Thursday, January 7, 2010

తెలుగు దేశానికి పట్టిన దుర్గతి

తెలుగు వాళ్ళకి మరో పని లేదా? చీటికీ మాటికీ వీధిన పడి దౌర్జన్యకాండ జరపటం తప్ప మనవాళ్ళకి మరో పని ఉన్నట్లు లేదు. ఎక్కడో, ఎవ్వరో అనామకులు అంతర్జాలంలో ఒక కూత కేసే సరికి ముందూ, వెనకా ఆలోచించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా వీధిన పడి కనిపించినవి అన్నీ కాల్చెయ్యటమేనా? ఒక "వెబ్ సైటు" స్థాపించటం అనేది అయిదు నిమిషాల పని. మరొకరి పేరు మీద ఈ-టపాలు పంపటం అర నిమిషం పని. తెలుగు వాళ్ళని ఇంత సులభంగా బుట్టలో వేసుకోవచ్చని మన దేశపు శత్రువులకి తెలిస్తే వారు వెబ్ సైటు లని, ఈ-టపాలని ఉపయోగించి మనకీ పాకిస్తానుకీ (కాకపోతే మనకీ- చైనాకి, ఏదో మాటవరసకి అంటున్నాను) ఒక్క కలం పోటుతో కలత పెట్టొచ్చు. ఆలోచించండి. రిలయన్సు వారు నా బావ మరదులు కారు. రాజశేఖరరెడ్డి చావుకి మరొక కారణం చెప్పేడు హైదరాబాదులో టేక్సీ తోలేవాడు. హెలికాప్టరు చోదకుడు మందులకి లొంగని కేన్సరుతో బాధపడుతున్నాడుట. అతని చావు ఎలాగూ తథ్యమేనని అతని వారసులకి కోట్ల కొద్దీ డబ్బు ఇచ్చి, ఆ చోదకుడిని ఆత్మహత్య చేసేసుకోమన్నారుట. ఎవ్వరు? రాజశేఖరరెడ్డి మరణిస్తే లాభం పొందే వారు. చోదకుడు వారి పేర్లు కూడా చెప్పేడు. అసలే ఆంధ్రదేశం ఉడికిపోతోంది. ఇప్పుడు ఆ పేర్లు మళ్ళా చెప్పేనంటే ఇంకేమయినా ఉందా!

ఇందిరా గాంధీ చచ్చిపోయిన తరువాత రాజివ్ గాంధి ప్రధాని అయిన రోజునే ధీరూభాయి అంబానీ అర నిమిషం సేపు రాజివ్‌తో ముఖస్తంగా మాట్లాడటానికి అవకాశం ఇమ్మని ఆ అర నిమిషంలోనూ "అమ్మ గారికి ఎప్పుడైనా ఏదైనా అయితే అప్పుడు ఈ కాగితం మీకు ఇమ్మన్నారు" అని నెంబర్లు ఉన్న కాగితం ఒకటి అందించేడుట. రాజివ్ అర నిమిషం కాదు అరగంట మాట్లాడేడుట. ఇటువంటి హాస్యోక్తులలో గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ తారాగణం అంతా ప్రస్తుతం దివంగతులై ఉండటం.

సర్దార్‌జీ జోకులు లాంటివే ఈ కథలు కూడ. కడుపులో చల్ల కదలకుండా, కాలు మెదపకుండా ఇటువంటి కథలు ఎవ్వరయినా అల్లగలరు. అలాగే కాలక్షేపానికో, కోతిచేష్టలు చెయ్యటానికో పనిలేని ఒక కుర్ర మంగలి ఈ అంబానీ జోకుని తయారు చేసి తన “ఇంటిపుట” (హోంపేజి వచ్చిన తిప్పలు) లో పెట్టుకున్నాడుట. అంతకంటె పనిలేని పెద్ద మంగళ్ళు రిలయన్సు షాపులమీదకి దండయాత్ర చేస్తూ ఉంటే మన రాజకీయ వినాయకులు “శాసనోల్లంఘన చేసిన విద్యార్ధులకి క్షమాబిక్ష పెట్టాలి” అని ఒత్తిడి తెస్తూ ఉంటే తెలుగువాళ్ళంతా కలసి కట్టకట్టుకుని ఏ గంగలోనో దూకాలి తప్ప మరో మార్గం లేదు.

5 comments:

  1. మనలో మన మాట.
    తెలుగు వాణ్ని అని చెప్పుకోవటం కంటే తమిళం నేర్చేసుకోని చక్కగా తమిళోన్ని అని చెప్పుకోవటం మంచిదేమో మన తరువాతి తరాలకు :)

    ReplyDelete
  2. కొంతమంది పనిలేని మంగళ్ళు చేసే పనులకు అందరూ ఛావాల్సొస్తూంది. మా ఇంటి దగ్గర రిలయన్స్ ఫోను పెట్టుకున్నందుకు ఒకాయన్ను కొట్టబోయారట. ఆయన ఆ ఫోను వదిలించుకుని పారిపోయి వచ్చాడు. ఇలాగయితే బతకడం కష్టమే.

    ReplyDelete
  3. మొన్నటి వరకు హైదరాబాదులో ఏదైనా మంచి కంపెనీలో జాబ్ చూసుకొని, సెటిల్ అవ్వాలనుకున్నా. అందుకే చెన్నైలో మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా తమిళం నేర్చుకోలేదు. ఒరెమూనా గారు అన్నట్లుగా, ఇకనుంచి తమిళం పై గట్టిగా శ్రద్ధ పెట్టి, తమిళం నేర్చేసుకొని, ఇక్కడే తమిళనాడులో సెటిల్ అయిపోతే బెటర్ అని డిసైడ్ అయ్యాను.

    ReplyDelete
  4. ఈ దాడులవలన ఎవరికి లాభం? మనుషులలో విచక్షణతో ఆలోచించే యోచన కరువయ్యిందా?

    ReplyDelete
  5. http://madhumohang.blogspot.com

    ReplyDelete