Sunday, September 26, 2010

గుడ్లు తినటం గుండెకి మంచిది కాదా?

వేమూరి వేంకటేశ్వరరావు

ఈ మధ్య ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్లు మరీ ఎక్కువయిపోయారు. ఎవ్వరిమాట విని చావాలో తెలిసి చావటం లేదు.

ఉదాహరణకి గుడ్డట్టు (ఆమ్లెట్ కి తెలుగులో వచ్చిన తిప్పలు) వేసుకుందామని కోడిగుడ్డుని పగలగొట్టేను కదా!

“ఆ పచ్చని తీసి పారేసి తెల్లసొనతో వేసుకొండి. ఆ పచ్చసొన అంతా కొలెస్టరాలే. మీ గుండెకి మంచిది కాదు” అంటూ ఉచితంగా ఒక సలహా పారేసింది – ఇంకెవరు! మా శ్రీమతి!

నాలోని సైంటిస్టు కుతూహలంతో కుతకుతలాడేడు. లాడడూ?

నిజంగా పచ్చసొన తింటే గుండెకి హాని కలుగుతుందా? ఎవ్వరు చెప్పేరు?

మనకి తెలుసున్న విషయాలు ఇవి: ఒక సగటు గుడ్డులో సుమారు 210 మిల్లీగ్రాములు కొలెస్టరాలు ఉంటుంది. నిజమే! అంతే కాదు. మన రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధం చాల మట్టుకు కొలెస్టరాలే! రక్తంలో ఉన్న కొవ్వు పదార్ధాలు – పాలల్లో వెన్నలా తేలిపోయి - గుండెకి సరఫరా చేసే రక్తనాళాలలో మేట వేసి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించినప్పుడు గుండెపోటు (heart attack) వస్తుంది. అదీ నిజమే. కాని మనం కొలెస్టరాలు ఉన్న తిండి పదార్ధాలు తినటం వల్ల గుండెపోటు వస్తుందనటం కొచెం నిజాన్ని సాగదియ్యటమే అవుతుంది.

మనలో - చాల మందిలో - కోలెస్టరాలు తిన్నంత మాత్రాన రక్తప్రవాహంలో కొలెస్టరాలు మట్టం పెరగదు. (పొట్లకాయ తిన్నంత మాత్రాన పొడుగెదుగుతామా?) ఆ మాటకొస్తే, మనం ఆహారం ద్వారా కొలెస్టరాలుని సరఫరా చేసిన పక్షంలో శరీరం తను ఉత్పత్తి చేసే కొలెస్టరాలుని తగ్గిస్తుంది. కనుక తినే తిండిలో ఉన్న కొలెస్టరాలుకీ, రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలుకీ మధ్య బాదరాయణ సంబంధం ఉంటే ఉండొచ్చు గాక; అది మాత్రం దగ్గర సంబంధం కాదు.

నిజానికి రక్తప్రవాహంలో ఉండే కొలెస్టరాలు మట్టం పెంచటానికి దోహదపడే కారణాంశాలు (factors) రెండు ఉన్నాయి. అవి – సంతృప్త గోరోజనామ్లాలు (saturated fatty acids) , అడ్డు గోరోజనాలు (trans fats). ఈ రెండు కారణాంశాలు ఒక గుడ్డులో కేవలం 2 గ్రాముల ప్రాప్తికి మాత్రమే ఉంటాయి.


అమెరికన్ హార్ట్ ఎసోషియేషన్ చేసే సిఫార్సు ప్రకారం ఆరోగ్యవంతులు రోజుకి 300 మిల్లీగ్రాముల వరకు కోలెస్టరాల్ ని నిర్భయంగా తినొచ్చు. గుండెజబ్బు చరిత్ర ఉన్నవాళ్లు అయితే 200 మిల్లీగ్రాములతో సరిపెట్టుకోవాలి. ఈ లెక్కన ఆరోగ్యంగా ఉన్న వాళ్లు రోజుకో గుడ్డు తిన్నంతమాత్రాన్న మరేమీ కొంప ములిగిపోదు. గుండె ఆరోగ్యం సరిగ్గా లేని వారు వారానికి రెండు గుడ్లు తింటే మరేమీ పరవా లేదు.

ఇవన్నీ ఉచితమైన సలహాలు. మీ డాక్టరుకి ముట్టజెప్పవలసిన ముడుపు ముట్టజెప్పి అప్పుడు ఆ వైద్యుడు చెప్పినట్లు చెయ్యటం సర్వదా శ్రేయస్కరం.

5 comments:

  1. సంతోషకరమైన వార్త చెప్పారు

    ReplyDelete
  2. /300 మిల్లీగ్రాముల వరకు కోలెస్టరాల్ ని నిర్భయంగా తినొచ్చు/
    /మనం ఆహారం ద్వారా కొలెస్టరాలుని సరఫరా చేసిన పక్షంలో శరీరం తను ఉత్పత్తి చేసే కొలెస్టరాలుని తగ్గిస్తుంది./

    Just curious.. then, why to restrict? Eat and let our body control.

    ReplyDelete
  3. If any one are suffering from migraine should not eat egg read the following article
    http://www.articlesbase.com/health-articles/migraine-and-eggs-573293.html

    ReplyDelete
  4. వివరణతో గూడిన మీ సలహా ఎంతొ ఉపయుక్తంగా ఉంది.నేనెక్కడో చదివినదానికి సరిపోయింది .సంతోషానికి తెగ బలమొచ్చింది.

    ReplyDelete
  5. snkr కి:

    నిజమే. కాని, ఎంత ఆరోగ్యవంతులైనా మితిమీరితేటట్లు తినటం ఎప్పుడూ మంచిది కాదు. మితిమీరి మంచినీళ్లు తాగితే ప్రాణానికి ముప్పు వస్తుంది, తెలుసా? ఆరోగ్య సూత్రాలలో మరొక కిటుకు ఉంది. ఉదాహరణకి ఉప్పు సంగతే తీసుకుందాం. ఇది అత్యవసరమైన పోషక పదార్ధం. పైపెచ్చు, ఉప్పు లేనిదే ఏదీ రుచిగా ఉండదు. నిజానికి ఆరోగ్యవంతులు ఉప్పు ఎంత కావలిస్తే అంత తిన్నా ప్రమాదం లేదు. కాని, మనం పెద్ద అయిన తరువాత వచ్చే అనేక రోగాలని అదుపులో పెట్టాలంటే ఉప్పు వాడకం తగ్గించాలి. కాని చిన్నప్పటినుండీ ఉప్పు ఎక్కువ తినటం అలవాటైన నోటికి ఉప్పు తక్కువైతే ఏవీ రుచించవు. కనుక చిన్నప్పటినుండీ మంచి ఆరోగ్య లక్షణాలు అలవాటు చేసుకుంటే పెద్దయినప్పుడు వాటి విలువ తెలిసొస్తుంది. ఈ సూత్రం పంచదార యెడల కూడ వర్తిస్తుంది. కనుక మోతాదు మించి ఏదీ తినకూడదు, ఇష్టమైన పదార్ధాలు కూడ!

    ReplyDelete