Monday, June 15, 2009

MP ల జీతాలు, మంత్రులకి అవకాశాలు!!

రాజకీయనాయకులని (MLA లు, MP లు, మంత్రులు, వగైరా) ఎవ్వరినైనా అడగండి, "ఎందుకీ పదవులకోసం పాకులాట?" అని.

"ప్రజాసేవ కోసం!" అని తడుముకోకుండా చెబుతారు, సమాధానం.

ఒక MP ఆ పదవి కోసం ఎందుకు అలా తాపత్రయ పడతాడో నిజం నేను చెబుతాను, వినండి. ముందస్తుగా MP అవటానికి ఏ చదువూ అక్కర లేదు, రేంకులు రానక్కర లేదు, నిరక్షరకుక్షి (అంటే, పొట్ట చించితే అక్షరం ముక్క లేని వాడు) కూడా MP అవొచ్చు.

ఇహ, MP అయిన తరువాత, ఆ వ్యక్తికి ముట్టే జీతం, అమాంబాపతులు:

నెలవారీ జీతం, కేవలం రూ. 12,000/= మాత్రమే.
నెలవారీ ఖర్చులు: రూ. 10,000/=
నెలవారీ ఆఫీసు ఖర్చులు: రూ. 14,000/=
ప్రయాణపు ఖర్చులు: కి. మీ. ఒక్కంటికి, కేవలం రూ.8/. ఈ లెక్కని ఒక్క సారి హైదరాబాదు నుండి ఢిల్లీ వెళ్ళి తిరిగి రావటానికి: 6,000 కి. మీ. x 8 = రూ. 48,000/=
రోజువారీ కరువు భత్యం (పార్లమెంటు పనిచేస్తూన్న రోజులలో): రూ. 500/=
ట్రెయిన్ లో మొదటి తరగతి ఎ. సి. లో: ఉచితం (ఎన్ని సార్లు కావలిస్తే అన్ని సార్లు, ఇండియాలో ఎక్కడి నుండి ఎక్కడికయినా సరే)
విమానంలో బిజినెస్ క్లాసులో ఏడాదికి 40 సార్లు (భార్యతో సహా లేదా సెక్రట్రీ): ఉచితం
ఢిల్లీ లో MP హాస్టల్ లో అద్దె: ఉచితం
ఉన్న ఊళ్ళో విద్యుత్తుకి అయే ఖర్చులు: ఉచితం (50,000 యూనిట్ల వరకు)
టెలిఫోను: 1,70,000 కాల్స్ ఉచితం (లోకల్)
వెరసి -
ఏడాదికి ఒక MP "ఏనుగు"ని భరించటానికి పౌరులకి అయే కనీసపు ఖర్చు: రూ. 32,00,000/=

నాకు తెలిసినంత వరకు, Ph.D. చేసి, యూనివర్సిటీలో పని చేసే ఆచార్యుడికి ఏటికి రూ. 3,00,000/=
కంపెనీ లో పని చేసే CEO కి ఏటికి రూ. 60,00,000 ఉండొచ్చేమో? (తెలియదు)

కాని ఈ రెండు ఉద్యోగాలకి జీవితంలో ఎన్నేళ్ళో కష్టపడి చదువుకోవాలి. ఏ చదువూ అక్కర లేకుండా ఏడాదికి 32 లక్షలు వచ్చే ఉద్యోగం బాగులేదూ?

ఇదే MP మంత్రి అయితే ఆ వ్యక్తి ఆర్జనకి ఆకాశమే అవధి. ఎలా అంటారా?

నిన్న కాక మొన్న వాషింగ్టన్ విమానాశ్రయంలో ఒక వైద్యుణ్ణి కలుసుకున్నాను. చెన్నైలో మెదడు మీద శస్త్ర చికిత్స చెయ్యగలిగే సదుపాయాలతో ఒక ఆసుపత్రి కడుతున్నాడు, ట. "మా హైదరాబాదులో కూడ ఒక "బ్రేంచి" పెట్టకూడదా?" అని అమాయకంగా అడిగేను.

"పెడదామనే అనుకున్నాం. స్థలం కొనుక్కుందుకి ప్రభుత్వం 30 కోట్లు సహాయం చేస్తే మా ఖర్చులతో మేము ఆసుపత్రి కడతాము" అని మీ మంత్రి గారిని (పేరు ఇక్కడ రాసే ధైర్యం లేదు!) అడిగేము."

"ముప్ఫై అయిదు కోట్లు మంజూరు చేస్తాము, కాని అందులో అయిదు కోట్లు రసీదు లేకుండా మంత్రి గారికి ముట్టచెప్పాలి" అని షరతు పెట్టేరు ట."

కనుక MP లు అందరూ, బహుపరాక్. MPలు గా మీరు గణించేవి చిల్లర డబ్బులు. సాదరు కి కూడ సరిపోవు. మళుపు తిరిగితే అంతా బంగారమే. మంత్రి అయిపొండి.

5 comments:

 1. మీరు మరీనండి MPలు జీతాలతోనే సరిపెట్టుకుంటున్నారా? ఎంత చెట్టుకు అంత గాలి :)

  ReplyDelete
 2. :):) మా ఊళ్ళో యం.పి, ఎం.ఎల్.ఏ ఒకడు సగం ఓరుని కొనేస్తే ఇంకోడు సగం ఊరిని ఆక్రమించేస్కున్నాడు. :)
  అందినకాడికి దోచేయ్యడమే ఈళ్ళ పని అద్దెచ్చా!!

  ReplyDelete
 3. ఆ విధం గా..................ముందుకుపోతూ ......,
  మీరు ఒక విషయం మర్చిపోయినట్లున్నారు.. ప్రతి M.P కి ప్రత్యేకంగా Development funds అని ఉంటాయి అవి మర్చిపోతే ఎలా......
  అవి ఒకటిన్నర కోటి అనుకుంటా.....

  ReplyDelete
 4. పాపం ఆ ఎం పీలు పెట్టుబడులు కూడా అలానే పడతారు కదండి.
  ఉదా- ఈ సారి ఎన్నికల్లో ఏ పార్టీ యొక్క ఎంపీ సీటుకైనా సరే నాలుగు కోట్లు చూపించమన్నారఁట. పార్టీనిధులకు ఇంకో నాలుగు కోట్లట. :)

  ReplyDelete
 5. ఆ డెవలప్మెంట్ ఫండు తొ CIVIL Projects కట్తే వాళు మన MP గారి చుట్తాలె!

  ReplyDelete