పార్టీ కప్పలా చివికిపోయింది. నెహ్రూ ఎంత మొనగాడైనా ఇలా చివికిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి బతికించలేడు. కనుక మండోదరి లాంటి అందమైన కొత్త పార్టీని పెట్టేం. మీరంతా ప్రజాపార్టీకే ఓటు వెయ్యండి" మా అందరికీ ఒక సలహా పారేసేరు.

ఇప్పుడు అమెరికాలో మన ఆర్ధిక పరిస్థితి చిరిగి, చివికి, మరమ్మత్తుకి లొంగని, టెర్మినల్ పేషెంటు" లా దీనావస్థలో ఉంది కదా? (అంటే కంప్యూటరు టెర్మినల్ దగ్గర కూర్చుని పేషెంటుగా ఈ బ్లాగుని చదువుతూన్న చదువరిలా కాదండోయ్!) మన ఒబామా, ఇంతకి ముందు బుష్, ఈ చివికిపోయిన వ్యవస్థకి ప్రాణం పోసి రక్షిద్దామని ట్రిలియన్లకొద్దీ డాలర్లు గుమ్మరిస్తున్నారు. కానీ, ఇలా చివికి శిధిలమయిపోయిన బేంకు (లేదా బ్యాంకు) లని పునరుద్ధరించేకంటె వీటిని చావనిచ్చి, వీటి స్థానంలో సరి కొత్త, బాగా, మంచి సమర్ధతతో పని చేసే, సంస్థలని నిర్మించి వాటికి మరొక కొత్త పేరు పెట్టి నడిపితే బాగుంటుంది.

ఈ ఊహ నా బుర్రలో కొంతవరకూ మాత్రమే పుట్టింది. నెట్‌స్కేప్ కనిపెట్టిన మార్క్ ఏండ్రీసన్ ఏమిటన్నాడంటే ఈ సరికొత్త బేంకు లని ఇంటర్నెట్‌లో పెట్టి కంప్యూటర్ల చేత నడిపించమన్నాడు. ఏండ్రీసన్ అనలేదు కానీ, ఇలా ఈ బేంకింగు వ్యవస్థ కి కొత్త పేరు పెట్టి అంతర్జాలం మీద నడిపిస్తే ఇప్పుడు జరుగుతూన్నన్ని గూడుపుఠాణీలు, కుమ్మక్కులూ జరగటానికి అవకాశం తక్కువ. అంతేకాదు. ఈ కొత్త వ్యవస్థ ని నిర్మించటానికి బోలెడు కంప్యూటర్లు, ప్రోగ్రామర్లు కావాలి కనుక ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయి. దానితో ఈ ఆర్ధిక మాంద్యత తగ్గవచ్చు. అయ్యా! అమ్మా! నేను మంచి చెప్పినా సరే, నా మాట వింటే నాకు ఎక్కడ "క్రెడిట్" వచ్చెస్తుందో అని ఎవ్వరూ వినరు. కాని చెప్పకుండా ఉండలేను కదా!

No comments:

Post a Comment