Friday, April 10, 2009

ఖగోళశాస్త్రంలో ఎవరు ముందు?

10 ఏప్రిల్ 2009

ఖగోళశాస్త్రంలో "ఎవరు ముందు?" అనేది ఒక చిక్కు ప్రశ్న? ముఖ్యంగా "ప్రాచ్యులు ముందా? పాశ్చాత్యులు ముందా?" అన్న ప్రశ్న వచ్చేసరికల్లా, "అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయి" అని మనవాళ్ళంటారు, "మీ మొహం మీకేమీ తెలియదు" అని మనని మన ప్రజ్ఞని పాశ్చాత్యులు కించపరుస్తూ ఉంటారు. ఈ తగవు రివాజు అయిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఆధారాలు చూపించకుండా మాట్లాడే మన అలవాటు కావచ్చు.

ఈ తగవుని నేను పరిష్కరించలేను కాని, మహీధర నళినీమోహన్ "నక్షత్రవీధుల్లో భారతీయుల పాత్ర" లో ఉదహరించిన ఆధారం ఒకటి ముచ్చటిస్తాను. మహాభారతం వ్యాస ప్రణీతం. అది లిఖితరూపం లోకి ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని, భారతయుద్ధం తరువాత జనమేజయుడు చేసిన సర్పయాగంలో సూతుడు ఈ కథ చెబుతాడు. ఇది కలియుగపు ప్రారంభంలో జరిగింది. అంటే దరిదాపు 5000 సంవత్సరాల కిందట. కనుక మహాభారత కాలం ఉరమరగా, కొంచెం ఇటూ అటూ గా, 5000 ఏళ్ళ క్రితం నాటిది.

ఈ సంస్కృత భారతంలో IV-9-19, 20, 21, 22 శ్లోకాలలో ధ్రువుడికి విష్ణుమూర్తి ఇచ్చిన వరం వ్యాసుడు ఇలా వర్ణిస్తాడు.

"వేదాహంతే వ్యవసితం హృదిరాజన్య బాలక!
యత్రగ్రహార్ష తారాణాం, జ్యోతిషాం చక్రమాహితం
మేధ్యాం గోచక్రవత్‌స్థాస్ను, పరస్తాత్ కల్పవాసినాం
ధర్మోగ్నిః కశ్యపః శుక్రో, మునయోయేవ నౌకసః
చరంతి దక్షిణీకృత్య, భ్రమంతోయత్సతారకాః
షడ్వింశద్వర్ష సాహస్రం, రక్షితా వ్యాహతేంద్రియః

ఈ శ్లోకాన్ని ఆంధ్ర భాగవతంలో బమ్మెర పోతన ఈ విధంగా తెలిగించేడు.

క.
ధీరవ్రత! రాజన్యకు
మారక! నీ హృదయమందు మసలిన కార్య
బారూఢిగా నెరుంగుదు
నారయనది పొందరానిదైనను నిత్తున్

వ. అది యెట్టిదనిన నెందేని మేధి యందు పరిభ్రామ్యమాణ గోచక్రంబునుంబోలె గ్రహనక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్రరూపంబులైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తఋషులును తారకా సమేతులై ప్రదక్షణంబు తిరుగుచుండుదురు. అట్టి ధ్రువ క్షితియను పధంబు ముందట ఇరువదియారు యేండ్లు సనం బ్రాపింతువు."

దీన్ని మనందరికీ అర్ధం అయేలా చెప్పుకోవాలంటే రాట (మేధి) చుట్టూ ఆవు తిరిగిన మాదిరి ఆకాశంలో ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండే నక్షత్రాలు వలయాకారంలో తిరగటానికి 26,000 ఏండ్లు పడుతుందని వ్యాసుడు చెపుతూనట్టు నాకు అర్ధం అయింది. ఈ 26,000 ఏండ్ల వలయం భారతంలో ఉందంటే కనీసం 5000 ఏండ్ల క్రితమే ఈ విషయం మనవాళ్ళకి తెలుసన్నమాట. అంటే సాధారణ శకానికి 3000 సంవత్సరాల క్రిందట అన్న మాట.

భూ అక్షం స్థిరంగా ఉండదనిన్నీ, అంటే భూ అక్షం ఎల్లప్పుడూ ధ్రువ నక్షత్రం వైపే చూపిస్తూ ఉండకుండా, ధ్రువ నక్షత్రం చుట్టూ 26,000 ఏళ్ళకో ప్రదక్షిణం చొప్పున వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గ్రీకు శాస్త్రవేత్త హిపార్చస్ సాధారణ శకానికి పూర్వం 143 లో కనుక్కున్నాడు. ఈ చలనాన్ని సంస్కృతంలో విషువచ్చలనం అనిన్నీ, ఇంగ్లీషులో precession of the equinoxes అనిన్నీ అంటారు. భారతంలోని శ్లోకాన్ని బట్టి ఈ విషయం పాశ్చాత్యులకంటె కనీసం రెండు సహస్రాబ్దాల ముందే మనవాళ్ళకి తెలిసిందని ఋజువు అవటం లేదూ?

విషువచ్చలనం అతి స్వల్పం. అంటే ఏడాదికి ఉరమరగా ఒక నిమిషం (భాగ లేదా డిగ్రీలో 60 వ వంతు). ఇంత స్వల్పమైన కదలిక యొక్క ప్రస్తావన కవిత్వంలోకి వచ్చేసిందంటే దీన్ని గమనించి, నమోదు చెయ్యటం అంతకు ముందు ఎప్పుడో జరిగి ఉంటుంది.

ఈ కథ ఇక్కడితో ఆపెస్తే నేను నేనెందుకవుతాను? నాకు మొట్టమొదట ఈ విషయం గురించి అమెరికాలో M. S. డిగ్రీ చేస్తూన్నప్పుడు తెలిసింది. భౌతిక శాస్త్రంలో భూమి కదలికని గురించి అధ్యయనం చేస్తూన్నప్పుడు భూమి గోళాకారంగా ఉండదనిన్నీ, పొట్ట దగ్గర (మనలో చాలమందికి మల్లే?) కైవారం ఎక్కువ అనిన్నీ, దీని వల్ల బొంగరంలా తిరుగుతూన్న భూమి అక్షం స్థిరంగా ధ్రువ నక్షత్రం వైపు ఎల్లప్పుడూ చూపించకుండా ఆ నక్షత్రం చుట్టూ ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటుందనిన్నీ గణితం ఉపయోగించి లెక్కకట్టటం నేర్చుకున్నాను. నూటన్ తరువాత గణితపరంగా అవగతమైన ఈ విషయం ఏ పనిముట్లు లేకుండా, ఉత్త కంటితో చూసి గమనించిన మన పూర్వుల ప్రతిభని తలుచుకుని మేమంతా "ఔరా!" అని ఆశ్చర్యపోయేం.

9 comments:

 1. రావు గారూ, విషువచ్చలనం గురించి భాగవతంలో ఉన్నదని నేనూ చదివాను. అంతే కాకుండా భాగవతంలో విషువద్దినాలలో (మార్చి 21, సెప్టెంబరు 22) పగలూ రాత్రీ సమానంగా ఉంటాయనీ కూడా ఉంటుంది. వీటితోపాటూ భాగవతంలో శింశుమార చక్రం అనబడే నక్షత్ర మండలాన్ని గురించీ, ఇంకా అనేక ఇతర ఖగోళ విశేషాలూ కూడా ఉన్నాయని చదివాను.

  కానీ మీ టపాలో నాకాశ్చర్యం కలిగించిన విషయం మహాభారత కాలం 5000 ఏళ్ళ క్రితమని మీరు అనడం. పురాణాల్లో ఇచ్చిన ఖగోళ/జ్యోతిష వివరాల్ని బట్టి ఈ కాలాన్ని లెక్క కట్టడం జరిగినా, దాన్ని అంగీకరించేవాళ్ళు కొంచం ’సాంప్రదాయికులు’గానే పరిగణించబడతారు. ఆధునిక చరిత్రకారుల్ని ప్రమాణంగా స్వీకరించేవాళ్ళతో ’భారతం అయిదువేల ఏళ్ళనాటిది కదా’ అంటే వాళ్ళు నా మీదపడి కరుస్తారేమో నాకు భయం వేస్తూ ఉంటుంది.

  భారత, భాగవతాది పురాణాలు రెండువేల ఏళ్ళకన్నా పూర్వంనాటివని అంటే ఆధునికులెవరూ ఒప్పుకోరు కదా, మీరు వాటి కాలం అయిదువేల ఏళ్ళ నాటిదని అంటే నాకు ఆశ్చర్యం కలిగింది.

  ReplyDelete
 2. ఇటువంటి సందర్భాలలోనే వివాదం పుట్టటానికి ఆస్కారం ఉంది.
  కలియుగం ప్రారంభమయి దరిదాపుగా 5000 ఏళ్ళు అయిందని అంటారు. ఆ కాలం నాటి కథ ఇది. గ్రంధస్తం అయేటప్పటికి ఆలశ్యం అయి ఉండవచ్చు. అసలు "వ్యాసుడే 2000 ఏళ్ళ క్రిందటివాడు" అనే వాదనని పూర్వపక్షం చెయ్యాలంటే మొదట్నించీ మొదలెట్టాలి. ఆ విషయం విచారించాలంటే ఈ బ్లాగు అనుకూలమైన వేదిక కాదు. అలా వాదించటానికి నా దగ్గర సాధనసంపత్తీ లేదు. భారతగాధ జరిగి 5000 సంవత్సరాలు అయిందన్న ప్రాతిపదికకి ఆధారాలు భారతంలో ఉన్నాయి. సృష్టి జరిగే 5000 ఏళ్ళు అయిందని ఒకప్పుడు నమ్మిన ఆధునికులకి భారతగాధ జరిగి 5000 ఏండ్లు అయిందంటే ఎలా మింగుడుబడుతుంది? ఈ విషయంలో శ్రీ వేపా కోస్లా చాలా కృషి చేసి సాధికారమైన ఆధారాలు చూపించేరు. ఓపిక ఉంటే చదివి చూడండి.

  ReplyDelete
 3. రావు గారూ, నా కామెంటు కొంచం అపరిపక్వంగా ఉంటే మన్నించండి. మీరు చెప్తున్న విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. శ్రీ వేపా కోస్లా గారిచ్చిన సమాచారం అంతా చదువుతాను. మీ తర్వాతి టపాలకోసం ఎదురు చూస్తూ...

  ReplyDelete
 4. రావు గారు, మీ ఈ పోస్టుకీ నా కామెంటుకీ సంబంధంలేదు. విషయం ఏంటంటే, మొన్నీమధ్య నేను నా గుంటూరి జ్ఞాపకాలని నెమరేస్కుంటుంటే, డా।ఇంగ్.పి.వేమూరి.రావ్, ఎడ్వైజర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి మధలో వచ్చింది. ఎవరో ఔత్సాహికులు ఆయన మీరూ ఒకటేనా అని అడిగారు. కాదని చెప్పా.
  మీ బ్లాగులు చలా బాగున్నాయ్, చాలా మంచి విషయాల మీద రాస్తున్నారు.


  పైన చెప్పిన వివరాల కోసం ఇక్కడ చదవండి http://ramakantharao.blogspot.com/2009/04/blog-post_9766.html

  ధన్యవాదాలు.

  ReplyDelete
 5. Ravu garu
  pl. do write some articles in this direction sir. at present there are a very few people who can assimilate both ancient and modern science like you.

  throw your light on
  the development of science/medicine/astronomy/engineering in ancient india in comparision with greek or roman civilizations.

  you may say there may be many books out side.
  may be true. but this is for internet and future internet reader. i hope it will remain in the search engines for ever.

  write whatever you wish in your style sir.

  thanking you
  bollojubaba

  ReplyDelete
 6. భాస్కర్ రామరాజు గారు

  భారత ప్రభుత్వం కావాలంటే సలహాలు ఇవ్వటానికి ఎవరు సిద్ధం కాదు కానీ, మీరు ఉదహరించిన వ్యక్తిని నేను కాదు.

  ReplyDelete
 7. బుల్లోజుబాబా గారు

  ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. తీరుబడి చూసుకుని రాస్తాను.

  ReplyDelete
 8. రావు గారు -
  ఆయనా మీరు ఒకరు కాదని నాకు తెలుసులేండి.
  ఈయనది ఎప్ప్యింటెడ్ పొజీషను. సరదాగా అలా రాసుకున్నా ఆయన చాలా గొప్పవ్యక్తి.

  ReplyDelete