Sunday, December 21, 2008

అత్త గా(వా)రి సొమ్ము దానం చెయ్యటం ఎలా?

డిసెంబరు 2008

“అత్త గారి సొమ్ము అల్లుడు ధార పోసేడు” అనే సామెత మనందరికి తెలుసు. ఒకరి సొమ్ముని మరొకరు దానం చేసినప్పుడు ఈ సామెతని వాడతారు.

అమెరికాలో అమెరికన్ ప్రభుత్వాన్ని “అంకుల్ శేం” అనటం వినే ఉంటారు. అంటే ప్రభుత్వం వారి సొమ్ము మావ గారి సొమ్మన్న మాట. మావ గారైతే నేమిటి, అత్త గారైతే నేమిటి, రెండూ ఒకటే కనుక పై సామెతని కొద్దిగా మార్చి, ”అత్త వారి సొమ్ముని అల్లుడు ధారపోసేడు” అని మార్చుకుందాం. ఏం?

ఇప్పుడు అమెరికాలో అత్త వారి సొమ్ముని ఎలా ధార పొయ్యటమో చెబుతాను. అమెరికాలో అత్తవారంటే ప్రభుత్వం వారు అని అన్వయించుకోవచ్చని చెప్పేను కదా. అంటే ప్రభుత్వం వారి సొమ్ముని మనం ఎలా ధార పొయ్యటమో చెబుతాను.

ప్రభుత్వం వారికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? మనం అంతా పన్నులు కడితే వస్తుంది. ఆది నా డబ్బు, మీ డబ్బు, అమెరికాలో ఉన్న మనందరి డబ్బు. అందులో నా డబ్బు కంటె మీ డబ్బే ఎక్కువ వుంది. ఈ డబ్బుని ఖర్చు పెట్టే భారం అంతా ప్రభుత్వం మీద వదిలేస్తే వాళ్ళు పనికిమాలిన యుద్ధాలు చేసి పాడు చేస్తారు. లేదా, దివాలా ఎత్తేస్తూన్న కారు కంపెనీలని, బేంకుల్ని ప్రాపు చెయ్యటానికి మన డబ్బుని మన పెత్తనం లేకుండా ఖర్చు పెట్టెస్తారు. కనుక వాళ్ళు తగలేసే లోపున మనం సద్వినియోగం చెయ్యటం ఎలాగో చెబుతానన్న మాట!

మనం ఒక స్వచ్ఛంద సంస్థ కి దానం చేసినప్పుడు మనం ఇచ్చే డబ్బు నూటికి నూరు శాతం మన జేబు లోంచి రాదు; పైవాళ్ళ డబ్బు కూడ, వాళ్ళ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అందులో కొంత పడుతుంది. (ఇది అమెరికాలోనే కాదు, అనేక ఇతర దేశాలలో కూడ నిజం. కాని నేను ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితిని ఆధారం చేసుకుని చెబుతున్నాను. ఇటుపై కథనాన్ని స్థూలంగా చూడండి తప్ప, ఎకౌంటెంటులా చూడకండి.)

ఎలాగంటారా? అమెరికాలో ఉన్న ఆదాయపు పన్నుల చట్టం లో ఉన్న ఒక మెలిక వల్ల నేను చెక్కు పుస్తకం తీసి ఒక సంస్థకి దానం చేసేనంటే, నా డబ్బుతో పాటు మీ డబ్బు కూడ దానం చేస్తున్నానన్న మాట. ఇది ఎలాగంటే, ఉదాహరణకి నేను 30% ఆదాయపు పన్ను కట్టే ఆర్ధిక అంతస్థు (టేక్స్ బ్రేకెట్) లో ఉన్నానని అనుకుందాం. అప్పుడు, నేను 100 డాలర్లు దానం చేసినప్పుడల్లా అమెరికా ప్రభుత్వం వారు నాకు 30 డాలర్లు ముదరా ఇస్తారు. అంటే నేను రాసే చెక్కు 100 డాలర్లకే అయినా, నాకు నిజంగా అయే ఖర్చు 70 డాలర్లే. ఆ మిగిలిన 30 నా తరఫున మీరంతా కడుతున్నారన్న మాట. కాని దానం చేసిన పేరు, కీర్తి, పుణ్యం నాకు వస్తున్నాయి. చిత్రగుప్తుడు మీ పద్దులో మీకేమీ రాయటం లేదు.

పైన చెప్పినది ఆదాయపు పన్నుల విషయం. ఇక మనం చిత్రగుప్తుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వం వారు “ఎస్టేట్ టేక్సు” విధిస్తారు. ఈ పన్ను వల్ల మనం వదలిపెట్టిన ఆస్తిలో దరిదాపు సగం (అంటే 50 శాతం) పైబడే ప్రభుత్వం కాజేస్తుంది. "ఏనుగు బతికున్నా చచ్చినా లక్ష రూపాయలే" అన్నట్లు ఈ అమెరికాలో బతికున్నన్నాళ్ళూ "ఆదాయపు పన్ను" అనీ, చచ్చిన తరువాత "చావు పన్ను" అనీ చంపుకు తింటున్నారు కదా. ఈ రాబడి పన్నునీ, చావు పన్నునీ లెక్కలోకి తీసుకుంటే తేలేది ఏమిటన్న మాట? మనం ఇప్పుడు ఒక డాలరు దానం చేసేమంటే నిజానికి మన ఆస్తి లోంచి ఇచ్చేది 35 పైసలే! మిగిలిన 65 పైసలు నోరు వాయి లేని పన్నులు కట్టే ప్రజలు భరిస్తున్నారన్న మాట. కనుక ఇవ్వటం వల్ల మనకా ఆత్మ సంతృప్తి, పుణ్యానికా పుణ్యం. పైపెచ్చు స్నేహితుల దగ్గర పెద్ద మొనగాడిలా కాలరెత్తి పోజులు కొట్టొచ్చు.

మరి పిల్లల మాట? తల్లిదండ్రులుగా మనకి కొన్ని కనీస బాధ్యతలు ఉన్నాయి. మన పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని, మంచి చదువులు చదువుకుని, పెద్ద పదవులు అధిష్టించాలని మనందరికీ ఉండటం సహజం. మనం ఎంత గణించి పిల్లలకి ఇచ్చినా అది చంద్రుడుకో నూలుపోగు అవుతుందే కాని వారి విద్యాబుద్ధులతో వారు గణించే దానితో దీటు రాదు. కనుక వాళ్ళని చదివించటం, మంచి ప్రవర్తనని అలవాటు చెయ్యటం, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతకగలగటం నేర్పటం మన కనీస ధర్మం. అంతకు మించి అధికంగా పిల్లలకి డబ్బివ్వటం వల్ల వాళ్ళు పాడవటానికి దోహదం చేసినవాళ్ళమే అవుతాము. చిన్నతనంలోనే అవధులు లేకుండా ఐశ్వర్యాన్ని చవి చూసిన పిల్లలు పాడవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనుభవం చెప్పటమే కాకుండా శాస్త్రీయ పరిశోధనల ద్వారా తెలిసిన విషయమే.

కోట్లకి పడగలెత్తిన ధనిక వర్గాలలో చాలమంది నేను పైన చెప్పిన సూత్రం ఆకళింపు చేసుకున్నవారే! ప్రపంచంలో రెండో స్థానంలోనో, మూడో స్థానంలోనో ఉన్న ధనికుడు వారెన్ బఫెట్ తన ఆస్తి లో సింహ భాగం వారసులకి ఇవ్వకుండా దానం చేసేసేడు - ఈ మధ్యనే! ప్రపంచంలో అందరి కంటె ధనికుడైన బిల్ గేట్స్ ఈ మార్గాన్ని అప్పుడే అవలంబించి బిలియన్ల తరబడి దానాలు చేస్తున్నాడు.

“వీళ్ళందరి దగ్గరా కుళ్ళబెట్టినా కుళ్ళనంత డబ్బుంది. దానిని ఏమి చేసుకోవటమో తెలియక వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, నా దగ్గర కూడా అంత డబ్బు ఉంటే నేను చేస్తాను” అనే వాళ్ళు ఉన్నారు. నెల జీతం మీద ఇంటిడు పిల్లని పోషిస్తూ కూడ మా అమ్మ ఎప్పుడూ ఒక వారాల పిల్లాడికి భోజనం పెట్టేది, “మనతో పాటు చారూ అన్నం ఆ కుర్రాడూ తింటాడు” అనేది. కనుక ఇచ్చే గుణం ఉన్న వాళ్ళకి ఉండక్కర లేదు; ఉన్న దాంట్లోనే ఇస్తారు.

