Wednesday, October 12, 2011

KCR కి బహిరంగ లేఖ

అన్నా, KCR అన్నా,

తవఁకేనండి, సిన్న మనవి.

మనూరోడివే కదా అనీని, మనోడే కదా అనీని, సొరవ సేసి అడగతన్నా. మనూరోడ్నెలాగయ్యానా? మరి మాదీ బొబ్బిలేగందా. మా ఓళ్లు, మీ ఓళ్లల్లాగే, బొబ్బిలోళ్లే. గత ఏభై ఏళ్ల నుండీ నానమెరికాలో ఉండిపోనానేమో బొబ్బిలి నాకెంత దూరమో నీకూ అంతే దూరం గందా? ఆ మాటకొస్తే నాకంటె నువ్వే బొబ్బిలికి దగ్గరుండావు. నేనూ, నీలాగే, తెలంగణోణ్ణేలే. అందుకే సొరవసేసి అడగతన్నా.

నేను బొబ్బిలోణ్ణంటూ తెలంగాణోణ్ణి ఎలాగయానంటావా, అన్నా? గత మూడేళ్లబట్టీ ఏడాదికి రెండు సుట్లు హన్మకొండ వచ్చి మూడేసి నెల్లు ఉంటన్నా కదా? ఐద్రాబాదు సాల సుట్లు ఏపారానికొచ్చి బోలెడంత డబ్బు తగలెట్టిన. నేనూ తెలంగణోణ్ణే. అందుకని సొరవ సేసి అడగతన్నా.

ఏంటడగతన్నానా? మరేమో, అన్నా. మనకి తెలంగణొచ్చెస్తది కదా. తెలంగాణలో అంటే రైళ్లు ఆపేసినాం కాని, నీ తఢాకాకి ఆంధ్రోడి గుండెల్లోనూ, ఢిల్లియోడి గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయన్నా. ఇదే ఊపులో మరొక్క సహాయం చేసి పుణ్యం కట్టుకో అన్నా. సొరవ సేసి అడగతన్నానని ఏఁవనుకోకు.

ఏటి కావాలో సెప్పకుండా ఈ సొద ఏంటని చిరాకు పడకన్నా. మన తెలంగణొచ్చినతరువాతన్నా, మన జాతీయగీతాన్ని కూడ కాసింత మరమ్మత్తు చేయించన్నా. "ద్రావిడ, ఉత్కళ, వంగా" అంటే ఉడుకు రక్తం ఉన్న తెలంగణోళ్లకి ఎలాగుంటుందన్నా? ఆంధ్రోళ్లకి సీవూఁ, నెత్తురూ లేకపోతే పాయె. తెలంగణోళ్లకి ఆత్మగౌరవం ఉందన్నా. ఈ పాటని "ద్రావిడ తెలంగణోత్కల వంగా" అని మార్చే వరకు రైళ్ల రాకపోకలు ఉండవని మరొక బందు ప్రకటించన్నా. మన బొబ్బిలి వీరుల, మన వెలమ దొరల, ప్రతాపం ప్రజలకి చాటి చెప్పన్నా......

Tuesday, September 20, 2011

జీవనది: రక్తం కథ

వేమూరి వేంకటేశ్వరరావు

దరిదాపు పదేళ్ల క్రితం నేను జీవనది అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించేను. అచ్చయిన ప్రతులన్నీ ఖర్చు అయిపోయాయి. అడపా, తడపా పుస్తకం ప్రతి ఒకటి ఉంటే కొనుక్కుంటామని చదువరులు వాకబు చేస్తూనే ఉన్నారు. పుస్తకాన్ని మళ్లా అచ్చొత్తించాలంటే కాగితం కావాలి. కాగితం కావాలంటే చెట్లని నరకాలి. అది పర్యావరణ రక్షణకి మంచిది కాదు. పైపెచ్చు ఆ కాగితం పుస్తకాలని బీరువాలలో దాచాలంటే ఇంట్లో చోటు ఉండాలి. ఇప్పటికే ఇంట్లోను, అటక మీద, గరాజ్ లోను, ... ఇలా ఎక్కడ చూసినా పుస్తకాలే. ఈ పరిస్థితులలో పుస్తకాలని కాగితం మీద అచ్చు కొట్టే కంటె అంతర్జాలంలోని మేఘాలలో దాచుకుని, అవసరం వెంబడి ఎవరికి, ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాటిని దిగుమతి చేసుకుని చదువుకునే వెసులుబాటు ఇప్పుడు వచ్చింది. ఆ వెసులుబాటుని ఉపయోగించుకుని, నా పుస్తకాన్ని మళ్లా ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన నాకు, కిరణ్ కుమార్ చావాకి ఒకేసారి వచ్చింది. ఆడబోయిన తీర్థం ఎదురయింది.

