Sunday, December 21, 2008

అత్త గా(వా)రి సొమ్ము దానం చెయ్యటం ఎలా?

డిసెంబరు 2008

“అత్త గారి సొమ్ము అల్లుడు ధార పోసేడు” అనే సామెత మనందరికి తెలుసు. ఒకరి సొమ్ముని మరొకరు దానం చేసినప్పుడు ఈ సామెతని వాడతారు.

అమెరికాలో అమెరికన్ ప్రభుత్వాన్ని “అంకుల్ శేం” అనటం వినే ఉంటారు. అంటే ప్రభుత్వం వారి సొమ్ము మావ గారి సొమ్మన్న మాట. మావ గారైతే నేమిటి, అత్త గారైతే నేమిటి, రెండూ ఒకటే కనుక పై సామెతని కొద్దిగా మార్చి, ”అత్త వారి సొమ్ముని అల్లుడు ధారపోసేడు” అని మార్చుకుందాం. ఏం?

ఇప్పుడు అమెరికాలో అత్త వారి సొమ్ముని ఎలా ధార పొయ్యటమో చెబుతాను. అమెరికాలో అత్తవారంటే ప్రభుత్వం వారు అని అన్వయించుకోవచ్చని చెప్పేను కదా. అంటే ప్రభుత్వం వారి సొమ్ముని మనం ఎలా ధార పొయ్యటమో చెబుతాను.

ప్రభుత్వం వారికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? మనం అంతా పన్నులు కడితే వస్తుంది. ఆది నా డబ్బు, మీ డబ్బు, అమెరికాలో ఉన్న మనందరి డబ్బు. అందులో నా డబ్బు కంటె మీ డబ్బే ఎక్కువ వుంది. ఈ డబ్బుని ఖర్చు పెట్టే భారం అంతా ప్రభుత్వం మీద వదిలేస్తే వాళ్ళు పనికిమాలిన యుద్ధాలు చేసి పాడు చేస్తారు. లేదా, దివాలా ఎత్తేస్తూన్న కారు కంపెనీలని, బేంకుల్ని ప్రాపు చెయ్యటానికి మన డబ్బుని మన పెత్తనం లేకుండా ఖర్చు పెట్టెస్తారు. కనుక వాళ్ళు తగలేసే లోపున మనం సద్వినియోగం చెయ్యటం ఎలాగో చెబుతానన్న మాట!

మనం ఒక స్వచ్ఛంద సంస్థ కి దానం చేసినప్పుడు మనం ఇచ్చే డబ్బు నూటికి నూరు శాతం మన జేబు లోంచి రాదు; పైవాళ్ళ డబ్బు కూడ, వాళ్ళ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అందులో కొంత పడుతుంది. (ఇది అమెరికాలోనే కాదు, అనేక ఇతర దేశాలలో కూడ నిజం. కాని నేను ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితిని ఆధారం చేసుకుని చెబుతున్నాను. ఇటుపై కథనాన్ని స్థూలంగా చూడండి తప్ప, ఎకౌంటెంటులా చూడకండి.)

ఎలాగంటారా? అమెరికాలో ఉన్న ఆదాయపు పన్నుల చట్టం లో ఉన్న ఒక మెలిక వల్ల నేను చెక్కు పుస్తకం తీసి ఒక సంస్థకి దానం చేసేనంటే, నా డబ్బుతో పాటు మీ డబ్బు కూడ దానం చేస్తున్నానన్న మాట. ఇది ఎలాగంటే, ఉదాహరణకి నేను 30% ఆదాయపు పన్ను కట్టే ఆర్ధిక అంతస్థు (టేక్స్ బ్రేకెట్) లో ఉన్నానని అనుకుందాం. అప్పుడు, నేను 100 డాలర్లు దానం చేసినప్పుడల్లా అమెరికా ప్రభుత్వం వారు నాకు 30 డాలర్లు ముదరా ఇస్తారు. అంటే నేను రాసే చెక్కు 100 డాలర్లకే అయినా, నాకు నిజంగా అయే ఖర్చు 70 డాలర్లే. ఆ మిగిలిన 30 నా తరఫున మీరంతా కడుతున్నారన్న మాట. కాని దానం చేసిన పేరు, కీర్తి, పుణ్యం నాకు వస్తున్నాయి. చిత్రగుప్తుడు మీ పద్దులో మీకేమీ రాయటం లేదు.

పైన చెప్పినది ఆదాయపు పన్నుల విషయం. ఇక మనం చిత్రగుప్తుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వం వారు “ఎస్టేట్ టేక్సు” విధిస్తారు. ఈ పన్ను వల్ల మనం వదలిపెట్టిన ఆస్తిలో దరిదాపు సగం (అంటే 50 శాతం) పైబడే ప్రభుత్వం కాజేస్తుంది. "ఏనుగు బతికున్నా చచ్చినా లక్ష రూపాయలే" అన్నట్లు ఈ అమెరికాలో బతికున్నన్నాళ్ళూ "ఆదాయపు పన్ను" అనీ, చచ్చిన తరువాత "చావు పన్ను" అనీ చంపుకు తింటున్నారు కదా. ఈ రాబడి పన్నునీ, చావు పన్నునీ లెక్కలోకి తీసుకుంటే తేలేది ఏమిటన్న మాట? మనం ఇప్పుడు ఒక డాలరు దానం చేసేమంటే నిజానికి మన ఆస్తి లోంచి ఇచ్చేది 35 పైసలే! మిగిలిన 65 పైసలు నోరు వాయి లేని పన్నులు కట్టే ప్రజలు భరిస్తున్నారన్న మాట. కనుక ఇవ్వటం వల్ల మనకా ఆత్మ సంతృప్తి, పుణ్యానికా పుణ్యం. పైపెచ్చు స్నేహితుల దగ్గర పెద్ద మొనగాడిలా కాలరెత్తి పోజులు కొట్టొచ్చు.

మరి పిల్లల మాట? తల్లిదండ్రులుగా మనకి కొన్ని కనీస బాధ్యతలు ఉన్నాయి. మన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని, మంచి చదువులు చదువుకుని, పెద్ద పదవులు అధిష్టించాలని మనందరికీ ఉండటం సహజం. మనం ఎంత గణించి పిల్లలకి ఇచ్చినా అది చంద్రుడుకో నూలుపోగు అవుతుందే కాని వారి విద్యాబుద్ధులతో వారు గణించే దానితో దీటు రాదు. కనుక వాళ్ళని చదివించటం, మంచి ప్రవర్తనని అలవాటు చెయ్యటం, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతకగలగటం నేర్పటం మన కనీస ధర్మం. అంతకు మించి అధికంగా పిల్లలకి డబ్బివ్వటం వల్ల వాళ్ళు పాడవటానికి దోహదం చేసినవాళ్ళమే అవుతాము. చిన్నతనంలోనే అవధులు లేకుండా ఐశ్వర్యాన్ని చవి చూసిన పిల్లలు పాడవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుభవం చెప్పటమే కాకుండా శాస్త్రీయ పరిశోధనల ద్వారా తెలిసిన విషయమే.

కోట్లకి పడగలెత్తిన ధనిక వర్గాలలో చాలమంది నేను పైన చెప్పిన సూత్రం ఆకళింపు చేసుకున్నవారే! ప్రపంచంలో రెండో స్థానంలోనో, మూడో స్థానంలోనో ఉన్న ధనికుడు వారెన్ బఫెట్ తన ఆస్తి లో సింహ భాగం వారసులకి ఇవ్వకుండా దానం చేసేసేడు - ఈ మధ్యనే! ప్రపంచంలో అందరి కంటె ధనికుడైన బిల్ గేట్స్ ఈ మార్గాన్ని అప్పుడే అవలంబించి బిలియన్ల తరబడి దానాలు చేస్తున్నాడు.

“వీళ్ళందరి దగ్గరా కుళ్ళబెట్టినా కుళ్ళనంత డబ్బుంది. దానిని ఏమి చేసుకోవటమో తెలియక వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, నా దగ్గర కూడా అంత డబ్బు ఉంటే నేను చేస్తాను” అనే వాళ్ళు ఉన్నారు. నెల జీతం మీద ఇంటిడు పిల్లని పోషిస్తూ కూడ మా అమ్మ ఎప్పుడూ ఒక వారాల పిల్లాడికి భోజనం పెట్టేది, “మనతో పాటు చారూ అన్నం ఆ కుర్రాడూ తింటాడు” అనేది. కనుక ఇచ్చే గుణం ఉన్న వాళ్ళకి ఉండక్కర లేదు; ఉన్న దాంట్లోనే ఇస్తారు.

“ఎందుకు ఇవ్వాలి? నా కాళ్ళ మీద నిలబడి నేను పైకి వచ్చేనే! అలాగే అందరూ ఎందుకు చెయ్యకూడదు?” అని అనే వారు ఉన్నారు. దీనికీ ఒక సమాధానం ఉంది. మా ఊళ్ళో, మమ్మల్ని చూసినవాళ్ళు ఇప్పటికీ అంటారు, “మీరంతా కష్టపడి ప్రయోజకులు అయేరు. నిజమే, కాని మీ అమ్మా, నాన్నా చేసిన దాన ధర్మాలే మిమ్మల్ని ఇలా పైకి లేవనెత్తేయి.” ఇటువంటి ఆర్ద్రత తో కూడిన మాటల వెనక శాస్త్రీయమైన రుజువులు ఉన్నాయో లేదో తెలియదు కాని, దానం చేసినప్పుడు “పోనీలే మన పిల్లలకి మంచి జరుగుతుంది” అనుకుంటే మనస్సుకి సంతృప్తి. ఇటువంటి వాటి మీద మీకు నమ్మకం లేక పోతే, ఏదో సాటి వాడికి సహాయం చేసేమనే తృప్తి వర్ణనాతీతం. ఈ తృప్తి అనేది కేవలం మానసికం కాదు. సంతృప్తి గా ఉన్న మెదడు నుండి స్రవించే “హార్మోనులు” ఆరోగ్యానికి, ఆయుర్‌వృద్ధికి తోడ్పడుతాయని వైద్యులు ఒప్పుకుంటున్నారు.

ఏ మత గ్రంధం తీసి చూసినా అవి ఇవ్వమనే ప్రోత్సహిస్తున్నాయి. భౌతికమైన సుఖాలు కోరుకోవటం లో తప్పు లేదు. డబ్బు గణించటంలోనూ, పోగు చెయ్యటంలోను కూడ తప్పు లేదు. డబ్బు గణించమనే చెపుతున్నాది ధర్మ శాస్త్రం. రిటైర్ అయిపోయిన నా అమెరికన్ స్నేహితుడు, జాన్ రోసటీ, ఇంకా చిన్నా పెద్దా ఉద్యోగాలు చేసి డబ్బు గణిస్తూ ఉంటే అడిగేను, “ఇంత డబ్బు గణించేవు, ఇంకా ఏమి చేసుకుంటావు?” అని. ఒక్క క్షణం కూడ తడుముకోకుండా సమాధానం చెప్పేడు, “నాకు నచ్చిన ఛారిటీకి దానం చేసెస్తాను” అని.

పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు కదా, ఏ ఛారిటీకి దానం చెయ్యాలి అన్నది మరొక ప్రశ్న. అమెరికాలో ప్రజలు ఇచ్చే దానాలు 90 శాతం మత సంబంధమైన సంస్థలకి వెళుతున్నాయని విన్నాను. ఈ సంస్థలు అందులోంచి కొంత తీసి పీడిత ప్రజల అవసరాలకి (వరదలు, భూకంపాలు, సునామీలు, వగైరా) మళ్ళిస్తారు. విశ్వవిద్యాలయాలకి ఇవ్వటం కూడ బాగా ప్రాచుర్యంలో ఉంది. తరువాత వరుసగా మ్యూజియంలు, లలిత కళలు వస్తాయి. అమెరికాలో ఉన్న భారతీయులు ఎవరికి ఇస్తున్నారు? నేను విన్నది దరిదాపుగా 99 శాతం పైబడి దేవాలయాలకి ఇస్తున్నారుట. కాని ఈ దేవాలయాలు ఇలా వస్తూన్న డబ్బులో కొంత భాగాన్నైనా బీద ప్రజల అవసరాలకి ఖర్చు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. మరి తెలుగు వారి సంగతో? నా దగ్గర శాస్త్రీయమైన గణాంకాలు లేవు. కాని తానా, ఆటా వంటి సభలలో జరిగే ఖర్చు చూస్తే మన ఆసక్తి ఎక్కడ ఉందో అర్ధం అవుతుంది.

ఎంత ఇవ్వాలి? ఉన్న దాంట్లో మన జీవన బాణీ ని భంగపరచ వలసిన అవసరం లేకుండా ఎంతో కొంత. మోర్మన్ చర్చి వారు జీతంలో పదో వంతు “డోనేషన్” లా కాకుండా, “డూస్” లా పుచ్చేసుకుంటారు. మనం వానప్రస్తం లోకి వచ్చే తరుణంలో, ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది కనుక అప్పుడు ఇచ్చే దానిని కొంచెం పెంచవచ్చు.

ఎప్పుడు ఇవ్వాలి? గణించిన డబ్బు మన అవసరాలకి సరిపడ్డ తర్వాత కదా దాన ధర్మాలు? తన్ను మాలిన ధర్మం లేదన్నారు. ఇది అక్షరాలా నిజం. నేల విడచి సాము చెయ్య కూడదు. అలాగని మనకి ఎప్పుడో అవసరం వస్తుందని ఎన్ని మిలియన్లు దాచినా సరిపోయినట్లు ఉండదు. దీనికి ఒక మార్గాంతరం ఉంది. ఎప్పుడో మనం దివంగతులమైన తర్వాత మన వారసులు మన పేరున దానం చేసేరే అనుకుందాం. దాని వల్ల మనకి సంతోషం రాదుగా? అందుకని మన హయాం లో మన కంఠంలో ప్రాణం ఉన్న తరుణం లోనే, మన అభీష్టాలకి అనుకూలమైన దాన ధర్మాలు చెయ్యటం లో కొంత సొగసుంది.

ఈ "ఎప్పుడు ఇవ్వాలి?" అన్న ప్రశ్నకి మన పురాణాలలో ఒక చమత్కారమైన కథ ఉంది. వామనుడు అడిగిన మూడడుగుల మేర దానం చెయ్యటానికి బలి చక్రవర్తి సిద్ధపడుతూ ఉంటే శుక్రాచార్యులవారు “అలోచించి రేపు ఇవ్వచ్చులే?” అని శుక్రనీతి బోధించబోతే బలి చక్రవర్తి అంటాడు, “రేపటికి ఈ బుద్ధి ఉంటుందో ఉండదో, ఇప్పుడే ఇచ్చెస్తాను” అని. ఈ ధోరణి నచ్చక, ధారపోసే కమండలపు కొమ్ములో పురుగు రూపంలో శుక్రాచార్యుల వారు అడ్డుకుంటారు. ఏదో అడ్డు పడిందంటూ వామనమూర్తి ఒక పుల్లని బెజ్జంలో పెట్టి తోస్తాడు. అది శుక్రాచార్యులవారి కంటికి తగలగా ఆ కన్ను పోతుంది. ఈ కథని మనం రకరకాలుగా అన్వయించుకోవచ్చు.

ఈ కథని ఎందుకు చెప్పేనంటే మనకే కాదు ప్రభుత్వాలకి కూడ ఇవ్వాలనే ఉంటుంది. ఏదో విపత్తు జరిగిన సందర్భంలో ఉన్న ఉద్రేకంలో నూస్ కాన్‌ఫరెన్సు పెట్టేసి “బిలియను డాలర్లు ఇచ్చేస్తున్నాం, చూస్కోండోయ్” అని బెదిరించెస్తారు. ఉద్రేకం తగ్గిన తరువాత వీళ్ళు నిజంగా ఇచ్చేరా లేదా అని మనం వాకబు చేస్తే సాధారణంగా వాగ్దానం చేసిన దాంట్లో ఏ పదో వంతో ఇస్తారు. మనలాంటి మానవ మాత్రులూ ఇంతే, అమెరికా లాంటి ప్రభుత్వాలు ఇంతే! అందుకనే ఇవ్వదలుచుకున్నది మీనమేషాలు లెక్కెట్టకుండా ఇచ్చేయటం మంచిది.

షరా: నేను ఇది సరదాకి రాసేను. ఇన్‌కం టేక్సు చట్టాల గురించి, ఎస్టేట్ టేక్సు చట్టాల గురించి నా కన్న మీకు ఎక్కువ తెలుసని నాకు తెలుసు. ఈ మెలికలన్నిటిని సందర్సిస్తూ కూర్చుంటే, వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు.

Wednesday, December 17, 2008

తెలుగు ఎందుకు?

డిసెంబరు 2008

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కృషి ఫలితంగా, ఆగస్టు 2007 నుండి కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్‌క్లీ, లో తెలుగు బోధన మొదలయిందని వినే ఉంటారు. ఇది తెలుగువారు వేసుకున్న బృహత్ ప్రణాళికలో మొదటి మెట్టు మాత్రమే. ఈ ప్రణాళికకి ప్రజాముఖంగా అంకురార్పణ జరిగినది జూలై 2006 లో. నాటి నుండి నేటి వరకు జరిగిన బృహత్ ప్రయత్నం ద్వారా $500,000 పోగు చేసి దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే ఖర్చు పెట్టి పాఠాలు చెప్పటం ప్రారంభించేరు - విశ్వవిద్యాలయం వారు. ఈ మొలక ఒక మహా వృక్షం అవాలంటే 5 మిలియన్ డాలర్లు అవసరం ఉంటుందని మా అంచనా.

ఈ ప్రయత్నం మొదలు పెట్టిన రోజు నుండీ నేటి వరకు, చందాలు పోగు చెయ్యటానికి బయలు దేరినప్పుడల్లా మమ్మల్ని ఎదుర్కుంటూన్న అతి జటిలమయిన ప్రశ్న ఒకటి ఉంది. రకరకాలుగా మాకు ఎదురయిన ప్రశ్న ఏమిటంటే: “మనకి తెలుగు ఎందుకు? అమెరికాలో మనం తెలుగు నేర్చుకుని ఏమిటి చేస్తాం?” మనకి ధన సహాయం చేసినవారిలో ఆంధ్రేతరులు ఉన్నప్పటికీ పదే పదే తెలుగువారే “మనకి తెలుగు ఎందుకండీ?” అని అడుగుతున్నారంటే దీనికి సమాధానం కొంచెం ఆలోచించి చెప్పాలని అనిపించింది.

ఈ ప్రశ్నకి రకరకాల కోణాల నుండి సమాధానం వెతకొచ్చు. తెలుగు దేశంలో ఉన్న తెలుగు వారు తెలుగు నేర్చుకోటానికీ, ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకోవటానికీ గల ప్రేరణకారణాలు వేర్వేరు. ముందు తెలుగుదేశంలో తెలుగు నేర్చుకోవలసిన అవసరం గురించి విచారిద్దాం. మనందరికీ, ప్రత్యేకించి నేర్చుకోకుండానే, అయిదేళ్ళు నిండేసరికి గడగడా తెలుగు మాట్లాడటం వచ్చెస్తుంది. మనం పాఠశాలకి వెళ్ళి నేర్చుకునేది రాయటం, చదవటం. ఒక భాష నేర్చుకోవటంలో అతి కష్టమైన అంశం మాట్లాడగలగడం. అటు తరువాత రాయటం, చదవటం అంత కష్టం కాదు. అయినప్పటికీ నా ఎరికలో ఈ నాడు తెలుగుదేశంలో మాట్లాడటం వచ్చి, రాయటం, చదవటం రాని వారు – ఇతరత్రా విద్యావంతులు - చాల మంది తారసపడుతున్నారు. వీరికొచ్చిన నష్టం ఏమిటి? మన సంస్కృతిని – రామాయణ భారతాలే అనండి, కాళిదాసాదులు చేసిన కృతులే అనండి – ఇంగ్లీషు మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నారు. త్యాగరాజ కీర్తనలని ఇంగ్లీషు లిపిలో రాసుకుని పాడుతున్నారు. కూచిపూడి నృత్యం చేస్తున్నారు. తాతలతోటీ, తాతమ్మలతోటీ తెలుగులో శుభ్రంగా మాట్లాడుతున్నారు. కాని వీరికి తెలుగు రాయటం, చదవటం రాదు. “ఇందువల్ల వచ్చిన నష్టం ఏమిటి?” అని అడుగుతున్నారు.

ప్రవాసాంధ్రుల పరిస్థితి వేరు. ప్రవాసంలో పెరుగుతూన్న తెలుగు పిల్లలకి – చాల మందికి – తెలుగు మాట్లాడటం కూడ రాదు. అయినా సరే ఇక్కడ (అమెరికాలో ఉండి రాస్తున్నాను) పుట్టి పెరిగిన మన పిల్లలు అమెరికాని జయించెస్తున్నారు. వీరికి తెలుగు రాకపోవటం వల్ల బాహ్యంగా దమ్మిడీ ఎత్తు నష్టం కనిపించటం లేదు. అయినా ఆశ్చర్యం వేసే విషయం ఒకటి ఈమధ్యనే గమనిస్తున్నాను. మా పిల్లలు తెలుగు నేర్చుకోకపోయినా వారి పిల్లలకి (మా మనవలకి) తెలుగు నేర్పమని మా పిల్లలు మమ్మల్ని బ్రతిమాలుతున్నారు. ఇది ఆశ్చర్యమా? ఆశ్చర్యమున్నరా? ఏమిటీ వైపరీత్యం అని అడిగితే వారి సమాధానం ఇలా ఉంటోంది: “మీరు మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పించలేదు. మా గుజరాతి స్నేహితులకి గుజరాతీ వచ్చు, పంజాబీ వారికి పంజాబీ వచ్చు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ భాషలు నేర్పుతున్నారు. మాకు తెలుగు నేర్పించకపోవటం మీ తప్పు. ఆ తప్పుని ఇప్పుడు మేము సరి దిద్దుకుని మా పిల్లలలకి నేర్పిస్తాం” అనే భావం వచ్చేలా మాట్లాడుతున్నారు మా పిల్లలు. కనుక మొదటి తరం తెలుగు వారం ఏదో తప్పు చేసేం. ఆ తప్పేదో చేస్తూన్నప్పుడు తెలియలేదు; ఇప్పుడు తెలుస్తోంది.

ఈ రకం తప్పులు చెయ్యటం ఇది మొదటి సారి కాదు. “ఆడ పిల్లకి చదువెందుకురా? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా? చాకలి పద్దు వెయ్యటానికి సరిపడా రాయటం, చదవటం వస్తే చాలదూ?” అని పూర్వం మనం ఆడపిల్లలని వంట ఇంట్లో నొక్కి పెట్టి అదే మన సంప్రదాయం అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుని, ఉద్యోగాలూ చేస్తున్నారు, ఊళ్ళూ ఏలుతున్నారు – ఈ రెండూ మగవారికంటె బాగా చేస్తున్నారు. అప్పుడు పనికిరాదనుకున్న ఆడదాని చదువు ఇప్పుడు ఎలా పనికొస్తోందో అదే విధంగా ఇప్పుడు పనికి రాదనుకుంటూన్న తెలుగు కూడ పనికొస్తుందని అమెరికాలో ఉన్న రెండో తరం పిల్లలు చెబుతున్నారు – వారి చేష్టల ద్వారా.

ఇదే సమస్యని మరొక కోణం నుండి చూద్దాం. నిసర్గాంధ్రులు (native Andhras) అయితేనేమి, ప్రవాసాంధ్రులు అయితేనేమి – వీరిరువురి నైసర్గిక వాతావారణాలు వేరైనప్పటికీ – వీరిరువురూ తెలుగు నేర్చుకోవలసిన ఉమ్మడి అవుసరం ఒకటి ఉంది. ఒక సమాజంలో బ్రతికే మనిషికి ఒక వైయక్తికత (identity) కావాలి. జంతువుల నుండి మానవుడిని వేరు చేసి మనిషికి ఒక వైయక్తికత ఇచ్చేది భాష. అమెరికా బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి స్వరాజ్యం సిద్ధించుకున్నప్పుడు, వారికీ వీరికీ సంస్కృతీపరమైన వ్యత్యాసం ఏమీ లేదు. కాని ఈ వైయక్తికత కోసం అమెరికా వారు ఇంగ్లీషు భాషనే మార్చేసి అమెరికన్ ఇంగ్లీషు తయారు చేసేరు. ఈ శక్తి అన్ని భాషలకీ ఉంది.

భారతదేశంలో తెలుగువాళ్ళని “మద్రాసీ” లు గా జమకట్టేసినంత సేపూ మనకి “తెలుగు వైయక్తికత” లేదనే కదా ఆరాటపడిపోయి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేసేం. కనుక తెలుగు వాళ్ళకి ఒక వైయక్తికతని ఇచ్చేది తెలుగు భాష. భారతదేశంలో ఉన్న తెలుగువాళ్ళకి ఈ వైయక్తికత అవసరమయినట్లే ప్రవాసులకి ఇటువంటి వైయక్తికత ఇంకా అవసరం. పులుసులో ఉప్పులా ప్రవాసాంధ్రులు ఎప్పుడైతే ఈ వైయక్తికతని కోల్పోయి ఆయా దేశాల ప్రధాన ప్రవాహాలలో కలిసిపోతారో అప్పటి నుండి వారు నామమాత్రంగా తెలుగువారు అవుతారు కాని సాంస్కృతికంగా తెలుగువారు కాజాలరు. కనుక ఒక విధంగా చూస్తే తమ వైయక్తికత నిలుపుకోవాలనే ఆరాటం సహజంగా ప్రవాసాంధ్రులకి ఉంటుంది కనుక ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకోవటం చాల అవసరం. కారణాలు వేర్వేరు అయినప్పటికీ నిసర్గాంధ్రులకి ఇంగ్లీషు నేర్చుకోవటం ఎంత అవసరమో ప్రవాసాంద్రులకి తెలుగు నేర్చుకోవటం అంతే అవసరం.

ఇప్పుడు తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు సంతరించుకుందని (నేనిలా అంటే మీకు కోపం రావచ్చు కానీ – తమిళంతో సమాన హోదా వచ్చిందని) దేశంలో హర్షధ్వానాలు చేస్తున్నారు. నాకూ సంతోషమే. కాని ప్రజాదరణ లేక పోయిన తరువాత ప్రభుత్వ పురస్కారాలు ఎన్ని సంతరించుకుని ఏమి లాభం? మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా. మన తెలుగు ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా ఎదిగినప్పుడు, మన తెలుగుకి ప్రపంచ భాషగా ఒక గుర్తింపు (తమిళానికి, సంస్కృతానికీ ఈ గుర్తింపు ఇప్పుడు ఉంది) పొందినప్పుడు - అప్పుడు మనం పండగ చేసుకుందాం. ప్రపంచ భాషగా గుర్తిపు రావాలంటే, తెలుగుని రెండవ భాష (second language) గా నేర్పటానికి తగిన పద్ధతులు, పనిముట్లు ఉండాలి. తెలుగుని ప్రవాస విద్యాలయాల్లో నేర్పటానికి అవకాశాలు సమకూర్చాలి.

భారత దేశానికి బయట, ప్రపంచ వ్యాప్తంగా దరిదాపు 250 విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం నేర్పబడుతోంది, సంస్కృత భాష మీద పరిశోధన జరుగుతోంది. తమిళానికి ఈ రకం గుర్తింపు కనీసం 12 విశ్వవిద్యాలయాల్లో ఉంది. హిందీ, ఉర్దూల బోధన పరిశోధన ఉరమరగా 110 చోట్ల జరుగుతోంది. తెలుగు? మొన్నమొన్నటి వరకు ఒక్క విస్కాన్సిన్ లో మాత్రమే తెలుగు పీఠం ఉండేది. భవిష్యత్తులో ఈ పీఠాన్ని ఎత్తెస్తారు. దీని స్థానంలో, దీనితో దీటైన పీఠాన్ని బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్థాపించాలని తెలుగు వారు సంకల్పించుకున్నారు. ఇక్కడ ఉన్న దక్షిణ ఆసియా కేంద్రంలో గత 100 సంవత్సరాల పైబడి సంస్కృతం నేర్పుతున్నారు. గత నలభై ఏళ్ళుగా తమిళం నేర్పుతున్నారు. హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ కూడ నేర్పుతున్నారు. ఇక్కడ తెలుగు బోధన, పరిశోధన లేకపోవటం సిగ్గు చేటు. ఈ వెలితిని పూడ్చటానికి పైన, మొదటి పేరాలో, చెప్పినట్లు నిధులు సేకరించి, తెలుగు బోధన ప్రవేశ పెట్టేం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడ ఒక చెయ్యి అందించి సహాయం చేస్తున్నారు. ఈ విత్తు మొలకై, పెరిగి, వటవృక్షంగా మారాలంటే చంద్రుడికో నూలు పోగులా అందరి సహాయసహకారాలూ కావాలి. ప్రత్యేకం ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం కూడ ఒక చెయ్యి వెయ్యాలి. ఈ బృహత్ ప్రణాళికకి సహాయం అందించదలుచుకున్న తెలుగు అభిమానులంతా, ఉడతా భక్తిగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన సహాయం చెయ్యగోరిన వారు UC Berkeley Foundation – Telugu Initiative కి చెక్కు రాసి ఈ దిగువ చిరునామాకి పంపగలరు.Attn: Prof. Sanchita Saxena, Center for South Asia Studies, 10 Stephens Hall, Room 2310, University of California, Berkeley, CA 94720-2310, USA

Tuesday, December 16, 2008

ఉత్తర అధునాతన తత్వ విచారణ

డిసెంబరు 2008

ఇంగ్లీషులో postmodern అనే పదబంధాన్ని తెలుగులో ఏమనాలో తెలియక అందాకా పై పేరు పెట్టేను. ఇంత కంటె మంచి పేరు ఉంటే చెప్పండి.

అసలు ఈ విషయం ప్రస్తావన ఎలా వచ్చిందంటే –

నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా. డా. కేతు విశ్వనాధ రెడ్డి మా ఊరు వచ్చిన సందర్భంలో అక్కడ సమావేశమైన వాళ్ళంతా postmodernism మీద ఘాటుగా మాట్లాడేసుకుంటూ ఉంటే నేను కళ్ళప్పగించి చూస్తూ నోరు మూసుకుని కూర్చున్నాను – నేను అంతకు మునుపు ఎప్పుడూ ఈ పదబంధం వినలేదు. ఇంకేమి మాట్లాడతాను? ఇంటికొచ్చి కొత్త తరానికి నేనెంత వెనకబడిపోయానో తలుచుకుని చాలా బాధ పడిపోయాను. కాని, చెయ్యగలిగింది ఏదీ లేక మిన్నకుండిపోయేను.

తర్వాత అక్టోబరు 2003 లో హైదరాబాదు యూనివర్సిటీ కి ఓ పది వారాల పాటు visiting professor గా వెళ్ళేను. వారి guest house లో నాకొక గది ఇచ్చేరు. ఆ గెస్టు హవుస్ ఎప్పుడూ వచ్చేపోయే వారితో కోలాహలంగా ఉండేది. ఒక సారి ఇంగ్లీషు ఉపాధ్యాయుల బృందం ఒకటి శిక్షణ (training) పొందటానికి వచ్చింది. వచ్చిన వారూ అదే అతిథి గృహం లో ఉండటం వల్ల సాయంకాలం వారితో కలసి బయట పచ్చిక మైదానంలో చెట్టు కింద కూర్చుని బాతాఖానీ వేసేవాడిని. ఆ బాతాఖానీలో చెవిటి కాకుల గూట్లో దొరికే సంజీవి పుల్లలని గుర్తు పట్టే పద్ధతుల దగ్గరనుండి జాతకాలలో ద్రేక్కాణం వరకూ, postmodernism నుండి సద్దాం హుస్సేన్ పట్టుబడ్డ వైనం వరకూ చర్చలు జరిగేవి. ఆ సందర్భంలో నేను తెగించి అడిగేను – “అయ్యా postmodern అంటే ఏమిటి?” అని. కేరళ నుండి వచ్చిన ఎ. రఘు అనే ఇంగ్లీషు లెక్చరరు అవకాశం ఇచ్చేను కదా అని నా మీద ఒక ఉపన్యాసం దంచేసేడు. ఆ దంపుడుకి నా సొంత పైత్యం కొంత కలిపి ఈ దిగువ సమీక్షిస్తున్నాను.

అసలు postmodern అనే పదబంధాన్ని రకరకాల సందర్భాలకి అన్వయించవచ్చు. ముందు చరిత్ర సంగతి తీసుకుందాం. ఏ చరిత్రనైనా సరే ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విడగొట్టటం పాశ్చాత్యులకి అలవాటైపోయింది. యూరప్ లో ఉన్న ఏ దేశ చరిత్రనైనా తీసుకోండి. దాన్ని ఇలా మూడు ముక్కలు చేసి అధ్యయనం చెయ్యటం వారికి రివాజు. ఈ పాశ్చాత్యులు చైనా, జపాను, ఇండియా వంటి ప్రాచీన ప్రాచ్య దేశాల ఉనికిని కనుక్కున్నప్పుడు, ఆ పాత అలవాటు ప్రకారం ఈ తూర్పు దేశాల చరిత్రలని కూడా మూడు ముక్కలు చేయటం మొదలుపెట్టేరు. ఉదాహరణకి The Oxford History of India లో Vincent Smith మన దేశ చరిత్రని మూడు భాగాలు చేసి, ప్రాచీన హిందూ శకం, మధ్యంతర ముస్లిం శకం, ఆధునిక బ్రిటిష్ శకం అని మూడు భాగాలుగా విడగొట్టేడు. నిడివిలో ప్రాచీన హిందూ శకం దరిదాపు 42 శతాబ్దాలు, ముస్లిం శకం ఆరు శతాబ్దాలు, బ్రిటిష్ శకం రెండున్నర శతాబ్దాలు ఉన్నా సరే ఆయనకి మన దేశ చరిత్రని ఈ మూడు భాగాలుగా విడగొట్టి, బంతిలో బలపక్షం లేకుండా ప్రతీ భాగానికీ సమానంగా పేజీలు కేటాయించటంలో అపశృతి కనబడ లేదు. వర్గాలుగా విడగొట్టటంలో ఉన్న ఇబ్బందే ఇది.

సి. పి. రామస్వామి అయ్యర్ తిరువాన్‌కూరు సంస్థానానికి దివానుగా ఉన్న రోజులలో సి. కె. న్. నాయర్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడిని చైనాలో మొక్కలని అధ్యయనం చెయ్యటానికి పంపేరు. నాయర్ చైనా వెళ్ళి అక్కడ వృక్ష సామ్రాజ్యాన్ని చైనా వారు ఆరు విభాగాలు చేసి అధ్యయనం చెయ్యటం గమనించారు. ఆ ఆరు భాగాలు ఏమిటయ్యా అంటే:
1. రాజు గారివి, 2. కొట్టేసినవి, 3. నూరేళ్ళ వయస్సు మీరినవి, 4. పిట్టలు గూళ్ళు కట్టుకున్నవి, 5. మరీ పొడుగాటివి, 6. వెయ్యి ఆకుల కంటె తక్కువ ఉన్నవి.

ఈ కథ విన్న తర్వాత వర్గీకరణ అనేది ఆ వర్గీకరణ చేసేవాడి దృష్టి మీద ఆధారపడి ఉంటుంది తప్ప సహజసిద్ధమైన ఒక తర్కానికి కట్టుబడి ఉండదనే నా అనుమానం మరోసారి బలపడింది. ఈ రకం అనుమానం నాకు వచ్చిందంటే నాలో కొంత ఉత్తర అధునాతన తత్వం ఉందనటానికి తార్కాణం ట!! అని ఆ మళయాళం ప్రొఫెసరు అన్నారు.

