Monday, April 6, 2009

ద్వాదశ రాశులు

6 ఏప్రిల్ 2009

మనం మన దేశంలో వాడే మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, వగైరా ద్వాదశ రాశుల పేర్లనీ ఇంగ్లీషులో వాడే Aries, Taurus, Gemini, ... మొదలైన పేర్లతో పోల్చి చూస్తే వాటి అర్ధాలలో పోలిక కొట్టొచ్చినట్లు కనబడుతుంది కదా. కనుక ఈ పేర్లని మనం ముందు వాడితే మన దగ్గర పాశ్చాత్యులు కాపీ కొట్టయినా ఉండాలి, లేదా వాళ్ళ దగ్గరనుండి మనం కాపీ కొట్టయినా ఉండాలి. పాశ్చాత్యులని అడిగితే ఇది తప్పకుండా భారతీయులు చాల్డియనుల (బాబిలోనియా వాసులని యవనులు పిలచే పేరు. వీరి ఉనికి సా. శ. పూ 6 వ శతాబ్దం) దగ్గర నుండి నిర్మొహమాటంగా కాపీకొట్టేసేరనే అంటారు. ఇంగ్లీషులోనే కాని తెలుగులో కూడ ఆలోచించటం తెలియనిన్నీ, ఇంగ్లీషు పుస్తకాలనే ఉగ్గుపాలతో అవుపోశన పట్టేసిన తెలుగు వాళ్ళని అడిగితే, "మనవాళ్ళు ఒఠ్ఠి వెధవాయిలోయ్! మూడొంతులు ఇంగ్లీషువాడి ఊహే "కరెక్టు" అంటారు. మీరేమంటారు?

ఋగ్వేదంలో దీర్ఘతమస్సు అనే ఋషి మొట్టమొదట పన్నెండు రాశుల ప్రస్తావన చేశాడు: "ద్వాదశ ప్రథయశ్చక్రమేకం త్రీణినభ్యానిక ఉతిచ్చిరేత! తస్మిన్‌త్సాకం త్రిశతాన శంకవోర్సితాః షష్టిర్నచలా చలాసః" - (ఋ I-164-48)

ఇక్కడ నాకు అర్ధం అయినంత మేరకి అర్ధం చెబుతాను. (వేద) సంస్కృతం వచ్చిన పాఠకులు ఎవ్వరయినా టీకా తాత్పర్యాలు చెప్పగలరు. ఇక్కడ ఒక చక్రం ప్రస్తావించబడింది. ఇది సంవత్సరాత్మకమైన కాలచక్రం. చక్రం తిరిగేటప్పుడు నేలని తాకే ప్రథని - పరిధిని - "నేమి" అని కూడ అంటారు. ఈ పరిథి పన్నెండు భాగాలుట. ఈ పన్నెండు భాగాలే రాశులు. ఈ చక్రానికి 360 ఆకులు ఉన్నాయిట. ఈ 360 ఆకులు 360 రోజులు లేదా 360 భాగలు. ఈ భాగలనే మన తెలుగువాళ్ళు డిగ్రీలు అంటారు. ఈ లెక్కని రాశికి 30 భాగలు.

ఇంతే కాదు. మేష రాశి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది: (I-51-1, I-52-2). "మేషానికి అగ్ని వాహనం ఏమిటి? నా బొంద, ఇదేమీ సబబుగా లేదు" అని మీరు అనొచ్చు. ఆకాశంలోకి తలెత్తి చూస్తే మేష రాశి పైన కృత్తిక రాశి ఉంది. కృత్తికలు అగ్ని దేవతలు. కనుక మేషానికి పైన అగ్ని ఉన్నట్లే కదా. లేదా అగ్నికి మేషం వాహనం అన్నమాట.

నేను బ్లాగే మరో స్థలం: http://lolakam.blogspot.com

6 comments:

 1. రావుగారు,

  తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు ఎవరు పెట్టేరో, ఎక్కడినుంచి వచ్చాయో ఏమైనా తెలుసా?

  ReplyDelete
 2. రావు గారూ, మేషాది రాశుల విభాగం వేదంలోనే ఉన్నదనడానికి ఇంకా ఆధారాలేమైనా ఉన్నాయా? నేను విన్నంతవరకు వేదాల్లో ఉన్న జ్యోతిషానికీ, మేషాది రాశులతో కూడిన జ్యోతిషానికీ పోలిక తక్కువ. పన్నెండు రాశుల చక్రం మనకి విదేశీయుల నుంచి వచ్చిందనే విన్నాను, కానీ వేదాల్లో మనకి 27/28 నక్షత్రాల విభాగం మాత్రం ఎప్పటినుంచో ఉన్నదట. (ఆ రాశి చక్రం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమౌతుందట.) అంతే కాకుండా పంచార చక్రం అనబడే అయిదు విభాగాల రాశి చక్రం మొదలైన విశేషాలు ఎన్నో వేదంలో ఉన్నాయట. కాబట్టి వేదాల్లో ఖగోళ-జ్యోతిష విజ్ఞానం ఎంతో ఉన్నదనీ, కానీ ఈనాడు భారతీయ జ్యోతిష్యంగా ప్రాచుర్యం పొందిన శాస్త్రానికి మూలాలు మాత్రం విదేశీయులనుంచి వచ్చాయనీ అంటారు. మీకింకా వివరాలేమైనా తెలిస్తే చెప్పండి.

  ReplyDelete
 3. భైరవభట్ల వారికీ, నాగమురళిగారికి సమాధానం.

  ప్రభవాది సంవత్సరాల పేర్లు ఎలా వచ్చేయో నాకూ తెలియదు.

  పోతే రాశుల విభాగానికి ఋగ్వేదంలో ఇంకా ఏవయినా ఆధారాల సంగతి. ఉన్నాయి. నాకు తెలిసిన మేరకి రాబోయే బ్లాగులలో చర్చిస్తాను. కీ. శే. శ్రీ మహీధర నళినీమోహన్ రాసిన పుస్తకాలు విశాలాంధ్ర ప్రచురణాలయంలో దొరుకుతాయి. ఆయన ఈ విషయాలలో బాగా పరిశ్రమ చేసేరు. "కేలండర్ కథ", "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" అనే పుస్తకాలలో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. హైదరాబాదులోని బిర్లా సెంటర్ అధిపతి శ్రీ బుర్రా సిద్ధార్ధ్ ఈ విషయాలపై ఇంగ్లీషులో చాలా రాశారు.

  అన్నీ వేదాల్లోనే ఉన్నాయటమూ, భారతీయులకి ఏమీ తెలియదనటమూ రెండూ సత్య దూరాలే. నిజం మధ్యలో ఎక్కడో ఉంది. ఈ మధ్యలో ఉన్న నిజం ఏమిటో కనుక్కోటానికి శ్రీ వేపా కోస్లా విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన కృషి Indic Studies Foundation అనే పేరుతో జరుగుతోంది. అంతర్జాలంలో వారి స్థలం చిరునామా http://kosal.us/Astronomy/
  ఇదొక మహా సముద్రం. తెలిసినది తక్కువ, తెలియనిది ఎక్కువ.

  ReplyDelete
 4. రావుగారూ, ధన్యవాదాలు. కాలెండర్ కథ నేను చిన్నప్పుడు చదివాను. వెబ్ సైటు లింకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీ తర్వాతి టపాలకోసం ఎదురు చూస్తాను.

  ReplyDelete
 5. పదిహేనిరవయ్యేళ్ల క్రితం 'కేలండర్ కధ' ఇంటర్మీడియెట్లోనో, ప్రధమ సంవత్సరం డిగ్రీలోనో తెలుగులో ఓ పాఠ్యాంశంగా ఉండేది.

  ReplyDelete
 6. బాగుంది. మా స్థానిక దేవాలయంలో చైత్ర శుద్ధ పాడ్యమిని వైదిక ఉగాది అనే పేరిట జరుపుతుంటారు. ముఖ్యాచార్యులూ, గుడి పెద్దల్లో పలువురూ తెలుగువారనుకోండి, కానీ ఆచార్యులు ఒకసారెప్ప్డో ప్రభవాది సంవత్సరాల పేర్లు కూడా వేదంలో ఎక్కడో ఉన్నాయని చెప్పిన గుర్తు.

  ReplyDelete