4. భోజనం చెయ్యగానే ఈత కొట్టకూడదంటారు? ఎందుకని?
వేమూరి వేంకటేశ్వరరావు
ఎందుకు కొట్టకూడదు? కొట్టాలని ఉంటే కొట్టొచ్చు! కాని ఈ సూత్రం అర్ధ శతాబ్దం కిందట అమెరికన్ రెడ్‌క్రాస్ వారు ప్రచురించిన పుస్తకంలో, “భోజనం చేసిన వెంటనే ఈత కొడితే కండరాలు కొంకర్లు పోతాయి. ప్రాణం కూడ పోవచ్చు” అని ఉంది. చెప్పింది అమెరికా వాడు. పైపెచ్చు రెడ్‌క్రాస్ వాళ్లు. అందుకని అందరూ నమ్మేసేరు. కాని 1961 లో ఆర్థర్ స్టయిన్‌హవుస్ అనే మరొక అమెరికా ఆసామి ఈ నమ్మకం తర్కబద్ధం కాదనీ, దమ్ములు ఉంటే రుజువు చెయ్యమనీ సవాలు చేసేడు. విజ్ఞానపరంగా ఎవ్వరూ రుజువు చెయ్యలేక పోయారు. అందుకని ఈ మధ్య అమెరికన్ రెడ్‌క్రాస్ వాళ్ళు పై రెండు వాక్యాలనీ వారి పుస్తకం నుండి తొలగించేరు. కనుక భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా? కూడదా?
నూ యార్క్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ కి చెందిన డా. రోషిణి రాజపక్ష అభిప్రాయం ప్రకారం, సామాన్యులు సరదాకి ఈత కొట్టదలుచుకున్నప్పుడు భోజనం చేసిన తరువాత ఈతకొట్టినా పరవాలేదు. కాని ఆ భోజనంతో పాటు రెండు చుక్కలు వేసుకుంటే మాత్రం ఈ సూత్రం వర్తించదు. కేలిఫోర్నియాలో నీళ్లల్లో మునిగిపోయి చచ్చిపోయినవాళ్ల గణాంకాలు పరిశీలించి చూడగా, 41 శాతం మనుష్యుల రక్తంలో ఆల్కహాలు కనిపించిందిట. కనుక “భోజనం చెయ్యగానే ఈత కొట్ట వచ్చా?” అన్న ప్రశ్నకి మీరే సమాధానం చెప్పండి.
Friday, October 15, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment