5. కేరట్లు తింటే కంటికి మంచిదంటారు. ఎందుకని?
వేమూరి వేంకటేశ్వరరావు
కేరటు దుంపలు నారింజ రంగులో పొడుగ్గా ఏకుల్లా ఉంటాయి. ఇవి తింటే కంటికి మంచిది అంటారు. ఇది మంచో కాదో తర్వాత చూద్దాం. ముందు ఈ పుకారు ఎలా పుట్టిందో పరిశీలిద్దాం. కేరట్లలో ఉండే బీటా కేరొటేన్ అనే రసాయనమే విటమిన్ ఎ తయారీకి ముడి పదార్ధం. ఈ విటమిన్ లోపిస్తే రేచీకటి అనే కంటి వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ లేకపోతే కండ్లలో చెమ్మదనం పోయి, ఎండి పోతాయి. టూకీగా చెప్పాలంటే పోషక పదార్ధాలలో విటమిన్ ఎ చాల ముఖ్యం. అందులో ఢోకా లేదు. రోజుల తరబడి పొట్ట వీపుకి అంటుకుపోయే అంత గర్భ దరిద్రం అనుభవించే వారిని మినహాయిస్తే సామాన్యులు తినే ఆహారంలో ఈ విటమిన్ దండిగానే ఉంటుంది. కనుక సర్వ సాధారణంగా విటమిన్ ఎ కొరత రాకూడదు. చెప్పొచ్చేదేమిటంటే కంటికి మంచిదని కేరట్లని ప్రత్యేకం మనం తినక పోయినా పరవా లేదు. బీటా కేరొటీన్ ఇంకా అనేక ఆహార పదార్ధాలలో లభిస్తుంది. ఆమాటకొస్తే విటమిన్ మాత్రలు మింగే కంటె విటమిన్‌లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తినటం మంచిది; ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమినులతోపాటు ఇంకా అనేక పోషక పదార్ధాలు ఉంటాయి (ఉ. ఖనిజ లవణములు).
కంటికి మంచిది కదా అని కేరట్లు ఎక్కువగా తిన్నంత మాత్రాన హ్రస్వదృష్టి (near-sightedness or myopia), దీర్ఘదృష్టి లేక చత్వారం (far-sightedness or hypermetropia) వంటి దృష్టి దోషాలు రాకనూ పోవు, ఉన్నవి పోనూ పోవు.
తెలిసో తెలియకో కేరట్లు మరీ ఎక్కువ తింటే శరీరం పచ్చబడుతుంది. ఇది ఆరోగ్యానికి హాని చెయ్యదు కాని, పెళ్లిచూపుల సమయంలో ఏదైనా ఉపకారం చెయ్యొచ్చేమో. నాకు తెలియదండోయ్! కేరట్లు తినటం, శరీరం పచ్చబడటం కేవలం కాకతాళీయం కావచ్చు. కామెర్ల రోగికి కూడ శరీరం పచ్చబడుతుంది. కనుక ఆరోగ్యం విషయంలో సొంత వైద్యం ఎప్పుడూ కూడదు. వెంకటేశ్వరస్వామికి, వైద్యుడికి ముడుపు చెల్లించవలసినప్పుడల్లా బకాయి పెట్టకుండా చెల్లించుకోవటమే మంచిది.
Sunday, October 24, 2010
Subscribe to:
Post Comments (Atom)
మంచి విషయం!. నేను కూడా కంటికి కారట్టు కి ఏదో లింకుంది అనుకుంటూ ఉండేవాడిని. (అలా అని తినడం మానెయ్యను అనుకోండి గాని, తిన్నప్పుడల్లా కళ్ళు మరింత చక్రాలు అయ్యయో లేదో అని చెక్ చేసుకోవడం తగ్గిస్తాను :) )
ReplyDelete