“ఎందుకు ఇవ్వాలి? నా కాళ్ళ మీద నిలబడి నేను పైకి వచ్చేనే! అలాగే అందరూ ఎందుకు చెయ్యకూడదు?” అని అనే వారు ఉన్నారు. దీనికీ ఒక సమాధానం ఉంది. మా ఊళ్ళో, మమ్మల్ని చూసినవాళ్ళు ఇప్పటికీ అంటారు, “మీరంతా కష్టపడి ప్రయోజకులు అయేరు. నిజమే, కాని మీ అమ్మా, నాన్నా చేసిన దాన ధర్మాలే మిమ్మల్ని ఇలా పైకి లేవనెత్తేయి.” ఇటువంటి ఆర్ద్రత తో కూడిన మాటల వెనక శాస్త్రీయమైన రుజువులు ఉన్నాయో లేదో తెలియదు కాని, దానం చేసినప్పుడు “పోనీలే మన పిల్లలకి మంచి జరుగుతుంది” అనుకుంటే మనస్సుకి సంతృప్తి. ఇటువంటి వాటి మీద మీకు నమ్మకం లేక పోతే, ఏదో సాటి వాడికి సహాయం చేసేమనే తృప్తి వర్ణనాతీతం. ఈ తృప్తి అనేది కేవలం మానసికం కాదు. సంతృప్తి గా ఉన్న మెదడు నుండి స్రవించే “హార్మోనులు” ఆరోగ్యానికి, ఆయుర్‌వృద్ధికి తోడ్పడుతాయని వైద్యులు ఒప్పుకుంటున్నారు.

ఏ మత గ్రంధం తీసి చూసినా అవి ఇవ్వమనే ప్రోత్సహిస్తున్నాయి. భౌతికమైన సుఖాలు కోరుకోవటం లో తప్పు లేదు. డబ్బు గణించటంలోనూ, పోగు చెయ్యటంలోను కూడ తప్పు లేదు. డబ్బు గణించమనే చెపుతున్నాది ధర్మ శాస్త్రం. రిటైర్ అయిపోయిన నా అమెరికన్ స్నేహితుడు, జాన్ రోసటీ, ఇంకా చిన్నా పెద్దా ఉద్యోగాలు చేసి డబ్బు గణిస్తూ ఉంటే అడిగేను, “ఇంత డబ్బు గణించేవు, ఇంకా ఏమి చేసుకుంటావు?” అని. ఒక్క క్షణం కూడ తడుముకోకుండా సమాధానం చెప్పేడు, “నాకు నచ్చిన ఛారిటీకి దానం చేసెస్తాను” అని.

పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు కదా, ఏ ఛారిటీకి దానం చెయ్యాలి అన్నది మరొక ప్రశ్న. అమెరికాలో ప్రజలు ఇచ్చే దానాలు 90 శాతం మత సంబంధమైన సంస్థలకి వెళుతున్నాయని విన్నాను. ఈ సంస్థలు అందులోంచి కొంత తీసి పీడిత ప్రజల అవసరాలకి (వరదలు, భూకంపాలు, సునామీలు, వగైరా) మళ్ళిస్తారు. విశ్వవిద్యాలయాలకి ఇవ్వటం కూడ బాగా ప్రాచుర్యంలో ఉంది. తరువాత వరుసగా మ్యూజియంలు, లలిత కళలు వస్తాయి. అమెరికాలో ఉన్న భారతీయులు ఎవరికి ఇస్తున్నారు? నేను విన్నది దరిదాపుగా 99 శాతం పైబడి దేవాలయాలకి ఇస్తున్నారుట. కాని ఈ దేవాలయాలు ఇలా వస్తూన్న డబ్బులో కొంత భాగాన్నైనా బీద ప్రజల అవసరాలకి ఖర్చు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. మరి తెలుగు వారి సంగతో? నా దగ్గర శాస్త్రీయమైన గణాంకాలు లేవు. కాని తానా, ఆటా వంటి సభలలో జరిగే ఖర్చు చూస్తే మన ఆసక్తి ఎక్కడ ఉందో అర్ధం అవుతుంది.

ఎంత ఇవ్వాలి? ఉన్న దాంట్లో మన జీవన బాణీ ని భంగపరచ వలసిన అవసరం లేకుండా ఎంతో కొంత. మోర్మన్ చర్చి వారు జీతంలో పదో వంతు “డోనేషన్” లా కాకుండా, “డూస్” లా పుచ్చేసుకుంటారు. మనం వానప్రస్తం లోకి వచ్చే తరుణంలో, ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది కనుక అప్పుడు ఇచ్చే దానిని కొంచెం పెంచవచ్చు.

ఎప్పుడు ఇవ్వాలి? గణించిన డబ్బు మన అవసరాలకి సరిపడ్డ తర్వాత కదా దాన ధర్మాలు? తన్ను మాలిన ధర్మం లేదన్నారు. ఇది అక్షరాలా నిజం. నేల విడచి సాము చెయ్య కూడదు. అలాగని మనకి ఎప్పుడో అవసరం వస్తుందని ఎన్ని మిలియన్లు దాచినా సరిపోయినట్లు ఉండదు. దీనికి ఒక మార్గాంతరం ఉంది. ఎప్పుడో మనం దివంగతులమైన తర్వాత మన వారసులు మన పేరున దానం చేసేరే అనుకుందాం. దాని వల్ల మనకి సంతోషం రాదుగా? అందుకని మన హయాం లో మన కంఠంలో ప్రాణం ఉన్న తరుణం లోనే, మన అభీష్టాలకి అనుకూలమైన దాన ధర్మాలు చెయ్యటం లో కొంత సొగసుంది.

ఈ "ఎప్పుడు ఇవ్వాలి?" అన్న ప్రశ్నకి మన పురాణాలలో ఒక చమత్కారమైన కథ ఉంది. వామనుడు అడిగిన మూడడుగుల మేర దానం చెయ్యటానికి బలి చక్రవర్తి సిద్ధపడుతూ ఉంటే శుక్రాచార్యులవారు “అలోచించి రేపు ఇవ్వచ్చులే?” అని శుక్రనీతి బోధించబోతే బలి చక్రవర్తి అంటాడు, “రేపటికి ఈ బుద్ధి ఉంటుందో ఉండదో, ఇప్పుడే ఇచ్చెస్తాను” అని. ఈ ధోరణి నచ్చక, ధారపోసే కమండలపు కొమ్ములో పురుగు రూపంలో శుక్రాచార్యుల వారు అడ్డుకుంటారు. ఏదో అడ్డు పడిందంటూ వామనమూర్తి ఒక పుల్లని బెజ్జంలో పెట్టి తోస్తాడు. అది శుక్రాచార్యులవారి కంటికి తగలగా ఆ కన్ను పోతుంది. ఈ కథని మనం రకరకాలుగా అన్వయించుకోవచ్చు.

ఈ కథని ఎందుకు చెప్పేనంటే మనకే కాదు ప్రభుత్వాలకి కూడ ఇవ్వాలనే ఉంటుంది. ఏదో విపత్తు జరిగిన సందర్భంలో ఉన్న ఉద్రేకంలో నూస్ కాన్‌ఫరెన్సు పెట్టేసి “బిలియను డాలర్లు ఇచ్చేస్తున్నాం, చూస్కోండోయ్” అని బెదిరించెస్తారు. ఉద్రేకం తగ్గిన తరువాత వీళ్ళు నిజంగా ఇచ్చేరా లేదా అని మనం వాకబు చేస్తే సాధారణంగా వాగ్దానం చేసిన దాంట్లో ఏ పదో వంతో ఇస్తారు. మనలాంటి మానవ మాత్రులూ ఇంతే, అమెరికా లాంటి ప్రభుత్వాలు ఇంతే! అందుకనే ఇవ్వదలుచుకున్నది మీనమేషాలు లెక్కెట్టకుండా ఇచ్చేయటం మంచిది.

షరా: నేను ఇది సరదాకి రాసేను. ఇన్‌కం టేక్సు చట్టాల గురించి, ఎస్టేట్ టేక్సు చట్టాల గురించి నా కన్న మీకు ఎక్కువ తెలుసని నాకు తెలుసు. ఈ మెలికలన్నిటిని సందర్సిస్తూ కూర్చుంటే, వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు.

1 comment:

  1. దానం చేయడంలోని లాజిక్ బాగుంది సార్.
    దానాలు చేయడంలోని తృప్తి ఆరోగ్యాలను మెరుగుపరుస్తుందనే విషయం అందరూ తెలుసుకొవాల్సింది.

    ReplyDelete