ఈ విషయం అలా ఉంచుదాం. పాశ్చాత్యుల చరిత్ర ఏ కొద్దిగానో తెలుసున్నవాడిని ఒకడిని నిలదీసి ‘ఆధునిక యుగం ఎప్పుడు మొదలైంది?’ అని అడిగి చూడండి. యూరప్‌లో పునర్వికాసం లేదా రినసాన్స్ (Renaissance) తో మొదలైందని చెబుతాడు. ఈ పునర్వికాశం ఎప్పుడు మొదలైందిట? నేను చదివిన చరిత్ర పుస్తకాన్నే అతనూ చదివిన వాడైతే “తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్ ని పట్టుకున్నప్పటి నుండి, లేదా సా. శ. 1453 నుండి” అని గభీమని చెబుతాడు – అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం నుండి! రోజుకో ఫేషన్ చొప్పున మారిపోతూన్న ఈ రోజుల్లో, ఆధునిక యుగం – పాత చింతకాయ పచ్చడిలా – ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితం మొదలయిందంటే ఆవలింతలు రావటం లేదూ? ఇలా ఆవలింతలతో చిటికెలు వేసే వారిని సంతృప్తి పరచటానికి ఇప్పుడు మనం ఆధునిక యుగం దాటేసి ఉత్తర అధునాతన యుగం (postmodern age) లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర అధునాతన యుగం ఎప్పుడు మొదలైందిట? Arnold Toynbee దృష్టిలో ఈ ఉత్తర అధునాతన యుగం 1870 దశకంలో మొదలైంది. Charles Jencks దృష్టిలో ఇది 15 జులై 1972 మధ్యాన్నం 3 గంటల 32 నిమిషాలకి మొదలైంది. కలియుగం ఎప్పుడు మొదలైంది అని అడిగితే వేద వ్యాస అనే postmodern ‘వ్యాసులవారు’ క్రీస్తు పూర్వం 3102 లో ఫలానా నెలలో, ఫలానా రోజున, ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మొదలయిందని మేలిబూ (కేలిఫోర్నియా) లో ఉన్న దేవాలయంలో ఇరవై ఏళ్ళ క్రితం ఒక సారి ఉటంకించేరు. అంతే కాకుండా మన కలియుగం మరో ముఫై ఏళ్ళల్లో అంతం అయిపోతోందని ఆయన postmodern గా ఆరాట పడుతూ ఉంటే నేను అమాయకంగా అడిగేను, “అయ్యా! మనం పూజ చేసేటప్పుడు ‘కలియుగే, ప్రథమ పాదే’ అంటాము కదా, మిగిలిన మూడు పాదాలు ముప్ఫై ఏళ్ళల్లో అయిపోతాయా?” అని. నా ‘చొప్పదంటు ప్రశ్న’ వినేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది. "పిదప కాలం పిల్లలు, పిదప కాలం బుద్ధులు" అనుకుంటూ ఆయన నన్నెక్కడ శపించెస్తారో అని నేను భయపడుతూ ఉంటే ఉత్తర అధునాతన వ్యాసుల వారి మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు, మరేమీ చింత పడవద్దని పక్క నున్న శాస్త్రి గారు ఊరట మాటలు పలికేరు.

ఈ సనాతన, అధునాతన, ఉత్తర అధునాతన అనే విభజనతో కుస్తీ పట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు; చాలా రంగాల్లో ఉన్నారు. నేను కాలేజీలో చదువుకుంటూన్న రోజులలో భౌతిక శాస్త్రాన్ని సంప్రదాయికం (classical), అధునాతనం (modern) అని రెండు భాగాలుగా చీల్చి చెప్పేవారు. క్వాంటం యంత్రశాస్త్రం (Quantum Mechanics) రాక పూర్వపు శాస్త్రం అంతా సంప్రదాయికం; ఆ తర్వాత వచ్చినదంతా అధునాతనం. మేక్స్ ప్లేంక్ ప్రచురించిన పరిశోధన పత్రం ధర్మమా అని ఈ ఆధునిక యుగం సా. శ. 1900 లో మొదలైందని మనలో చాల మందికి తెలుసు. అంతవరకూ వెలుగు కిరణాల రూపంలో ప్రసారమవుతుందని అనుకునే వారు. ఈ కిరణాలు చిన్న చిన్న రేణువుల సమూహం అని నూటన్ మహాశయుడు ఉటంకించేడు కూడా. తరువాత కాంతి కిరణాలూ కాదు, రేణువులూ కాదు – తరంగాల మాదిరి ప్రయాణం చేస్తుంది అన్నాడు, మేక్స్‌వెల్. ఈ లోగా క్వాంటం శాస్త్రం వచ్చి “కాదు, కాంతి సూక్ష్మమైన మాత్రల మాదిరి - హోమియోపతీ మందు మాత్రలలా అనుకొండి - చిన్న చిన్న మోతాదులలో ఉంటుంది” అంది. ఈ మోతాదునే ‘క్వాంటం’ అంటారు. మా ఇంటి చూరు లో ఉన్న చిల్లు లోంచి వచ్చే వెలుగుని చూసి కాంతి దూలాలలాగా, వాసాలలాగా ఉంటుందనుకునే నాకు అసలు విషయం అర్ధం కాలేదు సరికదా, పైపెచ్చు గాభరా ఎక్కువైంది. ఈ ఆధునిక భౌతిక శాస్త్రపు పరిస్థితి ఇలా ఉండి అప్పుడే శతాబ్దం గడిచి పోయింది కదా. ఇప్పుడు పాతబడిపోతూన్న ఆధునిక శాస్త్రంలో ఉత్తర అధునాతన ఊహలేవైనా మొలకెత్తాయా అంటే మొలకెత్తాయని ఒప్పుకోవాలి. అవి విషయ పరిజ్ఞానం ఉన్నవారినే పిచ్చెక్కించెస్తూ ఉంటే సామాన్యులకి అందుబాటులో ఉంటాయా?

పిచ్చి అంటే గుర్తుకి వస్తోంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చి మనలో నాటుకుపోయిన భావాలని కొన్నిటిని కూకటి వేళ్ళతో కదిలించే వరకూ మానవుడు తర్క జీవి (rational animal) అనే అనుకున్నాం. ఫ్రాయిడ్ కాదన్నాడు. మానసిక శాస్త్రం ప్రకారం మనందరికీ కొద్దో గొప్పో పిచ్చి ఉన్నాదిట; కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వర్గంలో పడేసి, మిగిలిన వాళ్ళం అంతా ఏదో ఊడబొడిచీసినట్లు పోజులు కొడతాం. ఒక సంఘంలో, ఒక సందర్భంలో పిచ్చివాడిగా జమకట్టబడిన వాడు మరొక చోట, మరొక వేళ మామూలు మనిషిగానో, మహా మేధావి గానో చెలామణీ అయిపోయిన సందర్భాలు ఎన్ని లేవు? విన్సెంట్ వాన్ గో, ఫ్రీడ్రిక్ నీట్జే పిచ్చి వాళ్ళా? మేధావులా? లేక వెలుగు విషయంలో ఆధునిక భౌతిక శాస్త్రపు తీర్మానంలా, రెండూనా?

భౌతిక, మానసిక శాస్త్రాలని, చరిత్రనీ అటుంచి భాషా శాస్త్రాన్ని చూద్దాం. భాష అనేది దైవదత్తం కాదుట. కనీసం అది మానవుల జన్మ హక్కు కూడా కాదుట. భాష మానవ నిర్మితం, కృత్రిమం, తర్కాతీతమూ అంటున్నారు కొందరు. ఒక మాటకీ, దాని అర్ధానికి మధ్య ఎటువంటి తార్కికమైన లంకె లేదుట. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు అల్లేవాడు "అల్లుడు" అయాడని మనం వ్యుత్పత్తి చెప్పుకున్నా, ఆ క్రియకి “అల్లు” అనే మాటనే ఎందుకు వాడాలి అని ప్రశ్నించుకుంటే భాష యొక్క అసలు రహస్యం బయట పడుతుంది. కుక్క ని ఒకొక్క భాషలో ఒకొక్క పేరు పెట్టి పిలుస్తూన్నప్పుడు ఆ పేరుకీ కుక్కకీ మధ్య ఉన్న సంబంధం కేవలం యాధృచ్చికం అని తేలటం లేదూ?

కొందరి దృష్టిలో పైన చెప్పిన అంశాలన్నీ ఉత్తర అధునాతన తత్వానికి ఉదాహరణలు. ఇంతకీ 'ఉత్తర అధునాతన తత్వం' అనే భావం యొక్క నిర్వచనం ఏమిటో? నిజానికి దీన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. కాని ప్రయత్నం పురుష లక్షణం కదా. కనుక ప్రయత్నిద్దాం! “ఇటీవలి, అనగా 1980 ల తరువాత, పాశ్చాత్య సమాజంలో వచ్చిన సాంస్కృతికాది రంగాలలో కొట్టొచ్చినట్లు కనబడే మార్పులే ఉత్తర అధునాతనానికి సూచికలు” అంటారు Margaret Drabble - అక్కడికేదో ఈ తత్వం, ఈ తత్వ విచారణ పాశ్చాత్యుల సొత్తు అయినట్లు! రెండవ ప్రపంచ యుద్ధం తరువాతి కాలానికి ఈ పదబంధం వర్తిస్తుందని M. H. Abrams అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యువతలో కలిగిన సామాజిక స్పృహ, చైతన్యం వల్ల వచ్చిన తిరుగుబాట్ల ద్వారా పుట్టిన ‘పర్యావరణ పరిరక్షణ, జనాభా పెరుగుదలని అరికట్టటం, అన్ని వర్గాల వారికీ సమాన హక్కులివ్వటం’ మొదలైన నినాదాలు పిదప కాలపు పిల్లలకి పుట్టిన పిదప కాలపు బుద్ధులు కావనీ, అవే ఉత్తర అధునాతన తత్వానికి సూచికలనిన్నీ ఈయన భాష్యం చెప్పేరు. ఇలా ఎన్ని నిర్వచనాలని పరిశీలించినా అవన్నీ అసంతృప్తిగానే ఉన్నాయి. ఇది నిర్వచనం చెప్పే కర్త లోపం కాదు, నిర్వచించబడే కర్మ అటువంటిది కావటం. కుక్క తోకని ఎంతమంది సాగదీసినా వంకరగానే ఉంటుంది మరి.

ఉత్తర అధునాతన తత్వానికి నిర్వచనం వెతుకుతూ ఇంతవరకూ పడ్డ తిప్పలని పక్కకి పెట్టి, ఈ సాపు కాని తోకని అటు నుండి నరుక్కొద్దాం. ‘ఉత్తర అధునాతన తత్వం’ అనే భావం భృహత్ సిద్ధాంతాలకి అతీతమైనదనే నిర్వచనాన్ని Jean-François Lyotard సమర్ధిస్తున్నారు. భృహత్ సిద్ధాంతం (metanarrative) అంటే ఏమిటి? సామ్యవాదం, హేతువాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణం, మొదలైన ‘విస్సన్న చెప్పిందే వేదం’ అనే తత్వాలు భృహత్ సిద్ధాంతాలకి ఉదాహరణలు. ప్రజాస్వామ్యం అమెరికా దృష్టిలో మంచిదైనంత మాత్రాన అది ప్రపంచంలో అందరికీ మంచిదే అని వాదించటం భృహత్ సిద్ధాంతానికి మరొక ఉదాహరణ. ఏసుక్రీస్తుని నమ్మి ఆయన శరణు పుచ్చుకోని వాళ్ళంతా తిన్నగా – ఎక్కడా మజిలీలైనా లేకుండా – నరకాని వెళ్ళిపోతారనటం మరొక భృహత్ సిద్ధాంతం. కనుక పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం లా కాకుండా సందర్భోచితమైన పరిధిలో ఇమిడి, వీచే గాలితో ఊగగలిగేది భృహత్ సిద్ధాంతం కాదు. అంటే ఏమిటన్న మాట? ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం అన్న మాట. ఈ సోదంతా విన్న తర్వాత నాకొక చిన్న ధర్మ సందేహం వచ్చింది. గతంలో ఉత్తర అధునాతన వేద వ్యాసుల వారిచేత మేలిబూ దేవాలయంలో తిన్న చివాట్లు సరిపోక, కుక్క తోకని ఒంపు తీద్దామనే అత్యాశ ఇంకా ఉండబట్టి, మా మళయాళీ మేష్టారిని చిన్న చొప్పదంటు ప్రశ్న వేశేను. “అయ్యా! భృహత్ సిద్ధాంతాలన్నిటిని పటాపంచలు చేసి, ఇలా సంప్రదాయాల మీద గౌరవం లేకుండా విశృంఖలంగా ప్రవర్తించండి” అన్న వాక్యం మరొక భృహత్ సిద్ధాంతంలా ఉంది కదా, దాని మాటేమిటి?” అని అడిగేను. అతను నా కంటె బాగా చిన్నవాడు కావటం వల్ల, నవ్వేసి నాకో దణ్ణం పెట్టేసేడు!

ఆఖరి మాట. ఉత్తర అధునాతన తత్వం పాశ్చాత్యుల కపోల కల్పితం అనే భావన ఎవరి మనస్సులలోనైనా ఉంటే, వారికో విన్నపం. విమానాన్ని ఎవరు కనిపెట్టేరో తెలుసా? రైట్ సోదరులు ఎలా అవుతారు? త్రేతా యుగంలో రావణాసురుడు విమానంలో షికారు కెళ్ళేవాడు కదా. అలాగే ఉత్తర అధునాతన తత్వ వాదానికి విత్తులు ఎప్పుడో మన వాళ్ళు నాటేరని నేనంటే మీరు నమ్మగలరా? అదెలాగో ఇప్పుడే చెప్పెస్తే ఎలా? మరో వ్యాసం రాయటానికి ముడి సరుకు ఉండొద్దూ?

Monday, December 15, 2008

మతాతీత రాజ్యాంగం

భారత దేశంలో అమలులో ఉన్నది ప్రజాస్వామ్యం - అంటే ప్రజలకోసం, ప్రజల వల్ల నడపబడే ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరివి సమాన హక్కులు. మనది ఉత్త ప్రజాస్వామ్యమే కాదు - మనది మతాతీత రాజ్యాంగం. అంటే ప్రభుత్వం అన్ని మతాలనీ సమ దృష్టితో చూడాలి. ఇంగ్లండు, అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన పాశ్చాత్య దేశాలలో ఉన్న ప్రభుత్వాలు చాల మట్టుకు - కొద్ది కొద్ది తేడాలతో - మతాతీత ప్రజాస్వామ్యాలే. ఈ మతాతీత ప్రజాస్వామ్యాలలో లౌకిక (సివిల్)విషయాలలోనూ, శిక్షా (క్రిమినల్) విషయాలలోనూ, ప్రభుత్వం ప్రజలందరినీ సమ దృష్టితో చూస్తుంది. ఉదాహరణకి పెళ్ళిళ్ళ విషయాలలోనైతే నేమి, ఆస్తి పంపకాల విషయంలో అయితేనేమి, దేవాలయాల నిర్మాణం లో అయితేనేమి చట్టబద్ధంగా ప్రవర్తించినంతసేపూ పౌరులందరివీ సమాన హక్కులే.