పాత పుస్తకాన్ని తీసుకుని కనిపించిన తప్పులన్నీ దిద్దేను. పుస్తకం పేరు చూడగానే ఆ పుస్తకంలో ఉండే వస్తువు ఏమిటో తెలియాలని, పేరు "జీవనది: రక్తం కథ" అని మార్చేను. కొత్త పేరుకి తగ్గట్టు అట్ట మీద బొమ్మని మార్చేను. మన తెలుగు వాడని చెప్పుకుని గర్వించదగ్గ యల్లాప్రగడ సుబ్బారావు చేసిన పరిశోధనలకీ, రక్తపు కేన్సరుకీ మధ్య ఉన్న బాదరాయణ సంబంధం వివరిస్తూ ఒక సరికొత్త అధ్యాయం రాసి దానిని పుస్తకంలో ఇమిడ్చేను. తెలుగు పుస్తకాలలో "ఇండెక్స్" సర్వసాధారణంగా కనిపించదు. అటువంటి ఇండెక్స్ ఈ పుస్తకానికి క్రొంగొత్త హంగు.

ఇలాంటి హంగులన్నింటితో "జీవనది: రక్తం కథ" అనే ఎలక్‌ట్రానిక్ పుస్తకం సర్వాంగసుందరంగా వెలువర్చిన కినిగి సంస్థని కొనియాడకుండా ఉండలేను. ఈ పుస్తకం గురించి ఇతర వివరాలు కావాలంటే ఈ దిగువ చూపిన లంకెని నొక్కండి:

http://kinige.com/kbook.php?id=378

ఇంకా రాస్తే సొంత డబ్బాలా ఉంటుంది. రక్తం గురించి సామాన్యులకి వచ్చే అనుమానాలకి సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయనే నమ్మకంతో ఈ పుస్తకం చదవమని నేను ప్రోత్సహిస్తున్నాను.

Tuesday, July 12, 2011

తెలుగెందుకా?

తెలుగెందుకా?

అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు కొందరు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరి సహాయ సహకారాలతో, ఒక “మంచి” పని తలపెట్టేరు. అదేమిటంటే బర్క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం స్థాపించటానికి పునాదులు వేసేరు. ఇది ఇంతింతై, ఎంతో పెద్దదై ప్రపంచంలోనే అత్యుత్తమమైన తెలుగు పీఠంగా వర్ధిల్లాలని వారి ఆకాంక్ష.

ఇలాంటి “మంచి” పని ఏది చెయ్యాలన్నా డబ్బు కావాలి కదా. కనీసం 1.5 మిలియను డాలర్లు కావలసి ఉంటుందని విశ్వవిద్యాలయం వారు అంచనా వేసేరు. ఈ డబ్బు దండటానికి బుజం మీద ఉన్న గావంచాని జోలెలా చాచి, బిచ్చం వెయ్యమని అందరినీ అడగటం మొదలుపెట్టేం. ఇచ్చేవాడికి అడిగేవాడు లోకువ. “మనకి తెలుగెందుకండీ? వెళ్లండి! వెళ్లండి!” అని తరిమి కొట్టినవాళ్లే ఎక్కువ. దాలిగుంటలో కుక్కని “ఛీ, ఛీ” అంటే దులుపుకుని పోయినట్లే ఈ దూషణ, తిరస్కారాలు ఈ శరీరమునకే కాని ఆత్మకి చెందవు” అని సంజాయిషీ చెప్పుకుని, మొత్తం మీద 350,000 డాలర్లు పోగుచేసి, విశ్వవిద్యాలయానికి ఇచ్చి పీఠం మొదలు పెట్టేం.

“ఇంగ్లీషు చదువు ఉద్యోగాలు ఇస్తున్నాయి” అనే భ్రమతో తెలుగన్నా, తెలుగు సంస్కృతి అన్నా అందరికీ ఒక రకమైన తృణీకారభావం అలవాటవుతోంది. తెలుగు నేర్చుకోకూడదు, తెలుగు మాట్లాడకూడదు, పరికిణీ, ఓణీ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అంటూ ఇలా మనం చెయ్యకూడని పనుల జాబితా చాల పెద్దదే ఉందనిపిస్తోంది.

మన వేషభాషల మీద, మన జాతి మీద, మన మతం మీద ఇంత తృణీకారభావం, ఇంత విస్తృతంగా పెరిగిందంటే దీనికి ఏదో గట్టి కారణమే ఉండి ఉండాలని నాకు అనుమానం వచ్చింది. కాని దీనికి కీలకమైన మూల కారణం ఏమిటో తెలియలేదు – నిన్నటి వరకు. ఇప్పుడు తెలిసింది. మీరందరూ ఇంగ్లీషు మీద మమకారంతో ఇంగ్లీషు మీద ప్రావీణ్యం సంపాదించి ఉన్న వారే కనుక, మన సంస్కృతి మీద మనకి విరక్తి కలగటానికి జరిగిన కుట్ర గురించి ఆ కుట్రదారుల మాటలలోనే చెబుతాను. చదవండి.

Lord Macaulay’s address to the British parliament, 2 February 1835

“I have travelled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief, such wealth I have seen in this country, such high moral values, people of such caliber, that I do not think we will ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore I propose we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native culture, and they will become what we want them, a truly dominated nation.”

ఇది చదివిన తరువాత మనది భ్రస్టు పట్టిపోయిన సంస్కృతి అని మీరు ఇంకా నమ్ముతున్నారా? మెకాలే చేసిన మోసానికి ప్రతి మోసం ఏమిటంటే ఇంగ్లీషు నేర్చుకుని ప్రపంచాన్ని జయించండి. కాని మన భాషని, మన జాతిని, మన సంస్కృతిని మరచిపోకండి.

మీ మనస్సు స్పందిస్తే, http://FriendsOfTelugu.org కి వెళ్లి తెలుగు పీఠం కోరకు జరుగుతూన్న ప్రయత్నాలు చూడండి. చంద్రుడికో నూలుపోగులా మీకూ సహాయం చెయ్యాలని ఉంటే అక్కడ ఉన్న PayPal ద్వారా మీరు కూడా బిక్ష వెయ్యండి. మేము జోలె పట్టుకుని ఇక్కడ నిలబడ్డాం. శలవు.

Monday, July 11, 2011

అమెరికాలో తెలంగాణ!!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కావాలని కలలు కంటూన్న వారికి అమెరికా నుండి ఒక శుభవార్త-


"Republican Jeff Stone is asking 13 conservative counties in Southern California to consider separating from the blue state. Gov. Jerry Brown's office calls the idea "a supremely ridiculous waste of everybody's time."

Sunday, March 27, 2011

ఏం? ఎందుకని? - 16

16. కొన్ని చెట్లు చలికాలం లో ఆకులని రాల్చుతాయి. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడ అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు.

మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న చెట్టు ఎక్కువ వేడిని నష్టపోతుంది. ఈ విషయాన్నే మరొక విధంగా చెప్పాలంటే, ఎక్కువ వైశాల్యంగా ఉన్న చెట్టుకి ఎక్కువ చలి వేస్తుంది. మనకి చలి వేసినప్పుడు మన వైశాల్యం తగ్గించడానికి ముడుచుకుని కూర్చుంటాం. అలాగే చలి కాలంలో చెట్లు తమ వైశాల్యాన్ని తగ్గించడానికి ఆకులని రాల్చివేస్తాయి.

రెండవ కారణం. ఆకులు ఆహారపదార్ధాలని తయారుచేసే కర్మాగారాల్లాంటివి. వేసవి కాలంలో ఎండ మెండుగా ఉన్న రోజులలో ఆ సూర్యరస్మిని పీల్చుకోడానికి ఎక్కువ వైశాల్యం ఉన్న ఆకులు కావాలి. శీతాకాలం వచ్చేసరికి ఎండ తగ్గిపోతుంది కనుక ఆకులకి సరిపడా సూర్యరస్మి తగలదు. కనుక అవి పూర్వంలా పని చెయ్యలేవు. పని చెయ్యని ఆకులతో నాకేం పని అని చెట్టు ఆ ఆకులని రాల్చేస్తుంది.

Monday, February 21, 2011

ఏం? ఎందుకని? - 15

15. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఆకులన్నీ ఆకుపచ్చగా ఉండవు కాని, చాల మట్టుకు ఉంటాయి. ఆకుపచ్చ వృక్షసామ్రాజ్యపు పతాక వర్ణం. ఈ ఆకుపచ్చకీ వృక్షసామ్రాజ్యానికి మధ్య ఉన్న లంకె ఏమిటో చూద్దాం. మనం బతకడానికి మనకి శక్తి ఎలా కావాలో అదే విధంగా చెట్లు బతకడానికి కూడా వాటికి శక్తి కావాలి. ఈ శక్తి ఆహారం నుండి లభిస్తుంది. మనం బద్ధకిష్టులం గనక ఆకలి వేసినప్పుడల్లా ఏదో ఒక చెట్టు నుండి ఒక కాయో, పండో కోసుకు తినేస్తాం. మొక్కలు ఆ పని చెయ్యలేవు కదా. ఆందుకని మొక్కలు తమకి కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకొంటాయి. ఈ తయారీ అంతా ఆకులలో జరుగుతుంది. అంటే ఆకులు మొక్కలకి ఆహారం తయారు చేసిపెట్టే కార్ఖానాలు.

అన్ని కార్ఖానాలకి మల్లే వీటికి కూడ ముడి పదార్ధాలు కావాలి కదా? అందుకని మొక్క భూమి నుండి నీళ్లనీ, పోషక పదార్ధాలనీ, గాలి నుండి బొగ్గుపులుసు వాయువునీ పీల్చుకుంటుంది. ఈ రెండింటిని రసాయన సంయోగం పొందించి ఆహారం తయారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియకి శక్తి కావాలి కదా. ఆ శక్తి సూర్య రస్మి సరఫరా చేస్తుంది. ఈ పద్ధతినే కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఈ సంయోగం ఫలోత్పాదకంగా జరగాలంటే ఒక మధ్యవర్తి సహాయం కావలసి ఉంటుంది. అటువంటి మధ్యవర్తిని రసాయనశాస్త్రంలో కేటలిస్టు అంటారు. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో వాడే కేటలిస్టు పేరు పత్రహరితం. దీన్ని పైరుపచ్చ అని కూడ అంటారు. ఇంగ్లీషులో 'క్లోరోఫిల్'. ఈ పత్రహరితాన్ని మొక్కలు తమకి తామే తయారు చేసికొంటాయి. ఈ పత్రహరితం ఆకుపచ్చ రంగులో ఉంటుంది కనుక, ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి.

మొక్కలు పత్రహరితం తో పాటు ఇంకా అనేక ఇతర రసాయనాలని తయారు చేసుకుంటాయి. పత్రహరితం ఆకుపచ్చ రంగుని ఇచ్చినట్లే 'క్సేంతోఫిల్' అనే పదార్ధం పసుపు పచ్చ రంగుని ఇస్తుంది. కేరోటిన్ నారింజ రంగుని పోలిన ఎరుపు రంగుని ఇస్తుంది. 'ఏంథోసయనిన్' ఎర్రని ఎరుపు రంగుని ఇస్తుంది. ఈ 'ఏంథోసయనిన్' ఏపిలు పళ్ళకి తీపిని, ఎరుపుని ఇస్తుంది. సర్వసాధారణంగా పత్రహరితం పాలు ఎక్కువ ఉండడం వల్ల పచ్చ రంగు ధాటి ముందు మిగిలిన రంగులు వెలవెలబోయి, ఆకులు పచ్చగా కనిపిస్తాయి.

Saturday, February 19, 2011

ఏం? ఎందుకని? - 14

14. మూత్రం సాధారణంగా పసుపుపచ్చగా ఉంటుంది. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ రకం ప్రశ్నలకి భౌతిక శాస్త్రం ఒక రకమైన సమాధానం చెబుతుంది, రసాయన శాస్త్రం మరొక కోణం ద్వారా సమాధానం చెబుతుంది. ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది? ఆకులు ఎందుకు ఆకుపచ్చగా ఉంటాయి? ఆన్న ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లే ఇక్కడా చెప్పొచ్చు. కాని ఈ విషయానికి ఇక్కడ రసాయన శాస్త్రపు దృక్కోణం బాగా ఉపయోగ పడుతుంది. మూత్రానికి రంగు రావడానికి మూత్రం లో ఉన్న రసాయనాలే ముఖ్య కారణం. అసలు మూత్రం ఎలా తయారవుతుందో తెలిస్తే దానికా రంగు ఎందుకు వస్తుందో అదే అర్ధం అవుతుంది. రక్తంలోని మలిన పదార్ధాలని వడబోసి విడతీయగా వచ్చేదే మూత్రం. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే ఎర్రటి రంగు పదార్ధం. ఈ ఎర్ర కణాలు కలకాలం బతకవు; వాటి కాలం తీరిపోగానే అవి చచ్చి పోతాయి. అప్పుడు ఈ హిమోగ్లోబిన్ బైలిరూబిన్ గానూ, తదుపరి యూరోక్రోం గానూ విచ్చిన్నం అయి మూత్రం ద్వారా బయటకి విడుదల అవుతాయి. ఈ రెండు పదార్ధాలు ఎర్రటి ఎరుపులో కాకుండా కొంచెం పసుపు డౌలు లో ఉంటాయి కనుక మూత్రానికి లేత పసుపు రంగు వస్తుంది. మనం ఎక్కువ నీళ్లు తాగినప్పుడు మూత్రం కూడ ఎక్కువగా తయారవుతుంది కనుక అప్పుడు ఈ రంగు లేత పసుపు రంగులో కాని, నీళ్ల రంగులో కాని ఉంటుంది. నీళ్లు బాగా తాగక పోయినా, బాగా చెమట పట్టినా మూత్రం ఎక్కువగా తయారు కాదు, కాని మలిన పదార్ధాలు తయారవుతూనే ఉంటాయి కనుక మూత్రం రంగు కొంచెం ముదురు పచ్చగా ఉంటుంది. ఈ పరిస్తితిలోనే మనవాళ్లు వేడి చేసిందంటారు. చలవ చెయ్యడానికి మజ్జిగ తాగమంటారు. మజ్జిగే అక్కర లేదు, మంచినీళ్లు తాగినా సరిపోతుంది; కాని అనుకోకుండా మంచి మజ్జిగ తాగే అవకాశం వస్తే ఎందుకు వదలుకోవాలి? (నా చిన్నతనంలో మంచి, చిక్కటి పాలు, మజ్జిగ తాగే అవకాశమే ఉండేది కాదు. అందుకనే ఇలా రాసేను.) మూత్రానికి పసుపు రంగు తప్ప మరే ఇతర రంగు ఉన్నా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది కాని ఎన్నడు సొంత వైద్యం చేసుకోకూడదు.

Thursday, February 3, 2011

ఏం? ఎందుకని? - 13

13. మనకి దురద ఎందుకు వేస్తుంది?

దోమ కుట్టితే దురద వేస్తుంది; నొప్పి పెట్టదు. దురదగుండాకు ఒంటికి తగిలితే దురద వేస్తుంది. కురుపు పక్కు కట్టి మానుతూన్నప్పుడు దురద వేస్తుంది. ఎందుకు?

తేనెటీగ కుట్టినప్పుడు శరీరం లోనికి వెళ్లిన విషం వల్ల నొప్పి పుడుతుంది. తేలు విషం శరీరం లోనికి వెళ్లినప్పుడు పుట్టే సలుపు వరసే వేరు. కాని దోమ కుట్టినప్పుడు తేనెటీగ విషం లాగా, తేలు విషం లాగా బాధ పెట్టదు; దురద వేస్తుంది. దోమకాటుకి దురద ఎందుకు వేస్తుందో ముందస్తుగా చెప్పనివ్వండి. నిజం చెప్పినందుకు నిష్టూరాలడవద్దని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.

దోమ కుట్టినప్పుడు అది నిజంగా మన రక్తం తాగుతున్నాదన్నమాట; తేనెటీగ లాగ తేలు లాగ మన శరీరం లోకి విషం ఎక్కించటం లేదు. తన పొట్ట నిండా మన రక్తం తాగేసిన తరువాత దోమ బరువెక్కి పోతుంది. పొట్టడు రక్తంతో దోమ మరి ఎగరలేదు. పోనీ ఆ తాగిన రక్తం బాగా ఒంట పట్టే వరకు మన శరీరం మీదే కాలక్షేపం చేద్దామా అంటే మనం మాత్రం తక్కువ వాళ్లమా? దాని చెంప చెళ్లు మనిపించెయ్యమూ? అందుకని తొందరగా పొట్ట నింపేసుకొని దోమ పలాయన మంత్రం పఠించాలాయె. ఎగరగలగటానికి ఎలాగో ఒక లాగ మన దోమ తన బరువుని తగ్గించుకోవాలె. మార్గాంతరం లేక దోమ మన మీద అల్పాచిమానం చేసేసి వెళ్లిపోతుంది. పోతూ పోతూ పొయ్యిలో ఉచ్చోసి పోవటం అంటే అక్షరాలా ఇదే! ఈ అల్పాచిమానం వల్లనే మనకి దురద వేస్తుంది. దోమ కాటులో విషం లేదని తెలిసి సంతోషించడమా? దోమ కరచిన కాటుకి కాకపోయినా అది పోతూ పోతూ చేసిన పనికి ఒళ్లు మండి ఏడవటమా? మగడు కొట్టేడని కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చినట్లు ఉంది ఈ ఉదంతం.

దురద అంటే నొప్పి కాదు. నొప్పి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. దురద చర్మం మీదే వేస్తుంది. చర్మం ఎండిపోయినా, తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నా దురద వేస్తుంది. ఈ రకం దురద బాధ నుండి తప్పించుకోవాలంటే శరీరాన్ని “చెమ్మ”గా ఉంచుకుంటే సరిపోతుంది. అందుకనే చలికాలంలో ఒంటికి వెన్నపూస రాసుకోవటం. మూత్ర పిండాలకి వ్యాధి వచ్చినా దురద వెయ్యవచ్చు.

దురద వేసినప్పుడు గోకాలనే బుద్ధి ఎందుకు పుడుతుందో తెలుసా? గోకినప్పుడు ఆ గోకుడు వల్ల నొప్పి పుడుతుంది. 'దురద వేస్తున్నాదీ, 'నొప్పి పుడుతున్నాదీ అనే వాకేతాలు (signals) రెండూ మెదడుకి ఒకే సారి చేరుకుంటాయి. అప్పుడు మెదడు 'నొప్పి పెడుతున్నాదీ' అనే వాకేతానికి ప్రాముఖ్యత ఇచ్చి, దురద వాకేతాన్ని విస్మరిస్తుంది.

నొప్పి మీద పరిశోధన చాల కష్టం. ఏందుకంటే మందు ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే దానిని మనుష్యుల మీద ప్రయోగించాలి. కాని మనుష్యుల మీద ప్రయోగాలంటే మనం అంతగా ఇష్టపడం.

Saturday, January 8, 2011

ఏం? ఎందుకని? - 8

8. చలి లో తిరిగినా వర్షం లో నానినా జలుబు చేస్తుందా?

వర్షం లో నానినంత మాత్రాన, చలి లో తిరిగినంత మాత్రాన జలుబు చెయ్యదు. పడిశం పట్టడానికి కారణం కంటికి కనిపించనంత చిన్న వైరసులు అనబడే సూక్ష్మజీవులు. ఈ వైరసులు బేక్టీరియా కంటె చిన్నవి. ఈ వైరసులలో జలుబు చేసే జాతివి శరీరం లో ప్రవేశించినప్పుడు జలుబు చేస్తుంది. ఫ్లూ కి ఒక రకమైన వైరసులే కారణం. ఈ రెండు రకాల వైరసులు ఒకరి నుండి మరొకరికి అంటుకోవడం బహు తేలిక. తుమ్ముల వల్లనో, కరచాలనం చేసినప్పుడో, లేక జలుబు చేసిన వారు ముట్టుకున్న వస్తువులని ముట్టుకున్నప్పుడో ఇది ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది.

మరి చలిలో తిరిగినా, వర్షంలో నానినా జలుబు చేస్తుందనే అపప్రథ ఎందుకు వచ్చింది? చలిలో తిరిగినా, వర్షంలో నానినా మన శరీరపు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ఉష్ణోగ్రత బాగా తగ్గితే ఆ పరిస్థితిని ఇంగ్లీషులో hypothermia అంటారు. అటువంటి సందర్భంలో శరీరంలో జరగవలసిన రసాయన క్రియలు లేదా చయాపచయ క్రియలు (metabolic activities) సక్రమంగా జరగవు. అటువంటి సందర్భంలో శరీరానికి ఉండవలసిన రోగనిరోధక శక్తి ఉండక పోవచ్చు. అటువంటి సందర్భంలో అప్పటికే శరీరంలో తిష్ట వేసుకున్న సూక్ష్మజీవులు అవకాశం వచ్చింది కదా అని అదును చూసుకుని ఒక దెబ్బ తియ్యవచ్చు.

జలుబు ఒకరి నుండి మరొకరికి సంక్రమించే అంటు వ్యాధి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటికి అడ్డుగా రుమాలు పెట్టుకోవటం, చేతులని తరచు కడుక్కోవటం వంటి కొన్ని ప్రాథమిక సూత్రాలని పాటిస్తే మనకున్న జలుబు మరొకరికి అంటుకోదు.

Sunday, January 2, 2011

ఏం? ఎందుకని? - 12

12. మన కంటికి ఆముదపు దీపం మంచిదా? విద్యుత్ దీపం మంచిదా?

మన పెద్దవాళ్లంటారు, "ఈ ఎలట్రీ దీపాలు వచ్చాకనే కళ్లజోళ్ళు ఎక్కువయాయి" అని. ఆముదపు దీపాల రోజులల్లో కళ్ల జోళ్ల వాడకం లేనేలేదని వాళ్ల వాదం. మరికొంతమంది "ఏమిట్రా, ఆ గుడ్డి దీపం దగ్గర చదువుతావు, కళ్లు పాడైపోగలవు జాగ్రత్త" అంటారు. ఈ నమ్మకాలలో నిజం ఎంత?

ఆముదపు దీపం అంటే వెలుగు తక్కువ ఇచ్చేదీపం అని అన్వయం చెప్పుకుంటే, వెలుగు తక్కువగా ఉన్న ఏ దీపం దగ్గర చదివినా కంటికేమీ నష్టం లేదు. ప్రమిదలో ఆముదం పోసినా, ఆవు నెయ్యి పోసినా, కిరసనాయిలు పోసినా ఆ దీపం నుండి వచ్చే పొగలో తేడా ఉండొచ్చు కానీ ఆ దీపపు వెలుగులో ఆరోగ్యానికి సంబంధించిన తేడాలు ఉండడానికి వీలు లేదు. కిరసనాయిలు దీపపు పొగకి కళ్లు మండుతాయి కనుక కిరసనాయిలు దీపం కంటె ఆముదపు దీపం మంచిది కావచ్చు.

వెలుతురు తక్కువగా ఉన్న చోట చదివితే కంటికి నష్టం కాదా? వెలుతురు తక్కువగా ఉన్న చోట ఫోటో తీస్తే కెమేరా పాడవుతుందా? పాడవదే. అలాగే వెలుతురు తక్కువగా ఉన్న చోట చదవడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కాని, కన్ను పాడవడానికి అవకాశం లేదు. చీకటికి అలవాటు పడిపోయిన తర్వాత మన కళ్లు చీకటిలో కూడ బాగానే చూడకలవు. అలాగే విద్యుత్ దీపాల వెలుగు కంటికి హాని చేస్తుందనుకోవడానికి నాకు తెలుసున్నంత వరకు దాఖలాలు ఏమీ లేవు.

మరి పూర్వపు రోజుల కంటె ఇప్పుడు కళ్లజోళ్ల వాడకం ఎందుకు పెరిగింది? పూర్వం కళ్ల పరీక్షలకి సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సదుపాయాలు పెరగడంతో చిన్న పిల్లలకి కూడా కళ్ల పరీక్షలు చేసి కళ్లజోళ్లు తొడిగెస్తున్నారు తప్ప కళ్ల జబ్బులు ఎక్కువ అయి ఏమీ కాదు.

ఏం? ఎందుకని? - 11

11. కంటి ముందు గాలి బుడగలు ఎందుకు కనబడతాయి?

ఎప్పుడేనా అలా గోడ కేసి కాని, ఆకాశం కేసి కాని కొంతసేపు చూడండి. కంటికి ఎదురుగా చిన్న చిన్న గాలి బుడగలు, గాలి బుడగలతో చేసిన గొలుసుల లాంటి ఆకారాలు గాలిలో తేలియాడుతూ, ఈదుతూ కనిపిస్తాయి. పట్టుకుందామంటే చేతికి అంకవు. ఆవి నిజానికి కంటి ఎదురుగా లేవు, కంటి లోపల ఉన్నాయి. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు కంటి ఎదుగుదలకి రక్తం సరఫరా అవాలి కదా! రక్తాన్ని అలా కంటికి సరఫరా చేసే ధమనిని హయాలిడ్ ధమని అంటారు. కన్ను పరిపూర్ణంగా పెరగడం అయిపోయిన తర్వాత ఈ ధమనితో మరి పని లేదు. కాని దానిని విసర్జించడానికి బయటకి పోయే మార్గం లేదు. కనుక అది నెమ్మదిగా కృశించి, శిధిలమయి, చివికిపోయి చాలమట్టుకి శరీరంలో ఇంకి పోతుంది. కాని దాని అవశేషాలు కొద్దిగా కంట్లో మిగిలిపోతాయి. ఈ అవశేషాలే మన కంటి ఎదుట ఈదులాడుతూ చిన్న చిన్న బుడగలుగా కనిపిస్తాయి.

ఏం? ఎందుకని? - 10

10. నీళ్లల్లో నానినప్పుడు వేళ్ల కొనలు ఎందుకు ముడతలు పడతాయి?

కాలి వేళ్ల మీద, చేతి వేళ్ల మీద దళసరి గాను, దిట్టం గాను ఉన్న చర్మం ఉంది. నీళ్లల్లో నానినప్పుడు నీళ్ళని పీల్చుకుని చర్మం ఉబ్బి వ్యాకోచం చెందుతుంది. ఇలా ఉబ్బిన చర్మం ఎక్కడికీ వెళ్ళలేదుగా! అందుకని ఉన్న చోటే ముడతలు పడి పడుతుంది.

ఏం? ఎందుకని? - 9

9. విభూతి స్నానం అంటే ఏమిటి? ఈ మాట ఎలా పుట్టుకొచ్చింది?

స్నానం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. ఎందుకనో? నీళ్లకీ విభూదికీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో?

ఈ ప్రశ్న కి సమాధానం అట్నించి నరుక్కొద్దాం. ఏ వస్తువైనా సంపూర్ణంగా కాలితే మిగిలేది భస్మం, లేదా బూడిద. కాలడానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి ఉండాలి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా ఉండాలి. అప్పుడు ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అని మనందరికీ తెలుసు. కాని నీళ్లు కూడ మరొక రకం బూడిదే అని మనలో ఎంతమందికి తెలుసు? ఉదజని వాయువు ని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్లూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్లు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్లకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టేరా? లేక, ఇది కేవలం కాకతాళీయమా?

Saturday, January 1, 2011

ఏం? ఎందుకని?-7

7. ఉప్పు ఎక్కువ తినడం మంచిదికాదంటారు. ఎందుకని?

ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ఉప్పు సోడియం, క్లోరీన్ అనే రెండు రసాయన మూలకాల సంయోగం వల్ల పుట్టింది కనుక రసాయనులు దీనిని సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. ఈ సోడియమూ, క్లోరీనూ - రెండూ విపరీతమైన విష పదార్ధాలు. ఈ రెండింటి కలయిక వల్ల పుట్టిన ఉప్పు ప్రాణానికి మూలాధారం. ఆశ్చర్యంగా లేదూ?

ఉప్పులో నిల్వ వేసిన తిండి పదార్ధాలు పాడవకుండా చాల కాలం నిల్వ ఉంటాయని మానవుడు ఎప్పుడో కనుక్కున్నాడు. ఆ రోజులలోనే ఉప్పు వేసిన పదార్ధాలు ఎక్కువ రుచిగా ఉంటాయని కూడ గ్రహించేడు. మనం తినే పదార్ధాల రుచి ఉప్పుదే అంటే అది అతిశయోక్తి కాదు. "చవి" అన్న మాటకి ఉప్పు అనీ, రుచి అనీ రెండు అర్ధాలు ఉన్నాయని మరచిపోకూడదు. ఉప్పు రుచి మరిగిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం కష్టం. ఒక విధంగా కాఫీ అలవాటూ, తాగుడు అలవాటు ఎలాంటివో ఈ ఉప్పు అలవాటు కూడ అలాంటిదే, అక్కడే వస్తుంది మడత పేచీ.

నిజానికి ఉప్పు తినకపోతే బతకలేము. అలాగని గుప్పిళ్ళతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అంటే చెంచాలో పదవ వంతు. ఆ ప్రాప్తికి మనం తినే కాయగూరలలోను, తాగే నీళ్ళల్లోను సహజసిద్ధంగా ఉప్పు లభ్యం అవుతుంది. (నిజానికి జంతుకోటికి కావలసిన ఉప్పు ఇలాగనే సరఫరా అవుతుంది.) అసలు తాగే నీళ్ళల్లో ఉప్పు బొత్తిగా లేకపోతే నీళ్ళకి రుచే ఉండదు. నా మాట మీద నమ్మకం లేకపోతే బట్టీ పట్టిన నీళ్ళని తాగి చూడండి. అయినప్పటికీ మనం వంటలలో ఉప్పు ఎంతగానో వేసుకుంటాం - మన శరీరానికి కావలసి కాదు, జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక. మనకి ఉప్పు అంటే అంత ఇష్టం.

ఇష్టమైనది, శరీరానికి కావలసినది అయిన ఉప్పుని తింటే వచ్చే మడత పేచీ ఏమిటంటారా? చిన్నప్పుడు ఉప్పు తినడం అలవాటు అయిపోతే పెద్దయిన తర్వాత ఆ అలవాటు తప్పించుకోవడం చాల కష్టం. పెద్దయిన తర్వాత మాత్రం ఎందుకు తప్పించుకోవాలంటారా? మనం పెద్ద అవుతూన్న కొద్దీ గుండెకీ, మూత్ర పిండాలకీ రోగాలు వచ్చే సావకాశం ఎక్కువ. అలాగే రక్తపు పోటు పెరిగే సావకాశాలూ ఎక్కువే. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఈ రోగాలు వస్తాయనడానికి ఏమీ దాఖలాలు లేవు. కాని ఈ జబ్బులు వచ్చేయంటే దానికి పథ్యం ఉప్పు తినడం మానేయడమే. కాని చిన్నప్పటి నుండీ అలవాటు పడిపోయిన ఉప్పుని మానడం చాల కష్టం. కాఫీ అలవాటు తప్పించుకో వచ్చు, సిగరెట్ల అలవాటు ఒదిలించుకో వచ్చు; కాని ఉప్పు అలవాటు అయిపోతే మానడం కష్టం.

వేడి దేశాలలో ఎండలో పని చేసే కూలీలని ఉప్పు బిళ్ళలు తినమని సలహా ఇస్తారు. దాని మాటేమిటి? ఎండలో పనిచేసేటప్పుడు చెమట బాగా పడుతుంది కదా! ఆ ఘర్మజలం తో పాటు ఉప్పు కూడ శరీరం నుండి బయటకు పోతుంది. ఇలా నష్టపోయిన ఉప్పుని భర్తీ చెయ్యమని శరీరం మొర్రో మని పోరు పెడుతుంది. అప్పుడు తాత్కాలికంగా ఉప్పు తినాలి. అప్పుడు ఒక ఉప్పు బిళ్ళని మందు వేసుకున్నట్టు వేసుకోవాలి కాని, ఆ ప్రాప్తికి ఉప్పుని వంటకాలలో కలుపుకుని తింటే ఉప్పు రుచికి శరీరం అలవాటు పడిపోతుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లూ నిజానికి ఉప్పు ఎంత తిన్నా పరవా లేదు. మన శరీరానికి అవసరం లేని ఉప్పుని మన మూత్రపిండాలు సునాయాసంగా తోడెయ్య గలవు. కాని మరే కారణం వల్లనైనా మన మూత్రపిండాలు ఈ పని చెయ్యలేని పరిస్థితి సంభవిస్తే అప్పుడు వస్తుంది మడత పేచీ. గుండె జబ్బు ఉన్నవాళ్లూ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లూ ఉప్పు ఎక్కువ తింటే వారి పరిస్థితి ఉపశమించడానికి బదులు ఉద్రేక పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!

ఏం? ఎందుకని?-6

6. ఉల్లిపాయలు తరుగుతూ ఉంటే కళ్ల వెంబడి నీళ్లు కారతాయి. ఎందుకని?

ఈ ప్రశ్నకి కొంచెం డొంక తిరుగుడుగా సమాధానం చెబుతాను. కళ్ల్ల వెంబడి నీళ్లు తిరగడమే ఏడుపు కి నిర్వచనం అనుకుంటే మనం మేలుకుని ఉన్నంతసేపూ ఏడుస్తూనే ఉంటాం. నిజానికి కళ్లు మిటకరించినప్పుడల్లా మనం ఏడిచినట్లే లెక్క. ఎందుకంటే మనం మిటకరించినప్పుడల్లా కళ్ల వెంబడి నీళ్లు కారతాయి (దేవతలు కంటి రెప్పలని కదలించరు కనుక వాళ్లు ఎప్పుడూ ఏడవరనే కదా!).

కంటి మొనల దగ్గర ఆశ్రు (లేదా బాష్ప) గ్రంధులు ఉన్నాయి. కంటి రెప్ప వాల్చినప్పుడల్లా కండరాల కదలికకి ఈ గ్రంధులు పితకబడి, ఒక కన్నీటి బొట్టు కంట్లోకి జారుతుంది. ఇదే కంటిని చెమ్మగా ఉంచుతుంది. ఈ చెమ్మదనం లేకపోతే కంట్లో ఇసక వేసినట్లు ఉండి బాధ కలుగుతుంది.

కంట్లో నలక పడ్డప్పుడు రెప్పలు టపటప కొట్టుకుంటాయి. అప్పుడు కంట్లోకి నీరు బాగా స్రవించి ఆ నలకని బయటకు తోలెస్తాయి. కంట్లోకి పొగ వెళ్లినప్పుడు కళ్లు అశ్రువులతో నిండడానికి కూడ కారణం ఇదే.

ఉల్లిపాయ విషయమూ దరిదాపుగా ఇదే. ఉల్లిపాయలో గంధకానికి సంబంధించిన తైలాలు ఉన్నాయి. ఉల్లిపాయని తరిగినప్పుడు ఈ తైలాలకి సంబంధించిన వాయువు కంటిలోని నీటిలో కరిగి గంధకికామ్లంగా మారి కంటిని కలత పెడుతుంది. ఆ కలతని పారదోలడానికి కంటి రెప్పలు టపటప కొట్టుకుంటాయి. దానికి పర్యవసానంగా కళ్లు నీటితో నిండుతాయి.

ఉల్లిపాయని తరుగుతూన్న చేతితో కంటిని నలిపితే పరిస్థితి మరింత ఉద్రేకపూరితం అవుతుంది.

టూకీగా కథ ఇది. ఇదే విషయాన్ని రసాయన శాస్త్రవేత్తని అడిగితే మనకి అర్ధం కాని రసాయనాల పేర్లు, ఫార్ములాలు చెప్పి గాభరా పుట్టించవచ్చు.