డిసెంబరు 2008
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కృషి ఫలితంగా, ఆగస్టు 2007 నుండి కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్‌క్లీ, లో తెలుగు బోధన మొదలయిందని వినే ఉంటారు. ఇది తెలుగువారు వేసుకున్న బృహత్ ప్రణాళికలో మొదటి మెట్టు మాత్రమే. ఈ ప్రణాళికకి ప్రజాముఖంగా అంకురార్పణ జరిగినది జూలై 2006 లో. నాటి నుండి నేటి వరకు జరిగిన బృహత్ ప్రయత్నం ద్వారా $500,000 పోగు చేసి దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే ఖర్చు పెట్టి పాఠాలు చెప్పటం ప్రారంభించేరు - విశ్వవిద్యాలయం వారు. ఈ మొలక ఒక మహా వృక్షం అవాలంటే 5 మిలియన్ డాలర్లు అవసరం ఉంటుందని మా అంచనా.
ఈ ప్రయత్నం మొదలు పెట్టిన రోజు నుండీ నేటి వరకు, చందాలు పోగు చెయ్యటానికి బయలు దేరినప్పుడల్లా మమ్మల్ని ఎదుర్కుంటూన్న అతి జటిలమయిన ప్రశ్న ఒకటి ఉంది. రకరకాలుగా మాకు ఎదురయిన ప్రశ్న ఏమిటంటే: “మనకి తెలుగు ఎందుకు? అమెరికాలో మనం తెలుగు నేర్చుకుని ఏమిటి చేస్తాం?” మనకి ధన సహాయం చేసినవారిలో ఆంధ్రేతరులు ఉన్నప్పటికీ పదే పదే తెలుగువారే “మనకి తెలుగు ఎందుకండీ?” అని అడుగుతున్నారంటే దీనికి సమాధానం కొంచెం ఆలోచించి చెప్పాలని అనిపించింది.
ఈ ప్రశ్నకి రకరకాల కోణాల నుండి సమాధానం వెతకొచ్చు. తెలుగు దేశంలో ఉన్న తెలుగు వారు తెలుగు నేర్చుకోటానికీ, ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకోవటానికీ గల ప్రేరణకారణాలు వేర్వేరు. ముందు తెలుగుదేశంలో తెలుగు నేర్చుకోవలసిన అవసరం గురించి విచారిద్దాం. మనందరికీ, ప్రత్యేకించి నేర్చుకోకుండానే, అయిదేళ్ళు నిండేసరికి గడగడా తెలుగు మాట్లాడటం వచ్చెస్తుంది. మనం పాఠశాలకి వెళ్ళి నేర్చుకునేది రాయటం, చదవటం. ఒక భాష నేర్చుకోవటంలో అతి కష్టమైన అంశం మాట్లాడగలగడం. అటు తరువాత రాయటం, చదవటం అంత కష్టం కాదు. అయినప్పటికీ నా ఎరికలో ఈ నాడు తెలుగుదేశంలో మాట్లాడటం వచ్చి, రాయటం, చదవటం రాని వారు – ఇతరత్రా విద్యావంతులు - చాల మంది తారసపడుతున్నారు. వీరికొచ్చిన నష్టం ఏమిటి? మన సంస్కృతిని – రామాయణ భారతాలే అనండి, కాళిదాసాదులు చేసిన కృతులే అనండి – ఇంగ్లీషు మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నారు. త్యాగరాజ కీర్తనలని ఇంగ్లీషు లిపిలో రాసుకుని పాడుతున్నారు. కూచిపూడి నృత్యం చేస్తున్నారు. తాతలతోటీ, తాతమ్మలతోటీ తెలుగులో శుభ్రంగా మాట్లాడుతున్నారు. కాని వీరికి తెలుగు రాయటం, చదవటం రాదు. “ఇందువల్ల వచ్చిన నష్టం ఏమిటి?” అని అడుగుతున్నారు.
ప్రవాసాంధ్రుల పరిస్థితి వేరు. ప్రవాసంలో పెరుగుతూన్న తెలుగు పిల్లలకి – చాల మందికి – తెలుగు మాట్లాడటం కూడ రాదు. అయినా సరే ఇక్కడ (అమెరికాలో ఉండి రాస్తున్నాను) పుట్టి పెరిగిన మన పిల్లలు అమెరికాని జయించెస్తున్నారు. వీరికి తెలుగు రాకపోవటం వల్ల బాహ్యంగా దమ్మిడీ ఎత్తు నష్టం కనిపించటం లేదు. అయినా ఆశ్చర్యం వేసే విషయం ఒకటి ఈమధ్యనే గమనిస్తున్నాను. మా పిల్లలు తెలుగు నేర్చుకోకపోయినా వారి పిల్లలకి (మా మనవలకి) తెలుగు నేర్పమని మా పిల్లలు మమ్మల్ని బ్రతిమాలుతున్నారు. ఇది ఆశ్చర్యమా? ఆశ్చర్యమున్నరా? ఏమిటీ వైపరీత్యం అని అడిగితే వారి సమాధానం ఇలా ఉంటోంది: “మీరు మాకు చిన్నప్పుడు తెలుగు నేర్పించలేదు. మా గుజరాతి స్నేహితులకి గుజరాతీ వచ్చు, పంజాబీ వారికి పంజాబీ వచ్చు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ భాషలు నేర్పుతున్నారు. మాకు తెలుగు నేర్పించకపోవటం మీ తప్పు. ఆ తప్పుని ఇప్పుడు మేము సరి దిద్దుకుని మా పిల్లలలకి నేర్పిస్తాం” అనే భావం వచ్చేలా మాట్లాడుతున్నారు మా పిల్లలు. కనుక మొదటి తరం తెలుగు వారం ఏదో తప్పు చేసేం. ఆ తప్పేదో చేస్తూన్నప్పుడు తెలియలేదు; ఇప్పుడు తెలుస్తోంది.
ఈ రకం తప్పులు చెయ్యటం ఇది మొదటి సారి కాదు. “ఆడ పిల్లకి చదువెందుకురా? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్ళేలాలా? చాకలి పద్దు వెయ్యటానికి సరిపడా రాయటం, చదవటం వస్తే చాలదూ?” అని పూర్వం మనం ఆడపిల్లలని వంట ఇంట్లో నొక్కి పెట్టి అదే మన సంప్రదాయం అని సరిపెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుని, ఉద్యోగాలూ చేస్తున్నారు, ఊళ్ళూ ఏలుతున్నారు – ఈ రెండూ మగవారికంటె బాగా చేస్తున్నారు. అప్పుడు పనికిరాదనుకున్న ఆడదాని చదువు ఇప్పుడు ఎలా పనికొస్తోందో అదే విధంగా ఇప్పుడు పనికి రాదనుకుంటూన్న తెలుగు కూడ పనికొస్తుందని అమెరికాలో ఉన్న రెండో తరం పిల్లలు చెబుతున్నారు – వారి చేష్టల ద్వారా.
ఇదే సమస్యని మరొక కోణం నుండి చూద్దాం. నిసర్గాంధ్రులు (native Andhras) అయితేనేమి, ప్రవాసాంధ్రులు అయితేనేమి – వీరిరువురి నైసర్గిక వాతావారణాలు వేరైనప్పటికీ – వీరిరువురూ తెలుగు నేర్చుకోవలసిన ఉమ్మడి అవుసరం ఒకటి ఉంది. ఒక సమాజంలో బ్రతికే మనిషికి ఒక వైయక్తికత (identity) కావాలి. జంతువుల నుండి మానవుడిని వేరు చేసి మనిషికి ఒక వైయక్తికత ఇచ్చేది భాష. అమెరికా బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి స్వరాజ్యం సిద్ధించుకున్నప్పుడు, వారికీ వీరికీ సంస్కృతీపరమైన వ్యత్యాసం ఏమీ లేదు. కాని ఈ వైయక్తికత కోసం అమెరికా వారు ఇంగ్లీషు భాషనే మార్చేసి అమెరికన్ ఇంగ్లీషు తయారు చేసేరు. ఈ శక్తి అన్ని భాషలకీ ఉంది.
భారతదేశంలో తెలుగువాళ్ళని “మద్రాసీ” లు గా జమకట్టేసినంత సేపూ మనకి “తెలుగు వైయక్తికత” లేదనే కదా ఆరాటపడిపోయి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేసేం. కనుక తెలుగు వాళ్ళకి ఒక వైయక్తికతని ఇచ్చేది తెలుగు భాష. భారతదేశంలో ఉన్న తెలుగువాళ్ళకి ఈ వైయక్తికత అవసరమయినట్లే ప్రవాసులకి ఇటువంటి వైయక్తికత ఇంకా అవసరం. పులుసులో ఉప్పులా ప్రవాసాంధ్రులు ఎప్పుడైతే ఈ వైయక్తికతని కోల్పోయి ఆయా దేశాల ప్రధాన ప్రవాహాలలో కలిసిపోతారో అప్పటి నుండి వారు నామమాత్రంగా తెలుగువారు అవుతారు కాని సాంస్కృతికంగా తెలుగువారు కాజాలరు. కనుక ఒక విధంగా చూస్తే తమ వైయక్తికత నిలుపుకోవాలనే ఆరాటం సహజంగా ప్రవాసాంధ్రులకి ఉంటుంది కనుక ప్రవాసాంధ్రులు తెలుగు నేర్చుకోవటం చాల అవసరం. కారణాలు వేర్వేరు అయినప్పటికీ నిసర్గాంధ్రులకి ఇంగ్లీషు నేర్చుకోవటం ఎంత అవసరమో ప్రవాసాంద్రులకి తెలుగు నేర్చుకోవటం అంతే అవసరం.
ఇప్పుడు తెలుగు ప్రాచీన భాషగా గుర్తింపు సంతరించుకుందని (నేనిలా అంటే మీకు కోపం రావచ్చు కానీ – తమిళంతో సమాన హోదా వచ్చిందని) దేశంలో హర్షధ్వానాలు చేస్తున్నారు. నాకూ సంతోషమే. కాని ప్రజాదరణ లేక పోయిన తరువాత ప్రభుత్వ పురస్కారాలు ఎన్ని సంతరించుకుని ఏమి లాభం? మనకి నిజానికి కావలసినది ప్రాచీన హోదా కాదు – ఆధునిక హోదా. మన తెలుగు ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా ఎదిగినప్పుడు, మన తెలుగుకి ప్రపంచ భాషగా ఒక గుర్తింపు (తమిళానికి, సంస్కృతానికీ ఈ గుర్తింపు ఇప్పుడు ఉంది) పొందినప్పుడు - అప్పుడు మనం పండగ చేసుకుందాం. ప్రపంచ భాషగా గుర్తిపు రావాలంటే, తెలుగుని రెండవ భాష (second language) గా నేర్పటానికి తగిన పద్ధతులు, పనిముట్లు ఉండాలి. తెలుగుని ప్రవాస విద్యాలయాల్లో నేర్పటానికి అవకాశాలు సమకూర్చాలి.
భారత దేశానికి బయట, ప్రపంచ వ్యాప్తంగా దరిదాపు 250 విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం నేర్పబడుతోంది, సంస్కృత భాష మీద పరిశోధన జరుగుతోంది. తమిళానికి ఈ రకం గుర్తింపు కనీసం 12 విశ్వవిద్యాలయాల్లో ఉంది. హిందీ, ఉర్దూల బోధన పరిశోధన ఉరమరగా 110 చోట్ల జరుగుతోంది. తెలుగు? మొన్నమొన్నటి వరకు ఒక్క విస్కాన్సిన్ లో మాత్రమే తెలుగు పీఠం ఉండేది. భవిష్యత్తులో ఈ పీఠాన్ని ఎత్తెస్తారు. దీని స్థానంలో, దీనితో దీటైన పీఠాన్ని బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో స్థాపించాలని తెలుగు వారు సంకల్పించుకున్నారు. ఇక్కడ ఉన్న దక్షిణ ఆసియా కేంద్రంలో గత 100 సంవత్సరాల పైబడి సంస్కృతం నేర్పుతున్నారు. గత నలభై ఏళ్ళుగా తమిళం నేర్పుతున్నారు. హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ కూడ నేర్పుతున్నారు. ఇక్కడ తెలుగు బోధన, పరిశోధన లేకపోవటం సిగ్గు చేటు. ఈ వెలితిని పూడ్చటానికి పైన, మొదటి పేరాలో, చెప్పినట్లు నిధులు సేకరించి, తెలుగు బోధన ప్రవేశ పెట్టేం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడ ఒక చెయ్యి అందించి సహాయం చేస్తున్నారు. ఈ విత్తు మొలకై, పెరిగి, వటవృక్షంగా మారాలంటే చంద్రుడికో నూలు పోగులా అందరి సహాయసహకారాలూ కావాలి. ప్రత్యేకం ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం కూడ ఒక చెయ్యి వెయ్యాలి. ఈ బృహత్ ప్రణాళికకి సహాయం అందించదలుచుకున్న తెలుగు అభిమానులంతా, ఉడతా భక్తిగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన సహాయం చెయ్యగోరిన వారు UC Berkeley Foundation – Telugu Initiative కి చెక్కు రాసి ఈ దిగువ చిరునామాకి పంపగలరు.Attn: Prof. Sanchita Saxena, Center for South Asia Studies, 10 Stephens Hall, Room 2310, University of California, Berkeley, CA 94720-2310, USA
Wednesday, December 17, 2008
Subscribe to:
Post Comments (Atom)
Is there any tax exemption for these contributions? Just want to know. thanks for your efforts.
