Saturday, January 1, 2011

ఏం? ఎందుకని?-7

7. ఉప్పు ఎక్కువ తినడం మంచిదికాదంటారు. ఎందుకని?

ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ఉప్పు సోడియం, క్లోరీన్ అనే రెండు రసాయన మూలకాల సంయోగం వల్ల పుట్టింది కనుక రసాయనులు దీనిని సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. ఈ సోడియమూ, క్లోరీనూ - రెండూ విపరీతమైన విష పదార్ధాలు. ఈ రెండింటి కలయిక వల్ల పుట్టిన ఉప్పు ప్రాణానికి మూలాధారం. ఆశ్చర్యంగా లేదూ?

ఉప్పులో నిల్వ వేసిన తిండి పదార్ధాలు పాడవకుండా చాల కాలం నిల్వ ఉంటాయని మానవుడు ఎప్పుడో కనుక్కున్నాడు. ఆ రోజులలోనే ఉప్పు వేసిన పదార్ధాలు ఎక్కువ రుచిగా ఉంటాయని కూడ గ్రహించేడు. మనం తినే పదార్ధాల రుచి ఉప్పుదే అంటే అది అతిశయోక్తి కాదు. "చవి" అన్న మాటకి ఉప్పు అనీ, రుచి అనీ రెండు అర్ధాలు ఉన్నాయని మరచిపోకూడదు. ఉప్పు రుచి మరిగిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం కష్టం. ఒక విధంగా కాఫీ అలవాటూ, తాగుడు అలవాటు ఎలాంటివో ఈ ఉప్పు అలవాటు కూడ అలాంటిదే, అక్కడే వస్తుంది మడత పేచీ.

నిజానికి ఉప్పు తినకపోతే బతకలేము. అలాగని గుప్పిళ్ళతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అంటే చెంచాలో పదవ వంతు. ఆ ప్రాప్తికి మనం తినే కాయగూరలలోను, తాగే నీళ్ళల్లోను సహజసిద్ధంగా ఉప్పు లభ్యం అవుతుంది. (నిజానికి జంతుకోటికి కావలసిన ఉప్పు ఇలాగనే సరఫరా అవుతుంది.) అసలు తాగే నీళ్ళల్లో ఉప్పు బొత్తిగా లేకపోతే నీళ్ళకి రుచే ఉండదు. నా మాట మీద నమ్మకం లేకపోతే బట్టీ పట్టిన నీళ్ళని తాగి చూడండి. అయినప్పటికీ మనం వంటలలో ఉప్పు ఎంతగానో వేసుకుంటాం - మన శరీరానికి కావలసి కాదు, జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక. మనకి ఉప్పు అంటే అంత ఇష్టం.

ఇష్టమైనది, శరీరానికి కావలసినది అయిన ఉప్పుని తింటే వచ్చే మడత పేచీ ఏమిటంటారా? చిన్నప్పుడు ఉప్పు తినడం అలవాటు అయిపోతే పెద్దయిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం చాల కష్టం. పెద్దయిన తర్వాత మాత్రం ఎందుకు తప్పించుకోవాలంటారా? మనం పెద్ద అవుతూన్న కొద్దీ గుండెకీ, మూత్ర పిండాలకీ రోగాలు వచ్చే సావకాశం ఎక్కువ. అలాగే రక్తపు పోటు పెరిగే సావకాశాలూ ఎక్కువే. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఈ రోగాలు వస్తాయనడానికి ఏమీ దాఖలాలు లేవు. కాని ఈ జబ్బులు వచ్చేయంటే దానికి పథ్యం ఉప్పు తినడం మానేయడమే. కాని చిన్నప్పటి నుండీ అలవాటు పడిపోయిన ఉప్పుని మానడం చాల కష్టం. కాఫీ అలవాటు తప్పించుకో వచ్చు, సిగరెట్ల అలవాటు ఒదిలించుకో వచ్చు; కాని ఉప్పు అలవాటు అయిపోతే మానడం కష్టం.

వేడి దేశాలలో ఎండలో పని చేసే కూలీలని ఉప్పు బిళ్ళలు తినమని సలహా ఇస్తారు. దాని మాటేమిటి? ఎండలో పనిచేసేటప్పుడు చెమట బాగా పడుతుంది కదా! ఆ ఘర్మజలం తో పాటు ఉప్పు కూడ శరీరం నుండి బయటకు పోతుంది. ఇలా నష్టపోయిన ఉప్పుని భర్తీ చెయ్యమని శరీరం మొర్రో మని పోరు పెడుతుంది. అప్పుడు తాత్కాలికంగా ఉప్పు తినాలి. అప్పుడు ఒక ఉప్పు బిళ్ళని మందు వేసుకున్నట్టు వేసుకోవాలి కాని, ఆ ప్రాప్తికి ఉప్పుని వంటకాలలో కలుపుకుని తింటే ఉప్పు రుచికి శరీరం అలవాటు పడిపోతుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లూ నిజానికి ఉప్పు ఎంత తిన్నా పరవా లేదు. మన శరీరానికి అవసరం లేని ఉప్పుని మన మూత్రపిండాలు సునాయాసంగా తోడెయ్య గలవు. కాని మరే కారణం వల్లనైనా మన మూత్రపిండాలు ఈ పని చెయ్యలేని పరిస్థితి సంభవిస్తే అప్పుడు వస్తుంది మడత పేచీ. గుండె జబ్బు ఉన్నవాళ్లూ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లూ ఉప్పు ఎక్కువ తింటే వారి పరిస్థితి ఉపశమించడానికి బదులు ఉద్రేక పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment