Tuesday, April 28, 2009

ఈ ప్రపంచం పోకడ: ఆర్ధిక మాంద్యం

ఏవిటో అప్పుడప్పుడు ఈ ప్రపంచం పోకడ బోధపడి చావదు నాకు. అప్పుడే ఈ ఆర్ధిక మాంద్యం మొదలయి ఏణ్ణర్ధం కావస్తోంది. మాంద్యం ఏమిటి నా మొహం! "మాంద్యం" అంటే చైతన్యం సన్నగిల్లటం. ఇప్పటి పరిస్థితి - ఆటు లో సముద్రంలా - వెనక్కి వెళుతోంది. ఇది అల్పపీడనపు ద్రోణిలా మారి అందరినీ ఒక సుడిగుండంలో ముంచెయ్యకుండా ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ ఆర్ధిక దుస్తితి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా - పర్యావరణానికి కొంత మంచి కూడా జరుగుతోంది. మూతపడ్డ కర్మాగారాలు వాతావరణంలోకి కాలుష్యాలని విసర్జించటం తగ్గించేయి. ఉద్యోగాలు ఊడిన వాళ్ళు, జేబుల్లో డబ్బులు లేక కార్లలో షికారులు తగ్గించేరు. ఇంటిపట్టున ఉన్నప్పుడు వాయునియంత్రణ సౌకర్యాలకి స్వస్తి చెప్పి, కిటికీలు తెరుచుకుని, విసనకర్రలతో విసురుకుంటున్నారు. ఆదాయం తగ్గిపోయిన కంపెనీలలో మిగిలిన ఉద్యోగస్తులు విమానాల ప్రయాణాలు తగ్గించి, ముఖాముఖీ సమావేశాలకి బదులు టెలిఫోను వాడకం అలవాటు చేసుకుంటున్నారు. వీటన్నిటి పర్యవసానం ఏమిటంటే అమెరికాలో, 2008 లో, పెట్రోలు వాడకం ఆరు శాతం తగ్గిపోయింది. ఆ ప్రాప్తికి వాతావరణంలో ప్రవేశించే కర్బనం శాతం కూడా తగ్గింది.

ఈ ప్రపంచం నడవటానికి రెండు మూలశక్తులు కావాలి. ఒకటి అప్పు, రెండు ఇంధనం. మన దురదృష్టం కొద్దీ ఆర్ధిక విపత్తు, ఇంధనపు విపత్తు, రెండూ ఒక్కసారే వచ్చిపడ్డాయి. దీనికి కారణం ఈ రెండు పైపైకి వేర్వేరుగా కనిపించినా ఇవి రెండూ ముడిపడ్డ సమశ్యలు. ఇంధనం (బొగ్గు, రాతిచమురు, సహజవాయువులు) మన కండ బలానికి ప్రవర్ధకి (amplifier) అయితే అప్పు మన జేబులో ఉన్న డబ్బుకి ప్రవర్ధకి. మన కండబలంతో చెయ్యలేనివి ఎన్నో యంత్రాలు ఉపయోగించి చెయ్యగలుగుతున్నాం. మన సొంత డబ్బుతో చెయ్యలేనివి ఎన్నో అప్పు చేసి చెయ్యగలుగుతున్నాం. ఈ రెండింటి సహాయంతోటే పారిశ్రామిక విప్లవం సాధ్యం అయింది. ఈ రెండు శక్తుల మధ్య అదృశ్యమైన తుల్యత (చైనా వారి ఇంగ్-యాంగ్ లా) ఉన్నంతసేపూ ఈ బండి సజావుగా నడుస్తుంది. కాని అప్పుడప్పుడు - మంచి ఉద్దేశ్యం తోటో, ఓట్ల కొరకో - ప్రభుత్వాలు ఈ పాత్రలో వేళ్ళు పెట్టి కెలుకుతాయి. దాని పర్యవసానం ఎలాగుంటుందో చూద్దాం.

2008 వేసంగిలో పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు దాటింది కదా. అలవాట్లు మార్చుకున్నాను. కారు తోలటం తగ్గించి బస్సులు, బార్టు (BART) వాడటం పెంచేను; పర్సుకీ పర్యావరణానికీ కూడా మంచిదనుకుంటూ సమర్ధించుకున్నాను. చాల రోజులబట్టి కొత్త కారు కొనుక్కుందామని సరదా పడ్డవాడిని ఆ ప్రణాళికకి స్వస్తి పలికేను. ఏదో గుడ్డిలో మెల్ల పర్యావరణ కాలుష్యం తగ్గటానికి చంద్రుడికోనూలు పోగులా నేనూ ఇతోధికంగా సహాయపడుతున్నానని సంతోషించేను. నా లాగే చాల మంది కార్లు కొనటం మానేశారు. దాంతో అమెరికాలో రెండు కార్ల కంపెనీలు దివాలా ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాయి. నేను కారు కొనుక్కుందామని దాచుకుంటూన్న డబ్బులని, నాతో చెప్పకుండా, నన్ను అడగకుండా, నా జేబులో చెయ్యి పెట్టి లాక్కుని ఆ డబ్బుని ములిగిపోతూన్న కార్ల కంపెనీలకి ఆసరాగా అప్పిచ్చింది అమెరికా ప్రభుత్వం. నా డబ్బూ హరించిపోయింది, కారూ లేక పోయింది.

ప్రజలు కార్లు నడపటం తగ్గిస్తే అది పర్యావరణానికి మంచిదే కాని ప్రపంచపు ఆర్ధిక ఆరోగ్యానికి మంచిది కాదేమో. ఈ విషచక్రం లోంచి బయట పడాలంటే హైబ్రిడ్ కార్లు కొని వాడాలిట. హైబ్రిడ్ కార్లని గేలనుకి 45 మైళ్ళవరకు నడపొచ్చు. అంచేత అవి పర్యావరణాన్ని అంతగా కలుషితం చెయ్యవు. కనుక హైబ్రిడ్ కార్లు అలవాటయిన తరువాత ఇంతకు పూర్వం అయే పెట్రోలు బడ్జెట్ తో రెట్టింపు దూరం వెళ్ళొచ్చు. కనుక పెట్రోలు ధర గేలను నాలుగు డాలర్లు అయినా మనకి రెండు డాలర్లకే కిట్టింది కదా. కనుక వెధవది బస్సులలోనూ, బార్టులలోనూ ఎవడు తిరుగుతాడు, మన కారులో మనం రాజాలా తిరగొచ్చు అని అందరూ అనుకుంటే - అనుకుని పూర్వం కంటే ఎక్కువ తిరగటం మొదలుపెడితే - నష్టపోయేది పర్యావరణమే.

హైబ్రిడ్ కార్లు మానేసి ఎలక్ట్రిక్ కార్లు వాడితేనో? ఎలక్ట్రిక్ కార్లు వాడకం పెరిగితే విద్యుత్తు వాడకం పెరుగుతుంది. ఆ విద్యుత్తు ఎక్కడ నుండి వస్తుంది? దానికోసం మరొక పవర్ హౌస్ కట్టాలి కదా. దాంట్లో వాడటానికి బొగ్గో, ఇంధనపు తైలమో వాడాలి కదా. అది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది కదా.

ఈ సమశ్యకి పరిష్కారం నా దగ్గర లేదు కానీ, ఈ సమశ్య ఇప్పటిది కాదని మనవి చేసుకుంటున్నాను. దీని పరిష్కారానికి అమెరికాలో ప్రజలకి ఉపాయాలు తట్టకనూ పోలేదు. వీళ్ళ పరిష్కార ధోరణి ఎలా ఉంటుందో నా స్వానుభవం ద్వారా మనవి చేసుకుంటాను. 1960-1970 దశకంలో పర్యావరణ సమశ్య ప్రజల దృష్టిలో పడటం మొదలు పెట్టింది. ఆ రోజుల్లో, ఒక వేసంగిలో, నేను కొలంబస్, ఒహాయోలో ఒక వైజ్ఞానిక సమావేశానికి హాజరయేను. రోజల్లా ప్రసంగాలు అయేయి. సాయంకాలం వాయునియంత్రణ ఉన్న హొటేలు గదిలో, కాక్‌టెయిల్ పార్టీ జరుగుతోంది. రెండు చుక్కలు పడ్డ తరువాత అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటూ పర్యావరణ సమస్యకి ఒక పరిష్కారమార్గం సూచించేరు. వారనేది ఏమిటంటే - మనం అమెరికాలో ఉన్నది 300 మిలియన్లు. ఇండియా, చైనా కలిపి దరిదాపు రెండు బిలియను ప్రజలు ఉన్నారు. వీరందరూ అమెరికాని అనుకరిస్తూ, ప్రగతి పథం వెంబడి ప్రయాణం చేస్తూ, సుఖ సౌఖ్యాలు (అంటే కార్లు, వాయునియంత్రణ యంత్రాలు, మొదలైనవి) కోరటం మొదలు పెట్టేరంటే వాతావరణ కాలుష్యం అపరిమితంగా పెరిగిపోతుంది. వాళ్ళు ఎలాగూ కష్టజీవితానికి అలవాటు పడిపోయేరు. కనుక పర్యావరణ కాలుష్య నియంత్రణ అక్కడ మొదలవాలి..." ఈ ధోరణిలో పోతూన్న ఆ వాక్ప్రవాహం ఎక్కడికెళుతోందో మీ ఊహకి వదిలేస్తాను.

ఇంతలో హొటేల్లో విద్యుత్తు సరఫరాకి అంతరాయం వచ్చింది. దీపాలు లేవు, ఎయిర్ కండిషనర్లు ఆగిపోయాయి. ఆగస్టు నెలేమో ఉక్క విపరీతంగా ఉంది. అప్పటి వరకూ నోరు మూసుకు కూర్చున్న నేను అన్నాను. "ఎందుకలా ఆపసోపాలు పడతారు. ఇండియా, చైనా దేశాల ప్రజలలాగే మనమూ పర్యావరణ ఆరోగ్యానికి దోహదం చేద్దాం."

ఈ కథ ఎందుకు చెప్పొచ్చేనంటే బుష్ ఆధ్వర్యంలో అమెరికా క్యోటో ఒడంబడికకి ఒప్పుకో లేదు. నెల్లాళ్ళ క్రితం కోపెన్‌హేగన్‌లో మరొక సమావేశం అయింది. సుదూర వాతావరణం (climate) గురించి, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచటం గురించి చర్చలు జరిగేయి. ప్రస్తుతపు ఆర్ధిక మాంద్యం ధర్మమా అని 2008 లో పర్యావరణానికి జరగబోయే హాని జరగలేదు. అంతా ఇండియా, చైనాలదే తప్పు అన్న ధోరణిలో కూడ కొద్దిగా మార్పు కనిపిస్తొంది.

2 comments: