Sunday, September 26, 2010

గుడ్లు తినటం గుండెకి మంచిది కాదా?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్లు మరీ ఎక్కువయిపోయారు. ఎవ్వరిమాట విని చావాలో తెలిసి చావటం లేదు.

ఉదాహరణకి గుడ్డట్టు (ఆమ్లెట్ కి తెలుగులో వచ్చిన తిప్పలు) వేసుకుందామని కోడిగుడ్డుని పగలగొట్టేను కదా!

“ఆ పచ్చని తీసి పారేసి తెల్లసొనతో వేసుకొండి. ఆ పచ్చసొన అంతా కొలెస్టరాలే. మీ గుండెకి మంచిది కాదు” అంటూ ఉచితంగా ఒక సలహా పారేసింది – ఇంకెవరు! మా శ్రీమతి!

నాలోని సైంటిస్టు కుతూహలంతో కుతకుతలాడేడు. లాడడూ?

నిజంగా పచ్చసొన తింటే గుండెకి హాని కలుగుతుందా? ఎవ్వరు చెప్పేరు?

మనకి తెలుసున్న విషయాలు ఇవి: ఒక సగటు గుడ్డులో సుమారు 210 మిల్లీగ్రాములు కొలెస్టరాలు ఉంటుంది. నిజమే! అంతే కాదు. మన రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధం చాల మట్టుకు కొలెస్టరాలే! రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధాలు – పాలల్లో వెన్నలా తేలిపోయి - గుండెకి సరఫరా చేసే రక్తనాళాలలో మేట వేసి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినప్పుడు గుండెపోటు (heart attack) వస్తుంది. అదీ నిజమే. కాని మనం కొలెస్టరాలు ఉన్న తిండి పదార్ధాలు తినటం వల్ల గుండెపోటు వస్తుందనటం కొచెం నిజాన్ని సాగదియ్యటమే అవుతుంది.

మనలో - చాల మందిలో - కోలెస్టరాలు తిన్నంత మాత్రాన రక్తప్రవాహంలో కొలెస్టరాలు మట్టం పెరగదు. (పొట్లకాయ తిన్నంత మాత్రాన పొడుగెదుగుతామా?) ఆ మాటకొస్తే, మనం ఆహారం ద్వారా కొలెస్టరాలుని సరఫరా చేసిన పక్షంలో శరీరం తను ఉత్పత్తి చేసే కొలెస్టరాలుని తగ్గిస్తుంది. కనుక తినే తిండిలో ఉన్న కొలెస్టరాలుకీ, రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలుకీ మధ్య బాదరాయణ సంబంధం ఉంటే ఉండొచ్చు గాక; అది మాత్రం దగ్గర సంబంధం కాదు.

నిజానికి రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలు మట్టం పెంచటానికి దోహదపడే కారణాంశాలు (factors) రెండు ఉన్నాయి. అవి – సంతృప్త గోరోజనామ్లాలు (saturated fatty acids) , అడ్డు గోరోజనాలు (trans fats). ఈ రెండు కారణాంశాలు ఒక గుడ్డులో కేవలం 2 గ్రాముల ప్రాప్తికి మాత్రమే ఉంటాయి.


అమెరికన్ హార్ట్ ఎసోషియేషన్ చేసే సిఫార్సు ప్రకారం ఆరోగ్యవంతులు రోజుకి 300 మిల్లీగ్రాముల వరకు కోలెస్టరాల్ ని నిర్భయంగా తినొచ్చు. గుండెజబ్బు చరిత్ర ఉన్నవాళ్లు అయితే 200 మిల్లీగ్రాములతో సరిపెట్టుకోవాలి. ఈ లెక్కన ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రోజుకో గుడ్డు తిన్నంతమాత్రాన్న మరేమీ కొంప ములిగిపోదు. గుండె ఆరోగ్యం సరిగ్గా లేని వారు వారానికి రెండు గుడ్లు తింటే మరేమీ పరవా లేదు.

ఇవన్నీ ఉచితమైన సలహాలు. మీ డాక్టరుకి ముట్టజెప్పవలసిన ముడుపు ముట్టజెప్పి అప్పుడు ఆ వైద్యుడు చెప్పినట్లు చెయ్యటం సర్వదా శ్రేయస్కరం.

Sunday, September 12, 2010

ఏమి సమంజసం?

జూలై 2010 రచన మాసపత్రికలో శ్రీకాకుళం నుండి ఎన్. బి. ఆర్. కె. భాను అనే ఆసామీ రాసిన ఒక ఉత్తరానికి స్పందిస్తూ శాయి ఒక సంపాదకీయం రాసేరు. ఆ పాఠకుని ఉత్తరం, ఆ సంపాదకీయాల సారాంశం: దేశంలో ప్రతి సంస్థకీ, కట్టడానికీ, జిల్లాకి, ఒక రాజకీయనాయకుడి పేరు పెట్టెయ్యటం ఏమి సమంజసం? నిజమే! రంగారెడ్డి జిల్లా, రాజశేఖరరెడ్డి జిల్లా అనుకుంటూ పోతే కొన్నాళ్లకి జిల్లాలు అన్నీ అయిపోతాయి. అప్పుడు ఊళ్లమీద పడతారు కాబోలు. కాకినాడ పేరు పళ్లంరాజు, తుని పేరు బుల్లిబాబు అవుతాయి కాబోలు. హైదరాబాదు పేరు కె. సి. ఆర్ గా మార్చాలనే కోరికతోటే తెలంగాణా ఉద్యమం ఆయన ప్రారంభించేడేమో కనుక్కోవాలి. ఢిల్లీ పేరు సోనియా అని మార్చేసి ఇండియా పేరు గాంధీ అని పెట్టేస్తే ఈ గొడవ తీరిపోతుందేమో!