Sunday, October 24, 2010

ఏం? ఎందుకని? - 5

5. కేరట్లు తింటే కంటికి మంచిదంటారు. ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

కేరటు దుంపలు నారింజ రంగులో పొడుగ్గా ఏకుల్లా ఉంటాయి. ఇవి తింటే కంటికి మంచిది అంటారు. ఇది మంచో కాదో తర్వాత చూద్దాం. ముందు ఈ పుకారు ఎలా పుట్టిందో పరిశీలిద్దాం. కేరట్లలో ఉండే బీటా కేరొటేన్ అనే రసాయనమే విటమిన్ ఎ తయారీకి ముడి పదార్ధం. ఈ విటమిన్ లోపిస్తే రేచీకటి అనే కంటి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ లేకపోతే కండ్లలో చెమ్మదనం పోయి, ఎండి పోతాయి. టూకీగా చెప్పాలంటే పోషక పదార్ధాలలో విటమిన్ ఎ చాల ముఖ్యం. అందులో ఢోకా లేదు. రోజుల తరబడి పొట్ట వీపుకి అంటుకుపోయే అంత గర్భ దరిద్రం అనుభవించే వారిని మినహాయిస్తే సామాన్యులు తినే ఆహారంలో ఈ విటమిన్ దండిగానే ఉంటుంది. కనుక సర్వ సాధారణంగా విటమిన్ ఎ కొరత రాకూడదు. చెప్పొచ్చేదేమిటంటే కంటికి మంచిదని కేరట్లని ప్రత్యేకం మనం తినక పోయినా పరవా లేదు. బీటా కేరొటీన్ ఇంకా అనేక ఆహార పదార్ధాలలో లభిస్తుంది. ఆమాటకొస్తే విటమిన్ మాత్రలు మింగే కంటె విటమిన్‌లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తినటం మంచిది; ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమినులతోపాటు ఇంకా అనేక పోషక పదార్ధాలు ఉంటాయి (ఉ. ఖనిజ లవణములు).

కంటికి మంచిది కదా అని కేరట్లు ఎక్కువగా తిన్నంత మాత్రాన హ్రస్వదృష్టి (near-sightedness or myopia), దీర్ఘదృష్టి లేక చత్వారం (far-sightedness or hypermetropia) వంటి దృష్టి దోషాలు రాకనూ పోవు, ఉన్నవి పోనూ పోవు.

తెలిసో తెలియకో కేరట్లు మరీ ఎక్కువ తింటే శరీరం పచ్చబడుతుంది. ఇది ఆరోగ్యానికి హాని చెయ్యదు కాని, పెళ్లిచూపుల సమయంలో ఏదైనా ఉపకారం చెయ్యొచ్చేమో. నాకు తెలియదండోయ్! కేరట్లు తినటం, శరీరం పచ్చబడటం కేవలం కాకతాళీయం కావచ్చు. కామెర్ల రోగికి కూడ శరీరం పచ్చబడుతుంది. కనుక ఆరోగ్యం విషయంలో సొంత వైద్యం ఎప్పుడూ కూడదు. వెంకటేశ్వరస్వామికి, వైద్యుడికి ముడుపు చెల్లించవలసినప్పుడల్లా బకాయి పెట్టకుండా చెల్లించుకోవటమే మంచిది.

Friday, October 15, 2010

ఏం? ఎందుకని? - 4

4. భోజనం చెయ్యగానే ఈత కొట్టకూడదంటారు? ఎందుకని?

వేమూరి వేంకటేశ్వరరావు

ఎందుకు కొట్టకూడదు? కొట్టాలని ఉంటే కొట్టొచ్చు! కాని ఈ సూత్రం అర్ధ శతాబ్దం కిందట అమెరికన్ రెడ్‌క్రాస్ వారు ప్రచురించిన పుస్తకంలో, “భోజనం చేసిన వెంటనే ఈత కొడితే కండరాలు కొంకర్లు పోతాయి. ప్రాణం కూడ పోవచ్చు” అని ఉంది. చెప్పింది అమెరికా వాడు. పైపెచ్చు రెడ్‌క్రాస్ వాళ్లు. అందుకని అందరూ నమ్మేసేరు. కాని 1961 లో ఆర్థర్ స్టయిన్‌హవుస్ అనే మరొక అమెరికా ఆసామి ఈ నమ్మకం తర్కబద్ధం కాదనీ, దమ్ములు ఉంటే రుజువు చెయ్యమనీ సవాలు చేసేడు. విజ్ఞానపరంగా ఎవ్వరూ రుజువు చెయ్యలేక పోయారు. అందుకని ఈ మధ్య అమెరికన్ రెడ్‌క్రాస్ వాళ్ళు పై రెండు వాక్యాలనీ వారి పుస్తకం నుండి తొలగించేరు. కనుక భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా? కూడదా?

నూ యార్క్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ కి చెందిన డా. రోషిణి రాజపక్ష అభిప్రాయం ప్రకారం, సామాన్యులు సరదాకి ఈత కొట్టదలుచుకున్నప్పుడు భోజనం చేసిన తరువాత ఈతకొట్టినా పరవాలేదు. కాని ఆ భోజనంతో పాటు రెండు చుక్కలు వేసుకుంటే మాత్రం ఈ సూత్రం వర్తించదు. కేలిఫోర్నియాలో నీళ్లల్లో మునిగిపోయి చచ్చిపోయినవాళ్ల గణాంకాలు పరిశీలించి చూడగా, 41 శాతం మనుష్యుల రక్తంలో ఆల్కహాలు కనిపించిందిట. కనుక “భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా?” అన్న ప్రశ్నకి మీరే సమాధానం చెప్పండి.

Wednesday, October 13, 2010

ఏం? ఎందుకని? - 3

3. కారం తినడం కడుపుకి మంచిది కాదా?

వేమూరి వేంకటేశ్వరరావు

కారం తింటే పొట్టలో పుండు పుడుతుందనే గాథ ఒకటి ఆధ్రేతర రాష్ట్రాలలోనూ – ముఖ్యంగా తమిళనాడులో – ఇతర దేశాలలోనూ చలామణీలో ఉంది. ఇది ఎంత వరకు వచ్చిందంటే తమిళ సోదరులు చెప్పిన మాటలని విని కాబోలు తెలుగు డాక్టర్లు కూడా సై అంటే సై అంటున్నారు. ఇవన్నీ పునాదులు లేని పేకమేడలని డాక్టర్ గ్రేం అంటున్నారు. ఈయన టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఉన్న బేలర్ కాలేజ్ అఫ్ మెడిసిన్ లో ఒక పేరు మోసిన ఘనాపాటీ. టెక్సస్ మెక్సికో దేశపు సరిహద్దులో ఉంది కాబట్టి కాబోలు మెక్సికో దేశపు కారం తినే అలవాటు టెక్సస్‌లోనూ కనిపిస్తుంది. అందుకని ఈయనకి కారం అంటే ఇష్టమో ఏమో నాకు తెలియదు కాని ఈయన కూడ ఈ పుకారులూ వదంతులూ విన్నాడు. విసిగెత్తే వరకూ విన్నాడు. తాడో, పేడో తేల్చేద్దామని ఒక ప్రయోగం చేసేడు.

ఆరోగ్యంగా ఉన్న మనుష్యులని కొంతమందిని కూడ గట్టి వాళ్ళని మూడు జట్లు గా విడగొట్టేడు. అందులో ఒక జట్టుకి కారం ఏమీ లేని చప్పిడి తిండి పెట్టేడు. రెండవ జట్టుకి అదే చప్పిడి తిండిలో అరడజను ఏస్పిరిన్ మాత్రలు కలిపి పెట్టేడు. మూడవ జట్టుకి బాగా కారం కలిపిన తిండి పెట్టేడు. మరునాడు ఒక బుల్లి విడియో కేమెరాని ఒక గొట్టానికి తగిలించి ఆ గొట్టాన్ని ఈ మూడు జట్ల వాళ్ళ పొట్టలలోకి దింపి క్షుణ్ణంగా పొట్ట గోడలని పరిశీలించేడు. ఏస్పిరిన్ తిన్న రెండవ జట్టు వాళ్ళ పొట్ట గోడలలో చిన్న చిన్న చిల్లుల గుండా రక్తం స్రవించడం చూసేడు తప్ప కారం తిన్న వాళ్ళ పొట్టలు, చప్పిడి తిండి తిన్న వాళ్ళ పొట్టలు ఒక్క లాగే, ఏ దోషం లేకుండా ఉన్నాయిట.

