Friday, February 6, 2009

కాకిగోల

ఫిబ్రవరి 2009

మా తునిలో – నా చిన్నతనంలో - సాయంకాలం డాబా మీద పడుక్కుంటే చాలు కాకులు వందలకొద్దీ కనిపించేవి. కాకులు గూళ్ళు చేరే వేళ అది. మా ఇంటి ఎదురుగా ఉన్న నేరేడు చెట్టు మీద కాకులు చేసే “కావ్ కావ్” గోలకి చెవులు గింగుర్లెత్తిపోయేవి. నేను అమెరికా వచ్చిన కొత్తలో కాకులు కనిపించేవే కాదు. ఈ మధ్య ఇండియన్సుతో పాటు అమెరికాలో కాకుల జనాభా కూడ పెరుగుతూన్నట్లనిపిస్తోంది.

ఒక్క నూజీలండ్‌లో తప్ప కాకులు లేని దేశం లేదుట. కొన్ని దేశాలలో ఎక్కువ, కొన్ని దేశాలలో తక్కువ.

సాధారణంగా పల్లెలలో ఎక్కువ, పట్టణాలలో తక్కువ.

పొలాలలో పంట పిట్టల పాలు కాకుండా ఉండటానికి గడ్డితో చేసిన మనిషి బొమ్మలని కాపలా పెడతారు. ఈ గడ్డి బొమ్మలని చూసి పిచికలు భయపడతాయేమో కాని ఆ గడ్డి మనుష్యుల మీద భయం లేకుండా వాలే కాకులని చూసేను నేను. మనుష్యులంటే కాకులకి బొత్తిగా భయం లేదు.

కాకులు పంటలని తినేసి రైతుకి నష్టం తీసుకొస్తాయనే వదంతి ఒకటి ఉంది. తిండి గింజలని కాజేయటంలో కాకులు దిట్టలే కాని, పంటలకి నష్టం కలిగించే క్రిమికీటకాదులని కూడ కాకులు తింటాయి కనుక మొత్తమ్మీద కాకుల వల్ల లాభమే కాని నష్టం వాటిల్లటం లేదని కొంతమంది “కాకి కోవిదులు” కాకులని వెనకేసుకొస్తున్నారు.

కాకులు తెలివిగల పక్షులు అని వాదించటానికి బోలెడన్ని దాఖలాలు చూపించవచ్చు.

ఒక సారి ఎత్తుగా ఎగురుకుంటూ వచ్చి ముక్కున కరిచిపెట్టిన పిక్కని ఒక కాకి సిమెంటు చపటా మీద జారవిడచింది. “అయ్యో పాపం! కాకి ముక్కు నుండి పిక్క జారిపోయిందే” అని నేను జాలి పడుతూ ఉంటే కింద పడ్డ దెబ్బకి పిక్క చితికి లోపల ఉన్న గింజ బయటకి వచ్చింది. కాకి కిందకి దిగొచ్చి ఆ గింజని కబళించింది. కాకి కావాలని ఆ పిక్కని చపటా మీద పడేసిందిట – అని కాకి కోవిదుడు నాకు వివరణ ఇచ్చేడు.

చిన్నప్పుడు చదువుకున్న మరొక కథ. సన్నని మూతిగల కూజాలో అట్టడుగున ఉన్న నీళ్ళని తాగటానికి గులకరాళ్ళతో కూజాని నింపుతుందొక కాకి. అప్పుడు పైకి అందొచ్చిన నీళ్ళని తాగుతుంది.

