Saturday, December 26, 2009
నవ్వటమా? మానటమా?
శేషప్ప అయ్యరుకి వచ్చినపాటి ఇంగ్లీషు నాక్కూడా వచ్చుంటే, నేను కనీసం పదహారణాల తెలుగువాణ్ణయి ఉండుంటే, పై మకుటంలో అడిగిన ప్రశ్నని to laugh, or not to laugh అన్న ధోరణిలో ఇంగ్లీషులోనే అడిగి ఉండేవాడిని.
నా చిన్నతనంలో రాజు గారు, గాజు పెంకు కథ చెప్పి, చివరికి వచ్చేసరికి "కథ కంచికి, మనం ఇంటికి" అనకుండా "తీస్తే మంట, తియ్యకపోతే తంట!" అంటూ ముగించేవాడిని. "ఆ గాజు పెంకు ఏమిటి? అది ఎక్కడ గుచ్చుకుంది?" అని నన్ను అడగి ఇరకాటంలో పెట్టకండి. మీరు కుశాగ్రబుద్ధులు కనుక ఊహించుకోగలరు.
ఇంతకీ నవ్వటమా? మానటమా? అని కదూ అడిగేను. నవ్వితే మంట, నవ్వకపోతే తంట! అన్నట్లు నవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
నేను అమెరికా వెళ్ళిన కొత్తలో లైబ్రరీ మెట్లు ఎక్కుతూ ఉంటే అట్నించి దిగుతూ ఉన్న ఒక తెల్లమ్మాయి నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వింది.
నేను డంగైపోయి, "అయితే ఈ అమ్మాయి నన్ను ప్రేమించెస్తోందంటావా?" అని పక్కనున్న అచ్యుతరావుని అడిగేను.
"లోపలికి పద, చెబుతాను" అన్నాడు
లోపల లోన్ డెస్క్ దగ్గర మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడ నన్ను చూసి కిచ కిచ మంది.
"ఇదిగో ఈ అమ్మాయి కూడ నవ్వుతోంది కదా. నిన్ను ప్రేమిస్తోందో ఏమిటో! ఓ సారి సినిమాకి వెళదామా అని అడిగి చూడు" అన్నాడు అచ్యుతరావు, ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
ఈ రెండో అమ్మాయి పాత కాలపు హిందీ సినిమా తార తున్ తున్ లా ఉంది.
అమెరికాలో నవ్వు ఒక పలకరింపులాంటిదిట. అని నాకేం తెలుసు?
అందుకని నేను కూడా ఎవ్వరినైనా చూసినప్పుడు నవ్వటం అలవాటు చేసుకున్నాను.
అదే నా కొంప ముంచింది - ఇండియాలో
ఇండియాలో నవ్వరుట! అని నాకేం తెలుసు?
ఆమాత్రం తెలియకపోతే ఎందుకు పనికొస్తావురా? అన్నాడు అన్నయ్య. ఎయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టంస్ వాళ్ళ మొహాలు చూడలేదుట్రా?
మహాభారత యుద్ధంలో అన్నదమ్ములు కొట్టుకు చావలేదూ! ఎందుకుట?
సూదిమొన మోపినంత భూమి కోసం అయితే ఈ సోది అంతా రాసి మిమ్మల్ని ఎందుకు ఇలా నస పెడతాను?
ద్రౌపది నవ్విందిట. మయసభలో మడుగులో పడ్డ మన దుర్యో అన్నని చూసి నవ్విందిట.
"నన్ను చూసి నవ్వెదవే, వన్నెల దొరసానీ?" అంటూ మండిపడి, "నీ భరతం పడతానుండు" అని పెద్దన్న భారత యుద్ధానికి కాలు దువ్వేడని ఒక కథ ఉంది. అదండి, పద్దెనిమిది అక్షౌణీలు కొట్టుకు చావటానికి కారణం. (తెలుగువాళ్ళు - ఆంధ్రావోళ్ళు కాదు - మనం, తెలుగోళ్ళం కౌరవుల పక్షంలో పోరాడేమని మరవకండి).
ఒక నాడు జిన్నా అన్న మాటకి నెహ్రూకి నవ్వు వచ్చిందిట. అదండి పాకిస్తాను పుట్టి మనకి పక్కలో బల్లెం అవటానికి కారణం.
ఇప్పుడు ఆంధ్రోళ్ళు, తెలంగణోళ్ళు "యూ హౌ మచ్ అంటే యూ హౌ మచ్" (నువ్వెంత అంటే నువ్వెంత) అని తగువాడేసుకుంటున్నారు కదా. ఈ కురుక్షేత్రంలో ఉభయ సైన్యాల మధ్యనీ రధాన్ని ఆపి ఏమిటి చెయ్యాలో తోచక బిక్కచచ్చిపోయి నేను నిలబడి ఉంటిని గందా. భోజనం చెయ్యనని భీష్మించుకుని కూర్చున్న ఒక కురువృద్ధుడిని ఒక అంపశయ్య మీద పడుక్కోబెట్టి, సవ్యసాచిలా వైద్యుడు పక్కని నిలబడి ఊషర జలం (సేలీను) ఎక్కిస్తూంటే ఇటు ఆంధ్రాలోనూ, అటు తెలంగాణాలోనూ ప్రజలు రధాలకి నిప్పెట్టి హాహాకారాలు చేస్తున్నారు కదా.
“ఈ నవభారత యుద్ధం”లో పద్దెనిమిది అక్షౌణీల రూపాయలకి పైనే నష్టం వచ్చి ఉంటుంది. హైదరాబాదులో బస్సులని నడిపితే వాటిని తగలెట్టెస్తున్నారు. నడపకపోతే ఆదాయం నష్టం వస్తోంది. నడిపితే మంట, నడపకపోతే తంట.
ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారా అని నాకు ఉన్న కొద్ది అవస్థాపక సౌకర్యాలనీ (infrastructure అండీ, మరేమీ కాదు) ఉపయోగించి చిరు పరిశోధన చేస్తిని గందా. చెయ్యగా తెలిసుకున్నది ఏమిటంటే…
శ్రీనాధుడు నవ్వేడుట. అదిట ఈ బంధ్‌కీ, రస్తా రోకోలకీ కారణం! ఒఠ్ఠి నవ్వటమే అయితే అంత బాధ కలిగేది కాదుట; వెటకారం కూడా చేసేడుట – వీళ్ళని చూసి.
వేళ్ళని చూసి?
ఈ తెలంగణోళ్ళని చూసి.
శ్రీనాధుడు ఎందరెందరినో చూసి నవ్వేడు. వేటకారాలు చేసేడు. నది ఒడ్డున ఉన్న నాయురాళ్ళని చూసి కన్ను గీటేడు. అది అతని స్వయంబు. అయినా నాకు తెలియక అడుగుతాను. శ్రీనాధుడు వీళ్ళని ఏమన్నాడుట?
“వీళ్ళు ఒఠ్ఠి అనాగరికులు. వీళ్ళకి వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుని, మాగాయ టెంకని గీరుతూ తినటం కూడ తెలీదు. సజ్జన్నం, జొన్న రొట్టెలు తినే అనాగరికులు” అన్నాడుట.
హారి భడవల్లారా. శ్రీనాధుడు అన్నది మిమ్మల్ని కాదు.
మరైతే ఎవరిని ఉద్దేశించి అన్నాడు?
ఎవ్వరిని ఉద్దేశించి అంటే ఏమిటి గాని, ఇదేదో అయిదు వందల ఏళ్ళ క్రితం మాట. దాన్నిప్పుడు కెలకటం ఎందుకు?
ఎలా మరిచి పోతామండీ. ముందు శ్రీనాధుడు. తరువాత నైజాము నవాబు, ఇప్పుడు ఈ ఆంధ్రాఓళ్ళు.
ఈ విషయాలన్నీ ఆలోచించే భారత ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసిందిట. ఎప్పుడూ, ఎక్కడా ఎవ్వరిని చూసి నవ్వొద్దని.
అదండి మన ఇమ్మిగ్రేషన్ వాళ్ళు ముడుచుకున్న మూతులు పెట్టుకుని ధుమధుమలాడుతూ ఉండటానికి కారణం! వాళ్ళని నవ్వించటానికి ప్రయత్నించకండి. మీ రస్తా రోకో చేసెయ్యగలరు.
Thursday, December 17, 2009
తెలంగాణ: ఒక సామాన్యుడి అవగాహన
ఈ మధ్య ఈ ఊళ్ళో ఒక రచయితల (కవితలు రాసేవారు) సమావేశానికి వెళ్ళేను. దరిదాపు 30 మంది వచ్చేరు. వీరిలో నలుగురు అతి ఆవేశంగా, "ఆంధ్రా ఓళ్ళని" తిడుతూ, అసహ్యించుకుంటూ, పద్యాలు చదివేరు. బ్రిటిష్ వాళ్ళని కూడ భారతీయులు అంతగా అసహ్యించుకున్నారని నేను అనుకోను!
తెలంగాణా ప్రజలు ఆంధ్రా ప్రజలని అంతగా అసహ్యించుకుంటూ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రా అంటూ ఎందుకు ఆంధ్రా వారు గొడవపెడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. కేంద్ర ప్రభుత్వం వాలకం చూస్తూ ఉంటే తెలంగాణాని విడదీయటంలో కేంద్రానికి ఏదో లాభం ఉండి ఉండాలి. ఏ రాష్ట్రమూ కేంద్రం కంటె బలంగా ఉండటం కేంద్రానికి ఇష్టం ఉండకపోవచ్చు.
ఈ పరిస్థితులలలో తెలంగణాతోపాటు హైదరాబాదు కూడ ఆంధ్రాకి దూరం అయిపోవటం తధ్యం. ఇటుపైని హైదరాబాదులో పెట్టుబడులు తగ్గించి ఆంధ్రావారు ఏ విజయవాడనో, విశాఖనో వ్యాపార కేంద్రంగా నిర్మించుకోవటం శ్రేయోదాయకం. మళ్ళా ఏ కడపో, కర్నూలో ముఖ్యపట్టణం అయితే కొన్నాళ్ళ తరువాత రాయలసీమ వారు విడిపోతామంటారు. అప్పుడు కోస్తా అంధ్రాకి మిగిలేది సున్న.
Friday, October 23, 2009
అమెరికా అనుభవాలు: సొంత డబ్బా
వేమూరి వేంకటేశ్వరరావు
మూడేళ్ళ క్రితం సిలికాన్ ఆంధ్రా వారి సుజనరంజనిలో కిరణ్‌ప్రభ "నా అమెరికా అనుభవాలు", నెలనెలా ఒక వ్యాసం చొప్పున 23 నెలలు ధారావాహికగా ప్రచురించేరు. ఆ సందర్భంలో చాలా మంది ఆ "అనుభవాలు" పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ఆదివారం, అనగా 18 అక్టోబరు 2009 నాడు, హైదరాబాదులో, ఎమెస్కో వారి ప్రాంగణంలో ఈ అనుభవాలు పుస్తకరూపంలో ఆవిష్కరించబడింది. సుప్రసిద్ధ రచయిత, శ్రీ రావూరి భరద్వాజ ఆవిష్కరణ చేసేరు. సుప్రసిద్ధ భాషాశాస్త్రవేత్త, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్ గారు మొదటి ప్రతిని అందుకున్నారు. ఈ సమావేశానికి శ్రీ విశ్వనాధ అచ్యుతదేవరాయలు గారు, శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు రావటం ఒక అపూర్వమైన సంఘటన.
ఈ పుస్తకం 1961 నుండి 1968 వరకు అమెరికాలో జరిగిన నా అనుభవాలే కాకుండా, ఒక విధంగా ఇది అమెరికాలో స్థిరపడ్డ మొదటితరం తెలుగువారి కథ.
ఈ పుస్తకం తెలుగుదేశంలో పుస్తక విక్రయశాలలో దొరుకుతోంది. జనవరి నాటికి అమెరికాలో కూడా లభ్యమయేటట్లు చూస్తాను. భారతదేశంలో ఉన్నవారు ఎవ్వరైనా ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.
Friday, August 28, 2009
వంకాయ వంటి కూరయు
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే
అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.
వంకరగా ఉన్న కాయని వంకర కాయ లేదా వంకాయ అనొచ్చు. కాని మెట్ట వంకాయలు గుండ్రంగానో, గుడ్డు ఆకారంలోనో ఉంటాయి, నీటివంకాయలైతే కోలగా ఉంటాయి; కాని వంకర టింకరగా ఉన్న వంకాయలు నాకు తారస పడలేదు.
వంగపండు, వంగనార వంటి మాటలనిబట్టి వంకాయ అంటే వంగ కాయ అయి ఉండొచ్చు. అంటే, వంగ దేశపు కాయ కాబోలు. బంగాళా దుంపలకీ, బెంగాలుకీ మధ్య బాదరాయణ సంబంధమే కాని, వంకాయకీ, వంగదేశానికీ దగ్గర సంబంధమే ఉందనవచ్చు.
వంకాయని బెంగాలీలో "బేగున్" అంటారుట. దీన్ని "బే గుణ్" అని విడగొడితే "గుణం లేనిది" అనే అర్ధం వస్తుంది. ఇక్కడ “గుణం” అంటే “నీతి, నియమం, శీలం, సత్‌ప్రవర్తన” వంటి అర్ధాలు కాకుండా ఒక ప్రత్యేకమైన లక్షణం అని అర్ధం చెప్పుకోవచ్చు. కందకి దురద వేసే గుణం ఉంది. కాకరకాయకి చేదు అనే గుణం ఉంది. కనరు పట్టిన వంకాయలు చేదుగా ఉంటాయి కాని ఆ చేదు వంకాయ గుణం కాదు. తనకి స్వగుణం లేదు కనుక మనం ఎలా ఒంచితే అలా ఒంగుతుంది, ఎలా వండితే అలా మొగ్గుతుంది. అందుకే వంకాయ-మెంతికారం, వంకాయ-కొత్తిమిరకారం, వంకాయ-ఉల్లికారం, వంకాయ వేపుడు, వంకాయ బజ్జీలు పచ్చడి (వంకాయని కాల్చి చేసే పచ్చడి), హైదరాబాదీ వంకాయ కూర, ఇలా ఎన్నెన్ని విధాలుగానో వంకాయని వాడుకోవచ్చు.
ఈ "బేగున్" హిందీలో బైన్‌గన్ అయింది.
హిందీ కంటె పాతది సంస్కృతం కదా. సంస్కృతంలో వంకాయని "వతింగన" అంటారు. ఇది పారశీక భాషలో "బదింగన్" అయింది. పారశీకం నుండి అరబ్బీలోకి వెళ్ళి అక్కడ "ఆల్ బదైన్‌జన్" అయింది. అరబ్బీలో "ఆల్" అనే ప్రత్యయం మన తెలుగులో డు, ము, వు, లు లాంటిది; తరచు కనిపిస్తూ ఉంటుంది. అరబ్బీ నుండి కేటలీనా వెళ్ళి అక్కడ "ఆల్బర్జీనా" అయింది. అక్కడనుండి ఫ్రెంచి భాషలోకి వెళ్ళి "ఔబర్‌జీన్| అయింది. ఈ ఫ్రెంచి మాట ఆఫ్రికాలో ఉన్న ఐబీరియా వెళ్ళి అక్కడ "బెరింజెలా" అయింది. ఆఫ్రికా నుండి బ్రిటిష్ వాళ్ళు ఈ మాటని "బ్రింజాల్" చేసి ఇండియా తీసుకొచ్చేరు. కాని ఇంగ్లండులో మాత్రం ఫ్రెంచి మాటయిన ఔబర్‌జీన్ నే వాడతారు.
మన తెలుగు వాడికి వంకాయని వంకాయ అనటానికి సిగ్గు; బ్రింజాల్ అనే అంటానంటాడు. "అమెరికాలో ఉన్న మీ "అగ్రవర్ణాలు" ఇంగ్లీషు నేర్చేసుకుని మంచి మంచి జాబ్స్ ని కొట్టేసి మనీ చేసేసుకుంటున్నారు, ఇండియాలో ఉన్న మాకు తెలుగు నేర్పేసి మమ్మల్ని "దళితులు"గా నొక్కెద్దామని చూస్తున్నారు. కనుక మేం ఛస్తే తెలుగు నేర్చుకోం. ఇంగ్లీషులోనే "బ్రింజాల్" అంటాం" అంటూ శంకరాభరణం లాల్చీ మేష్టారు లాంటి వ్యక్తి ఒకరు నన్ను తూలనాడేడు.
కాని ఈ అమెరికావాడు ఉన్నాడే వీడు నా పాలిట ఒక తంటసుడు; అంటే తంటసం తెచ్చిపెట్టినవాడు. ఇంగ్లీషు మరిగిన తెలుగువాడికి తంటసం అంటే ఏమిటో తెలియక పోవచ్చు. తంటసం అంటే ముల్లు. ఈ ముల్లు ఒక ప్రత్యేకమైన శరీరభాగంలో గుచ్చుకుంటే కూర్చోలేం, నిలబడలేం. తెలుగు మీద అభిమానం కొద్దీ నేను తెలుగు మాటలే ఎక్కువ వాడటానికి ప్రయత్నిస్తూ పృష్టభాగపు పేరుని తెలుగులో రాయబోతూ ఉంటే మరీ "అన్ విక్టోరియన్" గా ఉంటుందని ఉపద్రష్ట రామకృష్ణ అనే కుర్రాడు పెద్దవాడిని అయిన నన్ను మెత్తగా మందలించేడు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ అమెరికావాడు, ఈ తంటసుడు, వంకాయ పేరులోని పూర్వ చరిత్రని పూర్తిగా విస్మరించి ఒక కొత్త పేరు పెట్టేడు. అమెరికాలో వంకాయని "ఎగ్ ప్లేంట్" అంటారు. దీన్ని తెలుగులో "గుడ్డు చెట్టు" అనో "గుడ్డు మొక్క" అనో గాడిద గుడ్డు అనో అనుకోవచ్చు. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో "ఎగ్ ప్లేంట్" అంటే ఈ అమెరికా వాళ్ళు గుడ్లని చెట్లమీద కాయింపిస్తారు కాబోలని అనుకునే వాడిని. వీళ్ళంటే నాకంత గురి. నిఝం! "హాట్ డాగ్" అంటే కుక్కల్ని కాల్చుకు తింటారు కాబోలు అనుకునే వాడిని. సరస్పతి తోడు!
అమెరికావాడు వంకాయని చూసి గుడ్డు అనుకున్నాడుట. కొన్ని జాతుల వంకాయలు తెల్లగా, గుడ్డు ఆకారంలో ఉంటాయి. అందుకని అమెరికావాడు అలా భ్రమపడి ఉంటాడు.
అరవ్వాడు తెలివయిన వాడు. పిలక్కి తాడు కట్టుకుని మరీ చదివేవాడు - పూర్వం బుడ్డి కిరసనాయిలు దీపాలు ఉన్న రోజులలో. ఎలెట్రీ దీపాలు వచ్చేక పిలక్కి తాడు కట్టుకోవలసిన అవసరం పోయింది. పిలకలు కూడా పోయాయి లెండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అరవ్వాడు వంకాయని "కత్తరికాయ" అంటాడు. "ఈ మాట ఎక్కడ నుండి ఎక్కడనుండి వచ్చిందిరా?" అని అడిగితే వాడు "సిలప్పాధికారం, మణిమేఖలై" అంటూ తమిళం ప్రాచీనతని మనకి మరోసారి గర్వంగా జ్ఞాపకం చేస్తాడు. మనం త్రుళ్ళిపడి, లేచి, ఢిల్లీ పరిగెత్తుకు వెళ్ళి, తెలుగుకి కూడా క్లాసికల్ లాంగ్వేజి స్టేటస్ తీసుకొస్తాం. కాని తెలుగులో మాట్లాడం.
ఆమ. దట్సిట్!
షంషాబాదు విమానాశ్రయం నుండి హైదరాబాదు ఊళ్ళోకి తీసుకొచ్చే ఎక్స్‌ప్రెస్ బస్సులకి "గబగబ" అనో "చకచక" అనో ఎందుకు పేరు పెట్టకూడదు? హవాయిలో ఇటువంటి బస్సులని వాళ్ళు గర్వంగా వికివికి అని పిలుచుకుంటారు. అందులోంచే వికీపీడియా అనే మాట పుట్టింది.
Tuesday, June 30, 2009
విదేశీయులకి ఆతిథ్యం
"ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" అన్న పేరు వినే ఉంటారు. ఇది అమెరికా ప్రభుత్వం అందజేసే ఒక వేతన సౌకర్యం. ఇది రకరకాల రూపాలలో ఉంటుంది. నేను మొట్టమొదట "ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" అనే మాట 1957 లో విన్నాను; మా అన్నయ్యకి అమెరికాలో చదువుకుండుకి సీటు వచ్చినప్పుడు పడవ టికెట్టు కొనుక్కుందుకి ఈ "ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" ఉపయోగపడింది. నేను సెప్టెంబరు 2009 లో ఇండియా వచ్చి నాలుగు నెలల పాటు వరంగల్‌లో ఉన్న వాగ్దేవి కళాశాలలో పాఠం చెప్పటానికి "ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" ఉపయోగపడబోతోంది. ఇంకా ఏయే రకరకాల ప్రయోజనాలకి ఇది ఉపయోగపడుతుందో చెబుతూ కూర్చుంటే ఇదొక పెద్ద గ్రంధం అవుతుంది.
ఈ ఏడు "ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్" తో ఇండియా వెళ్ళబోయేవారికి వాషింగ్‌టన్‌లో ఒక "ఓరియంటేషన్" సమావేశం ఏర్పాటు చేసేరు. మూడు రోజులపాటు జరిగింది. ఈ సమావేశంలో ప్రతిరోజూ ఒక పూట ఒక "పేనల్" చర్చ ఏర్పాటు చేసేరు. గత సంవత్సరం ఇండియా వెళ్ళి వచ్చిన వారు వారి అనుభవాలు చెప్పి, వెళ్ళబోయేవారికి సలహాలు ఇవ్వటం ఈ చర్చ ముఖ్య ఉద్దేశం. ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళంతా ఇండియాలో చదువుకుందుకి వెళ్ళిన విద్యార్ధులు, ఇండియాలో పాఠాలు చెప్పటానికి వెళ్ళిన ఉపాధ్యాయులు. అంటే, వీరంతా మనబోటి వాళ్ళే.
వాళ్ళ అనుభవాలు వినటానికి నేను కూడ హాజరయాను. ఎవరి అనుభవాలు వారివి. కాని అందరి అనుభవాలలోను సూత్రప్రాయంగా నాకు కనబడిన ఒక అంశాన్ని ఇక్కడ పొందుపరుస్తాను. నేను అమెరికా వచ్చిన కొత్తలో ఇదే రకం అనుభవం పొందేను. కనుక స్పందిస్తున్నాను.
ఎవ్వరైనా కొత్త దేశం వెళ్ళినప్పుడు రెండు ప్రక్రియలకి లోనవుతారు: ఒకటి, మాతృదేశం గురించి, మాతృదేశంలో వదలి వచ్చిన ఆప్తుల గురించి ఒక రకమైన బెంగ. దీనిని ఇంగ్లీషులో "హోం సిక్‌నెస్" అంటారు. రెండు, కొత్త దేశంలో ఉన్నవారి ఆచార వ్యవహారాలు, కట్టుబొట్లు, పండగలు, ఉత్సవాలు, మొదలైనవాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం. ఈ రెండు పిట్టలని ఒకే రాయితో కొట్టొచ్చు. రెండు చేతులు కలిస్తే కాని చప్పుడు ఎలాకాదో అదే విధంగా అతిథులు, అభ్యాగతులు పూనుకుంటే కాని ఈ సమస్య పరిష్కారంకాదు.
ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్ తో ఇండియా వచ్చిన అమెరికన్ల సమస్యా ఇదే. వారు పదే పదే అనేది ఏమిటంటే "మమ్మల్ని మా సహాధ్యాయులు వారి ఇళ్ళకి ఒక్క సారైనా ఆహ్వానించలేదు" అని. ఈ సమస్య "ఆటోమేటిక్" గా పరిష్కారం కాదు. నేను అమెరికా వచ్చిన కొత్తలో మా యూనివర్శిటీ అధికారులు స్వయంగా పూనుకుని నాకు రెండు సంసారాలకి పరిచయం చేసేరు. ఏ పండగ వచ్చినా వారు నన్ను వారింటికి పిలచేవారు. ఇదే విధంగా మన దేశం వచ్చిన అతిథుల (పర్యాటకుల సంగతి కాదు, నేను చెప్పేది) కష్టసుఖాలని అర్ధం చేసుకుని, వారికి ఇతోధికంగా సహచర్యం కల్పిస్తే వారికి మనదేశం మీద మంచి అభిప్రాయం కలుగుతుంది.
మనం ఒక విషయం మరచిపోకూడదు. భారతీయులు అమెరికా వచ్చినప్పుడు వారెదుర్కొనే పరిస్థితి, అమెరికావారు భారతదేశం వచ్చినప్పుడు వారు ఎదుర్కొనే పరిస్థితి దర్పణ బింబాలు కావు. భారత దేశంలో భౌతిక సౌకర్యాలు తక్కువ. పరిశుభ్రత తక్కువ. ఆరోగ్యాన్ని భంగపరచే కారణాలు అనేకం. అమెరికాలో ఇవేమీ సమస్యలు కావు. మన సమస్య "ఇంటి బెంగ". కాని భారత దేశం వచ్చే ఇతరులకి పెక్కు సమస్యలు. కనీసం మనకి చేతనయిన ఆతిథ్యం అయినా అందజేయ్యటం మన కనీస ధర్మం.
కనుక ఇండియాలో చదువుకుందికి విదేశీయులు వచ్చినా, ఇండియాలో పాఠాలు చెప్పటానికి, పరిశోధనలు చెయ్యటానికి విదేశీయులు వచ్చినా వారి ఉనికి పూర్తిగా విస్మరించి ఊరుకోకుండా మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించండి. నిజమే ఎవరి పనులు వారికి ఉంటాయి. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, యాత్రలు, వగైరాలు. అన్ని బాధ్యతలతో ఇది మరొక బాధ్యత అనుకొండి. మీరు పనిచేసే చోట విదేశీయులు కొన్నాళ్ళపాటు ఉండటానికి వస్తే అవకాశంకల్పించుకుని ఒకసారి మీ ఇంటికి - కనీసం కాఫీకి - పిలవండి. లేక పోతే మీతో దేవాలయానికి తీసుకు వెళ్ళండి.
Monday, June 15, 2009
MP ల జీతాలు, మంత్రులకి అవకాశాలు!!
"ప్రజాసేవ కోసం!" అని తడుముకోకుండా చెబుతారు, సమాధానం.
ఒక MP ఆ పదవి కోసం ఎందుకు అలా తాపత్రయ పడతాడో నిజం నేను చెబుతాను, వినండి. ముందస్తుగా MP అవటానికి ఏ చదువూ అక్కర లేదు, రేంకులు రానక్కర లేదు, నిరక్షరకుక్షి (అంటే, పొట్ట చించితే అక్షరం ముక్క లేని వాడు) కూడా MP అవొచ్చు.
ఇహ, MP అయిన తరువాత, ఆ వ్యక్తికి ముట్టే జీతం, అమాంబాపతులు:
నెలవారీ జీతం, కేవలం రూ. 12,000/= మాత్రమే.
నెలవారీ ఖర్చులు: రూ. 10,000/=
నెలవారీ ఆఫీసు ఖర్చులు: రూ. 14,000/=
ప్రయాణపు ఖర్చులు: కి. మీ. ఒక్కంటికి, కేవలం రూ.8/. ఈ లెక్కని ఒక్క సారి హైదరాబాదు నుండి ఢిల్లీ వెళ్ళి తిరిగి రావటానికి: 6,000 కి. మీ. x 8 = రూ. 48,000/=
రోజువారీ కరువు భత్యం (పార్లమెంటు పనిచేస్తూన్న రోజులలో): రూ. 500/=
ట్రెయిన్ లో మొదటి తరగతి ఎ. సి. లో: ఉచితం (ఎన్ని సార్లు కావలిస్తే అన్ని సార్లు, ఇండియాలో ఎక్కడి నుండి ఎక్కడికయినా సరే)
విమానంలో బిజినెస్ క్లాసులో ఏడాదికి 40 సార్లు (భార్యతో సహా లేదా సెక్రట్రీ): ఉచితం
ఢిల్లీ లో MP హాస్టల్ లో అద్దె: ఉచితం
ఉన్న ఊళ్ళో విద్యుత్తుకి అయే ఖర్చులు: ఉచితం (50,000 యూనిట్ల వరకు)
టెలిఫోను: 1,70,000 కాల్స్ ఉచితం (లోకల్)
వెరసి -
ఏడాదికి ఒక MP "ఏనుగు"ని భరించటానికి పౌరులకి అయే కనీసపు ఖర్చు: రూ. 32,00,000/=
నాకు తెలిసినంత వరకు, Ph.D. చేసి, యూనివర్సిటీలో పని చేసే ఆచార్యుడికి ఏటికి రూ. 3,00,000/=
కంపెనీ లో పని చేసే CEO కి ఏటికి రూ. 60,00,000 ఉండొచ్చేమో? (తెలియదు)
కాని ఈ రెండు ఉద్యోగాలకి జీవితంలో ఎన్నేళ్ళో కష్టపడి చదువుకోవాలి. ఏ చదువూ అక్కర లేకుండా ఏడాదికి 32 లక్షలు వచ్చే ఉద్యోగం బాగులేదూ?
ఇదే MP మంత్రి అయితే ఆ వ్యక్తి ఆర్జనకి ఆకాశమే అవధి. ఎలా అంటారా?
నిన్న కాక మొన్న వాషింగ్టన్ విమానాశ్రయంలో ఒక వైద్యుణ్ణి కలుసుకున్నాను. చెన్నైలో మెదడు మీద శస్త్ర చికిత్స చెయ్యగలిగే సదుపాయాలతో ఒక ఆసుపత్రి కడుతున్నాడు, ట. "మా హైదరాబాదులో కూడ ఒక "బ్రేంచి" పెట్టకూడదా?" అని అమాయకంగా అడిగేను.
"పెడదామనే అనుకున్నాం. స్థలం కొనుక్కుందుకి ప్రభుత్వం 30 కోట్లు సహాయం చేస్తే మా ఖర్చులతో మేము ఆసుపత్రి కడతాము" అని మీ మంత్రి గారిని (పేరు ఇక్కడ రాసే ధైర్యం లేదు!) అడిగేము."
"ముప్ఫై అయిదు కోట్లు మంజూరు చేస్తాము, కాని అందులో అయిదు కోట్లు రసీదు లేకుండా మంత్రి గారికి ముట్టచెప్పాలి" అని షరతు పెట్టేరు ట."
కనుక MP లు అందరూ, బహుపరాక్. MPలు గా మీరు గణించేవి చిల్లర డబ్బులు. సాదరు కి కూడ సరిపోవు. మళుపు తిరిగితే అంతా బంగారమే. మంత్రి అయిపొండి.
Tuesday, April 28, 2009
ఈ ప్రపంచం పోకడ: ఆర్ధిక మాంద్యం
ఈ ఆర్ధిక దుస్తితి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా - పర్యావరణానికి కొంత మంచి కూడా జరుగుతోంది. మూతపడ్డ కర్మాగారాలు వాతావరణంలోకి కాలుష్యాలని విసర్జించటం తగ్గించేయి. ఉద్యోగాలు ఊడిన వాళ్ళు, జేబుల్లో డబ్బులు లేక కార్లలో షికారులు తగ్గించేరు. ఇంటిపట్టున ఉన్నప్పుడు వాయునియంత్రణ సౌకర్యాలకి స్వస్తి చెప్పి, కిటికీలు తెరుచుకుని, విసనకర్రలతో విసురుకుంటున్నారు. ఆదాయం తగ్గిపోయిన కంపెనీలలో మిగిలిన ఉద్యోగస్తులు విమానాల ప్రయాణాలు తగ్గించి, ముఖాముఖీ సమావేశాలకి బదులు టెలిఫోను వాడకం అలవాటు చేసుకుంటున్నారు. వీటన్నిటి పర్యవసానం ఏమిటంటే అమెరికాలో, 2008 లో, పెట్రోలు వాడకం ఆరు శాతం తగ్గిపోయింది. ఆ ప్రాప్తికి వాతావరణంలో ప్రవేశించే కర్బనం శాతం కూడా తగ్గింది.
ఈ ప్రపంచం నడవటానికి రెండు మూలశక్తులు కావాలి. ఒకటి అప్పు, రెండు ఇంధనం. మన దురదృష్టం కొద్దీ ఆర్ధిక విపత్తు, ఇంధనపు విపత్తు, రెండూ ఒక్కసారే వచ్చిపడ్డాయి. దీనికి కారణం ఈ రెండు పైపైకి వేర్వేరుగా కనిపించినా ఇవి రెండూ ముడిపడ్డ సమశ్యలు. ఇంధనం (బొగ్గు, రాతిచమురు, సహజవాయువులు) మన కండ బలానికి ప్రవర్ధకి (amplifier) అయితే అప్పు మన జేబులో ఉన్న డబ్బుకి ప్రవర్ధకి. మన కండబలంతో చెయ్యలేనివి ఎన్నో యంత్రాలు ఉపయోగించి చెయ్యగలుగుతున్నాం. మన సొంత డబ్బుతో చెయ్యలేనివి ఎన్నో అప్పు చేసి చెయ్యగలుగుతున్నాం. ఈ రెండింటి సహాయంతోటే పారిశ్రామిక విప్లవం సాధ్యం అయింది. ఈ రెండు శక్తుల మధ్య అదృశ్యమైన తుల్యత (చైనా వారి ఇంగ్-యాంగ్ లా) ఉన్నంతసేపూ ఈ బండి సజావుగా నడుస్తుంది. కాని అప్పుడప్పుడు - మంచి ఉద్దేశ్యం తోటో, ఓట్ల కొరకో - ప్రభుత్వాలు ఈ పాత్రలో వేళ్ళు పెట్టి కెలుకుతాయి. దాని పర్యవసానం ఎలాగుంటుందో చూద్దాం.
2008 వేసంగిలో పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు దాటింది కదా. అలవాట్లు మార్చుకున్నాను. కారు తోలటం తగ్గించి బస్సులు, బార్టు (BART) వాడటం పెంచేను; పర్సుకీ పర్యావరణానికీ కూడా మంచిదనుకుంటూ సమర్ధించుకున్నాను. చాల రోజులబట్టి కొత్త కారు కొనుక్కుందామని సరదా పడ్డవాడిని ఆ ప్రణాళికకి స్వస్తి పలికేను. ఏదో గుడ్డిలో మెల్ల పర్యావరణ కాలుష్యం తగ్గటానికి చంద్రుడికోనూలు పోగులా నేనూ ఇతోధికంగా సహాయపడుతున్నానని సంతోషించేను. నా లాగే చాల మంది కార్లు కొనటం మానేశారు. దాంతో అమెరికాలో రెండు కార్ల కంపెనీలు దివాలా ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాయి. నేను కారు కొనుక్కుందామని దాచుకుంటూన్న డబ్బులని, నాతో చెప్పకుండా, నన్ను అడగకుండా, నా జేబులో చెయ్యి పెట్టి లాక్కుని ఆ డబ్బుని ములిగిపోతూన్న కార్ల కంపెనీలకి ఆసరాగా అప్పిచ్చింది అమెరికా ప్రభుత్వం. నా డబ్బూ హరించిపోయింది, కారూ లేక పోయింది.
ప్రజలు కార్లు నడపటం తగ్గిస్తే అది పర్యావరణానికి మంచిదే కాని ప్రపంచపు ఆర్ధిక ఆరోగ్యానికి మంచిది కాదేమో. ఈ విషచక్రం లోంచి బయట పడాలంటే హైబ్రిడ్ కార్లు కొని వాడాలిట. హైబ్రిడ్ కార్లని గేలనుకి 45 మైళ్ళవరకు నడపొచ్చు. అంచేత అవి పర్యావరణాన్ని అంతగా కలుషితం చెయ్యవు. కనుక హైబ్రిడ్ కార్లు అలవాటయిన తరువాత ఇంతకు పూర్వం అయే పెట్రోలు బడ్జెట్ తో రెట్టింపు దూరం వెళ్ళొచ్చు. కనుక పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు అయినా మనకి రెండు డాలర్లకే కిట్టింది కదా. కనుక వెధవది బస్సులలోనూ, బార్టులలోనూ ఎవడు తిరుగుతాడు, మన కారులో మనం రాజాలా తిరగొచ్చు అని అందరూ అనుకుంటే - అనుకుని పూర్వం కంటే ఎక్కువ తిరగటం మొదలుపెడితే - నష్టపోయేది పర్యావరణమే.
హైబ్రిడ్ కార్లు మానేసి ఎలక్ట్రిక్ కార్లు వాడితేనో? ఎలక్ట్రిక్ కార్లు వాడకం పెరిగితే విద్యుత్తు వాడకం పెరుగుతుంది. ఆ విద్యుత్తు ఎక్కడ నుండి వస్తుంది? దానికోసం మరొక పవర్ హౌస్ కట్టాలి కదా. దాంట్లో వాడటానికి బొగ్గో, ఇంధనపు తైలమో వాడాలి కదా. అది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది కదా.
ఈ సమశ్యకి పరిష్కారం నా దగ్గర లేదు కానీ, ఈ సమశ్య ఇప్పటిది కాదని మనవి చేసుకుంటున్నాను. దీని పరిష్కారానికి అమెరికాలో ప్రజలకి ఉపాయాలు తట్టకనూ పోలేదు. వీళ్ళ పరిష్కార ధోరణి ఎలా ఉంటుందో నా స్వానుభవం ద్వారా మనవి చేసుకుంటాను. 1960-1970 దశకంలో పర్యావరణ సమశ్య ప్రజల దృష్టిలో పడటం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో, ఒక వేసంగిలో, నేను కొలంబస్, ఒహాయోలో ఒక వైజ్ఞానిక సమావేశానికి హాజరయేను. రోజల్లా ప్రసంగాలు అయేయి. సాయంకాలం వాయునియంత్రణ ఉన్న హొటేలు గదిలో, కాక్‌టెయిల్ పార్టీ జరుగుతోంది. రెండు చుక్కలు పడ్డ తరువాత అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ పర్యావరణ సమస్యకి ఒక పరిష్కారమార్గం సూచించేరు. వారనేది ఏమిటంటే - మనం అమెరికాలో ఉన్నది 300 మిలియన్లు. ఇండియా, చైనా కలిపి దరిదాపు రెండు బిలియను ప్రజలు ఉన్నారు. వీరందరూ అమెరికాని అనుకరిస్తూ, ప్రగతి పథం వెంబడి ప్రయాణం చేస్తూ, సుఖ సౌఖ్యాలు (అంటే కార్లు, వాయునియంత్రణ యంత్రాలు, మొదలైనవి) కోరటం మొదలు పెట్టేరంటే వాతావరణ కాలుష్యం అపరిమితంగా పెరిగిపోతుంది. వాళ్ళు ఎలాగూ కష్టజీవితానికి అలవాటు పడిపోయేరు. కనుక పర్యావరణ కాలుష్య నియంత్రణ అక్కడ మొదలవాలి..." ఈ ధోరణిలో పోతూన్న ఆ వాక్ప్రవాహం ఎక్కడికెళుతోందో మీ ఊహకి వదిలేస్తాను.
ఇంతలో హొటేల్లో విద్యుత్తు సరఫరాకి అంతరాయం వచ్చింది. దీపాలు లేవు, ఎయిర్ కండిషనర్లు ఆగిపోయాయి. ఆగస్టు నెలేమో ఉక్క విపరీతంగా ఉంది. అప్పటి వరకూ నోరు మూసుకు కూర్చున్న నేను అన్నాను. "ఎందుకలా ఆపసోపాలు పడతారు. ఇండియా, చైనా దేశాల ప్రజలలాగే మనమూ పర్యావరణ ఆరోగ్యానికి దోహదం చేద్దాం."
ఈ కథ ఎందుకు చెప్పొచ్చేనంటే బుష్ ఆధ్వర్యంలో అమెరికా క్యోటో ఒడంబడికకి ఒప్పుకో లేదు. నెల్లాళ్ళ క్రితం కోపెన్‌హేగన్‌లో మరొక సమావేశం అయింది. సుదూర వాతావరణం (climate) గురించి, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచటం గురించి చర్చలు జరిగేయి. ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యం ధర్మమా అని 2008 లో పర్యావరణానికి జరగబోయే హాని జరగలేదు. అంతా ఇండియా, చైనాలదే తప్పు అన్న ధోరణిలో కూడ కొద్దిగా మార్పు కనిపిస్తొంది.
Friday, April 10, 2009
ఖగోళశాస్త్రంలో ఎవరు ముందు?
ఖగోళశాస్త్రంలో "ఎవరు ముందు?" అనేది ఒక చిక్కు ప్రశ్న? ముఖ్యంగా "ప్రాచ్యులు ముందా? పాశ్చాత్యులు ముందా?" అన్న ప్రశ్న వచ్చేసరికల్లా, "అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి" అని మనవాళ్ళంటారు, "మీ మొహం మీకేమీ తెలియదు" అని మనని మన ప్రజ్ఞని పాశ్చాత్యులు కించపరుస్తూ ఉంటారు. ఈ తగవు రివాజు అయిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఆధారాలు చూపించకుండా మాట్లాడే మన అలవాటు కావచ్చు.
ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.
ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.
"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!
యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం
మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం
ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః
చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః
షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః
ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.
క.
ధీరవ్రత! రాజన్యకు
మారక! నీ హృదయమందు మసలిన కార్య
బారూఢిగా నెరుంగుదు
నారయనది పొందరానిదైనను నిత్తున్
వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారు యేండ్లు సనం బ్రాపింతువు."
దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.
భూ అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?
విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.
ఈ కథ ఇక్కడితో ఆపెస్తే నేను నేనెందుకవుతాను? నాకు మొట్టమొదట ఈ విషయం గురించి అమెరికాలో M. S. డిగ్రీ చేస్తూన్నప్పుడు తెలిసింది. భౌతిక శాస్త్రంలో భూమి కదలికని గురించి అధ్యయనం చేస్తూన్నప్పుడు భూమి గోళాకారంగా ఉండదనిన్నీ, పొట్ట దగ్గర (మనలో చాలమందికి మల్లే?) కైవారం ఎక్కువ అనిన్నీ, దీని వల్ల బొంగరంలా తిరుగుతూన్న భూమి అక్షం స్థిరంగా ధ్రువ నక్షత్రం వైపు ఎల్లప్పుడూ చూపించకుండా ఆ నక్షత్రం చుట్టూ ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గణితం ఉపయోగించి లెక్కకట్టటం నేర్చుకున్నాను. నూటన్ తరువాత గణితపరంగా అవగతమైన ఈ విషయం ఏ పనిముట్లు లేకుండా, ఉత్త కంటితో చూసి గమనించిన మన పూర్వుల ప్రతిభని తలుచుకుని మేమంతా "ఔరా!" అని ఆశ్చర్యపోయేం.
Wednesday, April 8, 2009
మనం ఏమీ చెయ్యలేమా?
స్విట్జర్లండు బేంకులలోని రహశ్య ఖాతాలలో డెబ్భయ్ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయిట. ఎవ్వరో నాకు ఈ-మెయిల్ చెయ్యగా తెలిసింది!
అయ్యబాబోయ్ 70,00,000 కోట్ల రూపాయలు!!
ఈ ప్రపంచంలో 180 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలవారు అందరూ దొంగచాటుగా డబ్బులు పట్టుకొచ్చి స్విట్జర్లండులో దాచుకోవటంలో వార్తావిశేషం ఏదీ లేదు. కాని ఈ 180 దేశాలలోనూ మన భారతదేశానిదే అగ్రస్థానం ట - ఇలా దొంగచాటుగా డబ్బు దాచటంలో.
ఎవరబ్బా ఇలా దాస్తూన్నది? మన రాజకీయ నాయకులే లంచాలు తినేసి ఇలా ప్రజల సొమ్ముని ఒడికేస్తున్నారని కొందరి ఊహాగానం. అన్ని పార్టీల వారూను.
అక్కడ బేంకులో డబ్బు అలా మూలుగుతూ ఉండగా మన నాయకులు ఇక్కడ టపా కట్టెస్తే ఆ డబ్బు గోవిందా గోవింద. మనం తిన్నది కాదు, మరొకడికి పెట్టింది కాదు. కనీసం తిరపతి హుండీలో వేస్తే పుణ్యం, పురుషార్ధం.
అయ్యబాబోయ్ డెబ్బయ్ లక్షల కోట్ల రూపాయలే నా ఊహకి కూడ అందటం లేదు.
ఈ పరిస్థితికి తరుణోపాయం లేదా? లేకేమి? ఉంది. ఒకటి, ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రెండు, ప్రస్తుతం పదవిలో ఉన్న నాయకులని, గతంలో పదవి అలంకరించిన నాయకులని తప్పించి కొత్త వారిని ఎన్నుకుని చూడాలి. మూడొంతులు వాళ్ళూ తినెస్తారు. అప్పుడు మనం మన కర్మ అని ఉత్తరీయం నెత్తిమీద వేసుకుని భోరుమని ఏడవాలి.
Monday, April 6, 2009
ద్వాదశ రాశులు
మనం మన దేశంలో వాడే మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, వగైరా ద్వాదశ రాశుల పేర్లనీ ఇంగ్లీషులో వాడే Aries, Taurus, Gemini, ... మొదలైన పేర్లతో పోల్చి చూస్తే వాటి అర్ధాలలో పోలిక కొట్టొచ్చినట్లు కనబడుతుంది కదా. కనుక ఈ పేర్లని మనం ముందు వాడితే మన దగ్గర పాశ్చాత్యులు కాపీ కొట్టయినా ఉండాలి, లేదా వాళ్ళ దగ్గరనుండి మనం కాపీ కొట్టయినా ఉండాలి. పాశ్చాత్యులని అడిగితే ఇది తప్పకుండా భారతీయులు చాల్డియనుల (బాబిలోనియా వాసులని యవనులు పిలచే పేరు. వీరి ఉనికి సా. శ. పూ 6 వ శతాబ్దం) దగ్గర నుండి నిర్మొహమాటంగా కాపీకొట్టేసేరనే అంటారు. ఇంగ్లీషులోనే కాని తెలుగులో కూడ ఆలోచించటం తెలియనిన్నీ, ఇంగ్లీషు పుస్తకాలనే ఉగ్గుపాలతో అవుపోశన పట్టేసిన తెలుగు వాళ్ళని అడిగితే, "మనవాళ్ళు ఒఠ్ఠి వెధవాయిలోయ్! మూడొంతులు ఇంగ్లీషువాడి ఊహే "కరెక్టు" అంటారు. మీరేమంటారు?
ఋగ్వేదంలో దీర్ఘతమస్సు అనే ఋషి మొట్టమొదట పన్నెండు రాశుల ప్రస్తావన చేశాడు: "ద్వాదశ ప్రథయశ్చక్రమేకం త్రీణినభ్యానిక ఉతిచ్చిరేత! తస్మిన్‌త్సాకం త్రిశతాన శంకవోర్సితాః షష్టిర్నచలా చలాసః" - (ఋ I-164-48)
ఇక్కడ నాకు అర్ధం అయినంత మేరకి అర్ధం చెబుతాను. (వేద) సంస్కృతం వచ్చిన పాఠకులు ఎవ్వరయినా టీకా తాత్పర్యాలు చెప్పగలరు. ఇక్కడ ఒక చక్రం ప్రస్తావించబడింది. ఇది సంవత్సరాత్మకమైన కాలచక్రం. చక్రం తిరిగేటప్పుడు నేలని తాకే ప్రథని - పరిధిని - "నేమి" అని కూడ అంటారు. ఈ పరిథి పన్నెండు భాగాలుట. ఈ పన్నెండు భాగాలే రాశులు. ఈ చక్రానికి 360 ఆకులు ఉన్నాయిట. ఈ 360 ఆకులు 360 రోజులు లేదా 360 భాగలు. ఈ భాగలనే మన తెలుగువాళ్ళు డిగ్రీలు అంటారు. ఈ లెక్కని రాశికి 30 భాగలు.
ఇంతే కాదు. మేష రాశి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది: (I-51-1, I-52-2). "మేషానికి అగ్ని వాహనం ఏమిటి? నా బొంద, ఇదేమీ సబబుగా లేదు" అని మీరు అనొచ్చు. ఆకాశంలోకి తలెత్తి చూస్తే మేష రాశి పైన కృత్తిక రాశి ఉంది. కృత్తికలు అగ్ని దేవతలు. కనుక మేషానికి పైన అగ్ని ఉన్నట్లే కదా. లేదా అగ్నికి మేషం వాహనం అన్నమాట.
నేను బ్లాగే మరో స్థలం: http://lolakam.blogspot.com
Friday, April 3, 2009
మరచినదానిని reQall చేసుకోవటం ఎలా?
ఏప్రిల్ 2009
మరుపు మనిషికి సహజం. నాలుగు వస్తువులు కొనుక్కురమ్మని నా శ్రీమతి బజారుకి పంపుతుంది. నాకు మరుపెక్కువ అని నాకు తెలుసు కాబట్టి ఒక కాగితం మీద అన్నీ జాగ్రత్తగా రాసుకుంటాను. షాపుకెళ్ళేలోగా ఆ కాగితాన్ని ఎక్కడో పారేసుకుంటాను. ఒకదానికి బదులు మరొకటి పట్టుకొస్తాను. చివాట్లు తింటాను. ఇటువంటి ప్రమాదాలు చాలా మందికి జరుగుతాయి.
David Pogue కొమ్ములు తిరిగిన పత్రికా విలేఖరి. తరచు మరిచిపోయేవారికి అతను ఒక చిట్కా చెప్పేడు. ఈ మూడు నిమిషాల విడియో చూడండి.
Watch video on reQall by david Pogue of NY Times at http://video.nytimes.com/video/playlist/technology/1194811622271/index.html
ఈ లింకు మీద క్లిక్ చెయ్యటానికి కుదరకపోతే ఈ URL ని కాపీ చేసి మీ బ్రౌజర్ లో అతికించండి.
లేదా తిన్నగా reQall.com కి వెళ్ళి అక్కడ ఈ ఉపకరణాన్ని వాడి చూడండి. మీకు దమ్మిడీ ఖర్చు లేదు.
Friday, February 20, 2009
మన ఆర్ధిక దుస్థితిని గట్టెక్కించటం ఎలా?
నన్నెవరూ అడగరు కానీ అడిగితే మన ఈ ఆర్ధిక దుస్థితి నుంచి తేరుకోటానికో మార్గం ఉంది. ఈ కిటుకు, మరొక కాలంలో, మరొక సందర్భంలో నాకు తెన్నేటి విశ్వనాధం గారు చెప్పేరు. నాకొక్కడికే కాదండోయ్. సభలో ఉన్న నలుగురికీ చెప్పేరు. అలాగని సభలో నలుగురే ఉన్నారనుకునేరు. ఆ నాడు మైదానం మనుష్యులతో కిటకిటలాడిపోయింది. మొదట "నాతో" అని, తరువాత "నలుగురితో" అని చివరికి "ఎంతోమంది" అంటున్నానని తప్పుపట్టకుండా అసలు విషయం చెప్పనివ్వండి.
విశ్వనాధం గారు చెప్పిన కిటుకు చిన్న కథ రూపంలో చెప్పేరు. అది ముందు టూకీగా చెబుతాను. ఒక రుషి నదిలో నిలబడి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆకాశంలో ఎగురుతూన్న ఒక డేగ కాళ్ళ పట్టు నుండి జారి దోసిట్లో ఒక కప్ప పడింది. దాని శరీరం అంతా గోళ్ళు గీరుకుపోయి ఉన్నాయేమో అది బ్రతికే అవకాశం తక్కువగా కనిపించింది. రుషి తన తపోశక్తిని అంతా ధారపోసినా అది బతికే అవకాశం తక్కువని సాక్షాత్తూ ఆ బ్రహ్మ దేవుడే కనిపించి చెప్పేడు. చెప్పి ఊరుకోకుండా ఒక తరుణోపాయం చెప్పేడు. చివికిపోయిన ఆ కప్పని ఒదిలేసి తన తపోశక్తితో ఒక కొత్త ప్రాణిని సృష్టించమన్నాడు. అప్పుడు ఆ రుషి ఏం చేసేడు? ఎలాగూ కొత్త దానిని సృష్టించినప్పుడు దానిని మరొక కప్పలా కాకుండా అందంగా మనిషిలా సృష్టించేడు. ఆ వ్యక్తే అతిలోకసుందరి అయిన మండోదరి - రావణాసురుడి భార్య. అంత అందమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని రావణుడు సీత వెంట పడటం మన అదృష్టం! లేకపోతే మనకి రామాయణం ఉండేది కాదు.
ఈ కథ చెప్పి విశ్వనాధం గారు "కాంగ్రెస్ పార్టీ కప్పలా చివికిపోయింది. నెహ్రూ ఎంత మొనగాడైనా ఇలా చివికిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి బతికించలేడు. కనుక మండోదరి లాంటి అందమైన కొత్త పార్టీని పెట్టేం. మీరంతా ప్రజాపార్టీకే ఓటు వెయ్యండి" మా అందరికీ ఒక సలహా పారేసేరు.
ఇప్పుడు అమెరికాలో మన ఆర్ధిక పరిస్థితి చిరిగి, చివికి, మరమ్మత్తుకి లొంగని, టెర్మినల్ పేషెంటు" లా దీనావస్థలో ఉంది కదా? (అంటే కంప్యూటరు టెర్మినల్ దగ్గర కూర్చుని పేషెంటుగా ఈ బ్లాగుని చదువుతూన్న చదువరిలా కాదండోయ్!) మన ఒబామా, ఇంతకి ముందు బుష్, ఈ చివికిపోయిన వ్యవస్థకి ప్రాణం పోసి రక్షిద్దామని ట్రిలియన్లకొద్దీ డాలర్లు గుమ్మరిస్తున్నారు. కానీ, ఇలా చివికి శిధిలమయిపోయిన బేంకు (లేదా బ్యాంకు) లని పునరుద్ధరించేకంటె వీటిని చావనిచ్చి, వీటి స్థానంలో సరి కొత్త, బాగా, మంచి సమర్ధతతో పని చేసే, సంస్థలని నిర్మించి వాటికి మరొక కొత్త పేరు పెట్టి నడిపితే బాగుంటుంది.
ఈ ఊహ నా బుర్రలో కొంతవరకూ మాత్రమే పుట్టింది. నెట్‌స్కేప్ కనిపెట్టిన మార్క్ ఏండ్రీసన్ ఏమిటన్నాడంటే ఈ సరికొత్త బేంకు లని ఇంటర్నెట్‌లో పెట్టి కంప్యూటర్ల చేత నడిపించమన్నాడు. ఏండ్రీసన్ అనలేదు కానీ, ఇలా ఈ బేంకింగు వ్యవస్థ కి కొత్త పేరు పెట్టి అంతర్జాలం మీద నడిపిస్తే ఇప్పుడు జరుగుతూన్నన్ని గూడుపుఠాణీలు, కుమ్మక్కులూ జరగటానికి అవకాశం తక్కువ. అంతేకాదు. ఈ కొత్త వ్యవస్థ ని నిర్మించటానికి బోలెడు కంప్యూటర్లు, ప్రోగ్రామర్లు కావాలి కనుక ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయి. దానితో ఈ ఆర్ధిక మాంద్యత తగ్గవచ్చు. అయ్యా! అమ్మా! నేను మంచి చెప్పినా సరే, నా మాట వింటే నాకు ఎక్కడ "క్రెడిట్" వచ్చెస్తుందో అని ఎవ్వరూ వినరు. కాని చెప్పకుండా ఉండలేను కదా!
Monday, February 16, 2009
ఈ ఆడువారు!!!
"ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే అన్నాడు" ఒక సినిమా కవి. అంటే, వారికి మనస్సులో ఉండేది ఒకటి, పైకి చెప్పేది మరొకటి నాకు అర్ధం అవుతున్నాది. Men are from Mars and Women are from Venus అంటారు. అంటే మాట్లాడే తీరు వేరవటమే కాకుండా ఈ ఆడువారు మరో ప్రపంచం నుండే వచ్చేరు అంటాడు (లేక అంటుంది) ఇంగ్లీషులో ఈ వాక్యం రాసిన వ్యక్తి. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం. సర్వసాధారణంగా మగవారికి "వాళ్ళు" ఏమంటున్నారో అర్ధం అయి చావదు. "వాళ్ళు" చేసే పనులు ఎందుకు అలా చేస్తున్నారో అస్సలే అర్ధం కాదు. అందుకనే పురాణాలు, ప్రబంధాల నుండి కట్టుకథలు, కొంటెబొమ్మల వరకు, ఏ మాధ్యమంలో చూసినా ఆడువారికి మగవారికీ మధ్య వచ్చే "సంఘర్షణ" మీద బోలెడన్ని వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. కారు తోలటం తీసుకొండి. ఈ విషయంలో ఆడవారి చాకచక్యాన్ని "ఆడ డ్రైవర్లు!!" అని రెండు ముక్కల్లో తేల్చి పారెస్తారు మగరాయుళ్ళు. ఆడువారి మీద అంత తొందరగా తీర్మానించేసేలోగా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఏదో కొత్త ఊళ్ళో కారు నడుపుతూ, ఒక చేతిలో మేపు ఉండీ కూడ దారి తప్పిపోయి, అస్సలు ఎక్కడ ఉన్నామో కూడ తెలియని పరిస్థితిలో, తిరిగిన దారి వెంబడే తిరుగుతూ, ఈతరానివాడు నీళ్ళల్లో బుడకలు వేస్తూన్నట్లు ఉంటాడు మన గోపాళం. అటువంటి సందర్భాలలో పక్క కుర్చీలో ఉన్న రాధ ఎన్నిసార్లు గోపాళాన్ని గట్టెంకించలేదు? ఆడవాళ్ళకి మేపులు అక్కరలేదు. "0.3 మైళ్ళు తరువాత కుడి పక్కకి తిరుగు" వంటి నిర్దేశాలు అక్కరలేదు. "మేసీస్ దాటిన తరువాత వచ్చే కారు డీలర్ దగ్గర కుడి పక్కకి తిరగాలి" అని వాళ్ళ బుర్రలో ఉంటుంది కాబోలు.
నేనే కాదు. ఆడ, మగ అనే విచక్షణ లేకుండా ఎంతోమంది విజ్ఞానవేత్తలు "ఆడువారు ఎందుకు మగవారిలా ఉండరు?" అని ఆలోచించి పరిశోధన చెయ్యటం మొదలుపెట్టేరు. ఆఖరికి అదృష్టవశాత్తు ఒక ఆడ సైంటిస్టు ముందుకు వచ్చి ఒక ప్రతిపాదనని చేసేరు. ఈ "ప్రతిపాదన" రుజువైతే అప్పుడు దీన్ని "సిద్ధాంతం" అంటాం. అదృష్టవశాత్తు అని ఎందుకన్నానంటే ఇటువంటి వాటిల్లో మగవాళ్ళు తమ బుర్రని పెడితే అది ఉచ్చులో పెట్టిన రీతి పరిణమిస్తుంది. ఈ ప్రతిపాదన మొదట్లో ఎప్పుడు ఎక్కడ జరిగిందో నేను చెప్పలేను కానీ, నేను చదవటం మాత్రం Scientific American సెప్టెంబరు 1992 సంచికలో చదివేను. ప్రొఫెసర్ డొరీన్ కిమూరా - బార్నరడ్ కాలేజీలో పనిచేసే సైకాలజీ ప్రొఫెసరు క్రిస్టీన్ విలియంస్ తో ఏకీభవిస్తూ - ఆడవాళ్ళ శరీర నిర్మాణమే వేరు!" అని గంభీరమైన వదనంతో శలవిచ్చేరు. ఆ విషయం మనకి తెలీదేమిటి? అయిదో తరగతి కుర్రాణ్ణి అడిగితే చెబుతాడు. ప్రేమలో పడబోతూన్న ఉన్నత పాఠశాల విద్యార్ధి అయితే మన ప్రభంద కవుల పద్యాలు ఉదహరిస్తూ మరీ చెబుతాడు.
"మీరు పొరపాటు పడుతున్నారు. నేననేది ఒకటి, మీరనుకుంటూన్నది మరొకటి?" అని ఆమె ఆడవారి మాటలని అపార్ధం చేసుకుంటూన్న మగరాయుళ్ళని సరిదిద్దింది.
గమనించేరా? ఇక్కడ మనం చేస్తూన్న తప్పు ఏమిటో! ఇక్కడ డొరీన్, క్రిస్టీన్ ఆడవాళ్ళల్లా మన కంటికి కనిపించినా వాళ్ళు యూనివర్శిటీ ప్రొఫెసర్లు అని మనం మరచిపోకూడదు. మనం స్త్రీని చూస్తే ముందస్తుగా మనని మెలికలు తిప్పించేవి ఆమె మెలికలు, ఒంపులు, వగైరా; మిగిలినవి ఏమీ కనబడవు, అర్జునుడికి మత్స్య యంత్రంలో చేప కన్ను ఒక్కటే కనిపించినట్లు అనుకొండి. ఒక ఆడ సైకాలజీ ప్రొఫెసరు మరొక ఆడదానిని చూస్తే ఆమెకి ఒంపులు కనిపించవు, ఒక "వ్యక్తి" కనబడుతుంది ట. (ఇది ఆడవాళ్ళు చెబితే తెలియాలి కాని నాకు ఎలా తెలుస్తుంది? ఇటువంటి సందర్భంలోనే ఆదిశంకరుడంతటివాడు ఉభయభారతి చేతుల్లో దరిదాపు చిత్తయిపోయేడు కదా?) ఈ "వ్యక్తి" కి వ్యక్తిత్వం ఎక్కడనుండి వచ్చింది? మెదడులో ఉన్న నూరానులనే జీవకణాల మధ్య ఉండే అల్లిక వల్ల. దీన్నే అందరికీ అర్ధం అయే శుద్ధ తెలుగులో చెబుతాను, వినండి. మన personality ని, మన mind stuff ని నిర్ణయించేది మన మెదడులో ఉండే wiring. మెదడులో ఉన్న ఈ wiring తేడాగా ఉండటం వల్ల ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకేలా ఉండరు. (బాహ్యరూపం సంగతి సరే, ఇక్కడ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తున్నాను.)
మన తెలుగువాళ్ళకి కంప్యూటర్ పరిభాష ఉగ్గుపాలతో పట్టినట్లు అబ్బేసింది కనుక ఇక్కడ కంప్యూటర్ ఉపమానం ఒకటి చెబుతాను. మగవాళ్ళ బుర్ర IBM PC లా ఉంటే ఆడవాళ్ళ బుర్ర Apple Mac లా ఉంటుందనుకొండి. లేకపోతే పురుషుల బుర్రలో Intel chip ఉంటే ఆడవాళ్ళ బుర్రలో Motorola chip ఉంటుందనుకొండి. చూశారా, ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అని చెప్పటం లేదు. రెండింటి కట్టడి వేరు.
చేసే పని చేసేదాని కట్టడి మీద ఆధారపడి ఉంటుందనే నమ్మకం కొంతమందిలో ఉంది. దీన్నే ఇంగ్లీషులో function follows structure అంటారు. కనుక మగవాళ్ళ బుర్రలు మేపులు చదవటానికి అనువుగా నిర్మించబడి ఉండొచ్చు. అందుకే మగవాళ్ళు మేపుల మీద ఆధారపడతారు.
"అహఁ, అలా కాదు. మేపులని నిర్మించినది అధికారంలో ఉన్న మగవాళ్ళు. కనుక వారికి అర్ధం అయేటట్లు వారు నిర్మించుకున్నారు. వాళ్ళు మేపులని గీసేటప్పుడు అవి ఆడవారికి అర్ధం అవుతున్నాయో, లేదో ఎప్పుడైనా ఆడువారిని సంప్రదించేరా?" అని ప్రొఫెసర్ విలియంస్ సున్నితంగానే మందలించేరు. "మొట్టమొదటి రోడ్డు మేపు ఆడది గీసి ఉంటే మేపు మీద దూరాలు, రోడ్ల పేర్లు, అక్షాంశాలు, రేఖాంశాలు, వగైరాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా దారి వెంబడి ఏయే బండగుర్తులు కనిపిస్తాయో చూపుతూ మేపు గీసి ఉండేది. చూడండి, చిన్న పిల్లల పుస్తకాల్లోనూ, కొంటేబొమ్మలలోనూ ఇటువంటి 'మేపు'లే కనిపిస్తాయి."
ఇదంతా నేను పనిలేని మంగలిలా గొరుగుతూన్న పిల్లి తల అనుకోకండి. ఆడ, మగా ఒకేలా ఉండరని ఈమధ్యనే - మరెవ్వరో కాదు - వైద్యశాస్త్రజ్ఞులు కనుక్కున్నారు! ఇంతవరకు జబ్బులని కుదర్చటంలో జరిగిన పరిశోధనలన్నిటిలోనూ, మగ వాడినే నమూనాగా తీసుకున్నారు. మగవాడి మీద పని చేసిన విధంగా మందులు ఆడవాళ్ళ మీద పని చెయ్యవని ఈ మధ్య తెలిసినది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే - ఇప్పటివరకు మీరెవ్వరు గమనించకపోతే - మగవారు, ఆడువారు, వీరిద్దరూ రెండు విభిన్నమైన శాల్తీలు. అసలు నన్నడిగితే ఆడవాళ్ళు ఈ లోకం వాళ్ళు కాదు! వాళ్ళని అర్ధం చేసుకోటానికి మగవాళ్ళ బుర్రలో ఉన్న IBM PC చాలదు.
ఆడువారిని ఇంకా బాగా అర్ధం చేసుకుని మోక్షాన్ని సాధించాలంటే చదవటానికి బోలెడంత ముడిసరుకు ఉంది. ఉదాహరణకి -
http://health.howstuffworks.com/men-women-different-brains.htm
Sunday, February 15, 2009
జిహ్వకోరుచి
ఫిబ్రవరి 2009
“ఎవ్వరైనా అరటి పండుని ఎలా తింటారబ్బా! తొక్క ఒలిచిన అరటి పండు ఆకారం చూస్తే చాలు, నాకు దానిని నోట్లో పెట్టుకో బుద్ధి పుట్టదు!” అంటూ అరటి పండు ఇష్టంగా తినే నా బోంట్లని చూసి ఆశ్చర్య పడ్డది ఒక గృహిణి.
నేను అప్పుడే నోట్లో పెట్టుకుని ఒక కొరుకు కొరికిన అరటి పండు ముక్కని మింగాలో కక్కాలో తెలియని తికమక పరిస్థితిలో పడ్డాను. అరటి పండు నాకు ఇష్టం. రోజుకో పండైనా తింటాను. అరటి పండు ఎంత ఇష్టమైనా ఎవ్వరైనా ప్రసాదం అంటూ చేత్తో చిదిమి, ఒక ముక్కని నా చేతిలో పెడితే నాకు తినబుద్ధి కాదు.
కొందరు అరటి పండు తొక్కంతటినీ ఒలిచేసి, తొక్కని పారేసి అప్పుడు పండుని తింటారు. కొందరు పండుని చక్రాలులా కోసుకుని, ఒకొక్క చక్రాన్నే ఫోర్కుతో తింటారు. వెంకట్రావు పండు మొదటి భాగాన్నీ, చివరి భాగాన్నీ విరచి పారేసి, మధ్య భాగాన్నే తింటాడు. సూజన్ ‘మీట్ అండ్ పొటేటో’ పిల్ల. ఆమెకి పళ్ళల్లో కాని, కాయగూరల్లో కాని గింజ కనబడ కూడదు. ఒక సారి ఇండియన్ రెస్టారాంటుకి తీసికెళ్ళి బైంగన్ బర్తా తెప్పిస్తే వేలేసి ముట్టుకో లేదు – వంగ గింజలని చూసి. కడుపుతో ఉన్న కేటీ సాల్ట్ బిస్కట్ మీద పీనట్ బటర్ రాసుకుని, దాని మీద టూనా ఫిష్ పెట్టుకుని, దాని మీద నిలువుగా కోసిన అరటి పండు బద్దని పేర్చి తింటూంటే చూసే వాళ్ళకి కడుపులో తిప్పిందంటే తిప్పదూ?
పళ్ళన్నిటిలోనూ అగ్రగణ్యమైన మామిడిపండు అంటే మా అన్నయకి ఇష్టం లేదు. కాదు, కూడదు అని మొహమాట పెడితే కోసుకు తినే ఏ బంగినపల్లి పండో ఒక ముక్క తింటాడు తప్ప పిసుక్కు తినే పళ్ళంటే అస్సలు పడదు. మూతి చిదిమి, జీడి పిండేసి, సువర్ణరేఖ పండుని తింటూ ఉంటే రసంతో పాటు మామిడి పండు గుజ్జు చిన్న చిన్న ముక్కలుగా నోట్లోకి వస్తూ ఉంటే దాని రుచితో స్వర్గానికి ఒక మెట్టు దిగువకి చేరుకుంటాను నేను. అదే పండుని నోట్లో పెట్టుకుని వాంతి చేసుకున్నంత పని చేసేడు మా అన్నయ్య.
లోకో భిన్న రుచి అన్నారు. మనుష్యులు ఎన్ని రకాలు ఉన్నారో వాళ్ళ రుచుల ఎంపకాలు, తిండి అలవాట్లు కూడ దరిదాపుగా అన్ని రకాలూ ఉన్నాయి. మా పెద్దన్నయ్య కూతురు లక్ష్మి చిన్నప్పుడు కందిగుండ అన్నంలో కలుపుకు తినేది తప్ప కంచంలో ఉన్న మరొక వస్తువుని ముట్టుకునేది కాదు. నూనెలో వేసి సాతాళించిన చిక్కుడు కాయలని తప్ప మరేదీ ముట్టుకునేవాడు కాదు మా అబ్బాయి సునీలు. యోగర్టు అంటే అసహ్యించుకునేవాడు. ఇప్పుడు నాకు అరటి పండు ఎంత ఇష్టమో వాడికి యోగర్టు అంత ఇష్టం. వయస్సుతో పాటు రుచులు, అభిరుచులు మారతాయి మరి.
ప్రజలని వేలి ముద్రలతో ఎలా పోల్చుకో వచ్చో అలాగే వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని “నాలుక ముద్రలు” తో పోల్చుకో వచ్చేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వేలి ముద్రలు జీవితాంతం ఒకేలా ఉంటాయి. కాని, “నాలుక ముద్రలు” జీవితంలో క్రమేపీ మారుతూ ఉంటాయి. “నాలుగు రుచులూ తినటం అలవాటు చేసుకోవాలి” అంటూ మా మామ్మ మా చేత తను కాచిన వేప పళ్ళ పులుసుని బలవంతాన్న తినిపించేది. అప్పుడు ఈసురో మంటూ ఆ చేదు పులుసు తిన్నా, ఇప్పుడు అలాంటి పులుసు ఎవ్వరైనా కాచిపెడితే తిందామని కలలు కంటూ ఉంటాను.
కారానికి రుచేమిటి అని మీరనొచ్చు కానీ, అలవాటు పడని నోటికి కారం కారంగానే అనిపిస్తుంది; అలవాటు పడ్డ తర్వాత కారంలో కారం కంటే “రుచిని” నాలుక ఎక్కువగా పోల్తి పడుతుంది. కాఫీ కాని, కారం కాని, కాకరకాయ వేపుడు కాని – ఇవేవీ కూడా మొదటి సారి రుచించవు. అలవాటు పడ్డ తర్వాత వాటిని వదలబుద్ధి కాదు. కుంకుడుకాయ రసంలా ఉందని ఒకప్పుడు బీరుని చీదరించుకున్న నేను ఇప్పుడు బీరులలో రకరకాలని గుర్తించి, వాటిలో తేడాలు చెప్పగలను.
ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్నట్లే ఆ వ్యక్తి తినే ఆహార పదార్ధాలలలోనూ, తినే విధి విధానాలలోనూ కూడ ఒక ‘వ్యక్తిత్వం’ ఉంటుంది. మనం ఎక్కువ ఇష్టపడి తినే వస్తువులు, మనకి ఇష్టం లేని వస్తువులు, మనకి అసహ్యమైన వస్తువులే కాకుండా మనం తినే పదార్ధాలని మనం తినే విధానం కూడ మన జఠర వ్యక్తిత్వాన్ని (గేస్ట్రొనోమిక్ పెరసనాలిటీ) వెల్లడి చేస్తుంది. కొన్ని ఉదాహరణలు చెబుతాను. “నేను శాకాహారం అయినంత సేపూ, ఏది ఎలా వండి పెట్టినా సమదృష్టితో రుచులు ఎంచకుండా తింటాను” అని అందరితోటీ చెప్పేవాడిని. అంటే నాకు ఒక జఠర వ్యక్తిత్వం అంటూ లేదని గొప్పగా చెప్పుకునేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత నా శ్రీమతి వచ్చి, నేను అనుకున్నట్లు నాకు అన్నీ సాయించవనిన్నీ, నాకు కూడా ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఉన్నాయనీ సోదాహరణంగా రుజువు చేసింది. నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా నా అక్క చెళ్ళెళ్ళు, “నీకు చేగోడీలు ఇష్టంరా, అందుకని చేసేం” అని చేసి పెట్టేవరకూ నాకు చేగోడీలు ఇష్టమనే తెలియదు. అయినా ఇంత అమెరికా వచ్చీ ఏ ఫేషనబుల్ గా ఉన్న తిండినో ఇష్టపడాలి కానీ ఈ నాటు వంటకం ఇష్టం అని నలుగురికీ తెలిస్తే నా పరువు పోతుందో ఏమో.
ఈ జఠర వ్యక్తిత్వం అనే ఊహనాన్ని వ్యక్తిగత స్థాయి నుండి జాతీయ స్థాయికి లేవనెత్తవచ్చు. మానవుడు సర్వాహారి. దేశ, కాల పరిస్థితులని బట్టి ఏది దొరికితే అది తిని బతకనేర్చిన జీవి. అయినా సరే కొన్ని కొన్ని జాతులు ఒకొక్క రకమైన జఠర ముద్రని ప్రదర్శిస్తాయి. హిందువులు ఆవుని తినరు. ముస్లింలు పందిని తినరు. కొరియా వారు కుక్కలని, చైనా వారు పాములనీ తింటారు కాని, అమెరికాలో కుక్కలని, పాములని తినరు. కీటకాలనీ, వానపాములనీ చాల మంది తినరు. ఫ్రాంసులో నత్తలని గుల్లల పాళంగా వేయించి, దాని మీద వెల్లుల్లి జల్లి ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఆయా సంస్కృతుల జఠర వ్యక్తిత్వాలు.
ఈ విపరీతమైన ఉదాహరణలని అటుంచి, మనం సర్వ సాధారణంగా తినే వస్తువుల సంగతి చూద్దాం. మా చిన్న బావ కొత్తిమిర దుబ్బు కనిపిస్తే చాలు మైలు దూరం వెళ్ళిపోతాడు. ఇలాగే బెండ కాయలు, టొమేటోలు, బ్రోకలీ, కేబేజీ, కొబ్బరికాయ మొదలైనవి తినలేని వాళ్ళు మనకితరచు తారస పడుతూ ఉంటారు.
ఈ అయిష్టతలు అన్నీ పుట్టుకతో వచ్చినవి కావు. పిల్లలందరికీ పుట్టగానే తెలిసేది తల్లి పాల రుచి. తర్వాత నెమ్మదిగా ఆవు పాలో, డబ్బా పాలో మొదలు పెట్టేసరికి కొంచెం తీపి అలవాటు అవుతుంది. ఆ తర్వాత సంస్కృతులకి అనుగుణంగా రుచులు అలవాటు అవుతాయి. మన దేశంలో అయితే అన్నంలో వాము నెయ్యి కలిపి కొత్త రుచులు అలవాటు చేస్తాం. సాధారణంగా పిల్లలు ఏ కొత్త రుచిని పరిచయం చేసినా మొదట్లో నచ్చుకోరు. మనం వాళ్ళ నోట్లోకి కుక్కటం, వాళ్ళు దాన్ని ఉమ్మెయ్యటం, మనం దానిని మళ్ళా చెంచాతో నోట్లోకి తొయ్యడం – ఈ తంతు ప్రతి తల్లికి తెలిసినదే.
పుట్టుకతో పసి పాపలు తీపిని నచ్చుకోవటం, చేదుని ఏవగించుకోవటం సర్వసాధారణంగా జరిగే పని. నాలుగు నెలల ప్రాంతాలలో ఉప్పదనం మీద మోహం పెరుగుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రకరకాల రుచులు అలవాటు అవుతాయి. పాపకి భవిష్యత్తులో ఏయే రుచులు అలవాటు అవుతాయో ఆ పాప గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే రుచుల మీద కూడ ఆధారపడి ఉంటుందిట. తల్లి వెల్లుల్లి తింటే పిల్లలకి కూడ వెల్లుల్లి మీద ఇష్టత పుట్టటానికి సావకాశాలు ఎక్కువట. ఈ సిద్ధాంతం ఎంత శాస్త్రీయమైనదో చెప్పలేను కాని, నా శ్రీమతికి వంకాయ ఇష్టం, మా అమ్మాయి సీతకి వంకాయ అంటే అసహ్యం.
కొత్త రుచులని ప్రయత్నించటానికి కూడ భయపడే పరిస్థితిని ఇంగ్లీషులో నియోఫోబియా అంటారు. ఈ భయమే పెద్దయిన తర్వాత “పికీనెస్” గా మారుతుంది. ఈ పికీనెస్ ని తెలుగులో ఏమంటారో ప్రస్తుతానికి స్పురించటం లేదు కాని, ఈ రకం వ్యక్తులు మనకి తరచు తారసపడుతూ ఉంటారు. కొందరు కంచంలో వడ్డించిన వస్తువులని వేళ్ళతో కోడి కెక్కరించినట్లు కెక్కరించి, ఏదీ సయించటం లేదని లేచి పోతారు. ఇలాంటి వాళ్ళతో రెస్టారెంటుకి వెళితే మన పని గోవిందా. వీళ్ళకి మెన్యూలో ఉన్నవి ఏవీ నచ్చవు. నూనె ఎక్కువ వేసేడనో, కారం సరిపోలేదనో, సరిగ్గా ఉడకలేదనో, అన్నం మేకుల్లా ఉందనో, ముద్దయిపోయిందనో, మరీ కరకరలాడుతోందనో, మాడిపోయిందనో, ఏదో ఒక వెలితి కనిపిస్తుంది వీరికి. వీరిని చూసి జాలి పడాలి కాని కోపగించుకునీ, విసుక్కునీ లాభం లేదు. మనందరికీ భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, పానీయాలు లా కనిపించేవే వీరికి ఏకుల్లాగో, మేకుల్లాగో కనిపిస్తాయి. అందుకని తినలేరు.
జేన్ కావర్ అనే ఆవిడ ఇటువంటి పికీ ఈటర్స్ మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడ పుచ్చుకుంది. ఫిలడెల్ఫియాలో 500 మందిని కూడగట్టి వారికి ఒక ప్రశ్నావళి సమర్పించింది. వీటికి ప్రజలు ఇచ్చిన సమాధానాలు చదవటం ఒక అనుభూతి. “నేను కరకరలాడే వస్తువులని తినలేను.” “నారింజ రంగులో ఉన్న తినుభండారలనే నేను తినగలను.” “పళ్ళెంలో వడ్డించిన వస్తువులని ఎల్లప్పుడూ అనుఘడి దిశలోనే తింటాను.” “నేను ఇంట్లో వండినవి తప్ప బయట వండినవి తినలేను.” ఇవీ ఆమె సేకరించిన సమాధానాలలో కొన్ని మచ్చు తునకలు. ఆవిడ పరిశోధనలో తేలిందేమిటంటే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా పికీ ఈటరే. ఆవిడ వరకుఎందుకు. అమెరికాలో మన తెలుగు వాళ్ళల్లో నేను చూసేను. బయటకి వెళ్ళి ఏది తిన్నా ఇంటికివచ్చి ఆవకాయ డొక్క తో ఇంత మజ్జిగ అన్నం దబదబా తింటే కాని నిద్ర పోలేరు.
కొన్ని అలవాట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కొన్నింటికి మనం అలవాటు పడిపోయి పట్టించుకోము. కార్న్ ఫ్లేక్సు, ఓట్ మీలు మొదలైనవి ఉదయమే తినాలని ఎక్కడైనా నియమనిబంధనలు ఉన్నాయా? ముందు పప్పూ అన్నం, ఆ తర్వాత కూర, ఆ తర్వాత పచ్చడి, ఆఖరున పులుసు, చారు, మజ్జిగ తినాలని ఎవరు నియంత్రించేరు? మా ఇంట పురోహితులు సోమయాజులు గారు ముందు కూర, పచ్చడి తిని, తర్వాత పిండివంటలు తిని, అప్పుడు పప్పు అన్నం తినే వారు. ఎందుకు అలా తిరకాసుగా తింటున్నారని నేను చిన్నతనంలో మర్యాద తెలియని రోజులలో అడిగేసేను. “పప్పు అన్నం ముందు తినెస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు మిగిలినవి తినటం కష్టం. అందుకని” అని ఆయన చెప్పేసరికి మా అమ్మ, నాన్నగారు కూడ తర్కబద్ధంగా ఉన్న ఆ సమాధానం విని ఆశ్చర్యపోయేరు.
నేను అమెరికా వచ్చిన తర్వాత తిండి తినే పద్ధతిలో ఒక కొత్త బాణీ ప్రస్పుటం కావటం మొదలైంది. ఇంటి దగ్గర అన్నంలో కలుపుకుందుకి పప్పు, కూర, పచ్చడి, తర్వాత పులుసు, చారు, మజ్జిగ – ఆ వరసలో తినేవాళ్ళం. ఆయ్యరు హొటేలుకి వెళ్ళి తిన్నా దరిదాపు అవే వంటకాలు తగిలేవి. మొన్న వాషింగ్టన్ వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ ఇండియన్ రెస్టరాంటు కి వెళ్ళేను. వాడు ఒక కప్పు అన్నం, దానితో తినటానికి బైంగన్ బర్తా ఇచ్చేడు. ఎంతకని బైంగన్ బర్తా తింటాను? మర్నాడు చైనా వాడి దగ్గరకి వెళ్ళేను. వాడూ కప్పుడు అన్నం తో పాటు మరొక పాత్ర నిండా వేయించిన చిక్కుడు కాయలు పెట్టేడు. ఎంతకని చిక్కుడు కాయలు తింటాను? పోనీ అని రాత్రి పీట్జా తినటానికి వెళ్ళేను. అక్కడా అంతే. అంటే ఏమిటన్న మాట? ఒక్కళ్ళం రెస్టరాంటుకి వెళితే, వెళ్ళిన చోట మనకి థాలీ లాంటిది దొరకక పోతే మనకి నాలుగు రకాల ఆధరువులు లేకుండా “ఏక భుక్తమే” గతి.
ఇలాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవాలంటే చైనా రెస్టరాంటుకీ, ఇండియన్ రెస్టారాంటుకీ, ఒక్కళ్ళూ వెళ్ళకూడదు, ఒక చిన్న మందలా వెళ్ళాలని ఒకడు నాకు హితోపదేశం చేసేడు. ఇంట్లో మా ఆవిడ చెప్పినట్లు, ఆఫీసులో మా సెక్రటరీ చెప్పినట్లు వినటం అలవాటయిపోయిందేమో మనమంచికే చెబుతున్నాడు కదా అని ఆ హితైషి చెప్పినట్లు ఒక సారి అరడజను మంది సహోద్యోగులతో చైనా రెస్టరాంటుకి వెళ్ళేను. వాళ్ళంతా బాతులని, కుక్కలని, పందులనీ ఆర్డరు చేసుకుంటున్నారు. నేను బితుకు బితుకు మంటూ బుద్ధాస్ డిలైట్ ఆర్డరు చేసేను. అందరివీ ఒకటీ ఒకటీ వస్తున్నాయి. నేను తప్ప అందరూ వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. నేను బిక్క మొహం బైటకి కనిపించకుండా బింకంగా పోజు పెట్టి బుద్ధాస్ డిలైట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆది వచ్చే సరికి ఒక వాయి భోజనాలు కానిచ్చేసిన నా సహోద్యోగులు దీని మీద కలబడి పంచేసుకుని, “రావ్, మేము కూడ నీలాగే వెజిటేరియన్ ఆర్డర్ చెయ్యవలసింది, ఇది చాలా బాగుంది” అంటూ ఆ ప్లేటుని ఒకరి చేతుల మీదుగా మరొకరు నా దగ్గరకి పంపేసరికి అది కాస్తా ఖాళీ అయిపోయింది. నేను మొర్రో మొర్రో అంటే మరొక ప్లేటు తెప్పించేరు. ఆది వచ్చేసరికి అందరి భోజనాలు అయిపోయాయి.
నా తిండి అలవాట్లని తలచుకొని నా మీద నేను జాలి పడిపోయేలోగా మరొక సంగతి. కొందరికి అన్ని రకాల తిండి వస్తువులు పడవు. అంటే ఎలర్జీ. అమెరికాలో నాలుగింట ఒక వ్యక్తికి ఎదో విధమైన తిండి ఎలర్జీ ఉందిట. ఈ ఎలర్జీలలో కూడ రకాలు ఉన్నాయి. కొంతమందికి నువ్వులు, వేరుశనగ తింటే నోరు పూసెస్తుంది. మరికొందరికి వేరుశనగ పొడ తగిలితే చాలు ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురౌతుంది.
అందుకోసం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలచినప్పుడు వారిని అడగెయ్యటమే. నిషిద్ధం కావచ్చు, పడక పోవచ్చు, ఇష్టం లేక పోవచ్చు. మతం ఒప్పుకోకపోవచ్చు. మా చిన్న బావని ఎవ్వరైనా భోజనానికి పిలిస్తే, మొహమాటం లేకుండా,”అమ్మా! దేంట్లోనూ కొత్తిమిర వెయ్యకండి. కొత్తిమిర వాసన కూడ దేనికీ తగలకుండా చూడండి” అని చెప్పెస్తాడు.
ఇంకో రకం ప్రజలకి మరొక సమస్య. వీరి నాలుక రుచులలో అతి చిన్న తేడాలని కూడ ఇట్టే పట్టేయగలదు. వీరి రుచి బొడిపెలు అతి సున్నితం. మన బోంట్లకి చక్కెర లేని కాఫీ, టీ లు కొద్దిగా చేదనిపిస్తే వీరికి పరమ చేదుగా ఉంటాయి. అదే టీ లో ఒక చెంచాడు పంచదార వేసుకుంటే మనకి సరి పోతుందికాని వీరి నోటికి ఆ టీ పానకంలా అనిపిస్తుంది. వీళ్ళని ఇంగ్లీషులో “సూపర్ టేస్టర్స్” అంటారు. మామిడి పండు ఇష్టం లేని మా అన్నయ్య ఒక సూపర్ టేస్టర్. వంట వండి వాడిని మెప్పించటం ఆ బ్రహ్మ దేవుడి తరం కాదు. ఉప్పు ఎక్కువైంది, పులుపు సరిపోలేదు, కారం మరి కాస్త పడాలి అంటూ వాడి గొణుగుడు భరించటం మాకు అలవాటైపోయింది. కాని ఆవకాయలు పెట్టే రోజులు వచ్చినప్పుడు మాత్రం పాళ్ళు సరిగ్గా పడ్డాయో లేదో చూడటానికి వాడు లేకపోతే ఆవకాయ సరిగ్గా వచ్చేదే కాదు. ఇండియాలో పుట్టి గుర్తింపు లేక, రుచులు ఎంచుతాడని నలుగురి చేత చివాట్లు తినేవాడు కాని, వాడి వంటి సూపర్ టేస్టర్స్ కి అమెరికాలో మంచి ఉద్యోగాలే దొరుకుతాయి.
ఆధారం
వేమూరి వేంకటేశ్వరరావు, జిహ్వకోరుచి, ఈమాట అంతర్జాల పత్రిక, సెప్టెంబరు 2005
Tuesday, February 10, 2009
ఈ సిద్ధాంతం విన్నారా?
చెన్నపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, భీమిలిపట్నం, కళింగపట్నం, (ఈ జాబితాని పూర్తి చెయ్యండి) .... ఇలా తెలుగు, తమిళ దేశాలలో ఏ "పట్నం" పేరు చూసినా అది సముద్రపుటొడ్డున ఉన్న ఉరే (రేవు పట్నం) కావటం గమనార్హం.
ఈ బాణీకి వ్యతిరిక్తంగా రెండే రెండు ఊళ్ళు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో తునికి, యలమంచిలికి మధ్య ఉన్న రైలు స్టేషన్ నరిశీపట్నం రోడ్డు. నరిశీపట్నం ఊరు ఇంకా లోపుకి (సముద్రానికి దూరంగా), కొండలలో ఉంది. రెండో ఊరు, విశాఖపట్నం స్టేషన్ కి రైలు బండి చేరుకునే ముందు గోపాలపట్నం అనే ఊరు మీదుగా వెళుతుంది. ఈ గోపాలపట్నం విశాఖ విమానాశ్రయానికి చాల దగ్గర. ఇది సముద్రానికి దగ్గరగానే ఉన్నా, రేవుపట్టణం కిందకి రాదు.
ఈ రెండు ఊళ్ళని మినహాయిస్తే, "పట్నం" అన్న తోక ఉన్న ఊళ్ళన్నీ రేవు పట్టణాలనే నా నమ్మకం. ఈ గమనిక మీద వ్యాఖ్యానాలు ఆహ్వానిస్తున్నాను.
Sunday, February 8, 2009
ఇచ్చుటలో ఉన్న హాయి...
http://www.eenadu.net/homelink.asp?qry=Editorial
ఈ లంకె ఎన్నాళ్ళు తాజాగో ఉంటుందో తెలియదు కనుక, ఆ వ్యాసాన్ని యధాతథంగా ఈ దిగువ చూపుతున్నాను. ఈ బ్లాగులో, గతంలో, అత్త(వా)గారి సొమ్ము అనే ఒక వ్యాసం ఉంది. అదికూడా ఈ సందర్భంలో మళ్ళా చదవదగ్గది.
ఇదిగో ఈనాడు సంపాదకీయం
ఇచ్చుటలో ఉన్న హాయి...
'వచ్చినవాడు వామనుడు కాడు, శ్రీమన్నారాయణుడు... దానం మాట మర్చిపో... లేకుంటే ఆయన మాయకు బలి అవుతావు' అని బలిచక్రవర్తిని శుక్రాచార్యులు గట్టిగా హెచ్చరించాడు. అయినా బలిచక్రవర్తి వినలేదు. 'మాట ఇచ్చాను... దానం చేసి తీరవలసిందే... తిరుగన్నేరదు నాదు జిహ్వ, వినుమా ధీవర్య వేయేటికిన్' అన్నాడు. ఆ ప్రకారమే ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. తన సహజ కవచకుండలాలు అపహరించడానికి స్వయంగా దేవేంద్రుడే యాచకుడిగా వస్తున్నాడని కర్ణుడికి ముందే తెలిసింది. అయినా చలించలేదు. '...విప్రులు కడునర్థివేడిన బొచ్చెంబు సేయక ఇచ్చుట... నాకు వ్రతం... ఆ వ్రత నియమాలకి తిరుగులేదు' అన్నాడు. అన్నట్టుగానే దానమూ చేశాడు. దగ్గరున్నదంతా దానధర్మాలకు వెచ్చించి వట్టి చేతులతో మిగిలాడు రంతిదేవుడు! ఆ స్థితిలో మరో దీనుడు వచ్చి చేయి చాచాడు. 'అన్నము లేదు... కొన్ని మధురాంబువులున్నవి... త్రావుమన్న... రావన్న!' అంటూ వాణ్ని చేరదీసి ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి నిశ్చింతగా నిలబడ్డాడు. మొన్న మొన్నటిదాకా మన మధ్యన జీవించిన మహాతల్లి డొక్కా సీతమ్మదీ అదేవరస. 'వరద గోదారి పోటుమీద ఉంది, పడవ ప్రయాణం ప్రమాదమమ్మా!' అని సరంగులు వారించారు. అయినా ఆవిడ వినలేదు. లంకల్లో చిక్కడి, ఆకలితో అల్లాడుతున్న దీనులకోసం వేడిగా వండి వార్చి పట్టుకెళ్ళి వడ్డించింది. పాప పుణ్యాల సంగతి కాదు ఇక్కడ చూడవలసింది. 'దానం చేస్తే పుణ్యం వస్తుంది' అనుకుంటూ దానాలు చేసిన బాపతు కాదు వారెవరూ! దాతృత్వం వారి సహజ స్వభావం అంతే! తమ దగ్గర ఉన్నది సంతోషంగా ఇచ్చే లక్షణం కారణంగా వారంతా చరిత్రలో నిలిచిపోయారు. వారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ధన్యజీవులంటున్నాం!
చప్పని వట్టిగడ్డిని తినిపించినా- గోవులు కమ్మని పాలు ఇస్తాయి. మురికినీటిని తెచ్చి తమలో కలిపేస్తున్నా సహించి, నదులు తియ్యని నీళ్లు ఇస్తాయి. తనని నరకడానికి వచ్చినవాడికి సైతం చెట్లు చల్లని నీడ ఇస్తాయి. ఇవ్వడం వాటి స్వభావం! అందుకే వాటికి లోకంలో పూజార్హత! అపకారం చేసినవాడిని సైతం ..పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు... అనే గొప్ప లక్షణాన్ని మనిషి వాటినుండే నేర్చుకున్నాడు. రుచికరమైన ఆహారాన్ని ఒక్కడివీ కూర్చుని తినకు. ఏకఃస్వాదు న భుంజీత... అని భారతం ఆదేశించింది. దాన్ని పాటించేవారు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. వారిని సజ్జనులు అంటారు. వారివల్లే ఈమాత్రం అయినా వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి- అని లోకం భావిస్తుంది. దానగుణం అనేదాన్ని గొప్ప లక్షణంగా లోకం గుర్తించింది. ఆలికి అన్నం పెట్టడమే ఊరికి గొప్ప ఉపకారమనుకునే జనం సంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో, పరాయివాడికి సహాయం చేద్దామని ఎవరైనా అనుకుంటే చాలు- లోకం హర్షిస్తుంది. వారికి జేజేలు పలుకుతుంది. వారిని దేవుళ్లలా చూస్తుంది. 'అనాథాశ్రమం కట్టడానికి చందా కావాలి' అని వస్తే- 'నా దగ్గరేముంది ఇవ్వడానికి! నా ముసలి తల్లితండ్రులను మీ సమాజానికి జమ వేసుకోండి' అని అంటగట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అలాంటివారికి ఇవ్వడంలో ఉండే గొప్ప అనుభూతి ఎన్నటికీ తెలియదు. తన స్తనాన్ని పసిబిడ్డ నోట కరచి పట్టుకుని తియ్యని పాలని ప్రేమగా జుర్రుకుంటుంటే- తన జీవాణువుల్లోని మాతృత్వపు మహామాధుర్యాన్ని పాల రూపంలో బొట్టు బొట్టుగా బిడ్డ లేత పెదవులపై జార్చే అమ్మ- ఆ క్షణాన ఏ దేవతకైనా తీసిపోతుందా? ప్రమాదానికి గురై రక్తం ఓడుతూ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యుడికి మన శరీరంలోని రక్తం నెమ్మదిగా ప్రాణం పోస్తుండగా, ఆ జీవి క్రమంగా తేరుకుని మొహం తేటపడుతుంటే మనకు కలిగే ఆనందం బ్రహ్మానందానికి తీసిపోతుందా! ఆ క్షణాన మనం దేవతలతో సమానం కామా? మరణానంతరం మన కళ్లు మరో అంధుడి కళ్లకి వెలుగునిచ్చి ఈ లోకాన్ని తృప్తిగా పరికిస్తుంటే - మనం ఇంకా జీవించి ఉన్నట్లు కాదా! ఆ మేరకు మనం అమరులం అయినట్లే కదూ! అవును! దానగుణం మనల్ని దేవతలను చేస్తుంది.
మనలో కొన్ని అపోహలు స్థిరపడి ఉన్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటే మగతనం సన్నగిల్లుతుందనీ, రక్తం దానం చేస్తే ప్రాణం నీరసపడుతుందనీ, కళ్లు దానం చేస్తే వచ్చే జన్మలో గుడ్డివాడిగా పుడతామనీ.. ఏవేవో దురభిప్రాయాలు మనలో పాతుకుపోయాయి. ఇదంతా వట్టి అవివేకమని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. నిజానికి రక్తదానం చేసినప్పుడు ఆ మేరకు తిరిగి రక్తాన్ని ఉత్పత్తి చేసుకునే వ్యవస్థ మన శరీరంలోనే ఉంది. కొద్ది గంటల్లోనే శరీరానికి అవసరమైనంత రక్తం తయారవుతుంది. అంతేకాదు, శరీర భాగాలను దానం చేసిన వారికి ఆరోగ్యమూ, ఆయుర్దాయమూ పెరుగుతాయన్న ఒక గొప్ప విశేషాన్ని పరిశోధకులు గుర్తించారు. మూత్రపిండాలను దానం చేసినవారి ఆరోగ్య స్థితిగతులపై సుదీర్ఘ పరిశీలన నిర్వహించిన అమెరికాలోని మినెసొటా విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఈ సంచలన విషయాన్ని ప్రకటించింది. 'న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్'లో ప్రచురితమైన డాక్టర్ హసన్ ఇబ్రహీం బృందం పరిశోధన ప్రకారం- మూత్రపిండాలు దానం చేసినవారు మరింత ఆరోగ్యంగాను, ఆయుర్దాయంతోను నిశ్చింతగా జీవిస్తున్నట్లు స్పష్టం అయింది. గతంలో నార్వే, స్వీడన్‌లలో చేపట్టిన ఇదేరకం అధ్యయనాలు సైతం ఈ విషయాన్నే నిర్ధారించడం గమనించదగిన విశేషం. మనిషి శరీరంలోని భాగాలను సైతం దానం చేసినా హాని జరగదు సరికదా- ఆరోగ్యం మెరుగవుతుంది, ఆయుర్దాయమూ పెరుగుతుందన్నది విజ్ఞాన శాస్త్రం తేల్చి చెప్పింది. మనిషికి వరంగా లభించే దేహంలోనే ఎలాంటి నష్టమూ వాటిల్లనప్పుడు- దానం మూలంగా మనిషి స్వయంగా సంపాదించుకున్న సిరిసంపదలలో కొంతభాగం ఇచ్చేస్తే కోలుకోలేమనడం శుద్ధ అవివేకం కదా! ఏమంటారు?
Friday, February 6, 2009
కాకిగోల
మా తునిలో – నా చిన్నతనంలో - సాయంకాలం డాబా మీద పడుక్కుంటే చాలు కాకులు వందలకొద్దీ కనిపించేవి. కాకులు గూళ్ళు చేరే వేళ అది. మా ఇంటి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు మీద కాకులు చేసే “కావ్ కావ్” గోలకి చెవులు గింగుర్లెత్తిపోయేవి. నేను అమెరికా వచ్చిన కొత్తలో కాకులు కనిపించేవే కాదు. ఈ మధ్య ఇండియన్సుతో పాటు అమెరికాలో కాకుల జనాభా కూడ పెరుగుతూన్నట్లనిపిస్తోంది.
ఒక్క నూజీలండ్‌లో తప్ప కాకులు లేని దేశం లేదుట. కొన్ని దేశాలలో ఎక్కువ, కొన్ని దేశాలలో తక్కువ.
సాధారణంగా పల్లెలలో ఎక్కువ, పట్టణాలలో తక్కువ.
పొలాలలో పంట పిట్టల పాలు కాకుండా ఉండటానికి గడ్డితో చేసిన మనిషి బొమ్మలని కాపలా పెడతారు. ఈ గడ్డి బొమ్మలని చూసి పిచికలు భయపడతాయేమో కాని ఆ గడ్డి మనుష్యుల మీద భయం లేకుండా వాలే కాకులని చూసేను నేను. మనుష్యులంటే కాకులకి బొత్తిగా భయం లేదు.
కాకులు పంటలని తినేసి రైతుకి నష్టం తీసుకొస్తాయనే వదంతి ఒకటి ఉంది. తిండి గింజలని కాజేయటంలో కాకులు దిట్టలే కాని, పంటలకి నష్టం కలిగించే క్రిమికీటకాదులని కూడ కాకులు తింటాయి కనుక మొత్తమ్మీద కాకుల వల్ల లాభమే కాని నష్టం వాటిల్లటం లేదని కొంతమంది “కాకి కోవిదులు” కాకులని వెనకేసుకొస్తున్నారు.
కాకులు తెలివిగల పక్షులు అని వాదించటానికి బోలెడన్ని దాఖలాలు చూపించవచ్చు.
ఒక సారి ఎత్తుగా ఎగురుకుంటూ వచ్చి ముక్కున కరిచిపెట్టిన పిక్కని ఒక కాకి సిమెంటు చపటా మీద జారవిడచింది. “అయ్యో పాపం! కాకి ముక్కు నుండి పిక్క జారిపోయిందే” అని నేను జాలి పడుతూ ఉంటే కింద పడ్డ దెబ్బకి పిక్క చితికి లోపల ఉన్న గింజ బయటకి వచ్చింది. కాకి కిందకి దిగొచ్చి ఆ గింజని కబళించింది. కాకి కావాలని ఆ పిక్కని చపటా మీద పడేసిందిట – అని కాకి కోవిదుడు నాకు వివరణ ఇచ్చేడు.
చిన్నప్పుడు చదువుకున్న మరొక కథ. సన్నని మూతిగల కూజాలో అట్టడుగున ఉన్న నీళ్ళని తాగటానికి గులకరాళ్ళతో కూజాని నింపుతుందొక కాకి. అప్పుడు పైకి అందొచ్చిన నీళ్ళని తాగుతుంది.
కాకి తెలివైన ఘటం అని నమ్మించటానికి మిత్రభేదంలో ఒక కథని వాడుకోవచ్చు. ఒక చెట్టు కింద పుట్టలో ఉండే పాము చెట్టెక్కి ఒక కాకి పెట్టిన గుడ్లని దొంగతనంగా తినేస్తూ ఉంటుంది. రాణి గారి మిలమిల మెరిసే నగని మన కరటం దొంగిలించి రాజభటులు చూస్తూ ఉండగా పుట్టలో పడెస్తుంది. రాజభటులు పుట్టని తవ్వి, పాముని చంపి, నేవళాన్ని దక్కించుకుంటారు. ఈ కథని బట్టి కాకి తెలివైనదే కాకుండా దొంగబుద్ధులు ఉన్నదని కూడ రుజువవుతోంది కదా. దొంగని దొంగే పట్టాలంటారు. ఈ కథని బట్టి మనకి మరొక విషయం ద్యోతకమవుతోంది. కాకులకి మిలమిల మెరిసే వస్తువులంటే ఇష్టం. మా పెరట్లోని వెండి ఉగ్గు గిన్నెలనీ, చిన్న చిన్న చెంచాలనీ కాకులు తరచు ఎత్తుకుపోతూ ఉండటం నాకు తెలుసు. కనుక నీతిచంద్రికలోని కాకి కథ పూర్తిగా కాకమ్మ కథ కాకపోవచ్చు.
ఇటువంటి తెలివిని ప్రదర్శిస్తూన్న కాకులని లోకువ కట్టేసి, “లోకులు కాకులు” అని లోకులు కాకులకి ఎందుకు అప్రతిష్ట తెస్తారో నాకు అర్ధం కాదు. లోకులలో వీసమెత్తు సంఘీభావం నేనెప్పుడూ చూడలేదు కాని, కాకులలో కలిసికట్టుతనం చాల ఎక్కువ. ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడిపోతే ఆ కాకిని ఏకాకిగా ఒదిలేయకుండా పది కాకులు కింద పడ్డ కాకి చుట్టూ మూగుతాయి. దెబ్బ తిన్న కాకి తేరుకునే వరకు వేచి ఉంటాయి. ఒక వేళ కాకి కాని చచ్చిపోతే చుట్టూ మూగిన కాకులు అలా కాపలా కాస్తూనే ఉంటాయి.
మసి పూసుకుని రెక్కలు కట్టుకున్నా సరే మానవుని మేధ - తులానికి తులం – కాకి తెలివితో తూగలేదని కొందరు అంటున్నారు.
కోకిలకి గుడ్లు పొదగటం చేతకాదనిన్నీ, అందుకని కోకిల కాకి గూట్లో గుడ్లు పెడుతుందనిన్నీ, పిల్ల బయటకి వచ్చిన తరువాత చూట్టానికి రెండూ నల్లగానే ఉన్నా “కాకి కాకే, కోకిల కోకిలే” కాబట్టి కాకి కోకిల పిల్లలని గుర్తు పట్టి గూట్లోంచి తరిమెస్తుందని ఒక కథ చలామణీలో ఉంది. ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని, ఇలా బేవారసుగా మరొకరి చేత పని చేయించుకోటాన్ని సంస్కృతంలో “కాక పిక న్యాయం” అంటారు. “కవి సమయం” వలె వాడుకుందుకి బాగుంటే బాగుండ వచ్చు గాక, కాని కాకులు ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు అంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను.
“కాకి కాకే, కోకిల కోకిలే” అంటూ కాకిని చిన్నబుచ్చటానికి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది: కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేద పిక కాకయో? వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. దీని అర్ధం ఏమిటంటే “కాకీ నలుపే, కోకిలా నలుపే. రెండింటికి ఏమిటి తేడా? వసంతకాలం వస్తే కాకి కాకే, కోకిల కోకిలే.”
ఇలాగే కాకినీ, నెమలినీ పోల్చుతూ, “కాకీక కాకికి కాక కేకికా?” అంటూ ఒక కొంటె కోణంగి కాకులని తెలుగులో ఒక కసురు కసిరేడు.
నల్లగా (అంటే, అంద విహీనంగా) ఉన్న మగవాడికి అందమైన (అంటే, నలుపు తక్కువైన) ఆడదానిని కట్టబెడితే, “కాక త్రోటిబింబ న్యాయం” అని సంస్కృతంలోనూ, “కాకి ముక్కుకి దొండపండు” అని తెలుగులోనూ అంటారు. “కాకిదొండ” అనే ఒక రకం దొండ పాదుకి కాసే దొండపండు కూడా ఎర్రటి ఎరుపే. కాని కాకి ముక్కుకి తగిలించే దొండ మామూలు దొండో, కాకిదొండో నాకు తెలియదు.
తెల్లనివన్నీ పాలెలా కావో అలాగే నల్లని పక్షులన్నీ కాకులూ కావు. ఆ మాటకొస్తే కాకి జాతికి చెందిన పక్షులన్నీ నల్లగానూ ఉండవు. తెలుగులో “సముద్రపు కాకి” అనబడే పక్షిని ఇంగ్లీషులో “ఆస్‌ప్రి” అంటారు. ఇది కాకి జాతి కానే కాదు. చూడటానికి తెల్లగా, కొంగలా ఉంటుంది. ఎందుకనో, ఎవ్వరో దీన్ని “సముద్రపు కాకి” అని తప్పుగా అనేశారు; అది నిఘంటువులోకి ఎక్కిపోయింది. “సముద్రపు కాకిని నిఘంటువు నుండి తొలగించాలి!” అనే నినాదంతో నేను ఎన్నికలలో పోటీ చేస్తా!
మేగ్‌పీ, రూక్, జే, రేవెన్ - ఈ నాలుగూ కాకి జాతే కాని మొదటి మూడూ నల్లగా ఉండనే ఉండవు. ఎడ్గార్ అలెన్ పో అనే అమెరికా కవి “రేవెన్” అనే మకుటంతో చిరస్మరణీయమైన ఇంగ్లీషు పద్యం రాసేడు.
కాకిని పోలిన రేవెన్ కి బ్రిటిష్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. లండన్ నగరపు తూర్పు శివారుల్లో, థెంస్ నది ఒడ్డున “టవర్ అఫ్ లండన్” అనే కట్టడం ఉంది. ఇందులో ఒక కోట, ఒక ఖైదు, ఒక రాజగృహంతో పాటు, ఈ కట్టడపు ప్రాంగణంలో నాలుగు రేవెన్ లు ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ ప్రాసాదపు ప్రాంగణం విడచి బయటకి ఎగిరిపోతాయో అప్పుడు బ్రిటిష్ రాజవంశం నాశనం అయిపోతుందనే మూఢ నమ్మకం బ్రిటిష్ వాళ్ళకి గాఢంగా ఉంది. అందుకని ఆ పక్షులు ఎగరటానికి వీలు లేకుండా వాటి రెక్కల కింద ఉండే స్నాయువులని రివాజుగా కత్తిరించెస్తారు. లండన్ చూడటానికి వెళ్ళిన పర్యాటకులకి ఈ రేవెన్ జాతి కాకులు ప్రత్యేకమైన ఆకర్షణ! ఈ రేవెన్ లు ఎంత నలుపంటే బాగా నల్లగా నిగనిగలాడే జుత్తుని ఇంగ్లీషులో “రేవెన్ హెయిర్” అంటారు.
ఈ రేవెన్ జాతి కాకులని నా చిన్న తనంలో “మాల కాకులు” అనేవారు. ఇప్పుడు, మాల, మాదిగ వంటి పేర్లు వాడితే హరిజనులకి, దళిత వర్గాలవారికీ కోపం వచ్చినా రావచ్చు కనుక వీటికి మరొక పేరు పెట్టాలేమో. మనం వీటిని ఏ పేరు పెట్టి పిలచినా ఇవి ఎండకి నల్లబడ్డ మామూలు కాకులు కావు; ఇవి కాకులలో ఒక ఉప జాతి. మామూలుగా మనవేపు కనిపించే “ఊర కాకులు” మరీ అంత నల్లగా ఉండవు; వాటి ఛాతీ బూడిద రంగులో (చామనచాయగా) ఉంటుంది. “బొంత కాకులు” శరీరం అంతా నల్లటి నలుపు. ఇవి రేవెన్ లకి దూరపు బంధువులయి ఉండొచ్చు.
మనదేశంలో మనకి ఎక్కడ చూసినా కాకులు కొల్లలుగా కనిపిస్తాయి; హంసలు తుపాకేసి వెతికినా కనిపించవు. తుపాకేస్తే కాకులూ కనిపించకపోవచ్చు; అది వేరే సంగతి. తమాషా ఏమిటంటే మన కవులకి మాత్రం ఎక్కడ చూసినా హంసలే కనిస్పిస్తాయి కాబోలు; వాళ్ళకి కాకి - మచ్చుకి ఒకటి - కనిపించి చావదనుకుంటాను. కాకులని వర్ణించిన కవిని ఒక్కడిని చూపించండి. కాకులన్నీ కవితకి అనర్హమేనా? లేకపోతే, లేని హంసలని తెగ వర్ణించి ఉన్న కాకులని విస్మరించిన కవుల పరిశీలనా శక్తిని విమర్శించాలా? లేక, మన దేశంలో తరతరాలుగా తెలుపు తొక్క మీద ఉన్న మమకారానికి నలుపు మీద ఉండే చిన్న చూపుకి ఇది మరొక నిదర్శనమా? కాకపోతే ఏమిటి చెప్పండి! “గంగలో మునిగినంత మాత్రాన్న కాకి హంస అవుతుందా?” అనిన్నీ, “కాకై కలకాలం బ్రతికే కంటె హసై ఆరు నెలలు బ్రతికితే చాలదూ?” వంటి సామెతలతో కాకులని వేళాకోళం చేస్తారా?
మన దేశంలో హంసని అమాంతం పైకి ఎత్తేసి కాకిని కిందకి దించేసేము కాని ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాలలో ఒక దానికి “సిగ్నస్” (హంస) అనిన్నీ, మరొక దానికి “కోర్వస్” (కాకి) అనిన్నీ పేర్లు పెట్టి రెండింటినీ సమానంగా గౌరవించేరు, పాశ్చాత్యులు.
రామాయణంలో ఒక్క చోట మాత్రమే కాకి ప్రస్తావన వస్తుంది. సీతారాములు కాకులు దూరని కారడవిలో వనవాసం చేస్తూన్నప్పుడు, కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవి వక్షస్థలం గాయపరచగా, రాముడు దర్భ పుల్లని మంత్రించి వదులుతాడు. అదే బ్రహ్మాస్త్రమై కాకాసురుడుని వెంటాడితే వాడు తిరిగి రాముడినే శరణు వేడుకుంటాడు. రామబాణానికి తిరుగులేదు కనుక ప్రాణం రక్షించుకుందుకి అస్త్రానికి కన్ను బలిగా సమర్పించుకుంటాడు. అందుకనే కాకికి ఒక కన్ను లొట్టపోయి మెల్లకన్నులా కనిపిస్తుందని ఒక కథ ఉంది.
కాకి మెల్ల కన్నుకి కారణం నల్లి శాపం అని మరొక పిల్లల కథలో వస్తుంది: “చీమ, నల్లి నేస్తం పట్టేయిట. నల్లి కర్రలకి వెళ్ళిందిట. చీమ పులుసులో పడిపోయిందిట. నల్లికి దుఃఖం వచ్చిందిట…” ఈ కథలో కాకి కన్ను లొట్టపోవాలని నల్లి శపిస్తుంది.
కారణం ఏది అయినా కాకి చూపులో కొద్దిగా దోషం ఉన్నట్లు కనిపిస్తుందని దృష్టి దోషం లేనివాళ్ళంతా ఒప్పుకుంటారు. కాకి ఎటు చూస్తున్నాదో చెప్పుకోవటం కష్టం. అందుకనే ఒకే వ్యక్తి రెండు పక్కలా వాదించటానికి ప్రయత్నిస్తే “కాకాక్షి న్యాయం” అంటారు. కాకతాళీయ న్యాయం లో కాకి పాత్ర కేవలం కాకతాళీయం! కాకదంత పరీక్ష అంటే కంచి గరుడ సేవ చెయ్యటం.
మిత్రభేదంలో కథానాయకుడనదగ్గ “కరటకుడు” కి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? కరటం అంటే కాకి. ఆ కాకి తెలివి నక్కకి ఇచ్చేడు కవి. ఇచ్చి ఆ నక్కకి “కరటకుడు” అని పేరు పెట్టేడు. అని నా సిద్ధాంతం.
కాకి గుమ్మంలో వాలి అదేపనిగా అరిస్తే చుట్టాలొస్తారని ఒక నమ్మకం. నిర్ధారణ చేసుకోవాలంటే, “కాకీ మా ఇంటికి మా అన్నయ్య వస్తున్నాడని గెంతు” అని అడిగినప్పుడు కాకి కాని గెంతితే అన్నయ్య రావలసిందే. కాకిని గెంతించటానికి “ఎంగిలి చేత్తో కూడ కాకిని తోలని వాళ్ళు” పరమ లోభులన్నమాట.
కాకెంగిలి చెయ్యటం అంటే చొక్కా కింద పెట్టి కొరికి ఇవ్వటం. చొంగెంగిలి కంటె కాకెంగిలి ఎంతో నయం అని శాస్త్రీయంగా రుజువు చెయ్యొచ్చు.
తెలుగులో కాకిబంగారం అన్నా ఇంగ్లీషులో “టిన్‌సెల్” అన్నా ఒకటే కాని తెలుగు వారికి ఇంగ్లీషు మాటే నచ్చుతుందిట. ఈ ఇంగ్లీషు అభిమానులు “ఎంగిలి” ని ఇంగ్లీషులో ఏమంటారో కనుక్కోవాలి.
కాకికీ, చావుకీ ఏదో సంబంధం ఉంది. చచ్చిపోయిన వారికి పిండాలు పెట్టినప్పుడు వాటిని కాకులు తినాలంటారు. కాకినాడలో కాకులకి కరువో ఏమిటో కాని అక్కడ పిండాలని పిండాల చెరువులో “వదిలేవారు.” “వదులుతారు” అని ఎందుకు అనలేదంటే ఆ చెరువుని ఇప్పుడు కప్పెట్టేసేరుట.
“కాకి చావు” అంటే హఠాన్మరణం.
“కాకి గాలి” తగిలితే చావు త్వరగా వస్తుందిట. కాకి గాలి తగిలేంత దగ్గరగా నేను ఎప్పుడూ కాకిని దగ్గరగా రానివ్వలేదు - అది మీద రెట్ట వేస్తుందనే భయంతో. ఆ భయమే నన్ను రక్షించినట్లుంది.
నాకు ఇంతవరకూ కాకి గాలి తగిలినట్లు లేదు. అందుకే ఇలా బ్లాగుతున్నాను.
ఈ దిగువ లంకె పంపినందుకు అరుణం గారికి ధన్యవాదాలు!
http://video.google.com/videoplay?docid=-7329182515885554944
Wednesday, January 28, 2009
స్వీడన్‌లో మాతృభాష వాడకం
(ఇది మార్చి 2003 ఈమాట వెబ్ పత్రికలో ప్రచురించేను. నా బ్లాగుని చదివే పాఠకుడో, పాఠకురాలో ఈ వ్యాసాన్ని ఈ బ్లాగులో ఇక్కడ మళ్ళా ప్రచురించమని కోరేరు. అందుకని...)
నేను ఈమధ్య స్వీడన్ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.
స్వీడన్ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు మహా ఉంటే. కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.
మన ఆంధ్ర ప్రదేష్ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.
నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి అన్నీ స్వీడిష్ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్ పక్కన ఇంగ్లీషు కనిపించదు ఒక్క స్టాక్‌హోమ్ వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల (”ఇన్‌గ్రీడియంట్స్”) పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్ భాష లోనే. “సి. ఎన్. ఎన్.” లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.
వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్ లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.
ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.
తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది కార్, బస్, కోర్ట్. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.
స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్ భాష లో. ఇలా అన్నానని స్వీడన్ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు. స్వీడన్ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్ కౌంటర్ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ ఇలా తారసపడ్డ వారందరితోనూ ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు. మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే మంచి ఇంగ్లీషు ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది. (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్ వాళ్ళు స్వీడిష్ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.
ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అందరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.
ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం. తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్ దేశీయులకి రెండో, మూడో నోబెల్ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.
ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్ లోని విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా బోధన అంతా స్వీడిష్ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.
ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. “నెల తక్కువ వెధవల్లారా” అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!
స్వీడన్ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ మరొక స్వీడన్ దేశీయుడితోనైనా సరే ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. “అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?” ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్ లోనూ సామర్య్ధం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.
ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్, జెర్మనీలో జెర్మన్, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, “అయ్యా, మీరు ఫారిన్ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ” అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.
ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. ” ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు” అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.
వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. “చదవడం, రాయడం వచ్చా?” అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్ ఎటాక్ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.
Tuesday, January 6, 2009
నిరుడు కురిసిన హిమ సమూహాలు – ఒక సమీక్ష
కల్యాణి, కాదంబిని, వైదేహి, విశాలాక్షి, సుగంధి, ఉలూచి, ప్రమద్వర, భార్గవ, అంబరీషుడు వంటి పాత్రలూ, వడ్డాణము, నాగవత్తులూ, నాలుగు పేటల చంద్రహారాలు, జాజిమొగ్గల గొలుసు, మొదలైన ఆభరాణాల మధ్య వెంకటేశ్వర్లూ, జోగినాధం వంటి పేర్లు రాకపోతే ఇదేదో పింగళి సూరన్న రాసిన ఏ కళాపూర్ణోదయమో అనుకునే ప్రమాదం ఉంది. ఈ పుస్తకం నిడివిని 150 పేజీలనుండి ఏ 1500 పేజీలకో పొడిగించి, ఒక క్రమ బద్ధంగా కథ చెప్పి ఉండుంటే ఏ వేయిపడగల కథలాగో తయారయి ఉండేదేమో. కాని చేసిన ప్రయత్నానికి ఒక “పడగ” ఇస్తాను.
ఈ “నవల”లో నన్ను బాగా హత్తుకున్నది కథాకాలంలో ఆచారవ్యవహారాలని, జీవితాన్ని వర్ణించిన ఆ నాటి తెలుగు భాష. ఈ రకం భాష ఇప్పుడు వినబడటం లేదు, కనబడటం లేదు. పురుళ్ళు, పిల్లలు, బారసాలలు, తొట్టిలో వెయ్యటాలు, అక్షరాభ్యాసాలు, దసరా పప్పుబెల్లాల పాటలు, సమర్తలు, పెళ్ళిల్లు, బూజంబంతులు, వియ్యపురాలి పాటలు, నూతిలోకి దూకి ఆడవాళ్ళు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, విధవా వివాహాలు, దేశభాషలని నొక్కిపెట్టి ఆంగ్లాన్ని ప్రవేశపెట్టినందుకు మెకాలే మీద ఒక విసురు, కులవృత్తులని కూకటివేళ్ళతో పీకివేసిన బ్రిటిష్ వారిపై మరొక విసురు, ఇలా రచయిత మూడు తరాల జీవితకథ మూడు పాళ్ళూ, కల్పన కొంచెం మేళవించి, సూత్రబద్ధం కాని పువ్వుల పోగులా కథని ప్రదర్శించేరు. దారంతో గుచ్చిన దండైతే దానికి ఒక మొదలో, చివరో, వరసో ఉంటాయి. ఈ కథ చదవటానికి ఆ ఇబ్బందేమీ అక్కర లేదు; ఏ పేజీలోనైనా మొదలుపెట్టి ఎంత ఓపిక ఉంటే అంతే చదివి, ఆ చదివినది కాస్తా ఆనందించవచ్చు.
ఉదాహరణకి పన్నెండేళ్ళ రవణని, “కాసిని మంత్రాలు చదివి ఆరిని దీవించండి బాబూ” అని ఎవ్వరో అడిగితే, “సుమంగళీరియం వధూ..తరవాత గుర్తురాలా..అమ్మా! రెండరటి పళ్ళు తెండి. వధూవరాభ్యాం వరదా భవంతు, ఆఁ తలంబ్రాలు పోయించాలి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ,..ఒ, ఓ, ఔ” అంటూ రాగయుక్తంగా చదివుతూ, “యస్యజ్ఞాన దయాసింధో – గోడ దూకితే అదో సందో, ... ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి, ఆఁ మంగళ సూత్రం కట్టు నాయనా…” ఇదొక చిన్న హాస్యస్పోరకమైన సంఘటన.
ఈ కథ మనకి స్వతంత్రం రావటానికి ముందు రోజులలో మొదలై ఆంధ్ర ప్రదేష్ అవతరణ వరకు కొనసాగుతుంది. స్వామీ విజయానంద ఆంధ్ర రాష్ట్ర అవతరణకోసం నిరాహార దీక్ష పట్టేరన్న విషయం నాకు తెలియనే తెలియదు (ఈయనేనా స్వామీ సీతారం అంటే?) రచయిత పూర్వులు గాంధీ గారి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనటం, జైలుకెళ్ళటం దగ్గర నుండి దేశంలో ఉన్న రాజకీయ, ఆర్ధిక వాతావరణాలు అలా కనిపిస్తూనే ఉంటాయి.
ఈ పుస్తకం రచయిత శ్రీమతి సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి, ఎం. ఎ. హైదరాబాదులో సిటీ కాలేజీ, తెలుగు శాఖకి ఆధిపత్యం వహిస్తూ రిటైరు అయేరు. ఈమె ఎవ్వరో నాకు తెలియదనే అనుకుంటున్నాను; ఎప్పుడూ కలిసిన జ్ఞాపకం లేదు. బంధుత్వమూ లేదు. ఎవరో అమెరికా వస్తూ ఉంటే, “వేమూరి వేంకటేశ్వరరావు గారికి – నమస్కారములతో” అని సంతకం చేసి పంపేరు. మొదట్లో రెండు పేజీలు చదివి ఆపేసేను. మరొక సారి మధ్యలోంచి మరో మూడు పేజీలు చదివేను. పుస్తకంలో ఎక్కడ మొదలుపెట్టి చదివినా బాగానే ఉందనిపించింది (ముందు కథ తెలియక్కరలేదు, ఎందుకంటే దీనికి కథలా ఒక మొదలూ, చివరా అంటూ ఏమీలేవు.) మధ్యమధ్యలో పద్యాలున్నాయి, పాటలున్నాయి, శ్లోకాలున్నాయి. ఈ రకం జీవితాన్నీ, ఈ రకం సంఘాన్నీ, ఈ రకం భాషనీ, అరవై ఏళ్ళ క్రితం నేను చూసేను. ఈ కథలో కొన్ని అంశాలు నా పుట్టుకకి ముందు కాలానివి కూడా ఉన్నాయి. ఆ కాలపు జీవితానికి అద్దం పట్టినట్లు ఉన్నాయి ఇందులో సంఘటనలు. అందుకనే నాకు మళ్ళా మళ్ళా చదవ బుద్ధి వేసింది.
పుస్తకం 500 ప్రతులే అచ్చు వేసేరు. వెల రూ. 130/ అని ఉంది కాని, మధ్యవర్తులు 40 శాతం తినెస్తారు కనుక కావలసిన వారు నేరుగా రచయితకి రూ. 100/ పంపించి బేరం పెట్టి కొనుక్కోవచ్చేమో. ఇది ఉభయత్రా లాభదాయకం అని నా పైత్యం. ప్రతులకు: ఓగేటి పబ్లికేషన్స్, 3-6-470 పావనీ సత్యా కంప్లెక్స్, 6 వ వీధి, 103 వ నంబరు ప్లాటు, హిమయత్ నగర్, హైదరాబాదు – 29, ఫోను: 040-27634469.
Monday, January 5, 2009
ఈ విమానాల సంసారం కాదనుకొండి
ఈ రోజుల్లో విమానపు ప్రయాణాలంటే విసుగేస్తోంది. కించిత్ భయం కూడా వేస్తోంది.
పూర్వం విమానపు ప్రయాణం చేసేమంటే అది సంఘంలో మన అంతస్థుకి ఒక గుర్తు, గుర్తింపు. ఇప్పుడో? ప్రతీ అబ్బడ్డమైనవాడూ, అంకుపాలెం వెళ్ళొచ్చినట్లు అమెరికా వెళ్ళి వచ్చెస్తున్నాడు. పడవలో కాదు, విమానంలో. నిన్న మొన్నటి వరకు చెంబుచ్చుకుని బయలుకెళ్ళడానికి మించి ఇంటి గుమ్మం దాటని ప్రబుద్ధులంతా అకస్మాత్తుగా విమానం ఎక్కేయడంతో "దోసెడూ కొంపలో పసుల రేణము" అని శ్రీనాథుడు అన్నట్లుగా తయారయేయి ఈ విమానాలు.
చెంబు, రేణము అనగానే గుర్తుకి వస్తున్నాది. మన '"విండియన్సు" ఎక్కువమంది ఎక్కిన విమానాలలో ఒక దృగ్విషయం గమనించేను; ఉదయం ఆ టోయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం అందరికీ ఒకే సారి వస్తుంది - ఎవరో సింక్రనైజ్ చేసినట్లు! ఒక సారి, నిక్కచ్చిగా చెప్పాలంటే 1964 లో, Saturn Airways వారి ప్రొపెల్లర్ విమానాన్ని అద్దెకు తీసుకుని భారతీయులం కొంతమందిమి ఇండియా వెళ్ళేం. తెల్లవారే సమయానికి అందరం విమానం తోకలో ఉన్న టాయిలెట్ దగ్గర బారులు తీసేం. పైలట్ "విమానం తూగిపోతోంది, కొంచెం ఎగువకి జరగండి బాబూ" అని ఇంగ్లీషులో మొర పెట్టుకున్నాడు. నా చిన్నతనంలో బండి తోలే మా ఎర్రన్న ఇలాగే "పైకి రండమ్మా" అన్నప్పుడల్లా మా అత్తయ్య, "అలా ఆశీర్వదించు బాబూ, నీ బండి మళ్ళా మళ్ళా ఎక్కుతాను" అనేది.
"ఆఁ మీకు ఇండియన్సు మరీ లోకువ అయిపోయేరు. ప్రతీ చిన్న విషయానికీ మీరు ఇండియన్సు మీద అలా విరుచుకు పడడం ఏమీ బాగు లేదు" అని కొందరు ఆప్తులు నన్ను పక్కకి పిలచి కూకలేసేరు.
మీరే చెప్పండి. ప్రపంచంలో ఏదేశెమేగినా ఎందు కాలిడినా ఇటువంటి ప్రవర్తన ఎక్కడేనా చూసేరా? దీనికి కారణం మనవి చేసుకుంటాను, సావధానంగా చదవండి.
సాధారణంగా మనం విమానాలు ఎక్కే ముందు రెండు భయాలు పీక్కు తింటాయి.
విమానం అవతలి దరికి క్షేమంగా చేరుతుందో లేదో అనేది మొదటి భయం. ఈ విషయంలో నేను చెప్పగలిగే సలహాలు రెండు. ఒకటి, విమానం ఎక్కే ముందు ఆ వెంకటరమణమూర్తి కి ఒక దండం పెట్టుకుని, ఆ విమానంలో ఉన్నంతసేపూ రామా కృష్ణా అనుకుంటూ కూర్చోవటం. లేదా, రెండవ మార్గం ఏమిటంటే, ఎయిర్ పోర్టు లో కనిపించిన ఆ హరే కృష్ణా వాడికి ఐదో పదో ఇచ్చేసుకుని, వాడి దగ్గర భగవద్గీత ఒకటి పుచ్చుకొని దాన్ని పారాయణ చేసెయ్యటం.
ఇక రెండో భయం ఏమిటా అని కాదూ అడుగుతున్నారు? చదవండి, తరవాయి కథనం!
విమానాలలో రెండు రకాలు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది - పెద్దవి, బుల్లివి. మీ "ఫ్లైట్ నంబరు" ఎంత పొడుగ్గా ఉంటే మీ విమానం అంత బుల్లిగా ఉంటుందన్నది గమనించ వలసిన మొదటి సూత్రం.
పొడుగాటి "ఫ్లయిట్ నంబరు" ఉన్నటువంటి బుల్లి విమానాల్లో రెండు పుంజీలకి మించి సీట్లు ఉండవు. కనుక మీరు ఏ పది నెలల ముందో "రిజర్వేషన్" చేయించేసుకోవడం తెలివైన పద్ధతి. ముందే రిజర్వు చేయించుకున్నా కంపెనీ వాడిని కనీసం రోజుకి రెండు సార్లేనా టెలిఫోనులో పిలచి మీ సీటు మీ పేరనే ఉందో మరొకరి పేరుకి బదిలీ అయిపోయిందో చూసుకుంటూ ఉండండి. ప్రయాణం దగ్గర పడుతోందనగానే, కంపెనీ వాడిని ఆరేసి నిమిషాలకి ఒకసారి చొప్పున ఆరారా పిలచి మీ సీటుని ఖరారు చేసుకోవడం లో నాకు తప్పేమీ కనిపించటం లేదు. నన్నడిగితే రేపు ప్రయాణం అనగా, ఈ వేళే ఆ అయిర్ పోర్టు కి వెళ్ళిపోయి ఆ గేటు దగ్గర మాటు వెయ్యమంటాను.
పొట్టి "ఫ్లయిట్ నంబరు" ఉన్న పొడుగాటి విమానాలు దేశపు ఈ కొస నుండి ఆ కొసకో, ప్రపంచపు ఈ కొస నుండి ఆ కొసకో వెళతాయి. ఈ రకం విమానాలలోనే మనం ఇండియా నుండి వచ్చేటప్పుడు పెద్ద పెద్ద భోషాణపు పెట్లు రెండేసి చొప్పున పట్టుకొస్తాం. నూ యార్కులో దిగిన తరువాత మీరు బేంగర్, మెయిన్ వెళ్ళవలసి వచ్చిందనుకొండి. అప్పుడు ఈ భోషాణపు పెట్లు కానీ పైన చెప్పిన బుల్లి విమానాలలోకి ఎక్కిచేమంటే అవి గాలిలోకి లేవలేవు. అసలు నన్నడిగితే ఈ సామానుని ఏ "ఫెడ్ ఎక్స్" లోనో పంపించేసి, ఆ "ఫెడ్ ఎక్స్" వాడు ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా మరొక శాల్తీ అనుకోమని ఆ "ఫెడ్ ఎక్స్" విమానం ఎక్కెయ్యండి!
ఈ రకం బుల్లి విమానాలు ఎక్కే ముందు గేటు దగ్గర మన బరువెంత అని అడుగుతారు. ఎక్కడేనా మీ బరువుని దాచిపెట్టచ్చు కాని, అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ మాత్రం బరువెంతో నిజం చెప్పెయ్యండి. మీరు మొహమాటపడిపోయి వాడి దగ్గర బరువు తగ్గించి చెప్పేరంటే, విమానం కడితేరా గమ్యం చేరకుండానే పెట్రోలు అయిపోతుంది. తరవాత విచారించి లాభం లేదు.
మీరెంత ముందు జాగ్రత్తలో ఉన్నా, ఈ బుల్లి విమానం బయలుదేరే వేళకి మిమ్మల్ని బండి ఎక్కనిస్తారన్న భరొసా ఏమీ లేదు. ఎదురు గాలి ఎక్కువగా వుంది కనుక బండి సగం ఖాళీగా ఉంచాలి అంటాడు. ఇటువంటి పరిస్థితులలో మనం మన ''స్టేటస్'' ని చాటించి సీటు సంపాదించడానికి పట్టు చీరలు కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా, సూట్లు వేసుకున్నా ఏమీ లాభం లేదు. అందుకని అప్పుడే సర్జరీ లోంచి బయటకు వచ్చిన డాక్టరులా నీలం రంగు పజామ, జుబ్బా వేసుకుని, ఒక గుడ్డ టోపీ పెట్టుకుని ఎయిర్ పొర్టు కి వెళ్ళండి. ఓపిక ఉంటే, దార్లో "టార్గెట్" లో ఆగి ఒక "బీచ్ కూలర్" కొని దాని మీద ''రష్, హ్యూమన్ ఆర్గన్'' అని ఎర్రటి అక్షరాలతో ఒక కాగితం అంటించేరంటే, మీ సీటుకి ఢోకా ఉండదు. గేటు దగ్గర కాపలావాడు మిమ్మల్ని ''డాక్!'' అని సంబోధించినప్పుడు మాత్రం ఎవరిని పిలుస్తున్నాడా అని వెనక్కి తిరిగి మాత్రం చూడకండి.
మొత్తం మీద మన ఏడుపు ఏదో ఏడిచి, గేటు దాటి బయటపడ్డాం అనుకుందాం. అక్కడ విమానానికి బదులు ఒక బస్సు ఉంటుంది. నిజంగా విమానం ఎక్కిస్తాడా లేక ఈ బస్సులోనే మన గమ్యానికి తీసుకుపోతాడా అని అనుమానం వచ్చేలా ఒక పావుగంట సేపు నానా సందులు, గొందులు తిప్పి చివరికి అగ్గిపెట్టెలలా ఉన్న నాలుగు విమానాల గుంపు దగ్గరకి తీసుకెళతాడు.
బోయింగు 747 ఒక ఏనుగులా కనిపిస్తే ఈ బుల్లి విమానాలు ఎలకల్లా కనిపిస్తాయి. మీ చేతులో ఏమైనా "కేరీ ఆన్ బేగేజి" ఉంటే ఒక ఆసామి ఆ బుల్లి విమానం మెట్ల దగ్గర మీ సామాను అంతా పుచ్చేసుకుని, మిమ్మల్ని ఒక్కరినే విమానం ఎక్కమంటాడు. ఆ సామానుని విమానం డిక్కీలో వేసేసి అదే ఆసామీ విమానం నడపడానికి వస్తాడు కనుక మీరు పరాగ్గా వాడికి "టిప్పు" ఇవ్వడం లాంటి అపసంతి పనులు చెయ్యకండి.
మీరు చిన్నప్పుడు ఎప్పుడేనా చెరువు గట్టు దగ్గర నిలబడి చిల్ల పెంకుతో నీళ్ళ మీద కప్ప గంతులు వేయించేరా? ఒడుపు చూసుకుని చిల్ల పెంకుని నీళ్ళల్లోకి విసిరితే అది నీటి ఉపరితలాన్ని తాకుతూ, లేస్తూ, గెంతులు వేస్తూ వెళుతుంది. మన బుల్లి విమానం గాలిలోకి లేచిన తరువాత అలాగే కుప్పి గంతులు వేస్తూ వెళుతుంది. దారి పొడుగునా మన గుండె కాయ గొంతుకలోనే ఉంటుంది కనుక విమానం బయలు దేరే లోగా ఒక వేలియం మాత్ర పడేసుకొండి. ఆ మరచిపోయేను. ఆ మాత్ర వేసుకునే లోగా, ఒక కాగితం మీద మీ పేరు, చిరునామా, టెలిఫోను నంబరు, మీ "బ్లడ్ టైపు" వగైరా వివరాలు అన్నీ రాసేసి ఆ కాగితాన్ని అందరికీ కనిపించేలా మీ బట్టలకి అంటించేసుకొండి.
విమానాలు - ప్రత్యేకంగా బుల్లి విమానలు - తోలేవాళ్ళకి "ఫ్రీ వే" ఏదో "రన్ వే" ఏదో తేడా తెలియకపోవచ్చు. చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు "శ్రీ, చుక్క, దెబ్బ" వేసిన విధంగానే మొట్టమొదట "చెకిన్" అయిన ఆసామీని "పైలట్" గాను, వరుసలో రెండవ వాడిని "కోపైలట్" గానూ, మూడవ వ్యక్తిని "స్టువర్డు" గాను వేస్తారని ఎవరో అంటూ ఉంటే ఒక సారి విన్నాను. కనుక విమానం తోలడంలో మనకి ఎంత అనుభవం ఉందో వాళ్ళకీ అంతే ఉండి ఉంటుంది. అంత కంటే ఎక్కువ అనుభవం ఉంటే వాళ్ళకి కూడా పెద్ద విమానాలు తోలే ఉద్యోగాలే దొరికేవి కదా.
ఈ మధ్య ఇలా బుల్లి విమానాలు తోలి తోలి చివరికి పెద్ద విమానం పైలట్ గా చిన్న "ప్రమోషను" సంపాదించుకొన్న ఒక పైలట్ పరాకు చిత్తగిస్తూ - బర్బేంక్ లో "రన్ వే" మీద ఆపడం మానేసి విమానాన్ని నేరుగా ఊళ్ళో ఉన్న పెట్రోలు బంకు దగ్గరకి తీసుకెళ్ళి ఆపిందిట. (ఈ రోజులలో ఆడ పైలట్లు కూడా ఉంటున్నారన్న మాట మరచి పోకండి.)
కారు తోలుతున్నాననుకొంది కాబోలు. బండి ఆగే లోగా ఒక సారి "లిప్ స్టిక్" రాసుకుందుకని "రియర్ వ్యూ మిరర్" లో చూసుకొని ఉండుంటుంది. లేకపోతే సర్దార్జీ జోకులో చెప్పినట్లు "రియర్ వ్యూ మిరర్" లో కనిపించిన "రన్ వే" ప్రతిబింబాన్ని చూసుకుని, "అరె, దూరం వెళుతూన్నకొద్ది ఈ రన్ వే పొడుగౌతున్నాదే" అని హాశ్చర్య పోయే లోగా ప్రమాదం జరిగిపోయిందేమో. నిజానిజాలు మనకి తెలియవు కదా.
ఈ సోదంతా మనకి ఇప్పుడు ఎందుకు కానీ విమానం ప్రయాణాలు మాత్రం పూర్వంలా "ఫన్" గా ఉండటం లేదు. విమానాలు బస్సుల్లా తయారయేయి. మరీ పిప్పళ్ళ బస్తాలో కుక్కీసినట్లు కుక్కెస్తున్నాడు. కాలు జాపుకుందుకి చోటుండదు. ఒళ్ళు విరుచుకుందామంటే చోటు ఉండదు. పోనీ కన్ను మూసి కునుకు తీద్దామంటే వెనక సీట్లొ ఉన్న ఆసామీ ఒడ్డి మంగలాడిలా మనని గుద్దుతూ ఉంటే నిద్ర ఎలా పడుతుంది? ఎలాగో ఒక లాగ కన్ను మూసేం అనుకొండి. ఉత్తర క్షణంలో "విండో సీటు" లో కూర్చున్న ఆసామీకి ఒంటేలుకి వస్తుంది.
విమానాలలో తిండి సంగతి నేను ప్రత్యేకం రాయక్కరలా! వాళ్ళు పెట్టే గడ్డి ఎలానూ తినలేమని తెలిసి కూడా బుద్ధి గడ్డి తిని "వెజిటేరియన్" భోజనం కావాలని అడిగేమనుకుందాం. మూడొంతుల ముప్పాతిక మనం అడిగిన "స్పెషల్ మీలు" వాళ్ళ కంప్యూటర్లో ఉండదు. మన పని గోవిందా! పోనీ మన అదృష్టం బాగుండి "స్పెషల్ మీలు" ఉందనుకుందాం. అప్పుడు ఉదయం, మధ్యహ్నం, రాత్రి అన్న పక్షపాతం లేకుండా - అన్ని పూటలు ఒకే భోజనం పెడతాడు. ఏదో వాడే పోయాడు, సరిపెట్టుకుందాములే అనుకొని, ఆ తిండిని నోట్లో పెట్టుకుంటే, తస్సాదియ్య, దాని రుచి అట్ట ముక్కలా ఉంటుంది.
ఇలా "తిండి అట్ట ముక్కలా ఉంటుంది, రుచిగా ఉండదు" వగైరా నిందారోపణలు చేస్తూ ఉంటే "ఆ మరీ డెక్కురుగొట్టు వాళ్ళల్లా ఏమిటి, వాళ్ళు పెట్టే తిండి కోసం విమానం ఎక్కుతామా మనం" అని సామంతురాలు ఒకావిడ ఒక సారి నన్ను నిలేసి అడిగింది.
"ఈ ప్రెషరైజ్డ్ కేబిన్ లో మన రుచి బొడిపెలు బాగా వికసించవండి. అంతే కాకుండా కేబిన్ లో పీడనం వల్ల ఆహారంలో "ఫ్లేవరు" ఉండి చచ్చినా అది మన ఘ్రాణ నాడుల వరకూ చేరదండి. అందుకని వాళ్ళు ఎంత బాగా వండినా ఈ విమానలలో తిండి ఇంతకంటె బాగుండదండి" అని "పాప్యులర్ సైన్స్" లో ప్రవేశం ఉన్న ఒక పెద్ద మనిషి విమానాలవాళ్ళని వెనకేసుకొచ్చాడు.
ఈ భయాలన్నీ ఒక ఎత్తు, సింగపూర్ నుండి మద్రాసు వెళ్ళడం లో ఉన్న భయం మరొక ఎత్తు. నేనొకసారి ఈ కాలి మీద (ఈ "లెగ్" లో అనడానికి నేను తెలుగులో పడుతూన్న తాపత్రయానికి నన్ను క్షమించి ఒదిలెయ్యండి) ప్రయాణం చేస్తున్నాను. విమానం గాలిలోకి లేచి కొంచెం కుదుట పడగానే నా ఎదురుగుండా ఉన్న ఒక ఆసామి లేచి, "ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్" తెరచి తన సంచి తీసేడు. సంచి లోంచి ఏదైనా పుస్తకం తీస్తున్నాడనుకొన్నాను. అది పుస్తకం కాదు. అదొక లుంగీ. ఆ లుంగీని బయటకు తీసి, కట్టుకున్న పేంటుని విప్పేసి ఆ లుంగీ కట్టుకుని, పేంటుని మడత పెట్టి ఆ సంచీలో పెట్టేసి, సంచీని పై అరలో పెట్టేసి తన సీట్లో మళ్ళా కూర్చున్నాడు. మనిషి కంగ లేదు. కానీ నా పక్కన కూర్చున్న ఆడ కూతురు మూర్చిల్లి పడిపోయింది. మద్రాసు వచ్చేవరకు మరి లేవలేదు.
ఆమ. "దట్సిట్."