ReplyDeleteYes. Contributions to UC Berkeley Foundation are tax deductible. Make sure you write "Telugu Initiative" somewhere on the check. You will get an official receipt from
ReplyDeletethe university. There are naming opportunities for large donors (say $100K or more). The official web site has been down for some time for maintenance; it will be up soon.
రావు వేమూరి గారు,
ReplyDelete"భాష సంస్కృతికి జీవనాధారం. నా చుట్టూ ఉన్నవి నాకు మన భాషలోనే పరిచయమయ్యాయి. నా ఉనికిని చాటే మన ప్రాంతపు అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, మన ప్రాంతం ప్రపంచానికి వివిధ రంగాల్లో అందించిన జ్ఞానం మన భాషలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మన భాష సంగీతానికి వన్నె తెచ్చిన భాష. మన భాషను నిలుపుకుంటే నా ఉనికిని చాటుకున్నట్టే. మన భాషని నిలుపుకుంటే మన సంస్కృతిని నిలుపుకున్నట్టే. మన భాషని చదివితే తర తరాలుగ మన వాళ్ళు మనకందించిన జ్ఞాన భాండాగారాన్ని సంరక్షించుకున్నట్టే. ఇవన్నీ జరిగినప్పుడు మన నాగరికత కాల పరీక్షను తట్టుకుని విరాజిల్లుతుంది. నేను నిండైన ఆత్మాభిమానంతో ప్రపంచ పౌరులతో కరచాలనం చేస్తాను."
ఇది నేను మాతృభాష ఎందుకు అనే ప్రశ్నకి ఆలోచించుకుని, సాధ్యమైనన్ని తక్కువ పదాలతో క్రోడీకరించుకున్న మాటలు.
ఇది నేను మాతృభాష ఎందుకు అనే ప్రశ్నకి ఆలోచించుకుని, సాధ్యమైనన్ని తక్కువ పదాలతో క్రోడీకరించుకున్న మాటలు.
ఉపాది, సౌకర్యం లాంటి అవసరాలని తప్పించి కూడా, మాతృభాషని పై కారణంగా నేను వాడుకుంటాను, పరిరక్షించుకుంటాను, తరవాత తరానికి అందిస్తాను.
దిలీప్ గారికి ధన్యవాదాలు. ఇలా వచ్చిన సలహాలన్నిటిని ఒకచోట చేర్చి University of California లో తెలుగు ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం తయారు చేసుకుంటాను.
ReplyDeleteమాతృభాష గురించి నేను రాసిన రెండు టపాల లంకెలు క్రిందనిస్తున్నాను చూడగలరు.
ReplyDeletehttp://parnashaala.blogspot.com/2008/08/blog-post_02.html
http://parnashaala.blogspot.com/2008/06/i-think-in.html
మహెష్ కుమార్
ReplyDeleteమీరిచ్చిన లంకెలకి ధన్యవాదాలు.
చాలా చక్కగా చెప్పారు.అందుకే దీన్ని మేము ఇలా ప్రదర్శించాము. చూడండి....
ReplyDeletehttp://teluguthesis.com/index.php?showtopic=591&st=0&#entry1308