డిసెంబరు 2008
ఇంగ్లీషులో postmodern అనే పదబంధాన్ని తెలుగులో ఏమనాలో తెలియక అందాకా పై పేరు పెట్టేను. ఇంత కంటె మంచి పేరు ఉంటే చెప్పండి.
అసలు ఈ విషయం ప్రస్తావన ఎలా వచ్చిందంటే –
నాలుగైదు ఏళ్ళ క్రితం అనుకుంటా. డా. కేతు విశ్వనాధ రెడ్డి మా ఊరు వచ్చిన సందర్భంలో అక్కడ సమావేశమైన వాళ్ళంతా postmodernism మీద ఘాటుగా మాట్లాడేసుకుంటూ ఉంటే నేను కళ్ళప్పగించి చూస్తూ నోరు మూసుకుని కూర్చున్నాను – నేను అంతకు మునుపు ఎప్పుడూ ఈ పదబంధం వినలేదు. ఇంకేమి మాట్లాడతాను? ఇంటికొచ్చి కొత్త తరానికి నేనెంత వెనకబడిపోయానో తలుచుకుని చాలా బాధ పడిపోయాను. కాని, చెయ్యగలిగింది ఏదీ లేక మిన్నకుండిపోయేను.
తర్వాత అక్టోబరు 2003 లో హైదరాబాదు యూనివర్సిటీ కి ఓ పది వారాల పాటు visiting professor గా వెళ్ళేను. వారి guest house లో నాకొక గది ఇచ్చేరు. ఆ గెస్టు హవుస్ ఎప్పుడూ వచ్చేపోయే వారితో కోలాహలంగా ఉండేది. ఒక సారి ఇంగ్లీషు ఉపాధ్యాయుల బృందం ఒకటి శిక్షణ (training) పొందటానికి వచ్చింది. వచ్చిన వారూ అదే అతిథి గృహం లో ఉండటం వల్ల సాయంకాలం వారితో కలసి బయట పచ్చిక మైదానంలో చెట్టు కింద కూర్చుని బాతాఖానీ వేసేవాడిని. ఆ బాతాఖానీలో చెవిటి కాకుల గూట్లో దొరికే సంజీవి పుల్లలని గుర్తు పట్టే పద్ధతుల దగ్గరనుండి జాతకాలలో ద్రేక్కాణం వరకూ, postmodernism నుండి సద్దాం హుస్సేన్ పట్టుబడ్డ వైనం వరకూ చర్చలు జరిగేవి. ఆ సందర్భంలో నేను తెగించి అడిగేను – “అయ్యా postmodern అంటే ఏమిటి?” అని. కేరళ నుండి వచ్చిన ఎ. రఘు అనే ఇంగ్లీషు లెక్చరరు అవకాశం ఇచ్చేను కదా అని నా మీద ఒక ఉపన్యాసం దంచేసేడు. ఆ దంపుడుకి నా సొంత పైత్యం కొంత కలిపి ఈ దిగువ సమీక్షిస్తున్నాను.
అసలు postmodern అనే పదబంధాన్ని రకరకాల సందర్భాలకి అన్వయించవచ్చు. ముందు చరిత్ర సంగతి తీసుకుందాం. ఏ చరిత్రనైనా సరే ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విడగొట్టటం పాశ్చాత్యులకి అలవాటైపోయింది. యూరప్ లో ఉన్న ఏ దేశ చరిత్రనైనా తీసుకోండి. దాన్ని ఇలా మూడు ముక్కలు చేసి అధ్యయనం చెయ్యటం వారికి రివాజు. ఈ పాశ్చాత్యులు చైనా, జపాను, ఇండియా వంటి ప్రాచీన ప్రాచ్య దేశాల ఉనికిని కనుక్కున్నప్పుడు, ఆ పాత అలవాటు ప్రకారం ఈ తూర్పు దేశాల చరిత్రలని కూడా మూడు ముక్కలు చేయటం మొదలుపెట్టేరు. ఉదాహరణకి The Oxford History of India లో Vincent Smith మన దేశ చరిత్రని మూడు భాగాలు చేసి, ప్రాచీన హిందూ శకం, మధ్యంతర ముస్లిం శకం, ఆధునిక బ్రిటిష్ శకం అని మూడు భాగాలుగా విడగొట్టేడు. నిడివిలో ప్రాచీన హిందూ శకం దరిదాపు 42 శతాబ్దాలు, ముస్లిం శకం ఆరు శతాబ్దాలు, బ్రిటిష్ శకం రెండున్నర శతాబ్దాలు ఉన్నా సరే ఆయనకి మన దేశ చరిత్రని ఈ మూడు భాగాలుగా విడగొట్టి, బంతిలో బలపక్షం లేకుండా ప్రతీ భాగానికీ సమానంగా పేజీలు కేటాయించటంలో అపశృతి కనబడ లేదు. వర్గాలుగా విడగొట్టటంలో ఉన్న ఇబ్బందే ఇది.
