Tuesday, February 10, 2009

ఈ సిద్ధాంతం విన్నారా?

ఫిబ్రవరి 2008

చెన్నపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమిలిపట్నం, కళింగపట్నం, (ఈ జాబితాని పూర్తి చెయ్యండి) .... ఇలా తెలుగు, తమిళ దేశాలలో ఏ "పట్నం" పేరు చూసినా అది సముద్రపుటొడ్డున ఉన్న ఉరే (రేవు పట్నం) కావటం గమనార్హం.

ఈ బాణీకి వ్యతిరిక్తంగా రెండే రెండు ఊళ్ళు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో తునికి, యలమంచిలికి మధ్య ఉన్న రైలు స్టేషన్ నరిశీపట్నం రోడ్డు. నరిశీపట్నం ఊరు ఇంకా లోపుకి (సముద్రానికి దూరంగా), కొండలలో ఉంది. రెండో ఊరు, విశాఖపట్నం స్టేషన్ కి రైలు బండి చేరుకునే ముందు గోపాలపట్నం అనే ఊరు మీదుగా వెళుతుంది. ఈ గోపాలపట్నం విశాఖ విమానాశ్రయానికి చాల దగ్గర. ఇది సముద్రానికి దగ్గరగానే ఉన్నా, రేవుపట్టణం కిందకి రాదు.

ఈ రెండు ఊళ్ళని మినహాయిస్తే, "పట్నం" అన్న తోక ఉన్న ఊళ్ళన్నీ రేవు పట్టణాలనే నా నమ్మకం. ఈ గమనిక మీద వ్యాఖ్యానాలు ఆహ్వానిస్తున్నాను.

7 comments:

  1. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. ఒరిస్సాలోని భవానీపట్న. చిన్న సవరణండి. అది భీమిలిపట్నం కాదు, భీమునిపట్నం. భీమిలి అని కూడా అంటారు.

    ReplyDelete
  2. intersting observation.. maku matram patnam ante hyderabade.. :)

    ReplyDelete
  3. మంచి అబ్జర్వేషన్.

    ReplyDelete
  4. తమిళనాడులో నాగపట్నం, మరికొంచెం ఉత్తరానికి చెన్నపట్నం, నెల్లూరు దగ్గర కృష్ణపట్నం, తరువాత మచిలీపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, శ్రికాకుళం జిల్లాలో ఉన్న కళింగపట్నం - ఇవీ తూర్పు కోస్తాలో ఉన్న పట్నాలు. ఇవి కాక శ్రికాకుళం జిల్లాలో పాతపట్నం అనే రేవుపట్నం ఉందా? ఒరిస్సాలో భవానీపట్నం కూడ రేవు పట్టణమేనా?

    రేవులు కాని పట్టణాలు: విశాఖపట్నం జిల్లాలో నరిశీపట్నం, గోపాలపట్నం కాకుండా హైదరాబాదు దగ్గర ఇబ్రహీంపట్నం అనే చిన్న ఊరు ఉన్నట్టు విన్నాను. ఈ మూడు పట్టణాలు అపస్వరాలలా అడ్డు పడకపోతే, ఎంచక్కా "కోస్తాలో ఉన్న ఊళ్ళకే "పట్నం" అనే తోక తగిలించవచ్చు" అనే ఒక "శుల్బ సూత్రం" ఒకటి ప్రవేశపెట్టి ఉండేవాడిని.

    ReplyDelete
  5. పట్నం అన్న పదం 16వ శతాబ్దం తర్వాత, విదేశీయుల నుంచి వచ్చిందని అనిపిస్తుంది("కోస్తా" బుడతకీచులనుండి వచ్చినట్ట్లు). తమిళంలో పట్టినం అన్న పదం seashoreకి వాడతారు.

    ReplyDelete
  6. చూశారా, భైరవభట్ల గారు చెప్పిన మాటలో నిజం ఉంది. తమిళనాడులో ఉన్న "పట్నం" నాగపట్నం అని తెనిగించి రాసేను కాని, తమిళులు దానిని నాగపట్టిణం అనే అంటారు. ఒక విధంగా "కోస్తా" అన్నా "పట్టిణం" అన్నా ఒకటే కనుక, నా గమనిక (సిద్ధాంతం అనను) సరి అయినదే. ఇప్పుడు చెయ్యవలసినది నరిశీపట్నానికీ, గోపాలపట్నానికీ, ఇబ్రహీంపట్నానికీ సరి అయిన పేర్లు పెట్టి ఆ పాత పేర్లని మార్పించటానికి ప్రయత్నం చెయ్యాలి. హైదరాబాదులో హార్బరు కట్టించాలనే కోరిక నాకు చిరకాలం నుండీ ఉంది కనుక ఈ రెండింటిని ఒకేసారి చేస్తాను. :-)

    ReplyDelete
  7. రావుగారు,

    నేను చెప్పిన రెండు రేవుపట్నాలు కాదండి (పట్నంతో అంతమవుతూ రేవులు కానివాటి ఉదాహరణలు ఇచ్చాను). అలాగే కర్ణాటకలోని శ్రీరంగపట్నం కూడా. 'పట్నం' విదేశీ పదం కాదని నా అభిప్రాయం. బీహారు రాజధాని పాట్నా పేరు పాటలిపుత్రం నుంచి వచ్చిందంటే నాకెందుకో నమ్మబుద్ధెయ్యదు. అది పట్నం/పట్టణం నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటున్నా.

    ReplyDelete