కాని భారత దేశంలో ప్రస్తుతం చలామణీ అవుతూన్న ప్రజాస్వామ్యపు పరిస్థితి వేరు. ఉదాహరణకి శిక్షాస్మృతి ప్రకారం ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానమే కాని లౌకిక స్మృతిలో మన ప్రభుత్వం ఒకొక్క వర్గాన్ని ఒకొక్క ప్రత్యేక దృష్టితో చూస్తుంది. కుల విచక్షణ కూడదంటూనే కులాలవారీగా ప్రత్యేక సదుపాయాలు చెయ్యటం, మతాతీతం అంటూనే ముస్లింల హాజ్ యాత్రకీ, ఇటీవల క్రైస్తవుల జెరూసలేం యాత్రలకి ప్రత్యేక నిధులు మంజూరు చెయ్యటం, మొదలైనవి ఈ కోవకి చెందితాయి. (ఇవి ఓట్ల కోసం చేసే గారడీలు మాత్రమే.)


లౌకిక (లేదా పౌర) స్మృతిలో వ్యక్తిగత హక్కులు అంతం అయే అవధి ఎక్కడ, సమాజం యొక్క సమష్టి హక్కులు మొదలయ్యేది ఎక్కడ అనే సమస్య కొంచెం జటిలమైనదే. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలు ఈ సమస్యని ఎలా ఎదుర్కుంటున్నాయో చూస్తే కొన్ని ఆధారాలు దొరుకుతాయి.


ఒక వ్యక్తి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి, ఏ దుస్తులు ధరించాలి, ఎవ్వరిని వివాహమాడాలి మొదలైన వ్యక్తిగత విషయాలలో ప్రభుత్వం జోక్యం కలుగజేసుకోవలసిన అవసరం సర్వసాధారణంగా ఉండదు. కాని ఉదాహరణకి ఒక వ్యక్తి నమ్మకాలవల్ల కాని, వేషధారణ వల్ల కాని సంఘానికి ఏదైనా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లయితే అటువంటి సామాజిక విషయాలలో ప్రభుత్వం కలుగజేసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు.


ముస్లిం వనితలు ముఖం కనిపించకుండా బురఖా ధరించటం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. కాని ఈ రోజుల్లో తీవ్రవాదులు బురఖాలు వేసుకుని ప్రజల మధ్య బాంబులు పేల్చే అవకాశాలు పెరుగుతున్నాయి కనుక బహిరంగ ప్రదేశాలలో ముస్లిం స్త్రీలు బురఖాలు వేసుకోకూడదని పాశ్చాత్య దేశాలలో ఒక చర్చ జరిగింది. ఇదే విధంగా శిఖ్ఖులు (మగవారు) కీర్పన్ అనే కత్తిని ధరించి విమానాలు ఎక్కితే ప్రభుత్వం ఊరుకోవటం లేదు. ఇటువంటి సందర్భాలలో "ప్రభుత్వం మమ్మల్ని విచక్షణా పూరితమైన జుగుప్సతో చూస్తున్నాది" అని అలమటించి లాభం లేదు.


మరొక ఉదాహరణ, అమెరికాలో సెవెంత్ డే ఏడ్వెంటిస్ట్ అనే ఒక మతం ఉంది. ఇది క్రైస్తవ మతంలో ఒక శాఖ. వీరి నమ్మకం ప్రకారం ప్రాణాపాయ సమయంలో కూడా కృత్రిమమైన మందులు వాడకూడదు. ఈ నమ్మకంతో వారు పిల్లలకి టీకాలు వేయించటానికి కూడ సుముఖత చూపరు. అంటురోగాలని అరికట్టాలంటే జనాభా అంతటికీ టీకాలు వెయ్యాలి - బలవంతగానైనా వెయ్యాలి; లేకపోతే వ్యాధులు ప్రజలమీదకి మహామారిలా విరుచుకు పడతాయి. ఇటువంటి నమ్మకంతో చంటివాడికి ప్రాణం మీదకి వచ్చినా "వైద్యం చేయించం" అని ఒక జంట మంకు పట్టు పడితే ప్రభుత్వం ఆ తల్లిదండ్రులని న్యాయస్థానానికి ఈడ్చి, పిల్లాడిని జప్తు చేసి, బలవంతంగా వైద్యం చేయించింది. ప్రభుత్వానికి ఈ హక్కు ఎక్కడినుండి వచ్చింది? తల్లిదండ్రులకి తమ మతం మీద ఎంత నమ్మకం ఉన్నా ఆ నమ్మకంతో మరొక ప్రాణం తీసే హక్కు వారికి లేదు అని న్యాయస్థానం తీర్మానించింది. ఈ సందర్భంలో సమాజపు హక్కు వ్యక్తిగత హక్కుల మీద తురుఫు అయిందన్న మాట.




దీని నీతి ఏమిటన్న మాట? మత సంబంధమైన విషయాలైనప్పటికీ కొన్ని విషయాలలో జోక్యం కలుగజేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇదే తర్కం ఉపయోగించి బ్రిటిష్ వారు సతీ సహగమనం నిషేధించేరు. ఆస్థి హక్కులు, ఏకపత్నీవ్యవస్త, పునర్వివాహాల నిబంధనలు ఈ కోవకి చెందినవే.


భారతదేశంలో "సెక్యులరిజం" పేరిట జరుగుతున్నది దీనికి వ్యతిరేకం. ఒక దేశం నిజంగా సెక్యులర్ అయినప్పుడు దేశవ్యాప్తంగా అందరికీ - అంటే, అన్ని కులాల వారికీ, అన్ని మతాల వారికీ, అన్ని రాష్ట్రాలవారికీ - ఒకే చట్టం ఉండాలి. ప్రభుత్వం దేవాలయాలనీ, మసీదులని, చర్చిలనీ, గురుద్వారాలనీ నడపటానికి తలదూర్చకూడదు - వాటిపై పర్యవేక్షణ ఉండొచ్చు. క్రైస్తవులకి ఒక చట్టం, ముసల్మానులకి ఒక చట్టం, బౌద్ధులకి ఒక చట్టం, హిందువులకి మరొక చట్టం ఏమిటి? మనని విభజించి పాలించటానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన అమరిక ఇది.


ఒక ఉమ్మడి పౌర స్మృతి అంటూ ఉంటే దాంట్లో అధికరణాలు ఏవేమిటి ఉండాలి? అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాలని పరిశీలించి మనం ఒక రాజ్యాంగాన్ని ఎలా నిర్మించుకున్నామో అదే విధంగా హిందూ, ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ, సిఖ్ఖు, పార్సీ మతాలలోని అభ్యుదయ భావాలని సేకరించి, సర్వ సమ్మతమైన కనీస అంశాలతో ఒక ఉమ్మడి పౌర స్మృతిని నిర్మించుకోవచ్చు.




గుడ్డిలో మెల్లలా భారతదేశంలో రాజకీయాలకీ, సొంతలాభాలకీ అతీతంగా రెండు సంస్థలు ఉన్నాయి: మిలటరీ, సుప్రీం కోర్టు. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన సుప్రీం కోర్టు ఎన్నో సార్లు సోత్సాహంగా కలుగజేసుకుని మన దేశానికి ఎనలేని మేలు చేసింది. సమాన హక్కుల విషయంలో కూడా మన ప్రధాన న్యాయస్థానం ఈ మధ్యనే (ఒక ఏడాది క్రితం) కొన్ని సూచనలు చేసింది. ప్రజాస్వామ్యంలో "యథా ప్రజా తథా రాజా" కనుక మనం కుల, మత, వర్గాలకి అతీతంగా నిజమైన ప్రజాసేవకులని మనం ప్రతినిధులని ఎన్నుకుంటే దేశం పురోగతి సాధిస్తుంది.