ఇలాంటి ప్రయోగమే భారత దేశంలో కూడ ఎవరో రెండు జట్ల మీద చేసేరుట. ఒకరి తిండిలో మిరప పొడి బాగా జల్లేరుట. మరొక జట్టు తిండిలో మిరప పొడి పొడ కూడా లేదుట. ఈ రెండు జట్ల మధ్య ఏమీ తేడా కనిపించ లేదుట.

ఈ రెండు ప్రయోగాల వల్ల తేలిందేమిటంటే మిరపకాయల వల్ల పొట్టలో పుండు పుట్టదని. నేను కూర్చున్న కుర్చీ లోంచి కదలకుండా స్పురణ ప్రయోగం (థాట్ ఎక్స్పరిమెంట్) ఒకటి చేసేను. దాని సారాంశం ఇది. సర్వ సాధారణంగా వేడి దేశాలలో ఉన్న ప్రజలు కారం ఎక్కువ తినడం నేను గమనించేను. వేడి దేశాలలో ఉన్న వాళ్ళకి చర్మం నల్లగా ఉండడం వల్ల ఉపయోగం ఉన్నట్లే, కారం తినాలనే కోరిక ఉండం వల్ల కూడా మనుగడకి పనికొచ్చే లాభం ఏదైనా ఉందేమో? డార్విన్ ని అడిగి చూడాలి.

Monday, October 11, 2010

ఏం? ఎందుకని? - 2


2. నోరు కారంతో చుర్రుమన్నప్పుడు నీళ్ళు తాగడం వల్ల నోరు చల్లారదు. ఎందుకని?


వేమూరి వేంకటేశ్వరరావు

మనం తినే ఆహారంలోని కారం ఒక రకమైన జిడ్డు పదార్ధం. అంటే నూనెతో కలసిన పదార్ధం. నూనె, నీళ్ళు కలవవు. కనుక కారం నోటితో నీళ్ళు తాగితే గోడమీద పోసిన నీళ్ళలా గొంతుకలోకి పోతాయి తప్ప నాలికమీద ఉన్న కారాన్ని కడిగెయ్యవు. నోరు కారం అయినప్పుడు చిన్న బన్‌రొట్టి ముక్క తింటే ఆ రొట్టి కారంలో ఉన్న జిడ్డు పదార్ధాన్ని పీల్చుకుంటుంది. రొట్టి లేకపోతే గుక్కెడు పాలు తాగినా పని చేస్తుంది. పాలలో కేసిన్ అనే ప్రాణ్యం (protein) ఉంది. అది జిడ్డు పదార్ధం మీద కుంకుడు నురుగులా పని చేస్తుంది. కారం ధాటిని తగ్గించడానికి తెలుగు దేశంలో మరొక చిటకా ఉంది. కారంగా ఉన్న నోటిలో చిన్న ఉప్పు బెడ్డ వేసుకుంటే కారానికి ఉప్పు విరుగుడులా పని చేస్తుందని అంటారు. ఈ నమ్మకం వెనక విజ్ఞానపరమైన వివరణ ఏదైనా ఉందేమో నాకు తెలియదు

Friday, October 8, 2010

ఏం? ఎందుకని? - 1

1. వర్షం పడ్డప్పుడు వానపాములు చపటాలమీదకి ఎందుకు ఎగబాకుతాయి?

మీరు ఎప్పుడైనా గమనించేరో లేదో, వర్షం పడ్డ తర్వాత నేల లోని వానపాములు బయటకొచ్చి, పొడిగా ఉన్న గచ్చు మీదకి, చపటాల మీదకి, రోడ్ల మీదకి ఎగబాకుతాయి. నిజానికి అప్పుడే మనకి వానపాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకో తెలుసా? వానపాములు మనలాగే గాలి పీల్చి బతుకుతాయి. వాన పడ్డప్పుడు వాటి శ్వాస రంధ్రాలు నీళ్ళతో నిండిపోతాయి కనుక వాటికి ఊపిరి సలపదు. అందుకని అవి పొడిగా ఉన్న స్థలాలలకి ఎగబాకుతాయి. అని సిద్ధాంతం. నిజం వానపాములకే తెలియాలి.