సి. పి. రామస్వామి అయ్యర్ తిరువాన్‌కూరు సంస్థానానికి దివానుగా ఉన్న రోజులలో సి. కె. న్. నాయర్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడిని చైనాలో మొక్కలని అధ్యయనం చెయ్యటానికి పంపేరు. నాయర్ చైనా వెళ్ళి అక్కడ వృక్ష సామ్రాజ్యాన్ని చైనా వారు ఆరు విభాగాలు చేసి అధ్యయనం చెయ్యటం గమనించారు. ఆ ఆరు భాగాలు ఏమిటయ్యా అంటే:
1. రాజు గారివి, 2. కొట్టేసినవి, 3. నూరేళ్ళ వయస్సు మీరినవి, 4. పిట్టలు గూళ్ళు కట్టుకున్నవి, 5. మరీ పొడుగాటివి, 6. వెయ్యి ఆకుల కంటె తక్కువ ఉన్నవి.
ఈ కథ విన్న తర్వాత వర్గీకరణ అనేది ఆ వర్గీకరణ చేసేవాడి దృష్టి మీద ఆధారపడి ఉంటుంది తప్ప సహజసిద్ధమైన ఒక తర్కానికి కట్టుబడి ఉండదనే నా అనుమానం మరోసారి బలపడింది. ఈ రకం అనుమానం నాకు వచ్చిందంటే నాలో కొంత ఉత్తర అధునాతన తత్వం ఉందనటానికి తార్కాణం ట!! అని ఆ మళయాళం ప్రొఫెసరు అన్నారు.
ఈ విషయం అలా ఉంచుదాం. పాశ్చాత్యుల చరిత్ర ఏ కొద్దిగానో తెలుసున్నవాడిని ఒకడిని నిలదీసి ‘ఆధునిక యుగం ఎప్పుడు మొదలైంది?’ అని అడిగి చూడండి. యూరప్‌లో పునర్వికాసం లేదా రినసాన్స్ (Renaissance) తో మొదలైందని చెబుతాడు. ఈ పునర్వికాశం ఎప్పుడు మొదలైందిట? నేను చదివిన చరిత్ర పుస్తకాన్నే అతనూ చదివిన వాడైతే “తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్ ని పట్టుకున్నప్పటి నుండి, లేదా సా. శ. 1453 నుండి” అని గభీమని చెబుతాడు – అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం నుండి! రోజుకో ఫేషన్ చొప్పున మారిపోతూన్న ఈ రోజుల్లో, ఆధునిక యుగం – పాత చింతకాయ పచ్చడిలా – ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితం మొదలయిందంటే ఆవలింతలు రావటం లేదూ? ఇలా ఆవలింతలతో చిటికెలు వేసే వారిని సంతృప్తి పరచటానికి ఇప్పుడు మనం ఆధునిక యుగం దాటేసి ఉత్తర అధునాతన యుగం (postmodern age) లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర అధునాతన యుగం ఎప్పుడు మొదలైందిట? Arnold Toynbee దృష్టిలో ఈ ఉత్తర అధునాతన యుగం 1870 దశకంలో మొదలైంది. Charles Jencks దృష్టిలో ఇది 15 జులై 1972 మధ్యాన్నం 3 గంటల 32 నిమిషాలకి మొదలైంది. కలియుగం ఎప్పుడు మొదలైంది అని అడిగితే వేద వ్యాస అనే postmodern ‘వ్యాసులవారు’ క్రీస్తు పూర్వం 3102 లో ఫలానా నెలలో, ఫలానా రోజున, ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి మొదలయిందని మేలిబూ (కేలిఫోర్నియా) లో ఉన్న దేవాలయంలో ఇరవై ఏళ్ళ క్రితం ఒక సారి ఉటంకించేరు. అంతే కాకుండా మన కలియుగం మరో ముఫై ఏళ్ళల్లో అంతం అయిపోతోందని ఆయన postmodern గా ఆరాట పడుతూ ఉంటే నేను అమాయకంగా అడిగేను, “అయ్యా! మనం పూజ చేసేటప్పుడు ‘కలియుగే, ప్రథమ పాదే’ అంటాము కదా, మిగిలిన మూడు పాదాలు ముప్ఫై ఏళ్ళల్లో అయిపోతాయా?” అని. నా ‘చొప్పదంటు ప్రశ్న’ వినేసరికి ఆయనకి చాలా కోపం వచ్చింది. "పిదప కాలం పిల్లలు, పిదప కాలం బుద్ధులు" అనుకుంటూ ఆయన నన్నెక్కడ శపించెస్తారో అని నేను భయపడుతూ ఉంటే ఉత్తర అధునాతన వ్యాసుల వారి మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు, మరేమీ చింత పడవద్దని పక్క నున్న శాస్త్రి గారు ఊరట మాటలు పలికేరు.
ఈ సనాతన, అధునాతన, ఉత్తర అధునాతన అనే విభజనతో కుస్తీ పట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు; చాలా రంగాల్లో ఉన్నారు. నేను కాలేజీలో చదువుకుంటూన్న రోజులలో భౌతిక శాస్త్రాన్ని సంప్రదాయికం (classical), అధునాతనం (modern) అని రెండు భాగాలుగా చీల్చి చెప్పేవారు. క్వాంటం యంత్రశాస్త్రం (Quantum Mechanics) రాక పూర్వపు శాస్త్రం అంతా సంప్రదాయికం; ఆ తర్వాత వచ్చినదంతా అధునాతనం. మేక్స్ ప్లేంక్ ప్రచురించిన పరిశోధన పత్రం ధర్మమా అని ఈ ఆధునిక యుగం సా. శ. 1900 లో మొదలైందని మనలో చాల మందికి తెలుసు. అంతవరకూ వెలుగు కిరణాల రూపంలో ప్రసారమవుతుందని అనుకునే వారు. ఈ కిరణాలు చిన్న చిన్న రేణువుల సమూహం అని నూటన్ మహాశయుడు ఉటంకించేడు కూడా. తరువాత కాంతి కిరణాలూ కాదు, రేణువులూ కాదు – తరంగాల మాదిరి ప్రయాణం చేస్తుంది అన్నాడు, మేక్స్‌వెల్. ఈ లోగా క్వాంటం శాస్త్రం వచ్చి “కాదు, కాంతి సూక్ష్మమైన మాత్రల మాదిరి - హోమియోపతీ మందు మాత్రలలా అనుకొండి - చిన్న చిన్న మోతాదులలో ఉంటుంది” అంది. ఈ మోతాదునే ‘క్వాంటం’ అంటారు. మా ఇంటి చూరు లో ఉన్న చిల్లు లోంచి వచ్చే వెలుగుని చూసి కాంతి దూలాలలాగా, వాసాలలాగా ఉంటుందనుకునే నాకు అసలు విషయం అర్ధం కాలేదు సరికదా, పైపెచ్చు గాభరా ఎక్కువైంది. ఈ ఆధునిక భౌతిక శాస్త్రపు పరిస్థితి ఇలా ఉండి అప్పుడే శతాబ్దం గడిచి పోయింది కదా. ఇప్పుడు పాతబడిపోతూన్న ఆధునిక శాస్త్రంలో ఉత్తర అధునాతన ఊహలేవైనా మొలకెత్తాయా అంటే మొలకెత్తాయని ఒప్పుకోవాలి. అవి విషయ పరిజ్ఞానం ఉన్నవారినే పిచ్చెక్కించెస్తూ ఉంటే సామాన్యులకి అందుబాటులో ఉంటాయా?
పిచ్చి అంటే గుర్తుకి వస్తోంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చి మనలో నాటుకుపోయిన భావాలని కొన్నిటిని కూకటి వేళ్ళతో కదిలించే వరకూ మానవుడు తర్క జీవి (rational animal) అనే అనుకున్నాం. ఫ్రాయిడ్ కాదన్నాడు. మానసిక శాస్త్రం ప్రకారం మనందరికీ కొద్దో గొప్పో పిచ్చి ఉన్నాదిట; కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న వాళ్ళని పిచ్చి వాళ్ళ వర్గంలో పడేసి, మిగిలిన వాళ్ళం అంతా ఏదో ఊడబొడిచీసినట్లు పోజులు కొడతాం. ఒక సంఘంలో, ఒక సందర్భంలో పిచ్చివాడిగా జమకట్టబడిన వాడు మరొక చోట, మరొక వేళ మామూలు మనిషిగానో, మహా మేధావి గానో చెలామణీ అయిపోయిన సందర్భాలు ఎన్ని లేవు? విన్సెంట్ వాన్ గో, ఫ్రీడ్రిక్ నీట్జే పిచ్చి వాళ్ళా? మేధావులా? లేక వెలుగు విషయంలో ఆధునిక భౌతిక శాస్త్రపు తీర్మానంలా, రెండూనా?
భౌతిక, మానసిక శాస్త్రాలని, చరిత్రనీ అటుంచి భాషా శాస్త్రాన్ని చూద్దాం. భాష అనేది దైవదత్తం కాదుట. కనీసం అది మానవుల జన్మ హక్కు కూడా కాదుట. భాష మానవ నిర్మితం, కృత్రిమం, తర్కాతీతమూ అంటున్నారు కొందరు. ఒక మాటకీ, దాని అర్ధానికి మధ్య ఎటువంటి తార్కికమైన లంకె లేదుట. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు అల్లేవాడు "అల్లుడు" అయాడని మనం వ్యుత్పత్తి చెప్పుకున్నా, ఆ క్రియకి “అల్లు” అనే మాటనే ఎందుకు వాడాలి అని ప్రశ్నించుకుంటే భాష యొక్క అసలు రహస్యం బయట పడుతుంది. కుక్క ని ఒకొక్క భాషలో ఒకొక్క పేరు పెట్టి పిలుస్తూన్నప్పుడు ఆ పేరుకీ కుక్కకీ మధ్య ఉన్న సంబంధం కేవలం యాధృచ్చికం అని తేలటం లేదూ?
కొందరి దృష్టిలో పైన చెప్పిన అంశాలన్నీ ఉత్తర అధునాతన తత్వానికి ఉదాహరణలు. ఇంతకీ 'ఉత్తర అధునాతన తత్వం' అనే భావం యొక్క నిర్వచనం ఏమిటో? నిజానికి దీన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. కాని ప్రయత్నం పురుష లక్షణం కదా. కనుక ప్రయత్నిద్దాం! “ఇటీవలి, అనగా 1980 ల తరువాత, పాశ్చాత్య సమాజంలో వచ్చిన సాంస్కృతికాది రంగాలలో కొట్టొచ్చినట్లు కనబడే మార్పులే ఉత్తర అధునాతనానికి సూచికలు” అంటారు Margaret Drabble - అక్కడికేదో ఈ తత్వం, ఈ తత్వ విచారణ పాశ్చాత్యుల సొత్తు అయినట్లు! రెండవ ప్రపంచ యుద్ధం తరువాతి కాలానికి ఈ పదబంధం వర్తిస్తుందని M. H. Abrams అంటారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యువతలో కలిగిన సామాజిక స్పృహ, చైతన్యం వల్ల వచ్చిన తిరుగుబాట్ల ద్వారా పుట్టిన ‘పర్యావరణ పరిరక్షణ, జనాభా పెరుగుదలని అరికట్టటం, అన్ని వర్గాల వారికీ సమాన హక్కులివ్వటం’ మొదలైన నినాదాలు పిదప కాలపు పిల్లలకి పుట్టిన పిదప కాలపు బుద్ధులు కావనీ, అవే ఉత్తర అధునాతన తత్వానికి సూచికలనిన్నీ ఈయన భాష్యం చెప్పేరు. ఇలా ఎన్ని నిర్వచనాలని పరిశీలించినా అవన్నీ అసంతృప్తిగానే ఉన్నాయి. ఇది నిర్వచనం చెప్పే కర్త లోపం కాదు, నిర్వచించబడే కర్మ అటువంటిది కావటం. కుక్క తోకని ఎంతమంది సాగదీసినా వంకరగానే ఉంటుంది మరి.
ఉత్తర అధునాతన తత్వానికి నిర్వచనం వెతుకుతూ ఇంతవరకూ పడ్డ తిప్పలని పక్కకి పెట్టి, ఈ సాపు కాని తోకని అటు నుండి నరుక్కొద్దాం. ‘ఉత్తర అధునాతన తత్వం’ అనే భావం భృహత్ సిద్ధాంతాలకి అతీతమైనదనే నిర్వచనాన్ని Jean-François Lyotard సమర్ధిస్తున్నారు. భృహత్ సిద్ధాంతం (metanarrative) అంటే ఏమిటి? సామ్యవాదం, హేతువాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణం, మొదలైన ‘విస్సన్న చెప్పిందే వేదం’ అనే తత్వాలు భృహత్ సిద్ధాంతాలకి ఉదాహరణలు. ప్రజాస్వామ్యం అమెరికా దృష్టిలో మంచిదైనంత మాత్రాన అది ప్రపంచంలో అందరికీ మంచిదే అని వాదించటం భృహత్ సిద్ధాంతానికి మరొక ఉదాహరణ. ఏసుక్రీస్తుని నమ్మి ఆయన శరణు పుచ్చుకోని వాళ్ళంతా తిన్నగా – ఎక్కడా మజిలీలైనా లేకుండా – నరకాని వెళ్ళిపోతారనటం మరొక భృహత్ సిద్ధాంతం. కనుక పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం లా కాకుండా సందర్భోచితమైన పరిధిలో ఇమిడి, వీచే గాలితో ఊగగలిగేది భృహత్ సిద్ధాంతం కాదు. అంటే ఏమిటన్న మాట? ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం అన్న మాట. ఈ సోదంతా విన్న తర్వాత నాకొక చిన్న ధర్మ సందేహం వచ్చింది. గతంలో ఉత్తర అధునాతన వేద వ్యాసుల వారిచేత మేలిబూ దేవాలయంలో తిన్న చివాట్లు సరిపోక, కుక్క తోకని ఒంపు తీద్దామనే అత్యాశ ఇంకా ఉండబట్టి, మా మళయాళీ మేష్టారిని చిన్న చొప్పదంటు ప్రశ్న వేశేను. “అయ్యా! భృహత్ సిద్ధాంతాలన్నిటిని పటాపంచలు చేసి, ఇలా సంప్రదాయాల మీద గౌరవం లేకుండా విశృంఖలంగా ప్రవర్తించండి” అన్న వాక్యం మరొక భృహత్ సిద్ధాంతంలా ఉంది కదా, దాని మాటేమిటి?” అని అడిగేను. అతను నా కంటె బాగా చిన్నవాడు కావటం వల్ల, నవ్వేసి నాకో దణ్ణం పెట్టేసేడు!
ఆఖరి మాట. ఉత్తర అధునాతన తత్వం పాశ్చాత్యుల కపోల కల్పితం అనే భావన ఎవరి మనస్సులలోనైనా ఉంటే, వారికో విన్నపం. విమానాన్ని ఎవరు కనిపెట్టేరో తెలుసా? రైట్ సోదరులు ఎలా అవుతారు? త్రేతా యుగంలో రావణాసురుడు విమానంలో షికారు కెళ్ళేవాడు కదా. అలాగే ఉత్తర అధునాతన తత్వ వాదానికి విత్తులు ఎప్పుడో మన వాళ్ళు నాటేరని నేనంటే మీరు నమ్మగలరా? అదెలాగో ఇప్పుడే చెప్పెస్తే ఎలా? మరో వ్యాసం రాయటానికి ముడి సరుకు ఉండొద్దూ?
Tuesday, December 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
ఒకటి చేర్చినా, తీసేసినా విలువ లెఖ్ఖ లేకుండా ఉండే గంపలో పళ్ళ లాగా కాకుండా, చదివేవాడి బుఱ్ఱని "మస్తిష్కావేశం" అనే ఎత్తుకు తీసుకుపోగలిగే నిచ్చెనల లాగా ఉండే ఇలాటి రచనలు చూసి ఎన్నాళ్లయ్యిందో..
ReplyDeleteజాషువాగారో ఎవరో - "నా రాతల్లో రత్నాలున్నాయి కానీ, వాటిని పెకలించి బయటికి చూపే నాథుడే లేడు" అని అన్నారట..మరి ఈ రత్నాలని ఎవరయినా ఏరుకుని దాచిపెట్టుకుంటే అదే చాలు..
గురువుగారూ - ఒక చిన్న ప్రశ్న - "మనవన్నీ పశ్చిమోత్తరప్రాచీననవ్యాధునిక రచనలు అండీ" అనే వాక్యానికి అర్థం కొద్దిగా వివరిద్దురూ..మొన్నీ మధ్య ఒక మేధావితో మాట్లాడుతుంటే ఈ పదప్రయోగం చేశాడు ఆయన....ఓం ప్రథమంగా ఆయన్ని నేనడిగిన ప్రశ్న ఇది - "తెలుగులో మనకున్న రచనల్ని మీకు తెలిసున్నంతలో , యే యే విభాగాల్లోకి చేర్చవచ్చో కొద్దిగా చెపుతారా" అని అడిగాను........
సర్, మీ బ్లాగు టపాలు చాలా బాగున్నాయి. నిజంగానే వంశీగారు చెప్పినట్టు educative గానూ, ‘మస్తిష్కావేశ’పు మజాని రుచి చూపించేలాగానూ ఉన్నాయి. మీ టపాల కోసం ఎదురు చూస్తుంటాను.
ReplyDeleteకలియుగం 3102 BC, Feb 17 రాత్రి మొదలైందని (అదే కృష్ణ నిర్యాణ సమయం అనీ) పురాణాల్లో ఇచ్చిన ఖగోళ/జ్యోతిష విశేషాల్ని బట్టి కొందరు జ్యోతిష్కులు లెక్కగట్టారనుకుంటాను. అలాగే ఈ మధ్య ఇదే పద్ధతిలో రామాయణ కాలాన్ని నిర్ణయించడానికి కూడా చర్చ జరిగింది. వేదవ్యాసగారు చెప్పిన కలియుగాంత సమయం 2000 తో దాటిపోయిందనుకుంటాను.
ReplyDeleteఅలాగే చాలాకాలం క్రితం ఒక క్రైస్తవ మతగురువు బైబిల్ ప్రకారం సృష్ట్యాది నుంచీ జరిగిన సంఘటనల్నీ, ప్రముఖ వ్యక్తుల/వంశాల జీవిత కాలాలన్నీ కలిపి లెక్కలుగట్టి ఈ సృష్టి 4000 BC (సంవత్సరం సరిగ్గా గుర్తు లేదు), సెప్టెంబర్లో ఒకానొక తేదీన, ఫలానా సమయానికి మొదలైందని లెక్కలుగట్టాట్ట. దాన్ని శతాబ్దాలపాటు పాశ్చాత్యులు గాఢంగా నమ్మారనీ, geology అభివృద్ధి చెందుతున్న తొలినాళ్ళలో భూమి చాలా పురాతనమైనది అని నిరూపణలు చూపించి జనాల్ని ఒప్పించడానికి శాస్త్రజ్ఞులు చాలా కష్టపడాల్సి వచ్చిందనీ చదివేను.
మీ బ్లాగులోకి రావటము ఇదే ప్రధమము.అద్బుతమైన మీ విచారణా తత్వము మెదడుకు పదును పెడుతున్నది. సమయము లెక త్వరగా చదివేను.మరలా ఇంకొకసారి చదువుతాను.ధన్యవాదములు
ReplyDeleteమేష్టారూ..ఇంతబాగా రాయటం ఇక్కడ నిషిద్ధం,కావున తెలియజేయడమైనది :)
ReplyDelete"Postmodernism is not an ideology.Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.
ReplyDeleteమీరు చెప్పినట్లు "ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం" ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తోంది. బహుశా మనలో చాలా మంది conformists కావడం వలన పోస్టుమాడ్రన్ పోకడల్ని విచ్చలవిడితనంగా వర్గీకరించి తృప్తిపడటమే జరుగుతోంది.
మంచి వ్యాసాన్ని చదివించారు గురువు గారూ
ReplyDeleteరాజేంద్రగారు :-)
వంశీ గారు గొప్ప కితాబునిచ్చారు.
మహేష్ గారి రాతలు మీరు చెపుతున్న పోస్ట్ మోడర్న్ పోకడలను కలిగి ఉంటాయి.
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
పోస్ట్ మోడర్నిజాన్ని మనం తెలుగులో ఆధునికోత్తర వాదం అని అంటున్నాం. లేదా కొందరు ఆధునిక అనంతర వాదం అని పిలుస్తున్నారు. మీరన్నట్టు ఉత్తర అధునాతన అనే పదం పలదానికి ఇబ్బంది లేదనుకుంటే లేదు. బి. తిరుపతిరావు గారు పోస్ట్ మోడర్నిజం పేరుతోనే రాసిన పుస్తకాన్ని హెచ్ బిటి ప్రచురించింది. ఇటీవల హెచ్చార్కె సందర్భం పేరుతో మరికొన్ని వ్యాసాల్ని ప్రచురించారు. మీరిచ్చిన సమాచారం విలువైందే గాని, పర్సనల్ టచ్ తో బాగా ఉంది కదా, ఆబ్జెక్టివిటీ...? తొక్క లెండి, బ్లాగుల్లో ఇంత విలువైన సమాచారం ఉండడమే గొప్ప. మీనుంచి మరిన్ని విలువైన్ వ్యాసాల కోసం ఎదురు చూస్తున్నాం.
ReplyDelete-రవికుమార్
"భృహత్ సిద్ధాంతాలన్నిటిని పటాపంచలు చేసి, ఇలా సంప్రదాయాల మీద గౌరవం లేకుండా విశృంఖలంగా ప్రవర్తించండి” అన్న వాక్యం మరొక భృహత్ సిద్ధాంతంలా ఉంది కదా"
ReplyDeleteSir, You nailed it right there.
నాకు ఆ అనుమానం పోస్ట్ మోడర్నిజం గురించి చదివినప్పుడే కాకుండా, విపరీతపోకడలు పోయే లిబరలిజం, ఒక్కో సారి కామన్ సెన్స్ కు అత్యంత దూరంగా ఉండి, కేవలం తర్కానికి మాత్రమే అందే అభ్యుదయ వాదాన్ని చూసినా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి నాలో.
వేమూరి గారు:
ReplyDeleteMore accepted "Telugu" translation for po-mo is "ఆధునికానంతరవాదం". ఈ దేశాల్లో పో.మో లని పట్టించుకోవడం మానివేసినా మన తెలుగుదేశంలో పోమోల హడావిడి కొంచెం యెక్కువ కాలమే నడిచింది. ఇప్పుడు తగ్గిందనుకోండి... తెలుగులో పో.మో.న్ని స్థూలంగా పరిచయం చేస్తూ బి. తిరుపతిరావు గారు రాసిన మంచి పుస్తకం ఒకటుంది. (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, బాగా కుదించి ప్రచురించారు.) మీరు సంపాదించుకోగలిగితే, తెలుగులో కొంత పాంఫ్లెట్ల్ యుద్ధం కూడా నడిచింది (ఎవరో అనామకంగా పో.మో లని హేళన చేస్తూ రాసినవి). గమ్మత్తేమంటే ఇక్కడ Alan Sokal పో.మో లని బుట్టలో వేసి, రాసిన రాతలన్నీ మనవాళ్ళు మాత్రం పట్టించుకోనట్లు ఊరుకున్నారు.
ఇంక ఏకంగా తొలి బ్లాగుల్లోనే Classical, modern, colonial వర్గీకరణలోకి దిగిపోయారు. మీరు ఆ లోతుల్లోనుండి త్వరగా, తేలికగా బయటపడతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చరిత్ర డిపార్ట్‌మెంటుల్లో "ఆధునికత్వం" (modernity) మీదా బాగా చర్చ్ సాగుతుంది. renaissance తో మీ ఖండంలోనే కాదు, ఉదాహరణకి భారతదేశంలో కూడా అప్పటికే "ఆధునికత" వుంది అని బలంగా వాదనలు సాగుతున్నాయి. తెలుగు contextలో వెల్చేరు నారాయణరావు గారు గత 10-12 ఏళ్ళలో రాసిన పుస్తకాలు, పేపర్లు ఈ చర్చలో భాగంగా చూడవచ్చు. ఇంక చెప్పటానికి బోలెడుంది కానీ, అది మరోసారి.
చివరిగా మీ ప్రశ్న: "అలాగే ఉత్తర అధునాతన తత్వ వాదానికి విత్తులు ఎప్పుడో మన వాళ్ళు నాటేరని నేనంటే మీరు నమ్మగలరా?" కు నా జవాబు: నమ్ముతాను. Foucalt గారి సిద్ధాంతాలన్నీ మనవే అని వాదించేస్తా నేనయితే.
భవదీయుడు, శ్రీనివాస్