కాకి తెలివైన ఘటం అని నమ్మించటానికి మిత్రభేదంలో ఒక కథని వాడుకోవచ్చు. ఒక చెట్టు కింద పుట్టలో ఉండే పాము చెట్టెక్కి ఒక కాకి పెట్టిన గుడ్లని దొంగతనంగా తినేస్తూ ఉంటుంది. రాణి గారి మిలమిల మెరిసే నగని మన కరటం దొంగిలించి రాజభటులు చూస్తూ ఉండగా పుట్టలో పడెస్తుంది. రాజభటులు పుట్టని తవ్వి, పాముని చంపి, నేవళాన్ని దక్కించుకుంటారు. ఈ కథని బట్టి కాకి తెలివైనదే కాకుండా దొంగబుద్ధులు ఉన్నదని కూడ రుజువవుతోంది కదా. దొంగని దొంగే పట్టాలంటారు. ఈ కథని బట్టి మనకి మరొక విషయం ద్యోతకమవుతోంది. కాకులకి మిలమిల మెరిసే వస్తువులంటే ఇష్టం. మా పెరట్లోని వెండి ఉగ్గు గిన్నెలనీ, చిన్న చిన్న చెంచాలనీ కాకులు తరచు ఎత్తుకుపోతూ ఉండటం నాకు తెలుసు. కనుక నీతిచంద్రికలోని కాకి కథ పూర్తిగా కాకమ్మ కథ కాకపోవచ్చు.

ఇటువంటి తెలివిని ప్రదర్శిస్తూన్న కాకులని లోకువ కట్టేసి, “లోకులు కాకులు” అని లోకులు కాకులకి ఎందుకు అప్రతిష్ట తెస్తారో నాకు అర్ధం కాదు. లోకులలో వీసమెత్తు సంఘీభావం నేనెప్పుడూ చూడలేదు కాని, కాకులలో కలిసికట్టుతనం చాల ఎక్కువ. ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడిపోతే ఆ కాకిని ఏకాకిగా ఒదిలేయకుండా పది కాకులు కింద పడ్డ కాకి చుట్టూ మూగుతాయి. దెబ్బ తిన్న కాకి తేరుకునే వరకు వేచి ఉంటాయి. ఒక వేళ కాకి కాని చచ్చిపోతే చుట్టూ మూగిన కాకులు అలా కాపలా కాస్తూనే ఉంటాయి.

మసి పూసుకుని రెక్కలు కట్టుకున్నా సరే మానవుని మేధ - తులానికి తులం – కాకి తెలివితో తూగలేదని కొందరు అంటున్నారు.

కోకిలకి గుడ్లు పొదగటం చేతకాదనిన్నీ, అందుకని కోకిల కాకి గూట్లో గుడ్లు పెడుతుందనిన్నీ, పిల్ల బయటకి వచ్చిన తరువాత చూట్టానికి రెండూ నల్లగానే ఉన్నా “కాకి కాకే, కోకిల కోకిలే” కాబట్టి కాకి కోకిల పిల్లలని గుర్తు పట్టి గూట్లోంచి తరిమెస్తుందని ఒక కథ చలామణీలో ఉంది. ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని, ఇలా బేవారసుగా మరొకరి చేత పని చేయించుకోటాన్ని సంస్కృతంలో “కాక పిక న్యాయం” అంటారు. “కవి సమయం” వలె వాడుకుందుకి బాగుంటే బాగుండ వచ్చు గాక, కాని కాకులు ఇంత తెలివి తక్కువ దద్దమ్మలు అంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను.

“కాకి కాకే, కోకిల కోకిలే” అంటూ కాకిని చిన్నబుచ్చటానికి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది: కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేద పిక కాకయో? వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః. దీని అర్ధం ఏమిటంటే “కాకీ నలుపే, కోకిలా నలుపే. రెండింటికి ఏమిటి తేడా? వసంతకాలం వస్తే కాకి కాకే, కోకిల కోకిలే.”

ఇలాగే కాకినీ, నెమలినీ పోల్చుతూ, “కాకీక కాకికి కాక కేకికా?” అంటూ ఒక కొంటె కోణంగి కాకులని తెలుగులో ఒక కసురు కసిరేడు.

నల్లగా (అంటే, అంద విహీనంగా) ఉన్న మగవాడికి అందమైన (అంటే, నలుపు తక్కువైన) ఆడదానిని కట్టబెడితే, “కాక త్రోటిబింబ న్యాయం” అని సంస్కృతంలోనూ, “కాకి ముక్కుకి దొండపండు” అని తెలుగులోనూ అంటారు. “కాకిదొండ” అనే ఒక రకం దొండ పాదుకి కాసే దొండపండు కూడా ఎర్రటి ఎరుపే. కాని కాకి ముక్కుకి తగిలించే దొండ మామూలు దొండో, కాకిదొండో నాకు తెలియదు.

తెల్లనివన్నీ పాలెలా కావో అలాగే నల్లని పక్షులన్నీ కాకులూ కావు. ఆ మాటకొస్తే కాకి జాతికి చెందిన పక్షులన్నీ నల్లగానూ ఉండవు. తెలుగులో “సముద్రపు కాకి” అనబడే పక్షిని ఇంగ్లీషులో “ఆస్‌ప్రి” అంటారు. ఇది కాకి జాతి కానే కాదు. చూడటానికి తెల్లగా, కొంగలా ఉంటుంది. ఎందుకనో, ఎవ్వరో దీన్ని “సముద్రపు కాకి” అని తప్పుగా అనేశారు; అది నిఘంటువులోకి ఎక్కిపోయింది. “సముద్రపు కాకిని నిఘంటువు నుండి తొలగించాలి!” అనే నినాదంతో నేను ఎన్నికలలో పోటీ చేస్తా!

మేగ్‌పీ, రూక్, జే, రేవెన్ - ఈ నాలుగూ కాకి జాతే కాని మొదటి మూడూ నల్లగా ఉండనే ఉండవు. ఎడ్గార్ అలెన్ పో అనే అమెరికా కవి “రేవెన్” అనే మకుటంతో చిరస్మరణీయమైన ఇంగ్లీషు పద్యం రాసేడు.

కాకిని పోలిన రేవెన్ కి బ్రిటిష్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. లండన్ నగరపు తూర్పు శివారుల్లో, థెంస్ నది ఒడ్డున “టవర్ అఫ్ లండన్” అనే కట్టడం ఉంది. ఇందులో ఒక కోట, ఒక ఖైదు, ఒక రాజగృహంతో పాటు, ఈ కట్టడపు ప్రాంగణంలో నాలుగు రేవెన్ లు ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ ప్రాసాదపు ప్రాంగణం విడచి బయటకి ఎగిరిపోతాయో అప్పుడు బ్రిటిష్ రాజవంశం నాశనం అయిపోతుందనే మూఢ నమ్మకం బ్రిటిష్ వాళ్ళకి గాఢంగా ఉంది. అందుకని ఆ పక్షులు ఎగరటానికి వీలు లేకుండా వాటి రెక్కల కింద ఉండే స్నాయువులని రివాజుగా కత్తిరించెస్తారు. లండన్ చూడటానికి వెళ్ళిన పర్యాటకులకి ఈ రేవెన్ జాతి కాకులు ప్రత్యేకమైన ఆకర్షణ! ఈ రేవెన్ లు ఎంత నలుపంటే బాగా నల్లగా నిగనిగలాడే జుత్తుని ఇంగ్లీషులో “రేవెన్ హెయిర్” అంటారు.

ఈ రేవెన్ జాతి కాకులని నా చిన్న తనంలో “మాల కాకులు” అనేవారు. ఇప్పుడు, మాల, మాదిగ వంటి పేర్లు వాడితే హరిజనులకి, దళిత వర్గాలవారికీ కోపం వచ్చినా రావచ్చు కనుక వీటికి మరొక పేరు పెట్టాలేమో. మనం వీటిని ఏ పేరు పెట్టి పిలచినా ఇవి ఎండకి నల్లబడ్డ మామూలు కాకులు కావు; ఇవి కాకులలో ఒక ఉప జాతి. మామూలుగా మనవేపు కనిపించే “ఊర కాకులు” మరీ అంత నల్లగా ఉండవు; వాటి ఛాతీ బూడిద రంగులో (చామనచాయగా) ఉంటుంది. “బొంత కాకులు” శరీరం అంతా నల్లటి నలుపు. ఇవి రేవెన్ లకి దూరపు బంధువులయి ఉండొచ్చు.

మనదేశంలో మనకి ఎక్కడ చూసినా కాకులు కొల్లలుగా కనిపిస్తాయి; హంసలు తుపాకేసి వెతికినా కనిపించవు. తుపాకేస్తే కాకులూ కనిపించకపోవచ్చు; అది వేరే సంగతి. తమాషా ఏమిటంటే మన కవులకి మాత్రం ఎక్కడ చూసినా హంసలే కనిస్పిస్తాయి కాబోలు; వాళ్ళకి కాకి - మచ్చుకి ఒకటి - కనిపించి చావదనుకుంటాను. కాకులని వర్ణించిన కవిని ఒక్కడిని చూపించండి. కాకులన్నీ కవితకి అనర్హమేనా? లేకపోతే, లేని హంసలని తెగ వర్ణించి ఉన్న కాకులని విస్మరించిన కవుల పరిశీలనా శక్తిని విమర్శించాలా? లేక, మన దేశంలో తరతరాలుగా తెలుపు తొక్క మీద ఉన్న మమకారానికి నలుపు మీద ఉండే చిన్న చూపుకి ఇది మరొక నిదర్శనమా? కాకపోతే ఏమిటి చెప్పండి! “గంగలో మునిగినంత మాత్రాన్న కాకి హంస అవుతుందా?” అనిన్నీ, “కాకై కలకాలం బ్రతికే కంటె హసై ఆరు నెలలు బ్రతికితే చాలదూ?” వంటి సామెతలతో కాకులని వేళాకోళం చేస్తారా?

మన దేశంలో హంసని అమాంతం పైకి ఎత్తేసి కాకిని కిందకి దించేసేము కాని ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహాలలో ఒక దానికి “సిగ్నస్” (హంస) అనిన్నీ, మరొక దానికి “కోర్వస్” (కాకి) అనిన్నీ పేర్లు పెట్టి రెండింటినీ సమానంగా గౌరవించేరు, పాశ్చాత్యులు.

రామాయణంలో ఒక్క చోట మాత్రమే కాకి ప్రస్తావన వస్తుంది. సీతారాములు కాకులు దూరని కారడవిలో వనవాసం చేస్తూన్నప్పుడు, కాకాసురుడు అనే రాక్షసుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవి వక్షస్థలం గాయపరచగా, రాముడు దర్భ పుల్లని మంత్రించి వదులుతాడు. అదే బ్రహ్మాస్త్రమై కాకాసురుడుని వెంటాడితే వాడు తిరిగి రాముడినే శరణు వేడుకుంటాడు. రామబాణానికి తిరుగులేదు కనుక ప్రాణం రక్షించుకుందుకి అస్త్రానికి కన్ను బలిగా సమర్పించుకుంటాడు. అందుకనే కాకికి ఒక కన్ను లొట్టపోయి మెల్లకన్నులా కనిపిస్తుందని ఒక కథ ఉంది.

కాకి మెల్ల కన్నుకి కారణం నల్లి శాపం అని మరొక పిల్లల కథలో వస్తుంది: “చీమ, నల్లి నేస్తం పట్టేయిట. నల్లి కర్రలకి వెళ్ళిందిట. చీమ పులుసులో పడిపోయిందిట. నల్లికి దుఃఖం వచ్చిందిట…” ఈ కథలో కాకి కన్ను లొట్టపోవాలని నల్లి శపిస్తుంది.

కారణం ఏది అయినా కాకి చూపులో కొద్దిగా దోషం ఉన్నట్లు కనిపిస్తుందని దృష్టి దోషం లేనివాళ్ళంతా ఒప్పుకుంటారు. కాకి ఎటు చూస్తున్నాదో చెప్పుకోవటం కష్టం. అందుకనే ఒకే వ్యక్తి రెండు పక్కలా వాదించటానికి ప్రయత్నిస్తే “కాకాక్షి న్యాయం” అంటారు. కాకతాళీయ న్యాయం లో కాకి పాత్ర కేవలం కాకతాళీయం! కాకదంత పరీక్ష అంటే కంచి గరుడ సేవ చెయ్యటం.

మిత్రభేదంలో కథానాయకుడనదగ్గ “కరటకుడు” కి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? కరటం అంటే కాకి. ఆ కాకి తెలివి నక్కకి ఇచ్చేడు కవి. ఇచ్చి ఆ నక్కకి “కరటకుడు” అని పేరు పెట్టేడు. అని నా సిద్ధాంతం.

కాకి గుమ్మంలో వాలి అదేపనిగా అరిస్తే చుట్టాలొస్తారని ఒక నమ్మకం. నిర్ధారణ చేసుకోవాలంటే, “కాకీ మా ఇంటికి మా అన్నయ్య వస్తున్నాడని గెంతు” అని అడిగినప్పుడు కాకి కాని గెంతితే అన్నయ్య రావలసిందే. కాకిని గెంతించటానికి “ఎంగిలి చేత్తో కూడ కాకిని తోలని వాళ్ళు” పరమ లోభులన్నమాట.

కాకెంగిలి చెయ్యటం అంటే చొక్కా కింద పెట్టి కొరికి ఇవ్వటం. చొంగెంగిలి కంటె కాకెంగిలి ఎంతో నయం అని శాస్త్రీయంగా రుజువు చెయ్యొచ్చు.

తెలుగులో కాకిబంగారం అన్నా ఇంగ్లీషులో “టిన్‌సెల్” అన్నా ఒకటే కాని తెలుగు వారికి ఇంగ్లీషు మాటే నచ్చుతుందిట. ఈ ఇంగ్లీషు అభిమానులు “ఎంగిలి” ని ఇంగ్లీషులో ఏమంటారో కనుక్కోవాలి.

కాకికీ, చావుకీ ఏదో సంబంధం ఉంది. చచ్చిపోయిన వారికి పిండాలు పెట్టినప్పుడు వాటిని కాకులు తినాలంటారు. కాకినాడలో కాకులకి కరువో ఏమిటో కాని అక్కడ పిండాలని పిండాల చెరువులో “వదిలేవారు.” “వదులుతారు” అని ఎందుకు అనలేదంటే ఆ చెరువుని ఇప్పుడు కప్పెట్టేసేరుట.

“కాకి చావు” అంటే హఠాన్మరణం.

“కాకి గాలి” తగిలితే చావు త్వరగా వస్తుందిట. కాకి గాలి తగిలేంత దగ్గరగా నేను ఎప్పుడూ కాకిని దగ్గరగా రానివ్వలేదు - అది మీద రెట్ట వేస్తుందనే భయంతో. ఆ భయమే నన్ను రక్షించినట్లుంది.

నాకు ఇంతవరకూ కాకి గాలి తగిలినట్లు లేదు. అందుకే ఇలా బ్లాగుతున్నాను.

ఈ దిగువ లంకె పంపినందుకు అరుణం గారికి ధన్యవాదాలు!

http://video.google.com/videoplay?docid=-7329182515885554944

8 comments:

  1. బాగుంది "మీ కాకిగోల".

    ReplyDelete
  2. See this video clever crows
    http://video.google.com/videoplay?docid=-7329182515885554944

    ReplyDelete
  3. బావుందండీ..!! కింది లైన్లు ఇంకా బావున్నాయ్.

    >>“సముద్రపు కాకిని నిఘంటువు నుండి తొలగించాలి!” అనే నినాదంతో నేను ఎన్నికలలో పోటీ చేస్తా!

    >>హంసలు తుపాకేసి వెతికినా కనిపించవు. తుపాకేస్తే కాకులూ కనిపించకపోవచ్చు

    ReplyDelete
  4. శ్రీరమణ గారు వ్రాసారా అనిపిస్తుంది.
    శైలి ఆ విధంగా అనిపించింది.

    ReplyDelete
  5. పెద్ద కితాబే ఇచ్చేసేరే!

    ReplyDelete
  6. బావుంది మీ కాకి వ్యాసం. నాకు తెలిసిన మరో రెండు కాకి సామెతలు,

    కాకి పిల్ల కాకికి ముద్దు.

    సముద్రంలో కాకి రెట్టంత.

    ఈ రెండు సామెతెల్లో కూడా కాకిని చిన్నబుచ్చారు.

    ReplyDelete
  7. రావుగారూ.. నాదొక సందేహం.. నిఘంటువులో ఆస్ప్రీ అని వెదకితే ఒకచోట సముద్రపుకాకి అనీ, ఇంకో చోట లకుముకిపిట్టా అనీ ఉంది. నాకు తెలిసి లకుముకిపిట్ట ఆస్ప్రీ కాదు, కానీ చిక్కేమిటంటే penguinకి, seagullకి కూడా తెలుగు పేరు సముద్రపుకాకి అనే ఉంది. వీటన్నిటిలో ఏది తప్పు ఏది సరి? ఇంతకీ సముద్రపుకాకి అంటే ఆస్ప్రీయేనా? పెద్దవారు, దయచేసి నా తికమక తీర్చగలరా? (నా బ్లాగులో నేను ఈమధ్య తీసిన ఆస్ప్రీ ఫొటో ఒకటి పెట్టి, ఫొటో సందర్భాన్ని గురించి కొద్దిగా వ్రాద్దామనుకుంటున్నాను.. అందుకూ నాకీ తెలుగు పేర్లతో తికమక)

    ReplyDelete
  8. చేతన గారూ

    ఇన్నాళ్లూ మీ వ్యాఖ్య చూడలేదు. అందుకే ఈ ఆలశ్యం.

    లకుమికిపిట్ట ఆస్ప్రీ కాదు. అంతవరకు ధైర్యంగా చెప్పగలను. Penguin అనే పక్షి భారతదేశంలో కనిపించదు. కనుక దానికి ఏ భారతీయభాషలలోనూ పేరు లేకపోయినా ఆశ్చర్యపోను. అటువంటి సందర్భాలలో pengun ని తెలుగులో పెన్‌గ్విన్ అని రాసుకోవచ్చు. Seagull విషయానికి వచ్చేసరికి నా అజ్ఞానం వెల్లడి చేసుకోవలసి వస్తోంది. ఈ జాతి పక్షులు ఉష్ణమండలాలలో ఉంటాయో ఉండవో నాకు బాగా తెలియదు. కాని వీటి అలవాట్లకి, కాకి అలవాట్లకి చాల పోలికలు ఉన్నాయి. అందుకనే కాబోలు seagull ని సముద్రపుకాకి అని తెలుగులో పేరు పెట్టేరు.

    చెట్లకి, జంతుజాలానికి ఒక ప్రాంతీయనామం ఒకా శాస్త్రీయనామం ఉంటాయి. ప్రాంతీయ నామాలు ఆయా ప్రాంతాలలో ఉపలభ్యమయే జాతులకే ఉంటాయి. Penguin, Asprey లకి తెలుగులో పేర్లు లేకపోవటానికి కారణం అవి మన ప్రాంతాలలో కనబడవు కనుక. ఉదాహరణకి fog, snow, ice అనే మాటలన్నిటికి తెలుగులో "మంచు" అనే అంటాం - అంతకీ కావలిస్తే పొగమంచు, గడ్డ మంచు అనొచ్చు. కాని snow కి తెలుగులో మాటే లేదు; సంస్కృతంలో ఉంది.

    ReplyDelete