Sunday, January 2, 2011

ఏం? ఎందుకని? - 12

12. మన కంటికి ఆముదపు దీపం మంచిదా? విద్యుత్ దీపం మంచిదా?

మన పెద్దవాళ్లంటారు, "ఈ ఎలట్రీ దీపాలు వచ్చాకనే కళ్లజోళ్ళు ఎక్కువయాయి" అని. ఆముదపు దీపాల రోజులల్లో కళ్ల జోళ్ల వాడకం లేనేలేదని వాళ్ల వాదం. మరికొంతమంది "ఏమిట్రా, ఆ గుడ్డి దీపం దగ్గర చదువుతావు, కళ్లు పాడైపోగలవు జాగ్రత్త" అంటారు. ఈ నమ్మకాలలో నిజం ఎంత?

ఆముదపు దీపం అంటే వెలుగు తక్కువ ఇచ్చేదీపం అని అన్వయం చెప్పుకుంటే, వెలుగు తక్కువగా ఉన్న ఏ దీపం దగ్గర చదివినా కంటికేమీ నష్టం లేదు. ప్రమిదలో ఆముదం పోసినా, ఆవు నెయ్యి పోసినా, కిరసనాయిలు పోసినా ఆ దీపం నుండి వచ్చే పొగలో తేడా ఉండొచ్చు కానీ ఆ దీపపు వెలుగులో ఆరోగ్యానికి సంబంధించిన తేడాలు ఉండడానికి వీలు లేదు. కిరసనాయిలు దీపపు పొగకి కళ్లు మండుతాయి కనుక కిరసనాయిలు దీపం కంటె ఆముదపు దీపం మంచిది కావచ్చు.

వెలుతురు తక్కువగా ఉన్న చోట చదివితే కంటికి నష్టం కాదా? వెలుతురు తక్కువగా ఉన్న చోట ఫోటో తీస్తే కెమేరా పాడవుతుందా? పాడవదే. అలాగే వెలుతురు తక్కువగా ఉన్న చోట చదవడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కాని, కన్ను పాడవడానికి అవకాశం లేదు. చీకటికి అలవాటు పడిపోయిన తర్వాత మన కళ్లు చీకటిలో కూడ బాగానే చూడకలవు. అలాగే విద్యుత్ దీపాల వెలుగు కంటికి హాని చేస్తుందనుకోవడానికి నాకు తెలుసున్నంత వరకు దాఖలాలు ఏమీ లేవు.

మరి పూర్వపు రోజుల కంటె ఇప్పుడు కళ్లజోళ్ల వాడకం ఎందుకు పెరిగింది? పూర్వం కళ్ల పరీక్షలకి సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సదుపాయాలు పెరగడంతో చిన్న పిల్లలకి కూడా కళ్ల పరీక్షలు చేసి కళ్లజోళ్లు తొడిగెస్తున్నారు తప్ప కళ్ల జబ్బులు ఎక్కువ అయి ఏమీ కాదు.

1 comment:

  1. అబ్స్టకిల్స్ పెరిగాయి కదా ఇవ్వాళ్ళ. ఆరోజుల్లో పెద్ద పెద్ద భవనాలు గట్రా ఉండేవి కావు. ఇవ్వాళ్ళ చూపుని అడ్డుకుంటూ ప్రతీదీ. అంతేగాక పొల్యూషన్, టీవీ లాంటివి, వీటివల్ల అలసిపోవుట కూడా కారణాలేనేమో. అంతేగాక తినేతిండి. అప్పట్లో ఒక ముద్ద తిన్నా, హోల్ గ్రైన్స్ తినేవాళ్ళు, ముతక బియ్యం ఉదాహరణకు. ఇప్పుడేమో రిఫైన్డ్ ఫుడ్. ఇవికూడా కారణాలు కావచ్చేమో మాష్టారూ?

    ReplyDelete